15, ఫిబ్రవరి 2019, శుక్రవారం

3. శ్రీమత్సింహాసనేశ్వరీ


శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥  1

లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మను ఇప్పటి వరకూ శ్రీమాత అని శ్రీమహారాజ్ఞీ అని చెప్పిన తరువాత ఇప్పుడు మూడవ నామంలో శ్రీమత్సింహాసనేశ్వరీ అని వశిన్యాదులు కీర్తిస్తున్నారు.

సింహాసనం అన్న మాట అందరూ వినే ఉంటారు. దాని అర్థమూ అందరికీ తెలిసినదే.

మహారాజులూ మహారాణులూ సభలో దర్శనం ఇచ్చేటప్పుడు వారు అలంకరించే ఆసనానికి సంప్రదాయికంగా సింహాసనం అని పేరు.

ఐతే అందరు రాజులూ రాణీలూ కూర్చొనే సింహాసనం వంటిదా అమ్మ అలంకరించే ఆసనం?

అమ్మ అఖిలబ్రహ్మాండాలకు అధినేత్రి.

ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోండి. వశిన్యాదులు అమ్మను కీర్తిస్తూ చెప్పిన ఈ సహస్రనామస్తోత్రాన్ని ఎక్కడ అమ్మకు వినిపించారో.

అప్పుడు అమ్మ పేరోలగం తీర్చి ఉన్నది కదా.

అక్కడ సమస్తబ్రహ్మాండాధిపతులైన మహానుభావులూ వచ్చి కూర్చుని ఉన్నారు కదా.

అంటే అమ్మ అలంకరించిన సింహాసనం సామాన్యమైన సింహాసనమా? సమస్తబ్రహ్మాండాలకూ అధినేత్రి ఐన అమ్మ కూర్చున్న ఆసనం అది! సకల జగదధిష్ఠానచైతన్యస్వరూపిణి ఐనది అమ్మ. అందుచేత ఆ సింహాసనము శ్రీమంతమైనది. అంటే శ్రీయుక్తమైనది. ఇక్కడ శ్రీ అని చెప్పటం అమ్మను పరాశక్తిస్వరూపిణిగా చెప్పటం జరిగింది. అందుకే అమ్మకు శ్రీమత్సింహాసనేశ్వరి అని పేరు. అంటే శ్రీమంతమైన సింహాసనమునకు అధికారిణి అని చెప్పటం అన్నమాట.

సింహాసనం అన్న మాటలోనే ఒక చమత్కారం ఉంది. వెంతనే స్ఫురించే అర్థం ఏమిటీ అంటే సభలోనే అన్నటికంటే  శ్రేష్ఠమైన ఆసనమూ అలాగే సభలో అన్ని ఆసనాలకన్నా ప్రతేకమూ, ఉన్నతమూ ఐన ఆసనమూ అన్నది. సభకు అధిపతి ఐన వ్యక్తి అలంకరించే ఆసనం ప్రత్యేకంగా ఉండాలీ, విడిగా ఉండాలీ, ఎత్తుగా ఉండాలి, పెద్దదిగా ఉండాలీ అన్న భావనలో అందరికీ మంచి ఔచిత్యం తప్పకుండా కనిపిస్తుంది.

ఒకప్పుడు రాజులసభల్లో రాజుగారు కూర్చొనే అసనం ఎంత దర్జాగా ఉంటుందో మనకు నాటకాలూ సినిమాలూ వంటిద్వారా మంచి అవగాహన ఉంది కదా. ఈనాటికీ ఏదైనా సభజరిగితే అద్యక్షులవారికి కొంచెం పెద్దదీ డాబుగా ఉండేదీ ఐన కుర్చీ ఉంటుంది. మన చట్ట సభల్లోనూ అంతేగా మరి.

మహా ఐతే సింహాసనం అన్నాం కదా, కొందరు డాబుకోసం ఆసనం కోళ్ళకు బదులుగా సింహవిగ్రహాలు వంటివి వచ్చేటట్లు హడావుడి చేస్తారు. అదీ తెలుసు మనకు.

కాని సమస్త బ్రహ్మాండాల్లోనూ నిజంగా సింహమే వాహనంగా కలిగి ప్రకాశించేది ఒక్క అమ్మ తప్ప మరెవరూ లేరు. గ్రహాల్లో బుధుడికి సింహవాననం ఉంది కాని బుధుడు మోక్షకారకుడైన దైవతం కాడు కదా.  అందుచేత సింహాసనేశ్వరి అన్నదాని సింహము ఆసనంగా కలిగిన జగదీశ్వరి అని చెప్పుకోవటం చాలా సముచితంగా ఉంటుంది కదా.

సింహాసనేశ్వరి అన్నదానిలో ఈశ్వరి అన్న ఉత్తరపదానికి అర్థం ఏమిటో ఒక్కసారి చూదాం. ఈశ్వరత్వానికి ప్రభుత్వం అని ఒక అర్థం ఐతే, సమస్తసిధ్ధులకు ఆధిపత్యం అని మరొక అర్థం.

సర్వవ్యాపకమైన పరబ్రహ్మము (అదే పరమాత్మ) ఉంది.  ఆ బ్రహ్మము యొక్క ప్రతిబింబానికి సాక్షి అని వ్యవహారం. ఆ సాక్షియొక్క అనేకానేక ప్రతిబింబాలే జీవులు. శుధ్ధమైన బ్రహ్మం ఇంద్రియాదులవలన గోచరం కానేకాదు. కాని సాక్షిరూపంలో అది గోచరం అవుతుంది. ఈ సాక్షికే కూటస్థుడనీ ఈశ్వరుడనీ వేదాంతవ్యవహారం. ఈశ్వరస్వరూపం గోచరం అవుతుంది అనుగ్రహపూర్వకంగా సందర్భాన్ననుసరించి ప్రకృతిలోని జీవులకు. స్త్రీలింగపరంగా ఈశ్వర శబ్దం ఈశ్వరి అవుతుంది.   అంటే పరబ్రహ్మస్వరూపిణి ఐన అమ్మ ఈశ్వరిగా సాక్షాత్మరిస్తున్నది అన్న మాట.

అమ్మకు వాహనం ఐన సింహము, ఈశ్వరి యొక్క ప్రభుత్వానికి అంటే నియామక దండనాధికారాలకి ప్రతీక.  సింహం అన్నది హింసకు ప్రతీక. హింస శబ్ధమే ఒకానొక వ్యాకరణ కార్యంవలన సింహం అవుతున్నది. హిసి హింసాయాం అనేది ధాతువు. ఈ ధాతువు నుండి హింస శబ్దం వచ్చింది. ఇందులో వర్ణాలు తారుమారు అవటం ద్వారా సింహం అనే శబ్దం సిధ్ధిస్తున్నది. ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. వశకాన్తౌ అన్న ధాతువు నుండి శివ శబ్దం వచ్చింది. పశ్యతి ఇతి పశ్యకః అన్నది కశ్యప శబ్దంగా మారింది.

ఇక్కడ సింహం హింసకు ప్రతీక అన్నప్పుడు సింహం మృగరాజు. విచక్షణారహితమైన హింస చేసేవాడు కాదు. తన శాసనాన్ని ధిక్కరించే వారిని మాత్రమే దండించే వాడు.  భగవంతుడూ అంతే తన ధర్మశాసనాన్ని ధిక్కరించిన వారిని మాత్రమే దండిస్తాడు.   యోగశాస్త్రం లో సహనశక్తికి,గమన శక్తికి ప్రతీకగా సింహన్ని చెబుతారు.

మృగములలో ముఖ్యమైనదీ, శ్రేష్ఠమైనదీ సింహమే. కాబట్టి సింహశబ్దానికి శ్రేష్ఠమైన అన్న అర్థంలో మిక్కిలి వాడుక. సింహభాగం అంటే ముఖ్యమైన భాగం. సింహద్వారం అంటే ద్వారా ఇంటిద్వారాల్లో శ్రేష్ఠమైనది. నరసింహుడు అంటే నరుల్లో శ్రేష్టుడు.  అలాగే సింహాసనం అంటే శ్రేష్టమైన ఆసనం.  అంతే కాదు కార్యార్థం మృగశ్రేష్టమైన సింహాన్నే అమ్మ వాహనంగా చేసుకున్నది.

ఈ నామంలో ఉన్న సింహాసన శబ్ధాన్ని సూచనగా అమ్మవారి పంచసింహాసనాలనూ స్మరించాలి.

సింహానికి పంచాననం అనీ పంచాస్యం అనీ పర్యాయపదాలున్నాయి. ఇక్కడ పంచ అంటే విశాలమైన అని అర్థం. అమ్మ వారి ఆసనం కూడ ఐదు వృత్తరూపాలుగా ఉంటుంది. దానికే కళ్యాణశ్రీకళాయంత్రం అని మంత్రశాస్త్రవ్యవహారం. అది అధిష్ఠానంగా గల శ్రీదేవి శ్రీమత్సింహాసనేశ్వరి అని ఒక వివరణ.

అమ్మవారికి ఇతరమైన పంచాసనాలు కూడా ఉన్నాయి.  శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌః అని పంచప్రణవబీజాలు. వీటికి అధిష్ఠాత్రి శ్రీదేవి. నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, శాంత్యతీతము అని పంచకళలు. వీటికన్న పైస్థానంలో ఉన్న తల్లి. ఈవిధంగా పంచప్రణవాసన మరియు పంచకళాసన.

నాలుగుదిక్కులూ, ఆదిక్కుల మధ్యమము అనే పంచదిక్కులకూ అమ్మకు అసనాలు అని చెప్పబడుతున్నాయి. ఆవిడ పంచదిగాసన. అమ్మవారు దేవేంద్రుడి తపస్సుకు మెచ్చి తూర్పుదిక్కు ఆసనంగా ప్రత్యక్షం అయ్యారని ఐతిహ్యం.

పంచభూతాలైన పృధివి, జలము, వాయు, తేజస్సు, ఆకాసము ఇవి అన్నీ తనకు ఆసనాలు (అంటే నివాసస్థానాలు)గా కలిగిన తల్లిగా పంచభూతాసన.

సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములనే శివుని పంచముఖములయందు వసించే శక్తిస్వరూపిణి అమ్మ పంచముఖాసన.

బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుల్ని పంచప్రేతాలని అంటారు. ఈ ఐదుగురూ అమ్మకు కోళ్ళుగా ఉన్న ఆసనం అధివసించి ఉంటుందని తంత్రశాస్త్రం.

జ్ఞానార్ణవం అన్న గ్రంధంలో చైతన్యభైరవీ మంత్రం నుండి సంపత్ప్రదా మంత్రం వరకూ ఉన్న ఎనిమిది మంత్రాలే అమ్మవారికి పంచసింహాసనాలన్న వివరణ ఉంది. మూడు జంటమంత్రాలూ, మిగిలిన రెండు మంత్రాలు మొత్తం ఐదు. 

మరొక ముఖ్యమైన సంగతిని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. హంస వాహన సరస్వతిగా అమ్మ శుధ్ధసాత్విక మూర్తి.  భండాసురాదినిర్మథనక్రియోన్ముఖురాలిగా అమ్మ తీవ్రమూర్తియై సింహవాహన. అమ్మవారి ఆవిర్భావానికి సంబంధించిన నామాలు మొట్టమొదట ప్రస్తావనకు వస్తున్నాయిక్కడ. రాబోయే నామాలు చిదగ్నికుండ సంభూతా, దేవకార్యసముద్యతా అన్న వాటిని మనం వివరంగా తెలుసుకొనే టప్పుడు ఈవిషయం మరింత స్పష్టం అవుతుంది

అమ్మ వారి వాహనసింహాన్ని ధ్యానించటం సమస్తశుభాలను కలుగ చేస్తుంది. ఆమ్మవారి వాహనసింహ ధ్యానస్తోత్రం పఠించండి

అటువంటి సింహవాహన ఐన తల్లి లలితాపరాభట్టారికా దేవి అని ఈ నామం ద్వారా తెలుసుకుంటున్నాం.

14 కామెంట్‌లు:

  1. >>>సింహం అన్నది హింసకు ప్రతీక. >>>

    ఇది ఎందుకో అభ్యంతరకరంగా ఉంది.సింహం రాజసానికి గుర్తు కదా ?

    రిప్లయితొలగించండి
  2. రిప్లయిలు
    1. నీహారిక గారూ, విన్నకోటవారూ, ఈనామ వ్యాఖ్యానం కొంచెం విస్తరించాను. మరొక్కసారి చదువుకొంటే మీ అనుమానం నివృత్తి అవుతుంది. ఇంకా శేషం ఏమన్నా ఉంటే రాబోయే రెండు నామాలూ తీర్చగలవు.

      తొలగించండి
    2. ఇప్పుడు తేటతెల్లంగా ఉందండి.. ధన్యవాదాలు.

      తొలగించండి
  3. శ్రీమత్సిమాసింహాసనేశ్వర్యైనమః

    రిప్లయితొలగించండి
  4. ఈ శ్రీమత్సింహాసనేశ్వరీ నామం గురించి ఇంకొంచె వ్రాయవలసినది ఉందని అనుకుంటున్నాను. ప్రస్తుతం వ్రాయటానికి మనస్సు తొందరించినా వ్రాయటానికి అననుకూలమైన పరిస్థితి. వీలైనంత త్వరలో ఈనామం గురించిన వ్యాఖ్యానాన్ని విపులీకరించటానికి యత్నిస్తాను. అంతవరకూ క్షంతవ్యుడను.

    రిప్లయితొలగించండి
  5. http://lokaateetalavanya.blogspot.com/2018/06/?m=0

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్ఞాత గారూ,

      ఇంతమంచి సమాచారం అందించి, మీరు మీ పరిచయాన్ని గుప్తంగా ఉంచుకోవటం బాధకలిగించింది. దుర్గా శివకుమార్ గారు నడుపుతున్న Lalitha Sahasranama బ్లాగు చాలా బాగుంది.

      నిజానికి ఇప్పుడు నాకు ఈ శ్రీలలిత బ్లాగు నడపటానికి కారణం పెద్దగా కనిపించటమే లేదు.

      దుర్గ గారి బ్లాగు విషయం తెలిసి ఉంటే, ఈ బ్లాగును ప్రారంభించే వాడినే కాదు!

      విజ్ఞులు ఆలోచించి తగినంత ప్రయోజనం ఉన్నదని సూచించే పక్షంలో మాత్రమే ఈ బ్లాగును నిర్వహించవలసి ఉంటుంది అని భావిస్తున్నాను.

      తొలగించండి
    2. మిత్రులు శ్యామలీయంవారు,
      నమస్సులు.


      ఆదిలోనే హంసపాదు.

      ఆరంభింపరు..........ప్రజ్ఞానిధుల్గావుతన్. ఈ పద్యం గురించి నేను మీకు చెప్పక్కరలేదనుకుంటా.

      ముఖే ముఖే సరస్వతి...విషయం ఒకటే కావచ్చు. ఎవరు చెప్పే విధానం వారికే స్వంతం. ఒకరు కష్టమైనదానిని చిన్న చిన్నమాటలలో ఉపమానాలతో, సుబోధకం చేయచ్చు. మరొకరు అదే విషయాన్ని క్లిష్టతరమూ చేయచ్చు. ఎవరి మాట వారిదే! ఎవరి బతుకువారిదే!! ఎవరిగోల వారిదే!!! చివరికి ఎవరి చావు వారిదే!!!!

      మరొకరితో పోలిక అనవసరం. ఇప్పుడేం చేయాలో మీరే నిర్ణయించుకోండి.

      చాలా కాలంగా వ్యాఖ్యలు రాయడం లేదు, ఇప్పుడే ఆగలేక.....
      స్వస్తి

      తొలగించండి
    3. శర్మగారు, ఎవరి మనస్సూ నొప్పించాలని కాదు. శ్రీలలితాసహస్రనామస్తోత్రానికి చక్కని వివరణ మరొకబ్లాగులో లభ్యం అవుతున్నది కదా, మరల నేనూ వ్రాయవలసిన అవసరం అంతగా ఉండదేమో నన్నభావన కలిగింది. మీరు ప్రస్తావించిన కారణం చాలు నేను కూడా వ్రాయటం విద్వజ్జనసమ్మతం కావచ్చునన్న నమ్మకం కుదరటానికి. అదీకాక లలితగారు కూడా ఈవిధంగానే సూచించారు కాబట్టి సంతోషంగా కొనసాగిస్తాను. ఆపార్థాలు రాకుండా ఉండటం మంచిదన్న ఉద్దేశంతో శ్రీదుర్గా శివకుమార్ గారికి కూడా మెయిల్ ద్వారా పరిస్థితిని వివరించాను.

      తొలగించండి
  6. శ్రీమత్సింహాసనేశ్వరీ నామ వివరణ మరికొంచెం విస్తరించి వ్రాయటం జరిగింది. పాఠకులు మరొక్క సారి పరిశీలగా చదువుకొన వలసిందిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  7. "శ్రీమత్సింహాసనేశ్వరీ" - మూడవ నామానికి మీరిచ్చిన వివరాలకి ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  8. దుర్గాదేవి చేతిలో ఖడ్గం పేరు ఏమిటి? విష్ణమూర్తికి నండకం అంటారు మరి అమ్మవారి చేతిలో వుండే ఖడ్గం పేరు ఏమిటి?

    రిప్లయితొలగించండి