22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

5. దేవకార్యసముద్యతా


శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ।
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥  1

అమ్మ చిదగ్నికుండసంభూతగా అవతరించటానికి ఒక కారణం భండాసురవధ అని చెప్పుకున్నాం.

ఈ భండాసురుడి వలన బాధలు పడుతున్న దేవతలు ఒక యోజనం విస్తారం కల హోమగుండంలో అమ్మ కొరకు యాగం చేసారు. తమతమ శరీరభాగాల్నే అమ్మకోసం హోమం చేసారు. ఐనా అనుగ్రహం కనుపించలేదు. వారు తమతమ శరీరాల్నేహోమం చేయటానికి పూనుకున్నారు. అమ్మ ప్ర్తత్యక్షమైనది అని కూడా చెప్పుకున్నాం.

ఇంతకీ ఈ భండాసురుడు ఎవడు?

ఇది తెలుసుకోవలసి ఉంది.

ఈ లలితాసహస్రనామంలో ఈ భండాసురుడితో అమ్మ చేసిన యుధ్ధం గురించి చాలా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుంది.

భండాసురవధోద్యుక్త శక్తిసేనాసమన్వితా అన్న నామం నుండి కామేశ్వరాస్త్రనిర్ధగ్ధ సభండాసురశూన్యకా అన్న నామం వరకు ఉన్న నామాల వరుస ఈ యుధ్ధాన్ని వర్ణిస్తుంది.

అందుచేత ఇప్పుడు ఈ భండాసురుడు ఎవ్వరూ, ఇతడిని వధించటం అనేది అమ్మ స్వయంగా రంగంలోనికి దిగవలసినంత ముఖ్యమైన కార్యం ఎందుకైనదీ తెలుసుకుందాం.

దక్షయజ్ఞం పుణ్యమా అని సతీదేవి శివనిందను సహించలేక అభిమానపడి శరీరత్యాగం చేసింది యోగాగ్నిలో. పిమ్మట శివుణ్ణి వివాహం ఆడటానికి హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది. శివుడు తపోనిష్ఠలో ఉన్నాడు.

వజ్రాంగుడనే రాక్షసుని కొడుకు తారకుడు దేవతలపైన పగతో శివుడిని ఉద్దేశించి మహాతపస్సు చేసి భోళాశంకరుణ్ణి మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. పైగా శివుడి కుమారుడి వలన తప్ప ఆతడు చావులేకుండా వరం పొందాడు.

శివయ్య మనస్సును పార్వతిపై లగ్నం చేయటానికి దేవతలు మన్మథుణ్ణి నియోగించితే కథ అడ్దంతిరిగింది. శివుడు కళ్ళెఱ్ఱ జేసి చూసి మూడో కన్ను తెరిచి వీక్షించే సరికి ఆ మన్మథుడు బూది కుప్ప ఐపోయాడు.

మనకు ఆతరువాత పార్వతీ కళ్యాణం జరిగిందని తెలుసును. శివుని కొడుకు కుమారస్వామి తారకాసురసంహారం చేసాడనీ మనకు తెలుసును. ఆ కథలోనికి యిప్పుడు మనం పోవటం లేదు.

బూడిదకుప్ప సంగతి ఒక పెద్ద కథగా మారింది. అది మనకు ఇక్కడి ప్రథాన విషయం.

శివుడి అనుచరగణాలను ప్రమథగణా లంటారు. ఆ  గణాలకు నాయకులను గణపతు లంటారు. అలాంటి ఒక గణపతి చిత్రకర్మ అనే వాడు ఈ బూడిద కుప్పను మానవాకారంలో తీర్చిదిద్ది ప్రాణప్రతిష్ఠ చేసాడు.

ఇది చూసి బ్రహ్మగారు ఆందోళనగా భండ భండ అన్నారు. అంటే అయ్యో అయ్యో అని ఆక్షేపించారన్నమాట.

ఆ పుట్టినవాడు ఉగ్రమైన బూడిదనుండి పుట్టాడు కదా వాడు అసురుడై భండాసురడన్న పేరు వచ్చింది వాడికి.

ఈ ఒక్కడినే కాదు చిత్రకర్మ సృజించింది! మిగిలిన బూడదతో మరో రెండు బొమ్మలూ చేసి ప్రాణం పోసాడు!  వాళ్ళ పేర్లు విశుక్రుడు, విషంగుడు అని.

చిత్రకర్మ వాడికి శివారాథనాక్రమం నేర్పితే వాడు దాన్ని సద్వినియోగం చేసుకొని శివుడి వలన 69వేల సంవత్సరాల రాజ్యపదవి సంపాదించాడు. వీడికి పురుషు డెవ్వడి వలనా చావు లేకుండానూ, ఎదిరించిన వాడి బలంలో అర్థభాగం తనపరం అయ్యేట్లుగానూ కూడా వరం ఇచ్చాడు శివుడు.

చాలా కాలం పాటు పాపం వాడు బుధ్ధిగానే ఉన్నా చివరకు వాడి దైత్యగుణమే గెలిచి లోకాల్నీ దేవతలనీ హింసించటం మొదలు పెట్టాడు.

వాడొక చిత్రమైన ఆలోచన చేసాడు. పరమభయంకరమైన ఆలోచన! ఈ సృష్ఠిని స్థంభింపజేయాలన్నదే ఆ ఆలోచన. అదెలా అంటే, భండాసురుడూ, వాడి ఇద్దరు తమ్ముళ్ళూ సూక్షరూపంలో లోకాలలో తిరుగుతూ స్త్రీపురుషులలో భోగేఛ్చను నశింపజేయటం ద్వారా అట. ఇక ఎక్కడా ఎవ్వరికీ ఏ విషయంలోనూ ఆసక్తి ఉండక నీరసించి క్రమంగా సృష్టి నశిస్తుందని వీళ్ళ ఊహ!

వీళ్ళ అఘాయిత్యం ఎంతదూరం పోయిందంటే స్త్రీపురుషులంటే నరయక్షకిన్నారాదులనే కాదు, పశుపక్ష్యాదులనూ వీళ్ళు వదలలేదు.  అన్ని జీవజాతులూ నీరసించాయి!

దేవతలకు చిక్కు వచ్చింది.  ఈ సృష్టిని సజావుగా నిర్వహించే భారం దేవతలదే. ఇప్పుడు అది ఇబ్బందిలో పడింది!

వాళ్ళు పోయి భండాసురుడితో పోరాడి చంపే వీలు లేదాయె.

చేసేది లేక అన్యథా శరణం నాస్తి అని గ్రహించి అమ్మకోసం ప్రార్థన చేసారు.

ఒక మహాయాగం చేసి అందులో తమతమ సమస్త శక్తులనూ ఆవిడకు సమర్పించారు.

తమ తమ శరీరభాగాలనే కాదు, చివరకు తమను తామే అర్పించుకుందుకు సిధ్ధమైపోయారు.

చివరకు అమ్మకు దయ కలిగి, దేవతల యొక్క ఈ కార్యం సఫలం చేయటానికి స్వయంగా అవిర్భవించింది!

ఆవిడే ఈ భండాసురుణ్ణి వధించటానికి యుధ్ధానికి ఉద్యుక్తురాలై వచ్చింది!

అందుకే వశిన్యాదులు అమ్మను దేవకార్య సముద్యతా అన్నారు.

అన్నట్లు చెప్ప మరిచాను. ఈ మహాయాగం ఎక్కడ జరిగిందో తెలుసా?

ఆ యాగస్థలానికి రాజరాజేశ్వరీ మహేంద్రవరం అన్న పేరు వచ్చింది. రాజరాజేశ్వరి అంటే అమ్మ. యాగకర్త ఐన వాడు దేవరాజు మహేంద్రుడు. అలా ఇద్దరి పేరునా ఆ యజ్ఞవాటికాస్థలానికి పేరు వచ్చింది.

ఆ పేరు క్రమంగా రాజమహేంద్రవరం ఐనది అని స్థలపురాణం!


20, ఫిబ్రవరి 2019, బుధవారం

4. చిదగ్నికుండసంభూతా


శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ।
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥ 1

చిత్ అన్న శబ్దానికి ప్రాణశక్తి అనీ మనస్సు అనీ జ్ఞానం అనీ సాధారణార్థాలు. విశేషంగా ఈ చిత్ అనే శబ్దానికి బ్రహ్మము అనే అర్థం వేదాంతప్రసిధ్ధిగా ఉంది.

చిదాకాశం అన్నప్పుడు ఆకాశం వలే అధారాపేక్షలేక ప్రకాశించే పరబ్రహ్మమని అర్థం. చిదాత్మాది పదములలో ద్యోతకామయ్యే అర్థప్రతీతి కూడా చిత్ అంటే బ్రహ్మము అనే.

అందుచేత చిత్+అగ్ని-> చిదగ్ని అంటే బ్రహ్మమే ఐన అగ్ని. ఈ అగ్నియొక్క ప్రకాశనస్థలావధియే చిదగ్ని కుండం. అగ్నిస్వభావాలుగా వేడిమినీ వెలుగునీ చెప్తాము. ఈ చిదగ్ని యొక్క వెలుగు అజ్ఞానం అనే చీకటిని పోగొడుతుంది.

అంతర్నిరంతర నిరింధన మేధమానే
మోహాంధకార పరిపంధిని సంవిధగ్నా

అని శాస్త్రం.

 అంటే ఈ సంవిదగ్ని నిరంతరం వెలుగుతూ ఉంటుంది. ఆలా ప్రకాశించటానికి దానికి ఏ ఇంధనమూ అవసరం లేదు కూడా! ఈ అగ్ని, మోహం అనే అంధకారానికి శత్రువు. అంటే అజ్ఞానరూపం ఐన మోహం అనేదాన్ని ఈ చిదగ్ని నాశనం చేస్తుంది అని భావం.

అగ్నులు మూడు రకాలు దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అని వాటికి పేర్లు.  గార్హ్యపత్యాగ్ని అంటే గృహస్థుడు నిత్యం ఇంటిలో ఉంచి సమారాధించే అగ్నిస్వరూపం. దక్షిణాగ్ని అంటే  యజ్ఞవేదికకు దక్షిణంగా ప్రతిష్ఠించబడే అగ్ని.  ఆహవనీయాగ్ని అంటే హోమాగ్ని. ఈ మూడింటినీ కలిపి  త్రేతాగ్నులు అని పిలుస్తారు. ఇక్కడ చిదగ్ని అంటే ఆహవనీయాగ్నిగా తెలుసుకోవాలి. ఇందే హవిస్సులను సమర్పిస్తారు.  భండాసురవధా కథానుసారంగా దేవతలు తమతమ శరీరభాగాలనే అమ్మకు ఆహుతులుగా సమర్పించిన హోమాగ్ని గుండమే ఇక్కడ చిదగ్నికుండము అని అర్థం.

మరొకవిధంగా కూడా సమన్వయం చెప్పుకోవచ్చును. హ్రీంకారమే చిదగ్ని. శ్రీదేవి ఈ హ్రీకాంరాగ్ని యొక్క శిఖాస్వరూపంగా ఉన్నది.  అహవనీయే జుహోతి అని చెప్పే మంత్రంతో పాటే ఉద్దీప్తేగ్నౌ జుహోతి అని కూడా మంత్రప్రమాణం ఉంది. శిఖలతో ప్రజ్వలిస్తున్న అగ్నియందే హోమం చేయాలి అని అర్థం తెలుస్తున్నది. ఈ విధంగా ఉద్దీప్తమైన అగ్నిజ్వాల కలిగిన ఆహవనీయాగ్నిని ధరించినది చిదగ్నికుండము సార్థకం.

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తకపాశ మంకుశధరాం స్రగ్భూషితా ముజ్జ్వలాం
త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీ చక్ర సంచారణీమ్

ఈ దేవీ ఖడ్గమాలాస్తోత్రంలోని ప్రసిధ్ధమైన శ్లోకంలో చెప్పబడిన హ్రీంకారాసనం చిదగ్నికుండమే. ఆ హ్రీంకారానలశిఖా స్వరూపమే అమ్మ శ్రీదేవి లలితాపరాభట్టారిక.

ఈ నామం చిదగ్నికుండసంభూతా అన్నదానికి చిదగ్ని కుండలో సంభవించినది అన్న స్థూలార్థం కనిపిస్తుంది. మనం చిదగ్ని కుండం అనేది ఏమిటో తెలుసుకున్నాం.  ఇంక సంభూత అని ఎందుకన్నారో చూడాలి.

సంభూత అంటే వ్యావహారికార్థం ప్రకారం పుట్టినది అని చెప్పాలి.  ఇక్కడ అలా చెప్పకూడదు. పాణినీయ వ్యాకరణంలో తత్రజాతః, తత్రభవః అన్న ప్రయోగాలు కనిపిస్తాయి.  జాతః అన్నా భవః అన్నా ఒక్కటే అర్థం ఐన పక్షంలో రెండు ప్రయోగాలు అవసరమే లేదు కదా. అందువల్ల జననం భవము అనేవి వేరువేరు అర్థఛ్ఛాయలు కలిగి ఉన్నాయని స్పష్టం అవుతున్నది.

భూః అనే ధాతువుకు పుట్టుట అన్నది కాక 'ఉన్నది' అని విశేషార్థం మనం స్వీకరించాలి.

నిత్య ఐన అమ్మకు పుట్టటం అనేది అన్వయం కానే కాదు కదా.

అందుచేత భూః ధాతువు వలన ఇక్కడి అర్థం లోకానుగ్రహం కొరకు వెలువడుట అనే గ్రహించాలి.

శ్రీదేవి ఇలా అగ్నికుండము నుండి వెలువడిన కథ ఒకటి రేణుకాపురాణంలో ఉంది.

ఏతస్మిన్నంతరే యజ్ఞే వహ్నికుండాఛ్ఛనై ర్ద్విజ
దివ్యస్వరూపాన్వితా నారీ దివ్యాభరణ భూషితా
వహ్నేశీతాంశుబింబాభా సహసా నిర్గతా బహిః
ఏకైవ తు జగధ్ధాత్రీ ద్వితీయా నాస్తి కాచన

ఇక్ష్వాకువంశంలోని రేణువు అనే రాజు అమ్మ అనుగ్రహం కొరకు యజ్ఞం చేసాడు. అప్పుడు అమ్మ దివ్యాభరణభూషితగా యజ్ఞకుండంలోనుండి ఆవిర్భవించింది. పైగా ఆవిడ చంద్రుడివలె చల్లని కాంతిని ప్రసరిస్తూ వచ్చినదట.

మండుతున్న అగ్నినుండి చల్లని కాంతితో వెలువడటం ప్రకృతివిరుధ్ధం అనిపించవచ్చును. కాని అమ్మ ప్రకృతికి ఆవలిది యైన శక్తి స్వరూపం కదా. ఆవిడకు ఆసాధ్యం ఏమి ఉంటుంది!

నిర్గతా బహిః అనటం గమనించండి. ఉన్నదే కదా బయటకు వస్తుంది. ఇక్కడ కొత్తగా పుట్టటం అన్నది చెప్పటం లేదు. ఆవిడ ఉన్నది. నిత్యం ఉన్నది. ఎల్లెడలా ఉన్నది. ఇప్పుడు, ఈ విధంగా బహిర్గతం ఐనది అని చెప్తున్నారు గమనించండి.

రెండవదీ, ఈ సహస్రనామాలలో చెప్పబడినదీ ఐన కథ బ్రహ్మాండ పురాణంలోని భండాసురవధ.  ఈ భండాసురవధ గురించి తరువాతి నామంలో విస్తారంగా చూదాం. ప్రస్తుతానికి అమ్మ ఆవిర్భావం గురించి తెలుసుకుందాం.

కుండం యోజన విస్తారం సమ్యక్కృత్వాతి శోభన...
హోతు మిఛ్ఛత్సు దేవేషుకళేబర మనుత్తమమ్
ప్రాదుర్భభూవ పరమం తేజః పుంజమయం మహత్
కోటిసూర్యప్రతీకాశం చంద్రకోటిసుశీతలమ్
తన్మధ్యతః సమదభూ చ్చక్రాకార మనౌపమమ్
తన్మధ్యతో మహాదేవీం దేవాః సర్వేసవాసవాః
ఉదయార్కసమప్రభామ్.....

సారాంశం ఏమిటంటే భండాసురుడి వలన బాధలు పడుతున్న దేవతలు ఒక యోజనం విస్తారం కల హోమగుండంలో అమ్మ కొరకు యాగం చేసారు. తమతమ శరీరభాగాల్నే అమ్మకోసం హోమం చేసారు. ఐనా అనుగ్రహం కనుపించలేదు. వారు తమతమ శరీరాల్నేహోమం చేయటానికి పూనుకున్నారు. అమ్మ ప్ర్తత్యక్షమైనది.

ఆవిడ హోమగుండమధ్యంలో ఎలా ప్రత్యక్షం ఐనది?

కోటి సూర్యుల కాంతితో, అంతే కాదు కోటి చంద్రుల వెలుగువలె చల్లని వెలుగులు ప్రసరిస్తూ వచ్చింది ఒక చక్రం తేజో మయమై అగ్నిగర్భం నుండి.

ఆ చక్రం మధ్యలోబాలసూర్యుని వలె అమితశోభతో శ్రీదేవి ప్రకాశిస్తూ ఉన్నది.

ఈ విధంగా చిదగ్నికుండం నుండి శ్రీదేవి అమ్మవారు సంభూత ఐనది. ఇక్కడ సంభూత అంటే ప్రాకృతజగత్తుకు ప్రత్యక్షం ఐనది అనే అర్థం కాని ఆవిడేదో కొత్తగా పుట్టింది అన్న మాట కాదు.

భగవద్గీతలో

అజోపిసన్ అవ్యయాత్మా  భూతానామ్ ఈశ్వరోపసన్
ప్రకృతిమ్ స్వామధిష్ఠాయ సంభవామి ఆత్మమాయయా (అ4. శ్లో6)

అనే కదా శ్రీకృష్ణవచనం.

పుట్టుక లేనిది నిర్వికారమైన పరాశక్తి. తన మాయాశక్తిని ఆశ్రయించి జన్మించినట్లుగా మనకు ద్యోతకం అవుతున్నది. అంతే.

అమ్మ ఆవిర్భావం ఈవిధంగా లోకానుగ్రహం కొరకు జరిగింది.


16, ఫిబ్రవరి 2019, శనివారం

అమ్మవారి వాహనసింహ ధ్యాన స్తోత్రం



గ్రీవాయాం మధుసూదనోస్య శిరసి శ్రీనీలకంఠః స్థితః
శ్రీదేవీగిరిజా లలాటఫలకే వక్షస్థ్సలే శారదా
షడ్వక్త్రో మణిబంధసంధిషు తధా నాగాస్తుపార్శ్వస్థితాః
కర్ణౌయస్య తు చాశ్వినౌ స భగవన్ సింహాః మ మాస్త్వి ష్టదః

యన్నేత్రే శశైభాస్కరౌ వసుకులం దంతేషు యస్యస్థితమ్
జిహ్వాయాంవరుణుస్తు హుంకృతిరియం శ్రీచర్చికా చండికా
గండౌ యక్షయమౌ తథౌష్టయుగళం సంధ్యాద్వయం పృష్టకే
వజ్రీయస్య విరాజతే స భగవన్ సింహాః మ మాస్త్వి ష్టదః

గ్రీవాసంధిషు సప్తవింశతి మితాన్యృక్షాణి సధ్యాహృది
ప్రౌఢానిర్ఘృణితా త మొన్యతు మహాక్రౌర్యం సమాపూతనాః
ప్రానే యస్యతు మాతరః పితృకులం యస్యా స్త్యయానాత్మకమ్
రూపే శ్రీకమలా కచేషు విమాలస్తే కేయూరే రశ్మయుః

మేరుస్యా ద్వృషణే బ్ధయస్తు జననే స్వేదస్థితా నిమ్నగాః
లాంగూలే సహదేవత్తర్విలసితా వేదాబలం వీర్యకమ్
శ్రీవిష్ణోః సకలా సురా అపి యధాస్థానం స్థితాయస్తు
శ్రీసింహాఖిలదేవతామయ వపుర్దేవి ప్రియః పాతుమామ్

యోబాలగ్రహపూతనాదిభయగృద్యః పుత్రలక్ష్మీప్రదోయః
స్వప్న జ్వర రోగరాజమయ హర్యోమంగలే మంగలః
సర్వత్రోత్తమ వర్ణనేషు కవిభిర్య స్యోపమా దీయతే
దేవ్యావాహనమేవ రోగభయహృత్ హింహోమమాస్త్విష్టదః

సింహస్త్వం హరిరూపోసి స్వయం విష్ణుర్న సంశయః
పార్వత్యా వాహనస్త్వం హ్యతః పూజయామి త్వా మహాం

మాయాద్వయం సముచ్చార్య సింహాయ మహాబలాయచ
పునర్మయా ద్వంద్వం దేవి మనురేష ప్రకీర్తితః
ద్యాత్వా పద్యాదికం దత్వా ఏకథా మంత్రముచ్చరేత్

15, ఫిబ్రవరి 2019, శుక్రవారం

3. శ్రీమత్సింహాసనేశ్వరీ


శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥  1

లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మను ఇప్పటి వరకూ శ్రీమాత అని శ్రీమహారాజ్ఞీ అని చెప్పిన తరువాత ఇప్పుడు మూడవ నామంలో శ్రీమత్సింహాసనేశ్వరీ అని వశిన్యాదులు కీర్తిస్తున్నారు.

సింహాసనం అన్న మాట అందరూ వినే ఉంటారు. దాని అర్థమూ అందరికీ తెలిసినదే.

మహారాజులూ మహారాణులూ సభలో దర్శనం ఇచ్చేటప్పుడు వారు అలంకరించే ఆసనానికి సంప్రదాయికంగా సింహాసనం అని పేరు.

ఐతే అందరు రాజులూ రాణీలూ కూర్చొనే సింహాసనం వంటిదా అమ్మ అలంకరించే ఆసనం?

అమ్మ అఖిలబ్రహ్మాండాలకు అధినేత్రి.

ఒక్క సారి గుర్తుకు తెచ్చుకోండి. వశిన్యాదులు అమ్మను కీర్తిస్తూ చెప్పిన ఈ సహస్రనామస్తోత్రాన్ని ఎక్కడ అమ్మకు వినిపించారో.

అప్పుడు అమ్మ పేరోలగం తీర్చి ఉన్నది కదా.

అక్కడ సమస్తబ్రహ్మాండాధిపతులైన మహానుభావులూ వచ్చి కూర్చుని ఉన్నారు కదా.

అంటే అమ్మ అలంకరించిన సింహాసనం సామాన్యమైన సింహాసనమా? సమస్తబ్రహ్మాండాలకూ అధినేత్రి ఐన అమ్మ కూర్చున్న ఆసనం అది! సకల జగదధిష్ఠానచైతన్యస్వరూపిణి ఐనది అమ్మ. అందుచేత ఆ సింహాసనము శ్రీమంతమైనది. అంటే శ్రీయుక్తమైనది. ఇక్కడ శ్రీ అని చెప్పటం అమ్మను పరాశక్తిస్వరూపిణిగా చెప్పటం జరిగింది. అందుకే అమ్మకు శ్రీమత్సింహాసనేశ్వరి అని పేరు. అంటే శ్రీమంతమైన సింహాసనమునకు అధికారిణి అని చెప్పటం అన్నమాట.

సింహాసనం అన్న మాటలోనే ఒక చమత్కారం ఉంది. వెంతనే స్ఫురించే అర్థం ఏమిటీ అంటే సభలోనే అన్నటికంటే  శ్రేష్ఠమైన ఆసనమూ అలాగే సభలో అన్ని ఆసనాలకన్నా ప్రతేకమూ, ఉన్నతమూ ఐన ఆసనమూ అన్నది. సభకు అధిపతి ఐన వ్యక్తి అలంకరించే ఆసనం ప్రత్యేకంగా ఉండాలీ, విడిగా ఉండాలీ, ఎత్తుగా ఉండాలి, పెద్దదిగా ఉండాలీ అన్న భావనలో అందరికీ మంచి ఔచిత్యం తప్పకుండా కనిపిస్తుంది.

ఒకప్పుడు రాజులసభల్లో రాజుగారు కూర్చొనే అసనం ఎంత దర్జాగా ఉంటుందో మనకు నాటకాలూ సినిమాలూ వంటిద్వారా మంచి అవగాహన ఉంది కదా. ఈనాటికీ ఏదైనా సభజరిగితే అద్యక్షులవారికి కొంచెం పెద్దదీ డాబుగా ఉండేదీ ఐన కుర్చీ ఉంటుంది. మన చట్ట సభల్లోనూ అంతేగా మరి.

మహా ఐతే సింహాసనం అన్నాం కదా, కొందరు డాబుకోసం ఆసనం కోళ్ళకు బదులుగా సింహవిగ్రహాలు వంటివి వచ్చేటట్లు హడావుడి చేస్తారు. అదీ తెలుసు మనకు.

కాని సమస్త బ్రహ్మాండాల్లోనూ నిజంగా సింహమే వాహనంగా కలిగి ప్రకాశించేది ఒక్క అమ్మ తప్ప మరెవరూ లేరు. గ్రహాల్లో బుధుడికి సింహవాననం ఉంది కాని బుధుడు మోక్షకారకుడైన దైవతం కాడు కదా.  అందుచేత సింహాసనేశ్వరి అన్నదాని సింహము ఆసనంగా కలిగిన జగదీశ్వరి అని చెప్పుకోవటం చాలా సముచితంగా ఉంటుంది కదా.

సింహాసనేశ్వరి అన్నదానిలో ఈశ్వరి అన్న ఉత్తరపదానికి అర్థం ఏమిటో ఒక్కసారి చూదాం. ఈశ్వరత్వానికి ప్రభుత్వం అని ఒక అర్థం ఐతే, సమస్తసిధ్ధులకు ఆధిపత్యం అని మరొక అర్థం.

సర్వవ్యాపకమైన పరబ్రహ్మము (అదే పరమాత్మ) ఉంది.  ఆ బ్రహ్మము యొక్క ప్రతిబింబానికి సాక్షి అని వ్యవహారం. ఆ సాక్షియొక్క అనేకానేక ప్రతిబింబాలే జీవులు. శుధ్ధమైన బ్రహ్మం ఇంద్రియాదులవలన గోచరం కానేకాదు. కాని సాక్షిరూపంలో అది గోచరం అవుతుంది. ఈ సాక్షికే కూటస్థుడనీ ఈశ్వరుడనీ వేదాంతవ్యవహారం. ఈశ్వరస్వరూపం గోచరం అవుతుంది అనుగ్రహపూర్వకంగా సందర్భాన్ననుసరించి ప్రకృతిలోని జీవులకు. స్త్రీలింగపరంగా ఈశ్వర శబ్దం ఈశ్వరి అవుతుంది.   అంటే పరబ్రహ్మస్వరూపిణి ఐన అమ్మ ఈశ్వరిగా సాక్షాత్మరిస్తున్నది అన్న మాట.

అమ్మకు వాహనం ఐన సింహము, ఈశ్వరి యొక్క ప్రభుత్వానికి అంటే నియామక దండనాధికారాలకి ప్రతీక.  సింహం అన్నది హింసకు ప్రతీక. హింస శబ్ధమే ఒకానొక వ్యాకరణ కార్యంవలన సింహం అవుతున్నది. హిసి హింసాయాం అనేది ధాతువు. ఈ ధాతువు నుండి హింస శబ్దం వచ్చింది. ఇందులో వర్ణాలు తారుమారు అవటం ద్వారా సింహం అనే శబ్దం సిధ్ధిస్తున్నది. ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. వశకాన్తౌ అన్న ధాతువు నుండి శివ శబ్దం వచ్చింది. పశ్యతి ఇతి పశ్యకః అన్నది కశ్యప శబ్దంగా మారింది.

ఇక్కడ సింహం హింసకు ప్రతీక అన్నప్పుడు సింహం మృగరాజు. విచక్షణారహితమైన హింస చేసేవాడు కాదు. తన శాసనాన్ని ధిక్కరించే వారిని మాత్రమే దండించే వాడు.  భగవంతుడూ అంతే తన ధర్మశాసనాన్ని ధిక్కరించిన వారిని మాత్రమే దండిస్తాడు.   యోగశాస్త్రం లో సహనశక్తికి,గమన శక్తికి ప్రతీకగా సింహన్ని చెబుతారు.

మృగములలో ముఖ్యమైనదీ, శ్రేష్ఠమైనదీ సింహమే. కాబట్టి సింహశబ్దానికి శ్రేష్ఠమైన అన్న అర్థంలో మిక్కిలి వాడుక. సింహభాగం అంటే ముఖ్యమైన భాగం. సింహద్వారం అంటే ద్వారా ఇంటిద్వారాల్లో శ్రేష్ఠమైనది. నరసింహుడు అంటే నరుల్లో శ్రేష్టుడు.  అలాగే సింహాసనం అంటే శ్రేష్టమైన ఆసనం.  అంతే కాదు కార్యార్థం మృగశ్రేష్టమైన సింహాన్నే అమ్మ వాహనంగా చేసుకున్నది.

ఈ నామంలో ఉన్న సింహాసన శబ్ధాన్ని సూచనగా అమ్మవారి పంచసింహాసనాలనూ స్మరించాలి.

సింహానికి పంచాననం అనీ పంచాస్యం అనీ పర్యాయపదాలున్నాయి. ఇక్కడ పంచ అంటే విశాలమైన అని అర్థం. అమ్మ వారి ఆసనం కూడ ఐదు వృత్తరూపాలుగా ఉంటుంది. దానికే కళ్యాణశ్రీకళాయంత్రం అని మంత్రశాస్త్రవ్యవహారం. అది అధిష్ఠానంగా గల శ్రీదేవి శ్రీమత్సింహాసనేశ్వరి అని ఒక వివరణ.

అమ్మవారికి ఇతరమైన పంచాసనాలు కూడా ఉన్నాయి.  శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌః అని పంచప్రణవబీజాలు. వీటికి అధిష్ఠాత్రి శ్రీదేవి. నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, శాంతి, శాంత్యతీతము అని పంచకళలు. వీటికన్న పైస్థానంలో ఉన్న తల్లి. ఈవిధంగా పంచప్రణవాసన మరియు పంచకళాసన.

నాలుగుదిక్కులూ, ఆదిక్కుల మధ్యమము అనే పంచదిక్కులకూ అమ్మకు అసనాలు అని చెప్పబడుతున్నాయి. ఆవిడ పంచదిగాసన. అమ్మవారు దేవేంద్రుడి తపస్సుకు మెచ్చి తూర్పుదిక్కు ఆసనంగా ప్రత్యక్షం అయ్యారని ఐతిహ్యం.

పంచభూతాలైన పృధివి, జలము, వాయు, తేజస్సు, ఆకాసము ఇవి అన్నీ తనకు ఆసనాలు (అంటే నివాసస్థానాలు)గా కలిగిన తల్లిగా పంచభూతాసన.

సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములనే శివుని పంచముఖములయందు వసించే శక్తిస్వరూపిణి అమ్మ పంచముఖాసన.

బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుల్ని పంచప్రేతాలని అంటారు. ఈ ఐదుగురూ అమ్మకు కోళ్ళుగా ఉన్న ఆసనం అధివసించి ఉంటుందని తంత్రశాస్త్రం.

జ్ఞానార్ణవం అన్న గ్రంధంలో చైతన్యభైరవీ మంత్రం నుండి సంపత్ప్రదా మంత్రం వరకూ ఉన్న ఎనిమిది మంత్రాలే అమ్మవారికి పంచసింహాసనాలన్న వివరణ ఉంది. మూడు జంటమంత్రాలూ, మిగిలిన రెండు మంత్రాలు మొత్తం ఐదు. 

మరొక ముఖ్యమైన సంగతిని కూడా ఇక్కడ ప్రస్తావించాలి. హంస వాహన సరస్వతిగా అమ్మ శుధ్ధసాత్విక మూర్తి.  భండాసురాదినిర్మథనక్రియోన్ముఖురాలిగా అమ్మ తీవ్రమూర్తియై సింహవాహన. అమ్మవారి ఆవిర్భావానికి సంబంధించిన నామాలు మొట్టమొదట ప్రస్తావనకు వస్తున్నాయిక్కడ. రాబోయే నామాలు చిదగ్నికుండ సంభూతా, దేవకార్యసముద్యతా అన్న వాటిని మనం వివరంగా తెలుసుకొనే టప్పుడు ఈవిషయం మరింత స్పష్టం అవుతుంది

అమ్మ వారి వాహనసింహాన్ని ధ్యానించటం సమస్తశుభాలను కలుగ చేస్తుంది. ఆమ్మవారి వాహనసింహ ధ్యానస్తోత్రం పఠించండి

అటువంటి సింహవాహన ఐన తల్లి లలితాపరాభట్టారికా దేవి అని ఈ నామం ద్వారా తెలుసుకుంటున్నాం.

13, ఫిబ్రవరి 2019, బుధవారం

2. శ్రీమహారాజ్ఞీ


శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ।
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥ 1

అమ్మ లలితాపరాభట్టారికా దేవి అన్నిలోకాలకూ మాతృదేవత అని చెప్పుకున్నాం కదా శ్రీమాత అన్న మొట్టమొదటి నామాన్ని వివరంగా పరిశీలించి.

అమ్మని శ్రీమహారాజ్ఞీ అని అనటంలో అంతరార్థం గమనిద్దాం.

శబ్దానికి సంబంధించి చూదాం. రాజన్ అన్నది రాజును తెలిపే నకారాంతమైన పుంలింగ పదం. ఆమాటకు స్త్రీలింగ శబ్దం రాజ్ఞీ అని అవుతుంది. ఈ రాజ్ఞీ శబ్దానికి ముందు మహత్ అనే శబ్ధం ఉంచి చెప్పితే అది మహారాజ్ఞీ అవుతుంది. అంటే గొప్ప రాణీ అని తెలుగులో చెప్పుకోవాలి.

మరి ఇప్పుడు శ్రీమహారాజ్ఞీ అని ఎందుకంటూన్నారయ్యా అంటే ఈ శ్రీ అనే శబ్దం ఏ గొప్పగొప్ప విషయాలను సూచిస్తుందో అవన్నీ ఈవిడయందే అన్వయం అవుతున్నాయి కాబట్టి. ఈ శ్రీ శబ్ధం గురించి  శ్రీమాతా అన్న నామం దగ్గర కొంత చర్చ చేసాం కదా, ఒకసారి మరలా చూడండి.

ముఖ్యంగా శ్రీ అని చెప్పి ఈతల్లి సకలబ్రహ్మాండాలకు అధినేత్రి అని సూచించటం అన్నది గమనించాలి.

అంటే శ్రీలలితాపరాభట్టారికా దేవి సకలబ్రహ్మాండాలను ఏలే మహారాణీ అన్న మాట.

లోకంలో చిన్నపెద్దా రాజులు కూడా మహారాజు అని పిలిపించుకోవటం సామాన్యమే. అక్కడ మహా అన్నది కేవలం మర్యాదకోసమేను. వారి రాణీలకు కూడా మహారాణీ అన్నపిలుపూ అటువంటిదే. అమ్మ సభలో అనేక బ్రహ్మాండాలకు అధినాయకులైన లక్ష్మీనారాయణాదులు ఎందరో ఉన్నారు. ఆ లక్ష్మీ సరస్వతీ వంతి లోకమాతలకు ఆ మర్యాదలూ గౌరవాలూ అన్నీ అనుగ్రహించినది శ్రీమాతయే అన్నది స్పష్టం. ఆ లోకమాతలు లోకాలకు తల్లులూ రాణులూ ఐనప్పుడు శ్రీమాతను మహారాజ్ఞీ అని కాక మరెలా సంబోధించాలి చెప్పండి. అందుచేత శ్రీమాతయే మహారాజ్ఞి.

అసలు రాణీ అంటే ఏలిక అనుకుంటున్నప్పుడు, ఆ రాణీ గారు చేసేది పాలించటం కదా, మరి పాలించటం అంటే రక్షించటమేను.

శ్రీమాత అని ఈవిడ సకలబ్రహ్మాండాలకు తల్లి అని చెప్పుకున్నాం.

ఇప్పుడు శ్రీమహారాజ్ఞీ అని ఈవిడే సకలబ్రహ్మాండాలనూ పాలించే తల్లి అని చెప్పుకుంటున్నాం అన్నమాట.

వేదం 'యస్మా ద్భూతాని జాయన్తే,  యేన జాతాని జీవంతి ' అంటూ (తైత్తరీయోపనిషత్తులో) ఎవరిచే జన్మించిదో ఎవరిచే జీవిస్తున్నదో అని చెప్పటం దీన్ని ధృవపరుస్తుంది.

ఇక్కడ రహస్యమైన మంత్రార్థం ఒకటుంది. శ్రీమహా అన్నప్పుడు  శ్రీ+మ్+అ+హా అని పదవిఛ్ఛేదం. ఇక్కడ శ్రీమ్ అనేదాన్ని నిత్యా షోడశీకళ అంటారు. అకారం శివ స్వరూపం. దీనిని ప్రకాశం అంటారు. హా అనేది విమర్శనము శక్తి స్వరూపము. ఈ హాకారమే  రెండు బిందువుల స్వరూపంగా ఉండే విసర్గ (ః) . దీనికి కళారూపం అని పేరు. ఈ  అకార హకారాల సామరస్యం శివశక్తి సామరస్య కామరూపం. ఈ రెండింటి వలననే సమస్త సృష్టి జరుగుతున్నది. వీరు అంటే శివశక్తులు బిందుమండలంలో ఉంటారు. వీరికే కామేశ్వరుడు, కామేశ్వరీ అని పేర్లు. పరాస్వరూపం అంటే కామరూప, కళారూపాల పర్యవసానం!

పరాశక్తియే అమ్మ లలితాదేవి. రాజిల్లటం అంటే సర్వోతృష్టత కలిగి ప్రకాశించటం అన్న అర్థం సామాన్యంగా అనేకులకు తెలిసిందే, రాజిల్లటం,  విరాజిల్లటం అన్నమాటలు సాహిత్యంలో తరచూ తగులుతూనే ఉంటాయి. ఇక్కడ రాజు అని చెప్పినప్పుడు ఆయన కామేశ్వరుడు, రాజ్ఞీ అని స్త్రీలింగంగా చెప్పినప్పుడు ఆవిడ కామేశ్వరి. ఆకామేశ్వరియే లలితాపరాభట్టారిక, మహారాజ్ఞీ వాచ్యురాలు.

జీవులను పాలించటం అంటే వారికి ఉన్న ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మాలను అనుసరించి తగిన విధమైన స్థితిగతుల్ని కలిగించి నియమించటం అన్నమాట. ఈ ఆగామిసంచితప్రారబ్ధాలన్న మాటలు వేదాంతంలో తరచు వినిపించేవే. ఆగామి అంటే ముందుముందు పండటానికి సిధ్ధంగా ఉన్న పూర్వకర్మఫలం. సంచితం అంటే మనం కూడబెట్టుకున్న కర్మఫలం. అందులో కొంతకొంత మనకు ఆగామి అవుతుంది. ప్రారభ్దం అంటే జీవుడికి శరీరం ఎత్తటానికి కారణమైన పూర్వకర్మల సముదాయం.  తన ప్రారభ్దం అనుభవించటానికి జీవి శరీరం దాలుస్తాడు. ఎటువంటి శరీరమూ అన్నది అమ్మ నియామకం. అతడి దగ్గర చాలా సంచిత కర్మ ఉంది, అందులో కొంతకొంతగా ఆగామి అవుతూ అనుభవానికి వస్తుంది.  బలమైన ప్రారబ్ధం మొత్తం ఒక శరీరంతో తీరేది కాకపోవచ్చును. అదీకాక వీడు తిన్నగా ఉండక ఆ శరీరంతో మరింత కర్మఫలాన్ని తన సంచితంలో చేర్చుతాడు. ఏతావత్ తేలేది ఏమిటంటే శరీరాంతంలో బోలెడు సంచిత కర్మం ఉంటుంది. అందులో వీలైనంత  అనుభవించటానికి మరో జన్మం ఎత్తాలి.  అప్పుడెంత తీరేనో, మరెంతగా పోగయ్యేనో. ఎప్పటికి లెక్క శూన్యం అయ్యేటట్లు! ఇదొక పెద్ద విషవలయం.

కర్మానుభవం అంటే అది పాపాలే కానక్కరలేదు. పుణ్యాల ఫలాలూ అనుభవించాల్సిందే! తప్పదు.

పుణ్యమూ, పాపమూ రెండూ లేనప్పుడు ఇంక జన్మం ఎత్తటం కూడా లేదు. అదే మోక్షం. మోక్షం అంటే పుణ్యపాపాలకు కారణమైన సకలబంధాలను వదలటం. బంధమే లేనప్పుడు స్వార్థమే లేదు. స్వార్థమే లేక కేవలం లోకసంగ్రహార్థం చేసేది ఏదీ తనకు పుణ్యమూ పాపమూ ఇవ్వదు కాబట్టి ఇంక పోగుచేసుకొనేది ఏమీ ఉండదు. ఏదీ లేక అనుభవించవలసిదీ లేక తన్ను తానెరిగి స్వస్వరూపంలో ఉంటాడు.

అంతవరకూ అమ్మ అందరు జీవులకూ వారివారి కర్మానుభవాలకు తగిన శరీరాలు ఇచ్చి వారి జీవికలను నియంత్రిస్తున్నది.

జీవులకు క్రమంగా స్వస్వరూపానుసంధానం కలిగేందుకు అమ్మ వారికి తగిన విధంగా కర్మక్షయాన్ని అనుగ్రహించటమూ రక్షించటమూ చేస్తున్నది.

అన్నట్లు ప్రపంచపాలనం అంటే ప్రప్రంచాన్ని సుస్థితిలో ఉంచటం విష్ణువు పని కదా అని అనవచ్చును. సందేహం లేదు. అది విష్ణువు పనే.

మరి మహారాజ్ఞీ అని ఈ విష్ణువు చేసేదంతా అమ్మ లలితాపరాభట్టారికా దేవి పరం చేసి చెప్పారే అని ఆశ్చర్య పోవచ్చును ఎవరన్నా.

పరిపాలనా దక్షతయే విష్ణుత్వం. ఆ విష్ణువు అమ్మయే. లలితా సహస్రనామాల్లో ముందుముందు నారాయణీ అన్న నామమూ వస్తుంది.

ఆ నారాయణతత్త్వాన్ని పురుషపరంగా చెప్తే నారాయణుడు. శ్రీమన్మహావిష్ణువు.
అదే నారాయణతత్త్వాన్ని స్త్రీపరంగా చెప్తే నారాయణి. శ్రీలలితాపరాభట్టారికా దేవి.

ఇద్దరూ ఒక్కటే.

అందుచేత అమ్మవారు నారాయణి అని నారాయణుడి సోదరి అని చెప్తారు సంప్రదాయంలో

జయజయ వైష్ణవి దుర్గే అన్న నారాయణతీర్ధులవారి తరంగం గుర్తుకు తెచ్చుకోండి.

12, ఫిబ్రవరి 2019, మంగళవారం

1. శ్రీమాత్రే నమః


శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ।
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥  1

అమ్మను శ్రీమాత అనటంలో అనేక విశేషాలున్నాయి.

పెద్దలను సంబోధించి చెప్పేటప్పుడు ముందు శ్రీ అని చేర్చి చెప్పటం మన సంప్రదాయం.  అందుచేత లలితాపరాభట్టారికా మాతను శ్రీమాత అని చెప్పటం.

శ్రీబీజము వైఖరీరూపంలో ఉంది. దానికే మాతృస్వరూపురాలు అంటే అమ్మ శ్రీదేవి పరాశక్తి స్వరూపిణి అని తెలియజేయటం శ్రీమాత అనటంలో ఆంతర్యం. ఇక్కడ వైఖరీరూపం అంటే ఏమిటో చెప్పాలి కదా. నాదం అనేది నాలుగు రూపాలు లేదా వికాసస్థాయిల్లో ఉంటుంది. అవి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేవి. అన్నిటంటికన్నా సూక్ష్మమైన స్థాయి బిందువు. అది పర అని పిలువబడుతుంది.  అవి వికసించి పశ్యంతి అన్న స్థాయికి వస్తుంది. అష్టవర్గులు మధ్యమ స్థాయి. వర్ణమాలలోని ఏభై అక్షరాల పలుకుబడిలో ధ్వనించేది వైఖరి అంటారు. ఈశ్రీబీజం అనేది నాదం యొక్క వైఖరీ విలాసం ఐతే దానికి మూలం ఐనది బిందుస్వరూపమైన పర. ఆ పరాశక్తి స్వరూపమైన అమ్మ శ్రీబీజానికి మూలమై అంటే మాతృస్థానంలో ఉంది కాబట్టి శ్రీమాత అని అమ్మవారికి అన్వయం.

ఈ శ్రీ అనే బీజాక్షరంలో శకారమూ, రేఫమూ (అంటే రకారం), ఈ-స్వరమూ ఇవి సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీకలు. ఈ త్రిగుణాలమేళనానికి వేదాంతశాస్త్రంలో అవ్యక్తం అని పేరు. ఈ అవ్యక్తం నుండే సకలసృష్టీ యేర్పడిందని వేదాంతం. ఈ అవ్యక్తసూచకమైన శ్రీ బీజానికి మాతృస్వరూపమైన బిందురూపంలో ఉన్న పరాశక్తి ఐన అమ్మవారికి అందుచేత శ్రీమాత అని పేరు.

ఇక్కడ మాతా అన్న పదం వలన ఒక త్రిపుటి సూచనగా ఉంది. అది మాతృ, మాన, మేయములు అనే మూడింటిని చెబుతోంది. ఈ త్రిపుటులు వేదాంతంలో విస్తారంగా ప్రస్తావనకు వస్తాయి. ఉదాహరణకు చూడటం అనేది తీసుకొంటే చూడటం అనే క్రియ, చూచేది, చూడబడేది అనే మరొక రెండున్నాయి కదా. ఈ మూడూ కలిసి ఒక త్రిపుటి అన్నమాట. ఇక్కడ అమ్మ అంటే అమ్మ, అమ్మదనమూ, ఎవరికి ఆ అమ్మ అమ్మగా ఉన్నది అనేవి కలిపి ఒక త్రిపుటీ అన్నది తెలుసుకోవాలి. ఈ త్రిపుటి అధిష్టానస్థానం శ్రీచక్రంలో త్రికోణం. దానికి అధిష్ఠానదేవత బాలాత్రిపురసుందరి. ఇక్కడ బాలా అంటే ఎనిమిది తొమ్మిదేళ్ళ పిల్ల. ఈ బాలాదేవికి మాతృదేవత బిందుమండలవాసిని ఐన కామేశ్వరీ దేవి. అందుచేత ఇక్కడ ఆ కామేశ్వరీ దేవిని శ్రీశబ్దంతో తెలుసుకోవాలి. అంటే శ్రీమాతా అని బిందుమండలవాసిని ఐన శ్రీచక్రేశ్వరి కామేశ్వరిని చెబుతున్నారు.

అమ్మ భక్తులకు సకలసంపదలనీ మోక్షప్రాప్తినీ కలిగిస్తుంది. అందుచేత శ్రీమాత అని పేరు. అది యెలాగో వివరంగా చూదాం.

శ్రీ అనే శబ్దానికి సంస్కృతంలో అనేక అర్థాలున్నాయి. శ్రీ అంటే విషం అన్న అర్థం ఉంది. పోతన్నగారి ప్రసిధ్ధమైన పద్యం శ్రీకంఠచాపఖండన... అనేది ఇక్కడ గుర్తుకు తెచ్చుకోండి. అదికాక శ్రీకంఠయ్య అని శివుడినామంగా పేరుపెట్టుకోవటమూ వాడుకలోనే ఉన్నది.

లోకంలో సుప్రసిథ్థంగా శ్రీ అంటే లక్ష్మి అన్న అర్థం చెలామణీలో ఉంది. ఆ లక్ష్మి గురించి ఈసహస్రనామస్తోత్రంలో ఒకచోట కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా అన్న నామం వస్తుంది ముందుముందు. దాని అర్థం ఏమిటంటే అమ్మ దయను పొందిని అనేకానేకమంది లక్ష్ములు అమ్మవారికి సేవకురాండ్రుగా ఉండి కొలుస్తున్నారని. అనేక లక్ష్ములు ఏమిటీ అన్న అనుమానం రావచ్చు. అమ్మ అన్ని బ్రహ్మాండాలకూ కూడా అధినేత్రి కదా. ఒక్కో బ్రహ్మాండానికీ మళ్ళా త్రిమూర్తులూ వాళ్ళ భార్యలూ ఉంటారు. అంటే అనేకమంది లక్ష్మీనారాయణులూ ఉన్నారు. ఇలా సమస్త బ్రహ్మాండాలకూ ఐశ్వర్యం అందించే లక్ష్ములకే అమ్మ లలిత యజమాని, మాతృస్వరూపిణీ కాబట్టి శ్రీమాతా అని పిలుపు.

ఈ శ్రీ అనే శభ్దానికి సరస్వతి అని కూడా అర్థం ఉంది. లక్ష్మీ సరస్వతీ ధీ త్రివర్గసంపద్విభూతి శోభాసు, ఉపకరణవేష విద్యాసు చ శ్రీరితి పథిత అని వ్యాడీ కోశం.  అంటే లక్ష్మీ, సరస్వతీ, బుధ్ధి, త్రివర్గం మొదలైనవని శ్రీశబ్దం చెబుతున్నది. త్రివర్గం అంటే ధర్మ, అర్థ, కామాలు. ఇక్కడ రుద్రాణి కూడా శ్రీశబ్దవాచ్యురాలే.  కాబట్టి అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీదేవి లలితాపరాభట్టారికా దేవియే శ్రీమాత (అన్ని విధాల శ్రీలకూ మాత అని)

అలాగే శ్రీ అంటే అమృతం అనే అర్థం కూడా ఉంది. అమృతం అంటే ఏమిటి? అది జరామరణాలను లేకుండాచేసేది కదా. అలా జరామరణరహితమైన స్థితి ఒక్కటే మోక్షం. అపవాదంగా జరామరణాలు దేవతలకు లేవు అని చెబుతారు కాని వారికి జర లేకపోయినా సర్గప్రళయంలో లయం కావటం ఉన్నది. నిజంగా జరామరణాలు లేని స్థితి అంటే మోక్షమే! అందుచేత శ్రీమాత అంటే అలా మోక్షాన్నందిచే తల్లి అని అర్థం,

శ్రీ అంటే వేదం అన్న అర్థం ఉంది. కాబట్టి శ్రీమాత అంటే వేదమాత. అంటే గాయత్రీ మంత్రస్వరూపిణి.

లోకంలో కన్నతల్లీ, గురుపత్నీ, అన్నభార్య మొదలైన పెద్దవారిని స్త్రీలను అమ్మలుగా సంభావించటం మన సంప్రదాయం.  వీరి ఆశీర్వచనాలు అభ్యున్నతికి మనకు సోపానాలు. అందువలన వీళ్ళందరూ మనకు నిత్యం వందనీయులూ, పూజనీయులూ అవుతున్నారు. కాని ఈ మాతృదేవతలు ఎవ్వరికీ జీవులకు సంసారతాపత్రయాది దుఃఖాలను పోగొట్టే శక్తి లేదు కదా. అన్నిలోకాలకూ కూడా తల్లి ఐన శ్రీదేవియే అలా సంసారతాపత్రయం పోగొట్టి ముక్తిని అందించగల గొప్ప మహత్తు కల తల్లి.  కాబట్టి లలితా అమ్మవారిని శ్రీమాత అని చెప్పటం జరుగుతోంది.

శ్రియం అంటే అంతులేని ఐశ్వర్యం అని అర్థం. శ్రియం మాతి అంటే శ్రియముని తెలిసినది కాబట్టి శ్రీమాత అని అర్థం.

శ్రియములు అంటే అంతులేని ఐశ్వర్యరూపాలైన అణిమాది సంపత్తులను తన సాక్షాత్కారం చేత తక్కువచేసి ఆ సిధ్ధులకే మాతృస్థానంలో విరాజిల్లేది కాబట్టి అమ్మకు శ్రీమాత అని పేరు.

నమాతుః పరదైవతమ్ అని సూక్తి. అందరి కన్నా అమ్మే గొప్ప.   జీవుడికి మొట్టమొదటి గురువు అమ్మే కదా! జ్ఞానసాధనాసంపత్తిని తెలిపే నామావళి కూడా జగన్మాత ఐన అమ్మ శ్రీదేవిని మాతృస్వరూపంగా ముందు ప్రతిపాదిస్తూనే మొదలుకావటం ఉచితంగా ఉంది. కాబట్టి అమ్మను శ్రీమాతా అని మొదట సంబోధించటం.

వేదంలో తత్ అనే శభ్దంలో ప్రారంభం అయ్యే మంత్రాలకు తతవతీ వాక్కులని పేరు. వీటినే శ్రీ అగ్రములు అని కూడా అంటారు. ఈ తత్ శబ్ధం పరబ్రహ్మ సూచకం. అందువల్ల తత్ అంటే మోక్షం. ఈవిధంగా శ్రీమాత అంటే శ్రీ అగ్రములైన మంత్రములకు మాతృస్థానమైన బ్రహ్మజ్ఞాన స్వరూపిణి ఐన శక్తి అని అర్థం

ఇంకా ఈ శ్రీమాత అన్న నామానికి విశేషమైన అర్థాలు మరికొన్ని ఉన్నాయి.

10, ఫిబ్రవరి 2019, ఆదివారం

శ్రీలలితాసహస్రనామస్తోత్రం ఎలా వ్యాప్తి చెందింది?


అగస్త్య మహర్షికి గురువు హయగ్రీవుడు.

ఒక సారి గురువుగారైన హయగ్రీవులకు అగస్త్య మహర్షి ఒక ప్రశ్నవేసారు.

అప్పుడు అగస్త్యమహర్షికీ ఆయన గురుదేవులైన హయగ్రీవులకూ మధ్య చాలా ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

పూర్వం నైమిశారణ్యంలో ఋషులందరూ ఒక మహాసత్రయాగం చేసారు. యాగకార్యక్రమాల మధ్యన విరామసమయాల్లో జరిగే పురాణగోష్టిలో పురాణం చెప్పిన మహానుభావుడు సూతపౌరాణికుడు. ఋషులు అడుగుతూ ఉండటమూ, వారికి కావలసిన విషయాలను సూతులవారు వివరించటమూ కారణంగా అనేకవిషయాలు వెలుగులోనికి వచ్చాయి. ఆయా ఋషులనుండి ఆ విషయాలు ప్రపంచంలో వ్యాప్తి చెందాయి.

ఋషులు సూతపౌరాణికుడిని శ్రీదేవి గురించి అడిగారు.

ఆయన అన్నారూ,  మహర్షులారా, ఈ శ్రీదేవి అమ్మవారిని గురించిన విద్యారహస్యాలు అన్నీ పూర్వం అగస్త్యమహర్షి తన గురువు హయగ్రీవులవద్ద నేర్చుకున్నారు. ఆతరువాత కొన్నాళ్ళకి ఆయన గురువుల వద్దకు వెళ్ళి ఒక సందేహం వెలిబుచ్చారు. అప్పుడు జరిగిన సంభాషణ అంతా చెబుతాను వినండి అని వివరంగా చెప్పటం మొదలు పెట్టారు.

గురుదేవా మీరు నాకు అమ్మవారి ఆవిర్భావం గురించిన కథ అంతా వివరించారు.

అలాగే నాకు అమ్మవారికి అన్ని బ్రహ్మాండాలకూ అధినేత్రిగా మహారాజ్ఞిగా పట్టాభిషేకం జరిగిన కథనూ వివరించారు.

అమ్మవారు భండాసురుడితో చేసిన మహాయుధ్ధాన్ని గురించీ వాడిని అమ్మవారు సపరివారంగా ఎలా వధించారు అన్నదీ కూడా మీరు నాకు తనివితీరా వివరించారు.

నాకు సకలైశ్వర్యసంయుతమైన మహనీయమైన ఆ శ్రీపురం గురించీ, శ్రీవిద్యకు చెందిన పంచదశాక్షరీ మహామంత్రాన్నీ దాని మహాత్మ్యాన్నీ వివరంగా చెప్పారు.

ఇంకా షోఢాన్యాసాదులూ, అంతర్యాగ బహిర్యాగాలను నాకు ఉపదేశించారు.

నాకు మహాయాగం గురించీ జపలక్షణాలగురించీ ఉపదేశం చేసారు.

శ్రీదేవిని గురించి హోమాదులు చేసే విధానమూ దానికి వలసిన హోమద్రవ్యాలను గురించీ చక్కగా బోధించారు.

దయతో నాకు మీరు శ్రీచక్రానికీ శ్రీదేవికీ ఏవిధంగా తాదాత్మ్యం అన్నది సెలవిచ్చారు. అంతే కాదు గురుశిష్యుల తాదాత్మ్యం గురించి కూడా బోధించారు.

అమ్మవారి గురించిన అనేక స్తోత్రాలను నాకు ఉపదేశించారు.

మీరు నాకు మంత్రిణీదేవి శ్యామలాంబా సహస్రానామాలనూ,  దండినీదేవి వారాహి సహస్రానామాలనూ బోధించారే కాని అమ్మవారు లలితాపరాభట్టారికా దేవి సహస్రానామాలను మాత్రం ఉపదేశించనేలేదు!

దయాసముద్రులైన మీరు ఈవిషయంలో పరాకు పడ్డారా లేక ఏదన్నా కారణం వలన ఈఒక్క స్తోత్రాన్నీ చెప్పకుండా ఊరుకున్నారా అన్న సందేహం కలిగి బాధపడుతున్నాను.

అమ్మ యొక్క సహస్రనామాలను వినటానికి నాకు యోగ్యత లేదేమో అని ఎంతో ఆవేదన చెందుతున్నాను.

మీరు నామీద దయచూపాలని వేడుకొంటున్నాను.

ఇలా అగస్త్యమహర్షి ఎంతో ఆర్తిగా తన సందేహాన్ని తన గురువులు హయగ్రీవులకు తెలియజేసారు వినయంగా.

హయగ్రీవులు చిరునవ్వు నవ్వారు. దయతో శిష్యుణ్ణి చూసి ఇలా అన్నారు.

నాయనా, నీవూ నీభార్యామణి లోపాముద్రా కూడా అమ్మవారికి మిక్కిలి భక్తులు.

అమ్మవారి సహస్రనామాలు అత్యంత రహస్యమైనవి. అందుకే నీకు ఇంతవరకూ ఉపదేశించలేదు.

భక్తి శ్రధ్ధలు కల శిష్యుడికి గురువు మంత్రోపదేశం చేయాలి.  అటువంటి శిష్యుడికి మాత్రమే మంత్రోపదేశం చేయాలి.

ఇప్పుడు నీకు నేను ఉపదేశం చేసే అమ్మవారి రహస్య నామాలు కూడా నువ్వు భక్తిలేని వాళ్ళకు ఎప్పుడూ ఉపదేశించకూడదు సుమా.

అనర్హులు చాలా రకాల వాళ్ళుంటారు కదా.

కొందరు శఠులు. వాళ్ళేం చేస్తారంటే గురువు గారు చెప్పిన రహస్యమైన ఉపదేశం గ్రహించి, ఆ తరువాత నేమో, గురువుతోనే ఇప్పుడు మీరు ఉపదేసించినది నాకు ఎప్పుడో తెలుసును అని ఎద్దేవా చేస్తారు లేదా మీరు చెప్పినది ఏమీ అర్థం కావటం లేదని మొండిగా మాట్లాడతారు. జాగ్రత.

కొందరు దుష్టులు. వాళ్ళేం చేస్తారంటే, గురువు గారు రహస్యం సుమా అని ఉపదేశంగా ఇచ్చిన విద్యను చులకనగా చూసి పదిమందికీ వెల్లడి చేసి గురువు ఉద్దేశాన్ని హేళన చేస్తారు. కాబట్టి జాగ్రత.

కొందరు అవిశ్వాసులు. అంటే వాళ్ళకి గురువు నుండి లభించిన విద్యపట్లనూ నమ్మకం ఉండదు, అసలు గురువుపైనా వారికి సరిగా నమ్మకం ఉండదు, అలాంటి వారుంటారు జాగ్రత.

అందుచేత బాగా ఆలోచించి యోగ్యులకు మాత్రమే రహస్యమైన లోతైన అర్థాలు గల విద్యలను బోదించాలి.

ఈ శ్రీలలితామహాదేవి రహస్యసహస్రనామస్తోత్రం కూడా అటువంటిది.

శ్రీదేవి పట్ల అమితభక్తి కలిగిన వారూ,  గురువువద్ధ పంచదశీ మంత్రం ఉపదేశం పొందినవారు ఐన భక్తులకు మాత్రమే ఎంచి ఉపదేశం చేయాలి సుమా.

అనేక విధాలైన దేవీ సహస్రనామస్తోత్రాలున్నాయి కదా.

వాటిలో బాలా, బగళా శ్యామాలా వంటి దేవతల సహస్రనామాలు త్వరగా సిధ్ధిని అనుగ్రహిస్తాయి.

శ్రీదేవి సహస్రనామస్తోత్రం విషయం వేరు.

మంత్రాల్లో శ్రీవిద్యా మంత్రం అతి ముఖ్యం కదా. ఆ శ్రీవిద్యావిషయంలోనూ కాది విద్య అతి ముఖ్యమైనది కదా.
చక్రాల్లో శ్రీచక్రం శ్రేష్ఠం కదా.

అలాగే శక్తిదేవతలో అతి శ్రేష్ఠురాలు అమ్మ శ్రీదేవి శ్రీలలితాపరాభట్టారికా దేవి.

ఆ విధంగా శ్రీవిద్యోపాసకుల్లో ఇంకెవరు పరమశివుడు శ్రేష్ఠుడు.

అలాగే అనేక విధాలైన దేవీసహస్రనామాల్లోనూ శ్రీలలితాసహస్రనామాలు శ్రేష్ఠమైనవి.

ఏ ఇతర స్తోత్రాలవలన కన్నా ఈ లలితాసహస్రనామస్తోత్రం వలన అమ్మవారు మిక్కిలి సంతోషిస్తుంది.

అమ్మవారిని బిల్వదళాలతోనూ, పద్మాలతోనూ ఈలలితాసహస్రనామాలతో పూజిస్తే తల్లి ఎంతో సంతోషిస్తుంది. తక్షణమే ఆవిడ అనుగ్రహం అబ్బుతుంది.

శ్రీచక్రర్చన, పంచదశాక్షరీ జపమూ చేసి సహస్రనామాలు పారాయణం చేయాలి. పూజాజపాలను చేయటానికి అశక్తులైనపక్షంలో నామపారాయణం చేస్తే చాలు.

ఈ నామ పారాయణం చేతనే సంపూర్ణంగా పూజా జపాలు చేసినట్లే అవుతుంది, సందేహం అక్కరలేదు.

శ్రీవిద్యోపాసకులు పూజాజపాలతో చేయటం మంచిది.  తదితర భక్తులు నామపారాయణం చేస్తే చాలును.

ఈ విధంగా అమ్మవారి సహస్రనామాలను గురించి వివరించి గురువుగారైన హయగ్రీవులు అగస్త్యమహర్షికి అప్పుడు శ్రీలలితాపరాభట్టారికా అమ్మవారి రహస్యసహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించారు.

అగస్త్యమహర్షి నుండి లోకంలో అర్హులైన భక్తులకు అమ్మవారి నామాలు అంది వ్యాప్తి చెందాయి.

గత టపాలో మనం అమ్మవారి సహస్రనామాల ఆవిర్భావకథను చెప్పుకున్నాం. అదంతా హయగ్రీవులు అగస్త్యమహర్షికి చెప్పారని అర్థం చేసుకోవాలి.



శ్రీలలితాసహస్రనామస్తోత్రం ఆవిర్భావం.


ఒకప్పుడు శ్రీదేవి తన భక్తులకు శ్రేయస్సును కలిగించాలన్న అభిలాషతో వశిన్యాది వాగ్దేవతలను తన సమ్ముఖానికి పిలిచింది.

వశిన్యాదులంటే అమ్మవారి పరివారదేవతలు. వాళ్ళపేర్లు వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, కౌళిని, సర్వేశ్వరి. వీళ్ళు మొత్తం ఎనిమిది మంది.

ఈ వశిన్యాదులు వాగ్దేవతలు. వర్ణమాలలొని అచ్చులకు అధిష్టానదేవత వశిని,  హల్లుల్లో క-వర్గానికి అధిష్ఠానదేవత కామేశ్వరి, చ-వర్గానికి అధిష్ఠానదేవత మోదిని, ట-వర్గానికి అధిష్ఠానదేవత విమల,  త-వర్గానికి అధిష్ఠానదేవత అరుణ, ప-వర్గానికి అధిష్ఠానదేవత జయిని, యరలవలకు అధిష్ఠానదేవత సర్వేశ్వరి, శషసహలకు అధిష్ఠానదేవత కౌళిని.

అంటే ఈవాగ్దేవతలు మనం పలికే ప్రతిమాటలోని ప్రతివర్ణాన్నీ శాసిస్తూ ఉంటారన్న మాట. మళ్ళా వీరంతా కూడా అమ్మవారు శ్రీదేవి శ్రీలలితాపరాభట్టారికా దేవికి పరివారదేవతలు.

ఈవాగ్దేవతలని పిలచి అమ్మావారు అందికదా, మీరంతా నాఅనుగ్రహంతో సకలవిద్యలనూ సంపదలుగా పొందారు.  నా భక్తులకు కూడా సకలవిద్యాసంపదలూ కలగాలని నా ఆకాంక్ష.

మీ అందరికీ నా అనుగ్రహం వలన మా శ్రీచక్రరహస్యాలు చక్కగా తెలిసాయి.  మీకు నా నామాలను చక్కగా తెలిసి పారాయణం చేయటంలో మంచి ఆసక్తి ఉంది.

అందుచేత ఆ నా నామాలతో ఒక మంచి స్తోత్రాన్ని నిర్మించే సమర్థత మీకు ఉంది.

కాబట్టి అటువంటి అందమైన స్తోత్రాన్ని నా గురించి రచించవలసిందిగా నా ఆజ్ఞ.

నా వేయి రహస్యనామాలను గిరించిన స్తోత్రం ఒకటి నాకంకితంగా రచించండి. ఏవిధంగా భక్తులు స్తోత్రం చేస్తే నాకు తక్షణమే అమితమైన ప్రీతి కలుగుతుందో అలాంటిది మీరు చేయండి.

వశిన్యాదులు అమ్మ ఆజ్ఞను విని చాలా ఆనందించారు.

అమ్మ కోరిన విధంగానే అమ్మవారి అతిరహస్యమైన వేయి  నామాలనూ చక్కగా గుదిగుచ్చి అందమైన అద్భుతమైన స్తోత్రం రచించారు.

వారంతా శ్రీదేవి దర్శనానికి ఆస్తోత్రంతో సహా విచ్చేసారు.

అప్పుడు అమ్మ గొప్ప సభను తీర్చి సింహాసనం మీద ఆసీనురాలై ఉంది.

తన దర్శనం కోసం వచ్చిన బ్రహాది దేవతాసమూహానికి తనసభలోనికి రావటానికి అమ్మ అనుజ్ఞ ఇచ్చింది.

ఒక్క బ్రహ్మ కాదు.

ఒక్క విష్ణువు కాదు

ఒక్క రుద్రుడు కాదు.

అనేకానేక బ్రహ్మాండాల నుండి వాటిని పరిపాలిస్తున్న బ్రహ్మలూ విష్ణువులూ రుద్రులూ అందరూ తమతమ దేవేరులతోనూ తమతమ బ్రహ్మాండాలను పాలించే దేవతాగణాలతోను వచ్చి అమ్మ సభలో ఆవిడ అనుజ్ఞతో ఆసీనులై ఉన్నారు.

శోభాయమానమైన అమ్మసభలోఅమ్మ యొక్క మంత్రిణి శ్యామలాంబా దేవీ, అమ్మయొక్క దండనాయిక వారాహీదేవీ సభకు ఆధ్వర్యం వహించి ఉన్నారు.

అమ్మసభలో లెక్కకు మిక్కిలిగా ఉన్న అమ్మ అనుచరదేవీగణం అందరు శక్తిదేవతలూ ఆసీనులై ఉన్నారు.

అమ్మసహలో ఓఘత్రయం చక్కగా విరాజిల్లుతోంది.

ఓఘత్రయం అంటే బ్రహ్మాదిదేవతలను దివ్యౌఘం అంటారు, సనకాది దేవర్షిగణాలను సిధ్దౌఘం అంటారు, వ్యాసాది మానవలోక ఋషిగణాన్ని మానవౌఘం అంటారు. వీళ్ళందరూ అమ్మను చూడటం కోసం ఆవిడ అనుజ్ఞపొంది సభలో ప్రవేశించి కూర్చున్నారు.

అటువంటి మహాద్భుతమైన అమ్మ సభలోనికి వాగ్దేవతలు వశిని మొదలైన ఎనమండుగురూ వచ్చారు. అమ్మ ఆజ్ఞ చేసిన విధంగా వారు అద్భుతమైన సహస్రనామస్తోత్రాన్ని అమ్మపైన విరచించి తీసుకొని వచ్చారు.

వారిని చూసి అమ్మ చిరునవ్వు చిందించి, దయాపూర్ణమైన నేత్రాలతో వారిని తిలకించి మీరు రచించిన స్తోత్రం వినిపించండి అన్నట్లుగా కనుసైగతోనే ఆజ్ఞాపించింది.

వశిన్యాదులు ఉప్పొంగిపోయి, లేచి అమ్మకు తమమ చేతులు భక్తిపూర్వకంగ్సా జోడించి నమస్కరించారు.

తాము ఎంతో భక్తి వినయాలతో విరచించిన అమ్మవారి దివ్య రహస్య సహస్రనామ స్తోత్రాన్ని వీనుల విందుగా ఆ సభలో అందరి సమక్షంలో అమ్మకు వినిపించారు.

అమ్మ ఆ అందమైన స్తోత్రాన్ని విని ఆనందించింది.

సభలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు.

ఈస్తోత్రం ఇతఃపూర్వం ఎన్నడూ విన్నది కాదే!

ఎంత అద్భుతంగా ఉన్నదీ!

ఎన్నెన్ని రహస్యార్థాలను నిక్షేపించి వెలయించారో ఈస్తోత్రాన్ని!

ఎవరు చేసారో ఈ మహత్తర స్తోత్రరత్నాన్ని!

వారి మనఃస్థితిని అమ్మ గమనించింది. వారిపట్ల అనుగ్రహంతో విషయం వారికి ఇలా చెప్పింది.

ఓ దేవతలారా!

వినండి. ఈ ఉత్తమమైన స్తోత్రాన్ని ఈవశిని మొదలైన ఎనమండుగురే చక్కగా రచించి ఇప్పుడు వినిపించారు.

ఇంతగొప్ప స్తోత్రం వీరెలా చేయగలిగారో అంటారా?

దానికి మా సంకల్పమూ, వారికి మా అనుగ్రహమూ  కారణం తప్ప మరేమీ లేదు.

ఇది చాలా చక్కగా ఉన్న స్తోత్రం.

మా మనస్సుకు ఎంతో నచ్చినది.

మీరు దీన్ని మా ఆజ్ఞగా పారాయణం చేయండి.

ఈ స్తోత్రపారాయణాన్ని ఆసక్తితో భక్తితో వినండి.

అంతేకాదు. మీరు మరొక పని కూడా చేయండి. మాపట్ల భక్తిగలవారికి దీనిని మీరు చక్కగా ఉపదేశం చేయండి.

అన్నివిధాలుగానూ ఈ సహస్రనామస్తోత్రాన్ని మీరు వ్యాప్తిచేయవలసింది.

దీని ప్రభావం వినండి.

ఏ భక్తుడైనా ఈ సహస్రనామస్తోత్రాన్ని ఒక్క సారి పారాయణం చేసినా సరే, అతడికి మా అనుగ్రహం ఉంటుంది. అటువంటి వాడికి నేను అన్ని కోరికలనూ తీరుస్తానని తెలుసుకోండి.

శ్రీచక్రాన్ని నా స్వరూపంగానే తెలుసుకొని, విధివిధానంగా శ్రీచక్రార్చన చేసి,  పంచదశాక్షరీ మంత్రాన్ని జపంచేసి, ఆ తరువాత ఈ సహస్రనామస్తోత్రాన్ని పారాయణం చేయాలి.

అందరికీ శ్రీచక్రార్చనకు ఉదదేశపూర్వకమైన అర్హత ఉండక పోవచ్చును కదా అనవచ్చును మీరు.

అందరికీ మంత్రోపదేశం ఉండకపోవచ్చును అన్నది కూడా నిజమేను.

ఐనా ఫరవాలేదు, అటువంటి వాళ్ళు శక్తిమేరకు నా సహస్రనామస్తోత్రం పారాయణం చేస్తే చాలు.
వారిపట్ల కూడా నాకు పూర్తిగా ప్రీతి కలిగి ఉంటాను. వాళ్ళ కోరికలు అన్నీ కూడా తీరుతాయి.

ఈవిషయంలో సందేహం అక్కరలేదు.

అందుచేత నా ఈ సహస్రనామస్తోత్రాన్ని మీరు చక్కగా ఎప్పుడూ పారాయణం చేయండి. వ్యాప్తిచేయండి.

ఇలాగున అమ్మ అక్కడ సభలో ఉన్న వారందరినీ ఉద్దేశించి అనుగ్రహభాషణం చేసింది.

అమ్మ ఆజ్ఞప్రకారం, అప్పటినుండి, శ్యామలాంబాదులూ, బ్రహ్మాది దేవతలూ ఋషులూ అందరూ అమ్మయొక్క సహస్రనామస్తోత్రాన్ని నిత్యమూ సంతోషంతో పారాయణం చేస్తున్నారు.

ఈ స్తోత్రం ముఖ్యంగా 'భక్తేన కీర్తనీయం' అని చెప్పబడింది. అంటే భక్తితో పారాయణం చేయాలి.




శ్రీలలిత బ్లాగుకు స్వాగతం


శ్రీలలిత బ్లాగు కేవలం శ్రీలలితాపరాభట్టారికా అమ్మవారికి సంబంధించిన సాహిత్యం కోసం ప్రత్యేకించబడింది.

యథావిధిగా ఇది కూడా జనబాహుళ్యానికి అందుబాటులో ఉంచటం జరుగుతోంది.

నా శ్యామలీయం బ్లాగులో నిన్న (2-10-2019) నాడు లలితా TS గారు పంపిన ఒక మంచి వ్యాఖ్య ఈబ్లాగు ఆవిర్భావానికి కారణభూతమైనది. అమ్మదయవలనే ఆవిడ ఈవిధంగా అడగటమూ, ఆసమయంలో నేను కూడా నడిచే దేవుడు పుస్తకాన్నివెబ్ లో చదువుతూ ఉండటమూ అంతా అమ్మ సంకల్పమే అని నమ్ముతున్నాను. అందుకే ఆలస్యం చేయకుండా, లలిత గారికి ఆవిషయం నా సమాధానంగా తెలియజేసి ఈ బ్లాగును అమ్మ కోసం ప్రత్యేకంగా ప్రారంహించటం జరిగింది.

పాఠకుల సౌకర్యార్థం లలితగారితో జరిగిన సంభాషణను ఇక్కడ ఉంచుతున్నాను.

లలిత గారు:"శ్యామలీయం గారు! మీకు వీలైతే మీరెప్పుడో రాద్దామనుకుంటున్నట్టు ప్రస్తావించిన లలితా సహస్రనామాలకి అర్థాలు రాయగలరా, దయచేసి? మీకిప్పటివరకూ ఎప్పుడూ చెప్పే సందర్భం రాలేదు కానీ, మీ లలితా సహస్రనామ స్తోత్రం - నామ విభజన పట్టిక నాకు నిత్య పారాయణం. దానిని పోస్ట్ రూపంలో అందించిన మీకు వేవేల కృతజ్ఞతలు."
నేను: "అమ్మ ఆజ్ఞ. తప్పకుండా ప్రయత్నిస్తాను. ఇప్పటివరకూ కంచిపరమాచార్యుల వారి గురించి నీలంరాజు వేంకట శేషయ్యగారి విరచించిన నడిచే దేవుడు పుస్తకాన్ని చదువుతున్నాను. ఇంతలో మీనుండి వర్తమానం. ఆనందంగా ఉంది. తప్పక ఈప్రయత్నం చేదాం."

అమ్మకు సంబంధించిన ఈబ్లాగులోని సర్వవిషయాలనూ అమ్మకు నివేదించుతూ వ్రాస్తున్నట్లే భావించి వ్రాయటం జరుగుతోంది. చదువరులు కూడా ఆవిషయాన్ని దృష్టిలో పెట్టుకొని చదవటమూ, ముఖ్యంగా ఎవరైనా వ్యాఖ్యలు పంపేటప్పుడు తగినంత హుందాతనం ప్రదర్శించటమూ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.  అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయని సవినయంగా మనవి చేస్తున్నాను.

మొట్ట మొదట శ్రీలలితాసహస్రనామస్తోత్రంలోని నామావళికి వివరణను సులభశైలిలో అందించే ప్రయత్నం చేస్తున్నాను.