20, మార్చి 2019, బుధవారం

13 - 51. అమ్మ స్వరూప వర్ణనం.


శ్రీ లలితా సహస్రనామస్తోత్రంలో13వ నామమైన చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా నుండి 51వ నామమైన సర్వాభరణభూషితా వరకూ అమ్మ యొక్క భౌతిక స్వరూపవర్ణన ఉంది. ఈ నామాలు 4వ శ్లోకం నుండి మొదలై 21వ శ్లోకం ప్రథమార్థం వరకూ విస్తరించి యున్నాయి.

సవివరంగా నామాలను గురించిన చర్చకు ముందుగా ఒక సారి వాటి అర్థాలను క్లుప్తంగా తెలుసుకుందాం.

13. చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా
సంపంగి పూవులు, అశోకపుష్పాలు, సురపొన్న పూవుల సువాసనచే ప్రకాశిస్తున్న జుట్టు అమ్మది.

14. కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా
పద్మరాగ మణులవరుసలతో ప్రకాశిస్తున్న కిరీటం అమ్మది.

15. అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా
అమ్మ నుదురు అష్టమి చంద్రుని వలె ఉన్నది.

16. ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా
అమ్మ ముఖం అనే చంద్రబింబానికి కస్తూరీతిలకం అనేది ఒక చక్కని మచ్చలాగా శోభిస్తున్నది.

17. వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా
అమ్మ ముఖమే మన్మథుని మంగళ గృహం. ఆవిడ కనుబొమలు ఆ ఇంటి ముఖద్వారాలవలె ఉన్నాయి.

18. వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా
అమ్మ ముఖకాంతి ఒక కారుణ్య జలప్రవాహం. ఆవిడ కన్నులు అ ప్రవాహంలో అందంగా కదలాడుతున్న చేపలు.

19. నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
అమ్మ ముక్కుదూలం అప్పుడే వికసించిన సంపంగి పూవులా ఉన్నది.

20. తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా
అమ్మ ముక్కుకు ఉన్న అడ్డబాస ప్రకాశం అకాశంపైన ఉండే నక్షత్రాల కాంతుల్ని త్రోసిరాజంటోంది.

21. కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా
అమ్మ చెవులపై మహామనోహరమైన అలంకంగారాలుగా కడిమిపూవుల గుత్తులు అలరారుతున్నాయి.

22. తాటంకయుగళీభూతతపనోడుపమండలా
సూర్యచంద్రులంటే వా ళ్ళెవ రనుకుంటున్నారు? వాళ్ళు అమ్మ చెవి కమ్మలే.

23. పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః
ఎర్రని పద్మరాగాలు అందంగా ఉంటాయి. కాని అమ్మ ఎర్రని చెక్కిళ్ళ అద్దాలు పద్మరాగాల అందాల్ని త్రోసిపుచ్చుతున్నాయి.

24. నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా
కొత్త పగడాల ఎరుపుదనం ఎంత గొప్పగా ఉన్నా అది అమ్మ పెదవుల అరుణిమ ముందు దిగదుడుపే.

25. శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా
శుధ్ధవిద్య అనే మొలక యొక్క రెండు చిగురుల్లాగా అమ్మ పండ్లవరుస ప్రకాశిస్తోంది.

26. కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా
అమ్మకు కర్పూర తాంబూలం సేవించటం ఇష్టం. ఆవిడ తాంబూలపు ఘుమఘుమలతో దిక్కులు నిండిపోతున్నాయి.

27. నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ
అమ్మ పలుకులు ఎంతో మధురమైనవి. అవి సరస్వతీ దేవి వీణకంటే ఎంతో స్పష్టమూ మధురమూ ఐనవి.

28. మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా
అమ్మ ఒలికిస్తున్న చిరునవ్వుల మధురకాంతుల్లో పరమేశ్వరుడి మనస్సు మునకలు వేస్తున్నది.

29. అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా
ఎందరో ఎన్నో ఉపమానాలతో అమ్మ అలౌకికసౌందర్యాన్ని వర్ణించవచ్చును. కాని ఆవిడ గడ్డం ఎంత అందంగా ఉందో పోల్చి చెప్పేందుకు అటువంటిది ఇంచుమించుగా కూడా మరిక వస్తువు లేనేలేదే!

30. కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా
అమ్మ మెడలో కామేశ్వరుడు కట్టినది లోకోజ్జీవన కారణమైన పరమసౌభాగ్యచిహ్నమైన మంగళసూత్రం శోభాయమానంగా ఉంది.

31. కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా
కాది హాది విద్యాస్వరూపములైన బంగారు భుజకీర్తులను ధరించి అమ్మ విరాజిల్లుతున్నది.

32. రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా
అమ్మ మెడలో రత్నాలతో చేసిన  చింతాకు పతకాలున్నాయి, మంచిముత్యాల హారాలున్నాయి.

33. కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ
కామేశ్వరుని ప్రేమరత్నానికి సరైన వెలగా నిలస్తూ ఉన్నాయి అమ్మ స్తనాలనే మణుల జంట.

34. నాభ్యాలవాలరోమాళిలతాఫలకుచద్వయీ
అమ్మ నాభినుండి పైకెదిగిన నూగారు అనే లతకు కాచిన రెండు మంచి ఫలాలుగా అమ్మ స్తనాలు శోభిస్తున్నాయి.

35. లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా
అమ్మ సన్ననిది. ఆవిడకు నడుము ఉందా లేదా అన్నది సంశయం ఐతే, దానికి పరిష్కరంగా అమ్మ నూగారు అమ్మకు నడుము ఉన్నది అని నిర్థారిస్తోంది.  అధారం లేనిదే నూగారు అనే లత ఎలా పైకి ప్రాకి స్తనాలనే పండ్లను కాచినది మరి?

36. స్తనభారదలన్మధ్యపట్టబంధవళిత్రయా
అమ్మ స్తనముల భారము వలన అసలే సన్ననిదైన అమ్మ నడుము ఇబ్బంది పడుతున్నది. ఆ నడుమును నిలిపి ఉంఛటానికి కట్టిన బంగారు పట్టీలలాగా అమ్మకు పొట్టమీద మూడు ముడుతలు కనిపిస్తున్నాయి.

37. అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ
అమ్మ కటిప్రదేశంలో మిక్కిలి ఎర్రనైన వస్తాలు ధరించి ఉన్నది.

38. రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా
అమ్మ బంగారపు ఒడ్డాణాన్ని ధరించింది. దానికి రత్నాలతో అలంకరించిన చిరుగంటలున్నాయి. అవి కిణికిణి అని మనోహరమైన ధ్వని చేస్తున్నాయి.

39. కామేశజ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా
అమ్మ కామేశ్వరి. అయ్యవారు కామేశ్వరుడు. ఈ ఇద్దరూ ఆదిదంపతులు. ఆవిడ ఊరువుల సౌభాగ్యమును కేవలము కమేశ్వరుడే యెరుగును.

40. మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా
అమ్మ మోకాళ్ళు అందమైన చిన్న మాణిక్యపు కిరీటాల వలె ఉన్నాయి.

41. ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా
మన్మథుని తూణీరాలను ఎర్రని ఆరుద్రపురుగులు ఆవరించుకొని ఉన్నయా అన్నట్లుగా అమ్మ  పిక్కలు శోభిస్తున్నాయి.

42. గూఢగుల్ఫా
చక్కగా పుష్టిగా ఉన్న చీలమండలు కలది అమ్మ.

43. కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా
అమ్మ మీగాళ్ళు (అనగా పాదాలపైభాగాలు) అందమైన తాబేళ్ల వీపులను తిరస్కరించుతూ ఉన్నాయి.

44. నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా
అమ్మ తన కాలిగోళ్ళ ప్రకాశం చేతనే, పాదనమస్కారం చేసే జనుల తమోగుణాన్ని పోగొట్టుతున్నది.

45. పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా
కొలనుల్లోనూ పద్మాలున్నాయి.  అమ్మ పాదపద్మాల సౌందర్యప్రభలకు అవి ఎంతమాత్రం సాటిరావు.

46. శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా
అమ్మ పాదాలకు మణులు పొదగిన అందమైన అందెలున్నాయి.

47. మరాళీమందగమనా
అమ్మ నడక అందమైన హంసనడక వంటిది.

48. మహాలావణ్యశేవధిః
లావణ్యం అంటే సౌందర్య. అమ్మ సౌందర్యం వంటిది మరొకటి బ్రహ్మాండంలోనే లేదు.

49. సర్వారుణా
అమ్మ అంతా ఎరుపు మయం. ఆవిడ శరీరఛ్ఛాయయే కాదు. ఆవిడ ధరించే వస్త్రమాల్యాభరణాదులు అన్నీ కూడా ఎర్రనివే.

50. అనవద్యాంగీ
అమ్మ శరీరనిర్మాణం ఎక్కడా లోపం ఎన్నటానికి వీలులేనిది. సర్వశుభలక్షణములూ కలిగినది.

51. సర్వాభరణభూషితా
అమ్మ చూడామణి మొదలుకొని పాదాలకు ఉంగరాలవరకూ సర్వాంగముల యందూ సర్వవిధములా శ్రేష్ఠములైన ఆభరణాలు ధరించి ఉంది.

ఇదీ అమ్మ యొక్క స్వరూప వర్ణన.

ఇప్పుడు మనం ఈ స్వరూపవర్ణనాపర మైన నామాల గురించి విడివిడిగా చర్చించుకుందాం.

19, మార్చి 2019, మంగళవారం

12. నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా


మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా।
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా। 3

అరుణ వర్ణం అంటే ఎరుపు రంగు. ప్రభ అంటే కాంతి. ప్రభలు అంటే కాంతిపుంజాలు. అంటే కిరణాలు అనవచ్చును. ఆ పూరము అంటే చూదాం. పూరణము అంటే నింపట. ఆపూరణము అంటే బాగా నింపట. పూరము అంటే నిండినది. ఆపూరము అంటే బాగా నిండినది లేదా సంపూర్ణంగా నిండినది. ఇక నిజ+ అరుణప్రభ -> నిజారుణప్రభ అని సంధి కార్యం. ఇక్కడ నిజ అంటే తనయొక్క అని అర్థం. కాబట్టి నిజ + అరుణ + ప్రభ + ఆపూర -> నిజారుణప్రభాపూర అంటే తనయొక్క ఎర్రని కాంతితో సంపూర్ణంగా నిండిపోయిన అని భావం.

అలా సంపూర్ణంగా నిండటం వలన ఏమి జరిగిందీ అంటే మజ్జద్బ్రహ్మాండమండలా అంటున్నారు. మజ్జనం అంటే స్నానం. బ్రహ్మాండమండలం అంటే బ్రహ్మాండాల సమూహం అని అర్థం. బ్రహ్మాండాల సమూహం అని ఎందుకంటాం అంటే అమ్మ అనేకకోటి బ్రహ్మాండ నాయకి కదా అందు వలన.

మజ్జత్ + బ్రహ్మాండమండలా -> మజ్జద్బ్రహ్మాండమండలా అని సంధికార్యం. అంటే బ్రహ్మాండమండలాలన్నీ స్నానం చేసినటుగా ఉంటున్నాయన్న భావన. అంటే పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి అని తాత్పర్యం

ఇప్పుడు మొత్తం నామానికి అర్థం చెప్పవలసి వస్తే అది, అమ్మ యొక్క అద్భుతమైన అరుణకాంతి (పుంజముల)తో పూర్తిగా (దిక్కులన్నీ) నిండిపోయి బ్రహ్మాండమండలాలన్నీ ఆ కాంతిలో సంపూర్ణంగా మునిగి స్నానం ఆచరిస్తున్నాయి అని.

అమ్మ అగ్ని యొక్క (అరుణ) వర్ణం కలది అని శ్రుతి (అంటే వేదం).

తా మగ్ని వర్ణాం తపసా జ్వలంతీం అని తై-య-నారా-2-అనువాకం.

అలాగే శ్రీ జైమిని మహర్షికృత దేవీ వేదపాదస్తోత్రంలో

శ్రీచ్రకస్థాం శాశ్వతైశ్వర్యదాత్రీం
పౌణ్డ్రం చాపం పుష్ప బాణాన్‌ దధానామ్‌
బన్థూకాభాం భావయామి త్రినేత్రాం
తా మగ్నివర్ణాం తపసా జ్వలన్తీమ్

అని వర్ణన. దీని అర్థం శ్రీచక్రంలో ఉన్నదీ, స్థిరమైన ఐశ్వర్యాన్ని ఇచ్చేదీ, నామాలచెఱకువిల్లు కలదీ, పుష్పబాణాలు కలదీ, మూడు నేత్రాలతో మంకెనపూవు లాంటి శరీరఛ్ఛాయతో అగ్నివంటి ప్రభలు కలిగిన తపస్విని ఐన దేవిని భావన చేస్తున్నాను అని .

అమ్మవారి ధ్యానశ్లోకంలో కూడా అరుణాం కరుణాంతరంగితాక్షీమ్ అని వస్తుంది కదా.

అరుణాం కరుణాంతరంగితాక్షీం
ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్‌
అణిమాదిభి రావృతాం మయూఖై:
అహ మిత్యేవ విభావయే భవానీమ

ఇక్కడ అమ్మవారిని అరుణా అంటే ఎర్రగా ప్రకాసిస్తున్న తల్లీ అని సంబోధించారు కదా.|

ఈ సందర్భంలో అంటే అమ్మవారి ఆవిర్భావఘట్టంలోని నామాల అమరికను గమనించండి.

ఉద్యద్భానుసహస్రాభా
చతుర్బాహుసమన్వితా
రాగస్వరూపపాశాఢ్యా
క్రోధాకారాంకుశోజ్జ్వలా
మనోరూపేక్షుకోదండా
పంచతన్మాత్రసాయకా
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా

ఉద్యద్భానుసహస్రాభా అన్న నామంలో అమ్మ ఉదయిస్తున్న వేయి సూర్యుల యొక్క ప్రకాశంతో సమానమైన శోభతో -లేదా- ఉదయసూర్యుని సహస్ర(అనంత) కిరణసముదాయం యొక్క శోభతో అవతరించింది అని చెప్పి, అటు పిమ్మట ఆవిడకు నాలుగు చేతులున్నాయనీ ఆ బాహువుల్లో ఫలాని ఆయుధాలున్నాయనీ చెప్పారు. వెంటనే అమ్మ యొక్క అరుణ (ఉదయసూర్య) ప్రకాశంలో బ్రహ్మాండమండలాలన్నీ మునిగి స్నానం చేస్తున్నాయని చెబుతున్నారు వశిన్యాది దేవతలు.

అమ్మ ఆవిర్భావం యొక్క తేజస్సు సహస్రకిరణసదృశంగా మొదట యజ్ఞవాటికలోని దేవతా సమూహానికి తెలియవచ్చింది కదా. అటుపిమ్మట అమ్మ మూర్తి చతుర్భాహువులతో వెల్లడి కాగానే, అమ్మ యొక్క అరుణమైన తేజస్సు యజ్ఞవాటిని దాటి బ్రహ్మాండాన్నే కాదు, సమస్తమైన బ్రహ్మాండాలనూ ఆవరించి ముంచెత్తిందని చెబుతున్నారు.

అరుణ వర్ణం చైతన్యానికి సూచకం. ఉదయించే సూర్యుడు సమస్తజగత్తుకూ చైతన్యం ప్రసాదిస్తూ అంతవరకూ నిద్రావస్థలో పడి ఉన్న లోకాన్ని మేలుకొల్పుతాడు. ఆయన రాకతో వెల్లడయ్యే అరుణమైన తేజస్సు జగత్తుని ఉత్సాహపరుస్తుంది.

అమ్మ ఆవిర్భావం కూడా జగత్తును కాదు కాదు సమస్ర బ్రహ్మాండాన్నీ ఉత్సాహపరచేది.

ఇంతవరకూ భండాసురుడి యొక్క మాయాప్రభావం వలన ఒక్క బ్రహ్మాండం మొత్తం నిస్సత్తువ చెంది చైతన్యవిహీనం ఐపోయింది.

ఇప్పుడు అమ్మ రాకతో చైతన్యం ఒక వెల్లువలా బ్రహ్మాండాన్ని ముంచెత్తింది. అది ఈ బ్రహ్మాండాన్నే కాదు సమస్త బ్రహ్మాండాలనూ మహాచైతన్యంతో నింపేసింది అని తాత్పర్యం

స్వతంత్ర తంత్రంలో

స్వాత్మైవ దేవతా ప్రోక్తా లలితా విశ్వవిగ్రహా
లౌహిత్యం తద్విమర్శ స్యా దుపాస్తిరితి భావనాః

అని ఉంది. ఇక్కడ అమ్మ యొక్క లౌహిత్యం అనగా అరుణిమను ప్రస్తావిస్తున్నారు. లోహితం అంటే రక్తచందనం అనీ రక్తం అనీ ఎరుపురంగు అనీ అర్థం. లౌహిత్యం అంటే లోహితము (ఎరుపు)గా ఉండటం అనే గుణం అనగా ఎర్రదనం.

అసౌ య స్తామ్రో అరుణ అని శ్రుతి. కుండలినీ రూప త్రిపురసుందర్యాత్మిక అరుణప్రభల చేత పిండాండ బ్ర్హహ్మాండములు నిండిపోయాయి అని. ఇక్కడ పిండాండం అంటే సాధకుడి శరీరమే. కుండలిని ఎర్రని ప్రభకలదని తాత్పర్యం. పిండాండ బ్రహ్మాండములకు ఏకత్వం చెప్తారు.

సౌందర్యలహరీ స్తోత్రంలో శ్రీశంకరులు

క్షితౌ షత్పఞ్చాషట్ ద్ద్విసమధిక పఞ్చాశదుదకే
హుతాశే ద్వాషష్టి శ్చతురధిక పఞ్చాశదనిలే
దివి ద్విష్షట్రింశ న్మనసి చ చతుష్షష్టి రితి యే
మయూఖాస్తేషా మప్యుపరి తవపాదాంబుజ యుగం.

అంటారు. ఈ శ్లోకం చాలా మనోహరమైనది. ఇక్కడ కుండలినికి ఉన్న 360 కిరణములను గురించి చెబుతున్నారు. ఈ 360 సంఖ్య సంవత్సరంలోని తిథులను తెలియజేస్తున్నది. అనగా శ్రీదేవి కాలస్వరూపిణి, సంవత్సరరూపిణి. ఆమె తేజః కిరణాలు 360న్నూ జగత్తును కాలమై నడుపుతున్నాయని స్థూలంగా తాత్పర్యం. ఇది బ్రహ్మాండరూపిణిగా అమ్మ యొక్క కాలస్వరూపం. పిండాండంలోని వివిధ చక్రాలకు వివిధ కిరణసంఖ్య ఉన్నది. అవి మొత్తం 360. కలిసి పిండాండాన్ని పాలిస్తున్నవి అని తాత్పర్యం. ఈ కాంతులన్నీ చైతన్యస్వరూపములు. ఈ విధంగా అమ్మ బ్రహ్మాండాలను తన తేజస్సులో ముంచెత్తుతున్నది అని అర్థం చేసుకోవాలి.

ఈ నామానికి సంబంధించిన కొన్నిమంత్రశాస్త్ర విషయాలున్నాయి. కాని అవి మనం ప్రస్తుతం చర్చించుకోవటం లేదు.

17, మార్చి 2019, ఆదివారం

11. పంచతన్మాత్రసాయకా


మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా। 3

పంచతన్మాత్రలు అంటే శబ్దమూ, స్పర్శా, రూపమూ, రసమూ, గంధమూ అనేవి.

మనకు పంచభూతా లంటే తెలుసును. అవి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధ్వి అన్నవి అని. ఈ ఐదు మహాభూతాల యొక్క స్వరూపములే పంచతన్మాత్రలు.

కొంచెం వివరంగా చూదాం.

భూతమాత్ర స్వరూపో౽ర్థ విశేషాణాం నిరూపకః
శబ్దస్తు శబ్దతన్మాత్రం మృదూష్ణక వినిశ్చయః
విశిష్ఠ స్పర్శరూపశ్చ స్పర్శతన్మాత్రం సంజ్ఞకం
నీలపీతత్వశుక్లశ్చ విశిష్ఠం రూపమేవచ
రూపతన్మాత్ర మిత్యుక్తం మధురత్వామ్లతాయుతమ్
రసతన్మాత్ర సంజ్ఞంతు సౌరభ్యాది విశేషతః
గంధ స్యా ద్గంధ తన్మాత్రం తేభ్యోవై భూతపంచకమ్

అని మహాస్వఛ్చందసంగ్రహం అనే గ్రంథంలో ఉన్నది.  ధ్వని యొక్క్ అర్థ విశేషాషాన్ని నిరూపించే శబ్దమే శబ్దతన్మాత్రం. గట్టిదనమూ, ,మెత్తందనమూ, వేడీ చల్లదనమూ మొదలైనవి తెలిపే స్పర్శయే స్పర్శతన్మాత్రం.  తెలుపూ నలుపూ వగైరా రంగుల్నీ అకారాల్నీ తెలిపేది రూపతన్మాత్రం. తీపీ పులుపూ వగైరా రుచుల్ని తెలిపేది రసతన్మాత్రం, రకరకాల వాసనలను తెలిపేది గంధతన్మాత్రం.

ఈ తన్మాత్రలు ఇంద్రియాల లక్షణాలను తెలిపేవిగా ఉన్నాయి కదా. ఇవే అమ్మవారి చెఱకు వింటికి బాణాలుగా ఉన్నాయట. సాయకములు అంటే బాణాలు అనే అర్థం.

ఈ బాణాలను మూడూ వర్గాలుగా చెబుతారు. మొదటివి స్థూలమైనవి. అంటే ఇవి పువ్వుల బాణాలు. చెఱకు వింటికి పూల బాణాలు కదా మరి. ఈ పూవుల బాణాలు ఏవిటంటే తామరపూవు, ఎఱ్ఱకలువ, ఎఱుపుడోలు కలిగిన తెల్ల కలువ, నల్లకలువ తియ్యమామిడి చెట్టు పువ్వు అనేవి.

ఇక సూక్ష్మమైన బాణాల పంచకం అంటే పంచతన్మాత్రలు అని పైన చెప్పుకొన్నవి.

పరా అని చెప్పబడే బాణాలు,  ద్రాం, ద్రీం, క్లీం, బ్లూం, నః అనేవి. ఇది శ్రీవిద్యలోని మంత్రశాస్త్రసంబంధమైన విషయం కాబట్టి ఇక్కడ విస్తరించటం లేదు.

ఈమధ్య కాలంలో ఒకరిద్దరు పంచతన్మాత్రసాయకా అన్న దానికి పంచతన్మాత్రలు సాయకములు (బాణములు)గా కలిగినది అని కాక పంచతన్మాత్రలు సాయకము (అనే ఒక్క బాణము)గా కలిగినది అని అర్థం చెప్పారు. కాని అది సంప్రదాయానికి విరుధ్ధంగా ఉంది. పంచబాణాలనటమే కాదు వాటికి విడివిడిగా మంత్రాలూ, బీజాక్షరాలూ ఉపాసనలూ కూడా శాస్త్రములలో ఉన్నాయి కాబట్టి ఒకే బాణం అన్న మాట అంగీకరించటం కష్టం. ఐతే వారు మాత్రం అమ్మవారి చిత్రపటాల్లో ఒకేబాణం సూచిస్తూ ఉన్నారన్న కారణం చెబుతున్నారు.


10. మనోరూపేక్షుకోదండా


మనోరూపేక్షుకోదండా  పంచతన్మాత్రసాయకా।
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా।  3

ఇక్షువు అంటే చెఱకు.  కోదండం అంటే విల్లు. కోదండరాముడు అని రామయ్యను ధనుర్ధారిగా కీర్తిస్తూ ఉంటాం కదా. అక్కడ కోదండం అన్న పదం మనకు బాగా పరిచయం ఐపోయినదే.

అమ్మ ఎడమవైపు చేతుల్లోని పైచేతిలో చెఱకువిల్లు ఆయుధంగా ధరించి దర్శనం ఇస్తోంది.

ఇది మామూలు చెఱకువిల్లు కాదు నామాలచెఱకు విల్లు.

కొన్ని చెఱకు గడలకి నామాల్లాగా తెల్లని నిలువు చారలుంటాయి. వాటిని నామాలచెఱకు అంటారు. అదే మనం బడాయిగా సంస్కృతంలో చెప్పాలటే పుండ్రేక్షువు. పుండ్రములు అంటే నామాలు.

పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే అన్నది విన్నారా? వినే ఉంటారు. ఈశ్లోకాలు చూడండి.

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి II

చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే
పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః

మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ

జయ మాతంగ తనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీత రసికే జయ లీలశుకప్రియే.II

ఇవి మహాకవి కాళిదాసు గారి శ్యామలాదండకం లోనివి. ఆ దండకం ఎత్తుగడలోనే ఈశ్లోకాలు వస్తాయి, మనలో అనేకమందిమి శ్రీఘంటసాల వేంకటేశ్వరరావు గారి కమ్మని గొంతులో అనేక సార్లు శ్యామలా దండకం వినే ఉంటాం కదా.  ఈ ఎత్తుగడ శ్లోకాల్లో పుండ్రేక్షువు కూడా అమ్మవారి ఆయుధం అని చెప్పారు కాళీప్రసన్నత కల మన కవి గారు.

కాని మనందరికి చెఱకువిల్లు ఆయుధం అనగానే గుర్తుకు వచ్చే పెద్దమనిషి మన్మథుడు.

ఇది మామూలు చెఱకువిల్లు కాదు. అది మనస్సే నట. మనస్సును గురించి వేదం ఏమంటున్నదీ అంటే

కామ స్సంకల్పో విచికిత్సా శ్రధ్ధా ధృతి రధృతి
శ్రీః హ్రీ ర్భీరిత్యేత్సర్వం మన ఏవ అని

సంకల్పం వికల్పం వంటి పదకొండు ప్రవృత్తులకు మొదటి స్థానం మనస్సు. సర్వజీవుల యొక్క సమిష్టి మనోరూపం ఐన కోదండం అమ్మ చేతిలోని విల్లుగా ఉంది.

మనస్సు యొక్క ప్రవృత్తిని సంస్కారం అంటాం. ఇది ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధంగా ఆయా జీవుల కర్మఫలాలను బట్టి ఉంటుంది.  మరణంతో పోయేది స్థూలమైన పాంచభౌతిక దేహమే. సూక్ష్మ కారణ శరీరాలు నశించవు. అందువలన కర్మఫలోదయ రూపమైన వేరొక శరీరం పొంది సంస్కారాన్ని అనుసరించిన మరొక స్థూలదేహం వస్తుందంతే. ఇలా జీవులకి వారి వారి సంస్కారఫలాన్ని బట్టి అనుగ్రహం చేసే శక్తియే అమ్మ చేతిలోని విల్లుగా ఇక్కడ సంభావన.

అమ్మకే తమ తమ కర్మలను అర్పించే బుధ్ది ఉన్న వాళ్ళకు నిత్యమూ అనిత్యమూ ఏమిటీ అన్న వివేకం కలుగుతుంది. అమ్మకే మనస్సును అప్పగించితే అది నిశ్చలమై ఉంటుంది.

మనస్సు అంటే అదే కదా ఇంద్రియాలకు రాజు? మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః అని అంటారు కదా. ఈ మనస్సు చంచలంగా ఉండి ఐహికం కోసం తిరుగుతూ ఉండటం వలననే కర్మ బంధాలన్నీను. ఈ మనస్సునే అమ్మకు అర్పించితే? చచ్చినట్లు దానితో పాటు దాని అనుచరగణం అయిన ఇంద్రియాలూ అమ్మవైపే తిరిగి ఉంటాయి. ఇంక ఇహాన్ని అపేక్షించటం అంటటం చేయవు. బంధమోక్షణం అవుతుంది. అదే కదా ముక్తి! అంటే జ్ఞానం దొరికి స్వస్వరూపంలో రమిస్తూ ఉంటాడు జీవుడు.

చెఱకు దేనికి పెట్టింది పేరు? తీపికి కదా. మనం తీపిని అనందానికి సంకేతంగా చెప్పుకుటాం. చెఱకుకు తీపి సహజం. మనస్సుకు కూడా ఆనందం సహజం. చెఱకులో తీపి అంతర్గతం. మనస్సులోని ఆనందమూ అంతర్గతమే. అనందం అన్నదే తనస్వభావం కాబట్టి. మనస్సు ఆనందాన్ని బయట వెదుక్కోవటం కేవలం అవిద్య వలననే. అమ్మకు అర్పించబడిన మనస్సు అమ్మ చేతిలోని చెఱకుగడ విల్లులా ఉంటుంది. చెఱకుకు ఒకరు తీపిని అందివ్వ నవసరం లేనట్లే ఆ మనస్సుకూ మరొకరి నుండి అనందం అపేక్షించక స్వస్వభావమైన ఆనందంలో ఉండటం జరుగుతుంది. ఇది అంతరార్థం


14, మార్చి 2019, గురువారం

9. క్రోధాకారాంకుశోజ్జ్వలా


ఉద్యద్భానుసహస్రాభా   చతుర్బాహుసమన్వితా
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా॥ 2

అమ్మవారి బాహ్యస్వరూప వర్ణనలో ఉన్నాం.

అమ్మ ఒక చేతిలో రాగం అనే స్వరూపం కల పాశం ఉన్నది అని చెప్పుకున్నాం.

మరొక చేతిలో అమ్మ వద్ద క్రోధమనే అంకుశం ఉన్నది అని చెబుతున్నారు వశినీ మొదలైన వారు.

ఈ అంకుశం అమ్మ కుడి చేతుల్లో మీది హస్తంలో ఉంది.

ఈ క్రోధం అనేది ద్వేషం నుండి పుట్టేది.

కామము క్రోధము అనేవి రజోగుణం నుండి వస్తున్నాయని గీతావాక్యం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవా అని.

రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా అన్న రెండునామాలనూ కలిపి ఏకనామం వలె పారాయణం చేయాలని వైద్యనాథ దీక్షితులనే వ్యాఖ్యాత గారి అభిప్రాయం, కాని అనూచానంగా వస్తున్న ఆచారం ఇవి రెండూ విడివిడి నామాలుగా చెప్పటమే. శ్రీశృంగేరీ పీఠాచారం కూడా ఇదే.  బాహువులు రెండింటిలో రెండు ఆయుధాలున్నాయని చెప్పటమే బాగుంటుంది కదా.

ఈ నామంలో క్రోధాకారం అని చెప్పటంలో ఒక విశేషం ఉంది. అది వ్యాకరణపరమైనది.  కలది అను అర్థంలో అచ్ ప్రత్యంయం చేయగా అకారము కలది అను అర్థం వస్తుందట.

మరి ఆకారం కలిగినది ఏమిటీ అంటే అది జ్ఞానం.

జ్ఞానం అనేది సవిషయకము, నిర్విషయకము అని సాంకేతికంగా రెండు విధాలుగా ఉంటుందని చెబుతారు.

వ్యాకరణశాస్త్రపరంగా సవిషయక జ్ఞానం అనేది వ్యాకరణ శాస్త్ర రీత్యా ఏర్పడుతున్న భావన.

శ్రుతి క్రోధోంకుశః అనగా క్రోధమే అంకుశము అని చెప్పుచున్నది.

అందుచేత సామాన్యార్థంతో క్రోధ + ఆకార+అంకుశ ->  క్రోధాకారాంకుశ అని చెప్పుకొని క్రోధమనే ఆకారం కల అంకుశం అని చెప్పటం ఒక విధానం.

మరొక విధానంగా క్రోధ + ఆకార+అంకుశ ->  క్రోధాకారాంకుశ అన్నదానికి క్రోధము= ద్వేషము, ఆకారము=సవిషయక జ్ఞానము అని అన్వయం చేసి ద్వేషమూ, జ్ఞానమూ రెండూ కలిసి ఉభయాత్మకమైనదిగా ఉన్న అంకుశం అమ్మ ఆయుధం అని చెప్పవచ్చును.

పూర్వచతుశ్శతిలో పాశాంకుశౌ తదీయౌ తు రాగద్వేషాత్మకౌ స్మృతౌ అని చెప్పినదానిలో  పాశం రాగమూ, అంకుశం ద్వేషాత్మకమూ అని అర్థం చెప్పబడింది.

తంత్రరాజం అనే గ్రంథంలో వాసనాపటలములో

మనో భవే దిక్షుధనుః పాశౌరాగ ఉదీరితః
ద్వేష స్యా దంకుశః పంచతన్మాత్రాః పుష్పసాయకాః

అంటూ అమ్మ ఆయుధం ద్వేషం అనే అంకుశం అని చెపుతున్నారు. మిగిలిన ఆయుధాలు రాగమనే పాశమూ, మనస్సు అనే చెఱకువిల్లూ, పంచతన్మాత్రలనే పూబాణాలూ అని పైశ్లోకం చెబుతున్నది.

ఉత్తరచతుశ్శతి అనే గ్రంథంలో

ఇఛ్ఛాశక్తి మయం పాశం  అంకుశం జ్ఞానరూపిణమ్
క్రియాశక్తిమయే బాణధనుషీ దధదుజ్జ్వల

అని చెప్పిన శ్లోకంలో అంకుశం జ్ఞానరూపకమైనది అని తెలుస్తున్నది.

అందుచేత రెండూ సమన్వయం చేసుకొని అది జ్ఞానద్వేషములు రెండున్ను కలిసిన అంకుశం అని అర్థం చేసుకోవాలి.

క్రోధాకారాంకుశోజ్జ్వలా అన్న దానికి అన్వయం క్రోధమనే అంకుశం కలిగి ఉజ్జ్వలంగా ఉన్నది  అని చెప్పటం కన్నా  ఉజ్జ్వలమైన క్రోధమనే అంకుశం కలది అని చెప్పుకోవటం బాగుంటుంది - అమ్మ ధరించటం వలన ఆ అంకుశం ఉజ్జ్వలమైనది (మంచి ప్రకాశం పొందినది) కదా!

9, మార్చి 2019, శనివారం

8. రాగస్వరూపపాశాఢ్యా


ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా॥  2

అమ్మను చతుర్బాహుసమన్వితా అని చెప్పిన తరువాత వశిన్యాదులు ఆ తల్లియొక్క బాహువుల యందున్న వాటిని గురించి వివరిస్తున్నారు.

రాగస్వరూపపాశాఢ్యా
క్రోధాకారాంకుశోజ్వలా
మనోరూపేక్షుకోదండా
పంచతన్మాత్రసాయకా

అనేవి నాలుగూ అమ్మ బాహువులను గురించిన నామాలు.

బాహువులను ప్రస్తావించిన తరువాత ఆ బాహువులలో ఉన్న ఆయుధసంపత్తిని వర్ణించటం సముచితం కదా

గమనించ వలసిన సంగతి యేమిటంటే ఈ ఆయుధాలు కూడా స్థూల, సూక్ష్మ పర అనే బేధాలు కలవిగా ఉండటం.

స్థూలంగా అమ్మ వారి చేతుల్లో ఒక దానిలో పాశం ఉన్నది.  అమ్మ వారి ఆకృతిలో అది ఆవిడ ఎడమవైపున ఉన్న రెండుచేతులలో మీది చేతిలో ఉన్నది.

ఈ పాశం ఎటువంటిది అంటే అది రాగం అనేదానిని తెలిపేదట. రాగమే పాశం అనే ఆకారంలో అమ్మ చేతిలోని ఆయుధంగా అమరి ఉందట.

చిత్తవృత్తుల్లో ఒకటి అనురక్తి. అదే రాగం. ఇది వాసనా మయం. వాసనలు మూడు రకాలు. అవి లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అనేవి. అంటే లోకం యొక్క గుర్తింపును కోరుకొనటమూ, దేహసౌఖ్యాపేక్షా, శాస్త్రసంబంధమైన జ్ఞానమే మోక్షం అనే భ్రమ అనేవి. ఇదంతా జీవులకు తమ ఉపాధి పైన అనురక్తి వల్ల ఏర్పడుతున్న తమాషా.

పశువును కట్టేది పాశం అని వ్యుత్పత్తి.  జీవులందరూ పశువులే. అందుకే శివునకు పశుపతి అని నామధేయం. పశువులకు తమ ఉపాధిపై రాగం సహజాత లక్షణం.

ఒకప్పుడు ఇంద్రుడు కర్మవశాత్తు పందిగా జనించ వలసి వచ్చింది. ఆయన నారదమహర్షిని దర్శించి, మహాత్మా, నేను పందిగా ఉపాధిని పొందినప్పుడు మీరు వచ్చి ప్రబోధించితే నేనా ఉపాధిని వదలి మళ్ళా ఇంద్రత్వం స్వీకరిస్తానూ అని బ్రతిమాలాడు. నారదుడు నవ్వి సరే అన్నాక ఆయన సూకరోపాధిని పొందటమూ మాట ఇచ్చినట్లే నారదమహర్షి పోయి ప్రబోధించటమూ జరిగింది. అప్పుడేం జరిగిందో చూసారా. ఆ పందిరూపంలో ఉన్న ఇంద్రుడు అన్నాడు కదా, ఈ జన్మం ఇంత హాయిగా ఉందే, దీనిని వదలిపెట్టమని చెబుతావేమి టయ్యా, ఠాట్ కుదరదంటే కుదరదూ అని.  ఇదండీ జీవుణ్ణి పశువుని చేసి ఆడించే వాసనారూపకమైన పాశం అంటే. ఇటువంటి పాశం అమ్మకు ఆయుధంగా అమరి ఉందని ఈ నామం తాత్పర్యం.

చూసారుగా రాగం అనేది జీవుణ్ణి లోకానికి కట్టి పడవేసే బంధం.  ఈ బంధం ఉన్నన్నాళ్ళూ జననమరణ రూపమైన సంసారంలో పరిభ్రమించటం తప్పదు.  ఈ రాగం అనేది కామం యొక్క స్వరూపం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముధ్భవాః అని గీత. త్రిగుణములు లేనిదే ఉపాధియే లేదు. ఉపాధులన్నిటికీ త్రిగుణముల ఆయా ఉపాధులకు తగినట్లు ఉండి తీరుతాయి కదా.  జీవుల కర్మల విశేషాలను బట్టి అమ్మ వారికి తగినట్లు ఈ పాశాన్ని అమ్మే ప్రయోగిస్తున్నదన్న మాట. అంటే ఈ పాశపు దెబ్బలు తిని తిని మెల్లగా జీవుడు దారిలోనికి రావాలి. అంటే రాగాన్ని అతిక్రమించటానికి ప్రయత్నించాలి అని తాత్పర్యం.

పూర్వచతుశ్శతి అన్న గ్రంథంలో పాంశాంకుశౌ తదీయౌ తు రాగద్వేషాత్మికౌ స్మృతౌ అని ఉంది. అంటే తల్లికి రాగద్వేషాలు ఆయుధాలుగా అమరి ఉన్నాయని.

దూర్వాసమహర్షి చేసిన దేవీమహిమ్నస్తోత్రంలో

పాశం ప్రపూరిత మహాసుమతి ప్రకాశో
యోవావ త్రిపురసుందరీ సుందరీణామ్
ఆకర్షణో౽ఖిల వశీకరణే ప్రవీణం
చిత్తే దధాతిస జతగత్రయవశ్యకృత్స్యాత్

య స్వాంతే కలయతి కోవిద స్త్రిలోకీ
స్తంభారంభణచణమృత్యుదారవీర్యమ్
మాతస్తే విజయమహాంకుశం సయే సా
దేవాం స్తంభయతి చ భూభుజో౽న్యసైన్యమ్

ఈ మూడు జగత్తులను ఆకర్షించి వశీకరణం చేసుకొనే శక్తి కలది త్రిపుర సుందరి యొక్క పాశం అనే ఆయుధం. ఆ తల్లి యొక్క క్రోధము అనే విజయ మహాంకుశం శత్రువులను స్తంభింపచేసి వారికి మృత్యువుగా పరిణమిస్తున్నది అని వీటి అర్థం స్థూలంగా.

అంటే జగత్తును శాసించే రాగం అనేది అమ్మ చేతి ఆయుధం. అని స్పష్టం అవుతున్నది.

మనం అమ్మ పాదాలను ఆశ్రయించినట్లైతే ఆవిడ కరుణామయి కాబట్టి రాగం అనే పాశం మనపైకి రాకుండా ఉంటుందని భావన చేయటం ఉచితంగా ఉంటుంది.

6, మార్చి 2019, బుధవారం

7. చతుర్బాహుసమన్వితా


ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా॥

అమ్మకు నాలుగు బాహువులున్నాయని ఈ చరుర్బాహు సమన్వితా అన్న నామం తెలియ జేస్తోంది.

ఈ చరుర్భాహువులు అన్న చోట ఉన్న నాలుగు సంఖ్య కొందరి మతం ప్రకారం అంతఃకరణ చతుష్టయాన్ని సూచిస్తోంది. అంతఃకరణ చతుష్టయం అంటే మనస్సు, బుధ్ధి, చిత్తము అహంకారము అనేవి.

మనస్సు అనేది వాయుతత్త్వం కలది. అందువల్ల గాలిలాగే నిత్యం చలిస్తూ సంకల్పాలూ వికల్పాలూ చేస్తూ ఉంటుంది. బుధ్ధి అనేది అనితత్త్వం కలది. మంచి చెడులను విశ్లేషించటం దీని లక్షణం. చిత్తం అనేది జలం యొక్క అంశ కలది ఆలోచనలను ప్రచోదింప చేస్తుంది. అహంకారం భూతత్త్వం కలది. నేను నాది అన్న అభిమానానికి మూలం. శ్రీదేవి యొక్క నిర్గుణ రూపంలో ఈ నాలుగూ ఆవిడ బాహువులుగా ఒక భావన.

మరికొందరి ఆలోచనలో నాలుగు బాహువు లంటే అవి ధర్మార్థకామమోక్షాలనే నాలుగు పురుషార్థాలకూ ప్రతీకలు. అంటే అమ్మ పురుషార్థములను సాధకులకు అనుగ్రహించుతూ ఉన్నదని భావన.

అమ్మ నాలుగు బాహువులతో నాలుగు వేదాలనూ ధరించినది అన్న భావన కూడా ఉన్నది.

ఇంకా నాలుగు బాహువు లంటే సాధనాచతుష్టయంగానూ నాలుగు ఆశ్రమాలుగానూ భావన చేయటమూ ఉన్నది.

మరొక విధంగా భావన చేస్తే, శ్రీదేవీ సూక్ష్మరూపం ఐన శ్రీవిద్యా పంచదశాక్షరీ మంత్రానికి కాది హాది విద్యల సమ్మేళనం చతుష్కూటం - అవే శ్రీదేవి బాహువులు అని. అనగా కఏఈల-హసకల-హసకహల-సకల అనే నాలుగు అక్షర కూటములు.

ఇంకొక విధంగా నాలుగు బాహువులతోనూ అమ్మ నాలుగు దిక్కులనూ శాసిస్తున్నది అని ఒక భావన చేయవచ్చును.

అలాగే ఈ నాలుగు బాహువులనూ జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలనూ లేదా స్థూల, సూక్ష్మ, కారణ, తురీయ దేహాలనూ సూచించటమూ కూడ కద్దు.

బాహృ యత్నే అన్న ధాతువు కారణంగా బాహువులు ప్రయత్న సూచకాలు. అమ్మ ఇక్కడు ముఖ్యంగా దేవకార్యం తీర్చటానికి ఆవిర్భవించుతున్నది. దేవతలకు అసాధ్యమైన కార్యాన్ని నెరవేర్చటానికి అవసరమైన అనుపమ మైన ప్రతాపం ప్రదర్శించేవి నాలుగుబాహువులుగా సూచన. అమ్మ బాహువులు ఆయుధధారణ చేసి ఉన్నాయి. దుష్టశిక్షణాకార్యం కొరకు వచ్చింది కదా మరి!

ఒక గమనిక ఏమిటంటే అమ్మ బాహువుల యందు వరద ముద్ర, అభయ ముద్ర చెప్పబడవు! అమ్మ పాదాలే అందుకు చాలు.భయా త్రాతుం దాతుం ఫలమపిచ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ అని సౌందర్య లహరిలో ఈ విషయం స్పష్టంగా ఉన్నది. అంటే భయాల నుండి రక్షించేందుకూ అడిగినవి దండిగా అనుగ్రహించేందుకూ అమ్మ పాదాలే మంచి నేర్పు కలిగినవి అని అర్థం.

3, మార్చి 2019, ఆదివారం

6. ఉద్యద్భానుసహస్రాభా


ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా।
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా॥ 2

భానుడు అంటే సూర్యుడు.  ఉద్యత్ అంటే పైకి వస్తున్న, ఉదయిస్తున్న అని అర్థం.  ఉద్యత్+భానుడు --> ఉద్యద్భానుడు.  అందుచేత ఉద్యద్భానుడు అంటే ఉదయిస్తున్న సూర్యుడు. ఉదయిస్తున్న సూర్యబింబం అరుణవర్ణంతో చాలా మనోహరంగా ఉంటుంది.

సహస్రం అన్న పదానికి సామాన్యార్థం వేయి అని.  విశేషంగా అనేకానేక అని చెప్పటానికి కూడా సహస్రం అన్న పదాన్ని వాడుతూ ఉంటారు. అలాంటిదే కోటి అనే పదమున్నూ. కోటి అంటే వందలక్షలు అనే కాక సమూహం అని అర్థం కూడా ఉంది. సందర్భాన్ని అనుసరించి సరైన విధంగా అర్థం చేసుకోవాలి.

సహస్ర + ఆభ --> సహస్రాభ. ఇక్కడ ఆభ అనే ఉపసర్గను పోలిక చెప్పటానికి వాడతారు.

అందుచేత మొత్తానికి ఉద్యత్ + భాను + సహస్ర + ఆభ --> ఉద్యద్భానుసహస్రాభ అంటే ఉదయిస్తున్న వేయి మంది సూర్యబింబాలతో పోలి ఉన్నది అని అర్థం. ఈ పోలిక దేనితో అంటే అరుణిమలో అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయసూర్యుడిలోని విశేషమైన లక్షణం అరుణిమయే కదా.

కాబట్టి అమ్మ ఆవిర్భావం ఎలా ఉన్నదీ అంటే వేయిమంది బాలసూర్యుల యొక్క అరుణప్రకాశంతో పోలిన వెలుగును కలిగి ఉన్నది అని చెప్పటం.

కాని శాస్త్రప్రకారం ఇలా చెప్పకూడదు. భానూనాం సహస్రం కిరణం యస్య అన్న వ్యుత్పత్తి ప్రకారం ఒక్క సూర్యుణ్ణే చెప్పాలి.

బ్రహ్మాండపురాణంలోని

ప్రాదుర్భభూవ పరమం తేజఃపుంజమయమ్ మహత్
కోటి సూర్యప్రతీకాశం చంద్రకోటి సుశీతలమ్

అని చెప్పిన దానికి విరోధం కలగ కూడదు.

భాను శబ్దానికి సూర్యుడు అనే కాక కిరణం అనే అర్థం కూడా ఉందని మనం గమనించితే అన్వయం సుభగంగా ఉంటుంది.

కాబట్టి ఇక్కడ వేయి అంటే అనేకానేక లేదా అనంత మైన అని అర్థం గ్రహించి  అనంతమైన అరుణకిరణాలతో ఉదయిస్తున్న సూర్యుడితో సమానమైన అరుణప్రభ అనే చెప్పుకోవాలి.

స్వతంత్రతంత్రమనే విద్యాగ్రంథంలో

స్వాత్వైవ దేవతా ప్రోక్తా లలితా విశ్వవిగ్రహాః
లౌలిత్యం తద్విమర్శః స్వాదుప్రాప్తి రితి భావయేత్

పరమాత్మయే దేవతా మూర్తి. ఆదేవతా మూర్తియే లలితదేవి. ఆవిడ విశ్వరూపము కలిగినది. అమె రక్తవర్ణమే విమర్శస్వరూపము. దీనిని చక్కగా భావించటమే ఉపాసనా విధానం అని పై శ్లోకానికి అర్థం. (ఇక్కడ విమర్శ అనేది సాంకేతికపదం)

వామకేశ్వర తంత్రంలో కూడా

స్వయం హి త్రిపురాదేవీ లౌలిత్యం తద్విమర్శనమ్

లలితా దేవి ఎఱ్ఱని వర్ణం కలిగి ఉంది. అది విమర్శారూపం అని పై వాక్యానికి అర్థం

అమ్మవారికి మూడు రూపాలు. స్థూలము, సూక్ష్మము, పరమము అని. కరచరణాలతో ఉండేది స్థూల రూపం. మంత్రమయమైన రూపం సూక్ష్మరూపం. వాసనాత్మకం పరస్వరూపం.

ఈ నామం ఉద్యద్భానుసహస్రాభా నుండి స్వాధీనవల్లభా అనే నామం దాకా అమ్మ యొక్క స్థూలస్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ఇదే విమర్శారూపం.

శ్రీమత్సింహాసనాసీన ఐన అమ్మయొక్క స్థూల (విమర్శా) రూపాన్ని  ధ్యానం చేయటం వలన మనస్సుకు ఏకాగ్రత సిధ్ధిస్తుంది.

ఈ విమర్శారూప వర్ణనలో ముందుగా శ్రీదేవి యొక్క తేజస్సును వర్ణించటం జరిగింది ఈ నామంతో.

ఉదయించే సూర్యుడు చీకటిని పారద్రోలి వెలుగును తీసుకొని వస్తున్నాడు.  చీకటి దుఃఖానికి సంకేతం. ఇక్కడ దేవతలు దుఃఖాకులిత చిత్తులై ఉన్నారు. వారి దైన్యం అనే చీకటిని పోగొట్టే బాలసూర్యుడివలె అమ్మ అహ్లాదకరమైన అరుణవర్ణతేజోవిరాజమానమూర్తిగా అవతరించింది అని తాత్పర్యం.

ఉదయించే సూర్యుడు సమస్త జీవులకు ఎలా అహ్లాదాన్ని కలిగిస్తున్నాడో అలాగే అమ్మ ఆవిర్భావం సమస్త దేవతాగణాలకూ అనందోత్సాహాలు కలిగించినది అని మనం అర్థం చేసుకోవాలి.

ఈ సందర్భంగా మనం నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా  సర్వారుణా అనే నామాల వివరణను కూడా పర్యావలోకనం చేసుకొనవలసి ఉంది.