20, మార్చి 2019, బుధవారం

13 - 51. అమ్మ స్వరూప వర్ణనం.


శ్రీ లలితా సహస్రనామస్తోత్రంలో13వ నామమైన చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా నుండి 51వ నామమైన సర్వాభరణభూషితా వరకూ అమ్మ యొక్క భౌతిక స్వరూపవర్ణన ఉంది. ఈ నామాలు 4వ శ్లోకం నుండి మొదలై 21వ శ్లోకం ప్రథమార్థం వరకూ విస్తరించి యున్నాయి.

సవివరంగా నామాలను గురించిన చర్చకు ముందుగా ఒక సారి వాటి అర్థాలను క్లుప్తంగా తెలుసుకుందాం.

13. చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా
సంపంగి పూవులు, అశోకపుష్పాలు, సురపొన్న పూవుల సువాసనచే ప్రకాశిస్తున్న జుట్టు అమ్మది.

14. కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా
పద్మరాగ మణులవరుసలతో ప్రకాశిస్తున్న కిరీటం అమ్మది.

15. అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా
అమ్మ నుదురు అష్టమి చంద్రుని వలె ఉన్నది.

16. ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా
అమ్మ ముఖం అనే చంద్రబింబానికి కస్తూరీతిలకం అనేది ఒక చక్కని మచ్చలాగా శోభిస్తున్నది.

17. వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా
అమ్మ ముఖమే మన్మథుని మంగళ గృహం. ఆవిడ కనుబొమలు ఆ ఇంటి ముఖద్వారాలవలె ఉన్నాయి.

18. వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా
అమ్మ ముఖకాంతి ఒక కారుణ్య జలప్రవాహం. ఆవిడ కన్నులు అ ప్రవాహంలో అందంగా కదలాడుతున్న చేపలు.

19. నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
అమ్మ ముక్కుదూలం అప్పుడే వికసించిన సంపంగి పూవులా ఉన్నది.

20. తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా
అమ్మ ముక్కుకు ఉన్న అడ్డబాస ప్రకాశం అకాశంపైన ఉండే నక్షత్రాల కాంతుల్ని త్రోసిరాజంటోంది.

21. కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా
అమ్మ చెవులపై మహామనోహరమైన అలంకంగారాలుగా కడిమిపూవుల గుత్తులు అలరారుతున్నాయి.

22. తాటంకయుగళీభూతతపనోడుపమండలా
సూర్యచంద్రులంటే వా ళ్ళెవ రనుకుంటున్నారు? వాళ్ళు అమ్మ చెవి కమ్మలే.

23. పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః
ఎర్రని పద్మరాగాలు అందంగా ఉంటాయి. కాని అమ్మ ఎర్రని చెక్కిళ్ళ అద్దాలు పద్మరాగాల అందాల్ని త్రోసిపుచ్చుతున్నాయి.

24. నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా
కొత్త పగడాల ఎరుపుదనం ఎంత గొప్పగా ఉన్నా అది అమ్మ పెదవుల అరుణిమ ముందు దిగదుడుపే.

25. శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా
శుధ్ధవిద్య అనే మొలక యొక్క రెండు చిగురుల్లాగా అమ్మ పండ్లవరుస ప్రకాశిస్తోంది.

26. కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా
అమ్మకు కర్పూర తాంబూలం సేవించటం ఇష్టం. ఆవిడ తాంబూలపు ఘుమఘుమలతో దిక్కులు నిండిపోతున్నాయి.

27. నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ
అమ్మ పలుకులు ఎంతో మధురమైనవి. అవి సరస్వతీ దేవి వీణకంటే ఎంతో స్పష్టమూ మధురమూ ఐనవి.

28. మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా
అమ్మ ఒలికిస్తున్న చిరునవ్వుల మధురకాంతుల్లో పరమేశ్వరుడి మనస్సు మునకలు వేస్తున్నది.

29. అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా
ఎందరో ఎన్నో ఉపమానాలతో అమ్మ అలౌకికసౌందర్యాన్ని వర్ణించవచ్చును. కాని ఆవిడ గడ్డం ఎంత అందంగా ఉందో పోల్చి చెప్పేందుకు అటువంటిది ఇంచుమించుగా కూడా మరిక వస్తువు లేనేలేదే!

30. కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా
అమ్మ మెడలో కామేశ్వరుడు కట్టినది లోకోజ్జీవన కారణమైన పరమసౌభాగ్యచిహ్నమైన మంగళసూత్రం శోభాయమానంగా ఉంది.

31. కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా
కాది హాది విద్యాస్వరూపములైన బంగారు భుజకీర్తులను ధరించి అమ్మ విరాజిల్లుతున్నది.

32. రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా
అమ్మ మెడలో రత్నాలతో చేసిన  చింతాకు పతకాలున్నాయి, మంచిముత్యాల హారాలున్నాయి.

33. కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ
కామేశ్వరుని ప్రేమరత్నానికి సరైన వెలగా నిలస్తూ ఉన్నాయి అమ్మ స్తనాలనే మణుల జంట.

34. నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ
అమ్మ నాభినుండి పైకెదిగిన నూగారు అనే లతకు కాచిన రెండు మంచి ఫలాలుగా అమ్మ స్తనాలు శోభిస్తున్నాయి.

35. లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా
అమ్మ సన్ననిది. ఆవిడకు నడుము ఉందా లేదా అన్నది సంశయం ఐతే, దానికి పరిష్కరంగా అమ్మ నూగారు అమ్మకు నడుము ఉన్నది అని నిర్థారిస్తోంది.  అధారం లేనిదే నూగారు అనే లత ఎలా పైకి ప్రాకి స్తనాలనే పండ్లను కాచినది మరి?

36. స్తనభారదలన్మధ్యపట్టబంధవళిత్రయా
అమ్మ స్తనముల భారము వలన అసలే సన్ననిదైన అమ్మ నడుము ఇబ్బంది పడుతున్నది. ఆ నడుమును నిలిపి ఉంఛటానికి కట్టిన బంగారు పట్టీలలాగా అమ్మకు పొట్టమీద మూడు ముడుతలు కనిపిస్తున్నాయి.

37. అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ
అమ్మ కటిప్రదేశంలో మిక్కిలి ఎర్రనైన వస్తాలు ధరించి ఉన్నది.

38. రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా
అమ్మ బంగారపు ఒడ్డాణాన్ని ధరించింది. దానికి రత్నాలతో అలంకరించిన చిరుగంటలున్నాయి. అవి కిణికిణి అని మనోహరమైన ధ్వని చేస్తున్నాయి.

39. కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా
అమ్మ కామేశ్వరి. అయ్యవారు కామేశ్వరుడు. ఈ ఇద్దరూ ఆదిదంపతులు. ఆవిడ ఊరువుల సౌభాగ్యమును కేవలము కమేశ్వరుడే యెరుగును.

40. మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా
అమ్మ మోకాళ్ళు అందమైన చిన్న మాణిక్యపు కిరీటాల వలె ఉన్నాయి.

41. ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా
మన్మథుని తూణీరాలను ఎర్రని ఆరుద్రపురుగులు ఆవరించుకొని ఉన్నయా అన్నట్లుగా అమ్మ  పిక్కలు శోభిస్తున్నాయి.

42. గూఢగుల్ఫా
చక్కగా పుష్టిగా ఉన్న చీలమండలు కలది అమ్మ.

43. కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా
అమ్మ మీగాళ్ళు (అనగా పాదాలపైభాగాలు) అందమైన తాబేళ్ల వీపులను తిరస్కరించుతూ ఉన్నాయి.

44. నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా
అమ్మ తన కాలిగోళ్ళ ప్రకాశం చేతనే, పాదనమస్కారం చేసే జనుల తమోగుణాన్ని పోగొట్టుతున్నది.

45. పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా
కొలనుల్లోనూ పద్మాలున్నాయి.  అమ్మ పాదపద్మాల సౌందర్యప్రభలకు అవి ఎంతమాత్రం సాటిరావు.

46. శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా
అమ్మ పాదాలకు మణులు పొదగిన అందమైన అందెలున్నాయి.

47. మరాళీమందగమనా
అమ్మ నడక అందమైన హంసనడక వంటిది.

48. మహాలావణ్యశేవధిః
లావణ్యం అంటే సౌందర్య. అమ్మ సౌందర్యం వంటిది మరొకటి బ్రహ్మాండంలోనే లేదు.

49. సర్వారుణా
అమ్మ అంతా ఎరుపు మయం. ఆవిడ శరీరఛ్ఛాయయే కాదు. ఆవిడ ధరించే వస్త్రమాల్యాభరణాదులు అన్నీ కూడా ఎర్రనివే.

50. అనవద్యాంగీ
అమ్మ శరీరనిర్మాణం ఎక్కడా లోపం ఎన్నటానికి వీలులేనిది. సర్వశుభలక్షణములూ కలిగినది.

51. సర్వాభరణభూషితా
అమ్మ చూడామణి మొదలుకొని పాదాలకు ఉంగరాలవరకూ సర్వాంగముల యందూ సర్వవిధములా శ్రేష్ఠములైన ఆభరణాలు ధరించి ఉంది.

ఇదీ అమ్మ యొక్క స్వరూప వర్ణన.

ఇప్పుడు మనం ఈ స్వరూపవర్ణనాపర మైన నామాల గురించి విడివిడిగా చర్చించుకుందాం.

2 కామెంట్‌లు:

  1. ఈ నామాలని ఎలా వివరిస్తారోనని ఆసక్తిగా వుంది. ఇంత ఓపిగ్గా ఈ సిరీస్ రాస్తున్న మీకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ అభిమానానికి ధన్యవాదాలు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంతా అమ్మ అభీష్టం మేరకే జరుగుతుందని నిశ్చింతగా వ్రాయటమే!

      తొలగించండి