20, ఫిబ్రవరి 2019, బుధవారం

4. చిదగ్నికుండసంభూతా


శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ।
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥ 1

చిత్ అన్న శబ్దానికి ప్రాణశక్తి అనీ మనస్సు అనీ జ్ఞానం అనీ సాధారణార్థాలు. విశేషంగా ఈ చిత్ అనే శబ్దానికి బ్రహ్మము అనే అర్థం వేదాంతప్రసిధ్ధిగా ఉంది.

చిదాకాశం అన్నప్పుడు ఆకాశం వలే అధారాపేక్షలేక ప్రకాశించే పరబ్రహ్మమని అర్థం. చిదాత్మాది పదములలో ద్యోతకామయ్యే అర్థప్రతీతి కూడా చిత్ అంటే బ్రహ్మము అనే.

అందుచేత చిత్+అగ్ని-> చిదగ్ని అంటే బ్రహ్మమే ఐన అగ్ని. ఈ అగ్నియొక్క ప్రకాశనస్థలావధియే చిదగ్ని కుండం. అగ్నిస్వభావాలుగా వేడిమినీ వెలుగునీ చెప్తాము. ఈ చిదగ్ని యొక్క వెలుగు అజ్ఞానం అనే చీకటిని పోగొడుతుంది.

అంతర్నిరంతర నిరింధన మేధమానే
మోహాంధకార పరిపంధిని సంవిధగ్నా

అని శాస్త్రం.

 అంటే ఈ సంవిదగ్ని నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఆలా ప్రకాశించటానికి దానికి ఏ ఇంధనమూ అవసరం లేదు కూడా! ఈ అగ్ని, మోహం అనే అంధకారానికి శత్రువు. అంటే అజ్ఞానరూపం ఐన మోహం అనేదాన్ని ఈ చిదగ్ని నాశనం చేస్తుంది అని భావం.

అగ్నులు మూడు రకాలు దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని వాటికి పేర్లు.  గార్హ్యపత్యాగ్ని అంటే గృహస్థుడు నిత్యం ఇంటిలో ఉంచి సమారాధించే అగ్నిస్వరూపం. దక్షిణాగ్ని అంటే  యజ్ఞవేదికకు దక్షిణంగా ప్రతిష్ఠించబడే అగ్ని.  ఆహవనీయాగ్ని అంటే హోమాగ్ని. ఈ మూడింటినీ కలిపి  త్రేతాగ్నులు అని పిలుస్తారు. ఇక్కడ చిదగ్ని అంటే ఆహవనీయాగ్నిగా తెలుసుకోవాలి. ఇందే హవిస్సులను సమర్పిస్తారు.  భండాసురవధా కథానుసారంగా దేవతలు తమతమ శరీరభాగాలనే అమ్మకు ఆహుతులుగా సమర్పించిన హోమాగ్ని గుండమే ఇక్కడ చిదగ్నికుండము అని అర్థం.

మరొకవిధంగా కూడా సమన్వయం చెప్పుకోవచ్చును. హ్రీంకారమే చిదగ్ని. శ్రీదేవి ఈ హ్రీకాంరాగ్ని యొక్క శిఖాస్వరూపంగా ఉన్నది.  అహవనీయే జుహోతి అని చెప్పే మంత్రంతో పాటే ఉద్దీప్తేగ్నౌ జుహోతి అని కూడా మంత్రప్రమాణం ఉంది. శిఖలతో ప్రజ్వలిస్తున్న అగ్నియందే హోమం చేయాలి అని అర్థం తెలుస్తున్నది. ఈ విధంగా ఉద్దీప్తమైన అగ్నిజ్వాల కలిగిన ఆహవనీయాగ్నిని ధరించినది చిదగ్నికుండము సార్థకం.

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తకపాశ మంకుశధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం
త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీ చక్ర సంచారణీమ్

ఈ దేవీ ఖడ్గమాలాస్తోత్రంలోని ప్రసిధ్ధమైన శ్లోకంలో చెప్పబడిన హ్రీంకారాసనం చిదగ్నికుండమే. ఆ హ్రీంకారానలశిఖా స్వరూపమే అమ్మ శ్రీదేవి లలితాపరాభట్టారిక.

ఈ నామం చిదగ్నికుండసంభూతా అన్నదానికి చిదగ్ని కుండలో సంభవించినది అన్న స్థూలార్థం కనిపిస్తుంది. మనం చిదగ్ని కుండం అనేది ఏమిటో తెలుసుకున్నాం.  ఇంక సంభూత అని ఎందుకన్నారో చూడాలి.

సంభూత అంటే వ్యావహారికార్థం ప్రకారం పుట్టినది అని చెప్పాలి.  ఇక్కడ అలా చెప్పకూడదు. పాణినీయ వ్యాకరణంలో తత్రజాతః, తత్రభవః అన్న ప్రయోగాలు కనిపిస్తాయి.  జాతః అన్నా భవః అన్నా ఒక్కటే అర్థం ఐన పక్షంలో రెండు ప్రయోగాలు అవసరమే లేదు కదా. అందువల్ల జననం భవము అనేవి వేరువేరు అర్థఛ్ఛాయలు కలిగి ఉన్నాయని స్పష్టం అవుతున్నది.

భూః అనే ధాతువుకు పుట్టుట అన్నది కాక 'ఉన్నది' అని విశేషార్థం మనం స్వీకరించాలి.

నిత్య ఐన అమ్మకు పుట్టటం అనేది అన్వయం కానే కాదు కదా.

అందుచేత భూః ధాతువు వలన ఇక్కడి అర్థం లోకానుగ్రహం కొరకు వెలువడుట అనే గ్రహించాలి.

శ్రీదేవి ఇలా అగ్నికుండము నుండి వెలువడిన కథ ఒకటి రేణుకాపురాణంలో ఉంది.

ఏతస్మిన్నంతరే యజ్ఞే వహ్నికుండాఛ్ఛనై ర్ద్విజ
దివ్యస్వరూపాన్వితా నారీ దివ్యాభరణ భూషితా
వహ్నేశీతాంశుబింబాభా సహసా నిర్గతా బహిః
ఏకైవ తు జగధ్ధాత్రీ ద్వితీయా నాస్తి కాచన

ఇక్ష్వాకువంశంలోని రేణువు అనే రాజు అమ్మ అనుగ్రహం కొరకు యజ్ఞం చేసాడు. అప్పుడు అమ్మ దివ్యాభరణభూషితగా యజ్ఞకుండంలోనుండి ఆవిర్భవించింది. పైగా ఆవిడ చంద్రుడివలె చల్లని కాంతిని ప్రసరిస్తూ వచ్చినదట.

మండుతున్న అగ్నినుండి చల్లని కాంతితో వెలువడటం ప్రకృతివిరుధ్ధం అనిపించవచ్చును. కాని అమ్మ ప్రకృతికి ఆవలిది యైన శక్తి స్వరూపం కదా. ఆవిడకు ఆసాధ్యం ఏమి ఉంటుంది!

నిర్గతా బహిః అనటం గమనించండి. ఉన్నదే కదా బయటకు వస్తుంది. ఇక్కడ కొత్తగా పుట్టటం అన్నది చెప్పటం లేదు. ఆవిడ ఉన్నది. నిత్యం ఉన్నది. ఎల్లెడలా ఉన్నది. ఇప్పుడు, ఈ విధంగా బహిర్గతం ఐనది అని చెప్తున్నారు గమనించండి.

రెండవదీ, ఈ సహస్రనామాలలో చెప్పబడినదీ ఐన కథ బ్రహ్మాండ పురాణంలోని భండాసురవధ.  ఈ భండాసురవధ గురించి తరువాతి నామంలో విస్తారంగా చూదాం. ప్రస్తుతానికి అమ్మ ఆవిర్భావం గురించి తెలుసుకుందాం.

కుండం యోజన విస్తారం సమ్యక్కృత్వాతి శోభన...
హోతు మిఛ్ఛత్సు దేవేషుకళేబర మనుత్తమమ్
ప్రాదుర్భభూవ పరమం తేజః పుంజమయం మహత్
కోటిసూర్యప్రతీకాశం చంద్రకోటిసుశీతలమ్
తన్మధ్యతః సమదభూ చ్చక్రాకార మనౌపమమ్
తన్మధ్యతో మహాదేవీం దేవాః సర్వేసవాసవాః
ఉదయార్కసమప్రభామ్.....

సారాంశం ఏమిటంటే భండాసురుడి వలన బాధలు పడుతున్న దేవతలు ఒక యోజనం విస్తారం కల హోమగుండంలో అమ్మ కొరకు యాగం చేసారు. తమతమ శరీరభాగాల్నే అమ్మకోసం హోమం చేసారు. ఐనా అనుగ్రహం కనుపించలేదు. వారు తమతమ శరీరాల్నేహోమం చేయటానికి పూనుకున్నారు. అమ్మ ప్ర్తత్యక్షమైనది.

ఆవిడ హోమగుండమధ్యంలో ఎలా ప్రత్యక్షం ఐనది?

కోటి సూర్యుల కాంతితో, అంతే కాదు కోటి చంద్రుల వెలుగువలె చల్లని వెలుగులు ప్రసరిస్తూ వచ్చింది ఒక చక్రం తేజో మయమై అగ్నిగర్భం నుండి.

ఆ చక్రం మధ్యలోబాలసూర్యుని వలె అమితశోభతో శ్రీదేవి ప్రకాశిస్తూ ఉన్నది.

ఈ విధంగా చిదగ్నికుండం నుండి శ్రీదేవి అమ్మవారు సంభూత ఐనది. ఇక్కడ సంభూత అంటే ప్రాకృతజగత్తుకు ప్రత్యక్షం ఐనది అనే అర్థం కాని ఆవిడేదో కొత్తగా పుట్టింది అన్న మాట కాదు.

భగవద్గీతలో

అజోపిసన్ అవ్యయాత్మా  భూతానామ్ ఈశ్వరోపసన్
ప్రకృతిమ్ స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా (అ4. శ్లో6)

అనే కదా శ్రీకృష్ణవచనం.

పుట్టుక లేనిది నిర్వికారమైన పరాశక్తి. తన మాయాశక్తిని ఆశ్రయించి జన్మించినట్లుగా మనకు ద్యోతకం అవుతున్నది. అంతే.

అమ్మ ఆవిర్భావం ఈవిధంగా లోకానుగ్రహం కొరకు జరిగింది.


4 కామెంట్‌లు:

  1. నమస్కారం
    ఒక్క విషయం. మీరు ఒక్కో నామం రాసేటప్పుడు ముందు శ్లోకం, దాని నెంబర్, నామం హైలైట్ చేస్తూ చీపిస్తే బాగుంటుందండి. అలారాస్తే ఏ నామం ఏ శ్లోకంలోనిది అనేది నాలాంటి వాజమ్మలకి తెలుస్తుంది అని, అంతకన్నా మరోటి ఏమీ లేదు

    మరొకటి భగవదీత శ్లోకం అని రాస్తే దానికి అది ఏ అధ్యాయంలోది అని చెప్తే బాగుంటుంది. అలాగే మిగతా రిఫరెన్సులూను. ఉదాహరణకి

    శ్రీమాతా శ్రీమహరాజ్ఞీ శ్రీమత్సిం హాసనేశ్వరీ

    చిదగ్నికుండసమ్బూతా దేవకార్యసముద్యతా (ల.స.నా 1)
    హైలైట్ కి టేగ్ వాడాను. మీరు మరోవిధంగా చేయవచ్చు.

    హ్రీంకారాసన గర్భితాం .. అని రాసేటప్పుడు అది ఎక్కడిదో ఇలా బ్రాకెట్లలో చెప్తే బాగుంటుంది(దేవి ఖడ్గమాలా శ్తోత్రం) అని రాస్తే మంచిది. అందరికీ వెంఠనే తెలుస్తుంది.

    భగవదీతలో ఆ మాత్రం వెదుక్కోలేరా అని నా మీద అరవకండి మరి. :-)


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అరవను లెండి.
      మీ సూచనలు బాగున్నాయి.
      ప్రయత్నిస్తున్నాను.

      తొలగించండి
  2. "చిదగ్నికుండసంభూతా!"

    చిద్రూపీ! పరదేవతా!

    రిప్లయితొలగించండి