30, ఏప్రిల్ 2019, మంగళవారం

20. తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా


నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా 7

అమ్మ నాసికను గురించి వశిన్యాదులు సెలవిస్తున్నారు. నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా అన్న నామంతో అమ్మ ముక్కుదూలం అప్పుడే విచ్చుకుంటున్న సంపంగిపూవు లాగా ఉందని చెప్పారు.

ఈ తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా అన్న నామంలో అమ్మ పెట్టుకున్న ముక్కుపుడక గురించి చెబుతున్నారు. ఈ నామంలో ఉన్న నాసాభరణం అన్న మాటకు ముక్కుపుడక అని అర్థం. దానినే అడ్డబాస అనీ బులాకీ అనీ కూడా అంటూ ఉంటారు.

ఈ అడ్డబాసను ఎలా తయారు చేస్తారంటే దానిలో పైన మాణిక్యం ఉంటుంది, క్రింది భాగంలో మంచిముత్యం వ్రేలాడుతూ ఉంటుంది.

ఈ నాసాభరణం ఎట్లా ఉందీ అంటే అది తారాకాంతిని తిరస్కరిస్తోందట. అవును మరి అమ్మ అలాంటి ఇలాంటి ముక్కుపుడక ఎందుకు పెట్టుకుంటుందీ? ఆ ముక్కుపుడక ఎంతలా ప్రకాశిస్తోందీ అంటే దాని వెలుగు జిలుగుల ముందు నక్షత్రాల తళుకుబెళుకులు బలాదూరు అంటున్నారు!

అలాంటి తారాకాంతి తిరస్కారి ఐన నాసాభరణం ధరించి అమ్మ చాలా భాసురంగా ఉన్నదట. భా అంటే కాంతి. అమ్మ భాసురంగా ఉండేందుకు ఆ ముక్కు పుడక అనేది కొంత దోహదకారి అని తాత్పర్యం తీసుకుందామా? అదంత ఉచితంగా అనిపించదు నాకు. మరెలా అన్వయం అని ప్రశ్న వస్తుంది. అమ్మ సహజంగానే వెలుగులకే వెలుగు. ఆ వెలుగుల్లో అవిడ ముక్కుపుడక యొక్క వెలుగు భాసురంగా అంటే ప్రస్ఫుటంగా ఉండి తారకల యొక్క కాంతినే ధిక్కరిస్తున్నది అని చెప్పుకోవాలి మనం.

ఈ తారాకాంతి అన్నప్పుడు మనం తారకలు అనగా నక్షత్రాల యొక్క కాంతి అని చెప్పుకున్నప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రసమాహారం అంతటినీ చెబుతున్నాం. అలా చెప్పటం సహజంగానూ సొగసుగానూ ఉంది నిజమే.

కొందరు తారా అని చెప్పబడినవి రెండు తారలు అని అభిప్రాయ పడ్డారు. అవి శుక్రతార, కుజతార అన్నవి. నిజానికి ఇవి రెండూ శుక్ర మంగళ గ్రహాలు కాని తారలు కావు. జ్యోతిష సంప్రదాయంలో పంచతారాగ్రహాలు అని సూర్యచంద్రులని మినహాయించి మిగిలిన వారగ్రహాలైన కుజ, గురు, శని, బుధ, శుక్ర గ్ర్తహాలను చెప్పటం ఆనవాయితీ. అలా ఎందుకూ అంటే అవి ఆకాశంలో తారలవలె చాలా చిన్నగా ప్రకాశిస్తూ కనిపిస్తాయి కాబట్టి. జాగ్రత్తగా గమనిస్తే ఈ తారాగ్రహాలు దృష్టికి ఆనిన సందర్భాల్లో అవి చాలా ప్రకాశంతో ఉంటాయి. పైగా అవి నక్షత్రాల్లాగా మిణిక్కు మిణుక్కు మనవు. ఆకారణంగా వాటి కాంతి మరింత స్ఫుటంగా కూడా ఉంటుంది.

జాతకపధ్ధతిలో, అందులోనూ ముఖ్యంగా స్త్రీ జాతక విషయంగా మంగళ శుక్ర గ్రహాలకు ఉన్న ప్రాముఖ్యత అందరరికీ తెలిసిందే.

ఇక్కడ ధరించిన బులాకీలో మణిపూసల్లాగా ఉన్నవి ఈ రెండు తారలూ అని తాత్పర్యం. ముక్కుకు రెండువైపులకూ రెండు మణులు ఆ బులాకీలో ఆభరణవిశేషంగా ఉన్నాయి అని కొందరు అభిప్రాయ పడ వచ్చును కాని బులాకీలలో ఇందాక చెప్పినట్లు మాణిక్యమూ దాని క్రింద ముత్యమూ ఉండటమే సాధారణం.

వాటిలో ఒకటి మంగళతార అన్నాం కదా, అది రక్త బిందు వర్ణ సంకేతం. అంటే ఎఱ్ఱనిది. అది పగడపు మణి వంటిది. మరొకటి శుక్రతార అన్నాం కదా, శుక్ల బిందు వర్ణసంకేతం. అంటే స్వఛ్ఛమైన తెల్లని రంగుది. అది వజ్రము వంటిది. ఈ రక్తశుక్ల బిందువుల వర్ణ సమ్మేళనాన్ని ఇక్కడ మనం రక్త శుక్ల బిందువుల మేళనంగా భావించాలి. ఈ మిశ్రబిందువునే అహం అంటారు. ఈ నాసాభరణం సౌమంగళ్య సూచకం.

మరొక విధమైన అన్వయం ప్రకారం సంసారాత్ తారయతి ఇతి తారం. సంసారచక్రమునుండి తరింప జేయునది కాబట్టి తారం. తారం యొక్క భాసురత్వం అనగా వెలుగు జ్యోతిర్మయత్వం అన్నది తారాకాంతిగా ఇక్కడ చెప్పబడింది. అటువంటి వెలుగును త్రోసిరాజంటున్నది అమ్మ ముక్కెర అని సూచన. అనగా ముక్కెరకు శోభ అమ్మ ధరించటం వలన వచ్చినది. ఆవిడ స్వయంగా పరభ్రహ్మ స్వరూపిణి. ముక్కెరవెలుగులు సూచించే పరబ్రహ్మ స్వరూపానికే అలంబనమైనది అమ్మ కాబట్టి తారకమైన జ్యోతుల ద్వారా సూచితమైన వెలుగు యొక్క సాధారణత్వాన్ని దాటి అమ్మ యొక్క శోభ ప్రకాశిస్తున్నది. అమ్మ శోభలో ఆవిడ ముక్కెరశోభ ఒక భాగం.

తారః అనగా తరింపచేయునది. అంటే ఆమాటకు అర్థం ప్రణవం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ. తస్య వాచకః ప్రణవః అని కదా. అమ్మ యొక్క ఆకారశోభ ఆ ప్రణవశోభను మించి ఉన్నది. అలా చేయటానికి ఆవిడ నాసాభరణం ఒక నిమిత్తం.

శంకరభగవత్పాదులు సౌందర్యలహరీ స్తోత్రంలో

అసౌ నాశా వంశ ,స్తుహిన గిరి వంశాధ్వజ పటి
త్వదీయో ,నేదేయః ఫలతు ఫల మాస్మాక ముచితం
వహత్యంత ర్ముక్తా ,శ్శిశిర కర ,నిశ్వాస ,గలితం
సంరుద్ధ్యా యత్తాసాం ,బహిరపి ,సముక్తా మణిధరః

అని అమ్మ నాసాదండాన్ని ప్రస్తుతించారు. అమ్మా నీ నాసాదండం మాకూ మా వాళ్ళకూ కోరికలు తీర్చుగాక. నీ నాసాదండంలో ముత్యాలున్నాయి. నీ ఎడమ నాసిక నుండి వచ్చే గాలి వలన కూడా ముక్కు అంచున ముక్తామణులను ధరించినట్లు ప్రకాశిస్తున్నావు అని అంటున్నా రందులో.

తంజావూరును పాలించిన విజయరాఘవ నాయకుడికి ఒక గొప్ప నియమం ఉండింది.  అమ్మవారికి నివేదన జరిగి, ఆపైన బ్రాహ్మణసమారాధనం జరిగిన తరువాత కాని ఆయన భోజనానికి లేచే వాడు కాదు.

ఇది ఇలా ఉండగా, భగవంతుడి పరీక్ష కారణంగానా అన్నట్లుగా ఒకవారం పాటు విపరీతమైన వానల కారణంగా వంటచెఱకుకు ఎంతో ఇబ్బంది కలిగింది. చివరకు ఒక నాటికి అన్నీ పచ్చికట్టెలై వంట కుదిరే సావకాశమే లేకపోయింది.

అప్పుడు ఎక్కడినుండి వచ్చిందో ఒక పెద్దావిడ, ఆ పచ్చి కట్టెలనే ఉపయోగించి నేర్పుగా వంట చేసింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. విజయరాఘవ నాయక మహారాజు గారి నియమం భగ్నం కాకుండా దైవమే రక్షించినట్లైనది.

ఇది జరిగిన మరునాడు శ్రీరంగంలో గొప్ప అలజడి రేగింది. శ్రీరంగనాయకీ దేవిగా ఉన్న అమ్మ ముక్కెర హఠాత్తుగా అదృశ్యం ఐనది. అర్చకులు కొయ్యబారిపోయారు. అందరూ రాజదండనకు భయడుతున్న ఆ సమయంలో అమ్మ ఒక పెద్దముత్తైదువ ముఖంగా తన ముక్కెర  ఎక్కడ ఉన్నదో సెలవిచ్చింది. అది తంజావూరు విజయరాఘవ నాయక మహారాజుగారి వంటశాలలో ఒక చోట బూడిద కుప్పలో పడి ఉన్నదీ అని.

ఈ వార్త తంజావూరికి చేరి మహారాజు గారు స్వయంగా వెదకి బూడిద కుప్పలో దేదీప్యమానంగా వెలుగులీనుతున్న అమ్మ ముక్కెరను కనుకొని ఆనందాశ్చర్యపరవశు డైనా డట. ఆ ముక్కెరను అలంకరించిన పల్లకీలో ఉంచి స్వయంగా మోస్తూ దాన్ని శ్రీరంగం కొనిపోయి సమర్పించాడని ఐతిహ్యం.

కన్యాకుమారి అని ప్రసిధ్ధమైన క్షేత్రం ఒకటి ఉంది దక్షిణదేశంలో. ఆక్షేత్రంలో అమ్మ పార్వతీ దేవిగా కొలువై ఉంది. అక్కడ అమ్మ చేతిలో ఒక మణిమాలను ధరించి ఉంటుంది. ఆ అమ్మకు ఉన్న ముక్కెర చాలా విశేషమైన ఖ్యాతి కలది. అమ్మ ముక్కెర వెలుగులు సముద్రంలోనికి కూడా చక్కగా ప్రసరించేవట దేదీప్యమానంగా. ఆ వెలుగులకు అటు ఎదురుగా వచ్చే నావలను నడిపే వారికి కళ్ళు మిరుమిట్లు గొలిపేవట. దానితో వాళ్ళ కళ్ళు చెదరటం కారణంగా వారి నౌకలు అడ్డదిడ్దంగా పోయి రేవులో తీరాన ఉన్న బండరాళ్ళకు ఢీకొట్టుకొని ముక్కలైపోయేవని చెప్పుకుంటారు. అందుకే సముద్రాభిముఖంగా ఉన్న అమ్మ అలయం ఉత్తరద్వారాన్ని మూసి ఉంచుతారట. ఆద్వారాన్ని కేవలం ఉత్సవసమయాల్లో మాత్రమే తెరుస్తారట. దీన్ని బట్టి అమ్మ ముక్కెర ప్రకాశం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవలసిందే కదా. 

29, ఏప్రిల్ 2019, సోమవారం

19. నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా


నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా  7

ఈ నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా అన్న నామం అమ్మ నాసికను గురించి. నాసిక అంటే తెలుసును కదా ముక్కు.

వశిన్యాదులు అమ్మ ముఖశోభను వర్ణిస్తున్నారు కదా.  ముక్కు అనేది ముఖం మధ్యలో ఉంటుందాయెను. దాని గొప్పను గురించి చెప్పకపోతే ఎలా మరి?

ఈ నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా  అన్న నామంలో చంపకం అనే శబ్దం ఒకటి వచ్చింది. ఈ చంపకం అన్న సంస్కృతపదానికి అర్థం సంపంగి. అందుచేత చంపకపుష్పం అంటే సంపంగి పువ్వు. ఈ సంపంగి పువ్వు అలాంటిలాంటిది కాదుట అది నవం అంటే అప్పుడే వికసించినది. సంస్కృతంలో సంపెంగను గంధఫలి అని కూడా అంటారు.

మనకు నవనీతము అన్న మాట బాగానే తెలుసును. బాలకృష్ణుణ్ణి నవనీతచోరుడు అని ముద్దుగా పిలుస్తూ ఉంటాం కదా.  నవనీతం అంటె ఏమిటీ అంటే మనవాళ్ళలో చాలామంది వెన్న అని చెబుతారు. కాని నిజానికి ఆమాటకు అర్థం అప్పుడే చల్లచిలికి తీసిన వెన్న అని అర్థం.

అలాగే ఇక్క నవచంపకపుష్పం అంటే అప్పుడే వికసించిన సంపెంగపూవు అని అర్థం. అంటే ఆ సంపెంగపూవు కొద్దిగా వికసించింది. ఇంకా వికాసం పొందుతూనే ఉంది. అటువంటిది.

ఈ నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా  అన్న నామంలో నాసాదండం యొక్క ప్రశస్తిని గురించి చెబుతున్నారు. నాసిక అంటే ముక్కు కదా. మరి నాసాదండం అంటే - ముక్కుదూలం అన్న మాట.

మొన్నమొన్ననే ముఖచంద్రకళంకాభమృగనాభవిశేషకా అన్న నామం చదువుకున్నాం అక్కడ కళంకాభం అంటే కళంకం వంటిది అని చెప్పటానికి వాడినట్లే ఇక్కడ కూడా అభము అన్న శబ్దం వాడారు. నవచంపకపుష్పాభం అన్నప్పుడు.  అంటే అమ్మ ముక్కుదూలం అప్పుడే కొద్దిగా విరిసిన సంపెంగ పూవులాగా ఉంది అని చెప్పారన్న మాట.

ముక్కును సంపెంగపూవుతో పోల్చటం కవులకు పరిపాటే.  చాలా ప్రసిధ్ధికి ఎక్కిన ఈ పద్యం చూడండి.

నానాసూన వితానవాసనల నానందించు సారంగ మే
లా నన్నొల్ల దఁటంచు గంధఫలి బల్కాలం దపం బంది యో
షా నాసాకృతిఁ దాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసి యై
పూనెం బ్రేక్షణమాలికా మధుకర పుంజంబు లిర్వంకలన్

ఈ పద్యం తెలుగు ప్రభంధకావ్యాల్లో పారిజాతాపహరణం అన్న నంది తిమ్మన్న గారు వ్రాసిన కావ్యం లోనిదని చాలా మంది పొరబడుతూ ఉంటారు. అంతే కాదు, ఈ పద్యం వల్లనే నంది తిమ్మన్న గారికి ముక్కు తిమ్మన్న అన్న పేరు వచ్చింది అని కూడా చెబుతూ ఉంటారు.

కాని ఇది రామరాజభూషణుడు అనే కవిగారి అద్భుతప్రబంధ కావ్యం వసుచరిత్ర లోనిది. ఐతే ఒక చాటు కథ ప్రకారం నంది తిమ్మన్న గారి దగ్గరనుండి నాలుగువేల వరహాలకు రామరాజభూషణుడు ఈ పద్యం కొనుక్కున్నాడట! పిచ్చికథ. ఇద్ధరి కాలాలూ వేరువేరు.

ఈ పద్యానికి సంస్కృత మూలం ఉంది. అది ప్రతాపరుద్రచక్రవర్తి ఆస్థానంలోని విద్యానాథుడు అనే కవి వ్రాసిన నలకీర్తికౌముది అన్న సంస్కృత కావ్యంలోని

భృంగానవాస్తి ప్రతిపన్నఖేదా
కృత్వాననే గంధఫలీ తప:ఫలమ్
తన్నాసికా భూ దనుభూతగంధా
పార్శ్వనేత్రీకృతభృంగసేవ్యా

నిజానికి ముక్కును సంపెంగతో పోల్చటం ఇంకా కొన్ని శతాబ్దాలకు ముందే నన్నెచోడుడు చేసాడు చూడండి కుమారసంభవంలో

చం. జలజము సావి కోకములు షట్పదముల్ పఱతెంచి తద్దయున్
నలి వినుతాస్యమండలము నాసికయున్ శశిబింబ చంపకం
బులు సవి డాయనొల్ల కతి మోహమునం బెడఁబాయనోప కా
కులమతి నున్న భంగిఁ గుచకుంతలవక్త్రము లొప్పు గౌరికిన్

పార్వతీ అమ్మవారి ముఖాన్ని చూచి పద్మం అని భ్రమించి చక్రవాకపక్షులూ తుమ్మెదలూ దగ్గరకు వస్తున్నాయట.  దగ్గరకు రాగానే వాటికి అమ్మ ముఖకాంతి వెన్నెలలాగానూ అమ్మ నాసిక చంపకపుష్పం లాగానూ కనిపించిందట, సరిసరి ఈ చక్రవాకాలకు వెన్నెల నచ్చదు. ఆ తుమ్మెదలకు సంపంగి అంటే కిట్టదు. పద్మమని చేరాలో మానాలో తేల్చుకోలేక గడబిడ పడుతున్నాయట అవి.  అన్నట్లు ఈ పద్యం చంపకమాల అన్న ఛందస్సులో ఉంది చూడండి!

చూసారా కవులు ఎంత గమ్మత్తుగా ముక్కును సంపెంగను చేసి పద్యాలను చెప్తున్నారో.

ఇదంతా ఎందుకు తడుముకున్నాం అంటే స్త్రీల నాసికను కవులు సంపెంగ పూవుతో పోల్చటం ప్రసిధ్ధం అని ఒకసారి చెప్పుకుందుకు మాత్రమే.

అమ్మ శ్రీదేవి చిదగ్నికుండంలో దేవతల అంశలను అన్నింటినీ అంగీకరిస్తూ ఆవిర్భవించింది. అప్పుడు ఆవిడ నాసికగా వెలసినది కుబేరాంశ.

మంత్రశాస్త్రపరంగా బహిర్మాతృకా న్యాసంలో ఋ ౠ అన్నవి ఎడమ కుడి నాసికలకు బీజాలు.

అజపా మంత్రం అని చెప్పబడే హంసమంత్రానికి సాధనోపకరణం నాసిక. అమ్మ నాసికకు గంధఫలి అనగా సంపెంగకు అది కూడా అప్పుడే కొంచెంగా వికసించిన సంపెంగపూవుతో సామ్యం. వాసనలను గ్రహించేది నాసిక. అజపాసాధనవలన సమస్త వాసనలనూ విలీనం చేసుకొనే సాధనోపకరణం నాసికను ఇక్కడ గంధఫలితో పోల్చటం సముచితం.

నవ అంటే ప్రణవ సూచకం. అజపాసాధనలో ఉఛ్వాసనిశ్వాసాలు సోహం అనే హంసమంత్రం. ఈ సంపెంగ పూవు రేకులు స హ అనే వర్ణాలు. ప్రణవనాదమే పరీమళం అని కొందరి అభిప్రాయం.


25, ఏప్రిల్ 2019, గురువారం

18. వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా


వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా। 6

వశిన్యాదులకు అమ్మ ముఖారవిందాన్ని గురించి ఎన్ని విధాలుగా చెప్పినా తనివి తీరదు కదా.

ఇప్పుడు అమ్మ ముఖాన్ని లక్ష్మీపరీవాహం అంటున్నారు. పరీవాహం అన్నా పరివాహం అన్నా ఒకటే. ఆమాటుకు తెలుగు సమానార్థప్రతిబోధక మైన  మాట అలుగు అని. మనం ఇక్కడ జలప్రవాహం అని గ్రహిస్తే సరిపోతుంది. అదీ ఎటువంటి పరీవాహం? లక్ష్మీ శబ్దం చేత అమ్మ ముఖం యొక్క సౌందర్యశోభను చెబుతున్నారు.

అందుచేత వక్త్రలక్ష్మీపరీవాహం అంటే అమ్మ ముఖకాంతి అనే ఒక జలప్రవాహం అని అర్థం. ఐతే ముఖాన్ని ప్రవాహంతో పోల్చటం కొంచెం వింతగానే అనిపిస్తుంది.

సరే ఈ నామంలో ఉన్న ఇతర శబ్దా లనూ పరిశీలించాక ఇంకా ఏమి బోధపడుతుందో చూదాం.

ఈ వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా అన్న నామంలో మిగిలిన భాగం  చలన్మీనాభలోచనా అని.  ఇందులో చివరి భాగం మీనాభలోచనా అని.  సంబోధనగా చివర్న ఆ కారం ఉన్నది సరే. అదటుంచుదాం  ఆభము అంటే పోలిక కలిగిన అని అర్థం.  మీనాభము అంటే మీనము(ల)తో పోల్చదగిన అని అర్థం.  అందుచేత మీనాభలోచన అంటే చేపలతో పోల్చదగిన కళ్ళుకలది అని అమ్మవారిని ఇక్కడ వశిన్యాదులు సంబోధిస్తున్నారు.

మనకు చప్పున గుర్తుకు వస్తుంది కదా. అమ్మకు  మీనాక్షి అని ప్రసిధ్ధమైన పేరు ఉండనే ఉంది.  దక్షిణదేశంలో మథురానగరంలో మీనాక్షి అన్న పేరుతో అమ్మ కొలువై ఉంటుంది.

ఇంకా వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా అన్న నామంలో 'చలత్' అన్న మాటొకటి ఉంది. చలత్ + మీనాభలోచనా -> చలన్మీనాభలోచనా అని సంధి కార్యం.  ఈ చలత్ అన్న దానికి అర్థం చలిస్తూ ఉన్న అని. సులభంగానే ఉన్నది కదా.

చలన్మీనములు అంటే కదులాడుతూ ఉన్న చేపలు అని తాత్పర్యం.

మగవాడు అని చెప్పేందుకు ఆట్టే మాటలు కనిపించవు కాని స్త్రీ అని చెప్పటానికి మాత్రం భాషలో కొల్లలుకొల్లలుగా మాటలున్నాయి. తెలుగులోనూ సంస్కృతంలోనూ కూడా.

తరళేక్షణ, తరళాక్షి, లోలాక్షి, చంచలాక్షి అన్నమాటలు స్త్రీ అన్న మాటకు పర్యాయపదాలు. వీటి అన్నింటి భావమూ కదులుతున్న కళ్ళు కలది అనే. ఒకకవి ఐతే భీతహరిణేక్షణ అన్నాడు. అంటే అవిడ కళ్ళు బెదిరిన లేడి కళ్ళలాగా అటూ ఇటూ కదులుతున్నాయని అనటం.

పిండితార్థం ఏమిటంటే ఆడవాళ్ళ కళ్ళు రెపరెపలాడుతూ ఉంటాయి. అదొక అందం. అలా ఎందుకూ అంటే సహజంగా వారు తమ పరిసరాలు సురక్షితమేనా అన్న విషయంలో సహజంగా అత్యంత జాగరూకతతో ఉంటారు కాబట్టి అనుకోవాలి.

ఇప్పుడు మొత్తం నామం యొక్క అర్థం చూదాం. ముఖకాంతి అనే జలప్రవాహంలో చలిస్తూ ఉన్న చేపల వలె ఉన్న కన్నులు కల తల్లీ అని అమ్మను వశిన్యాదులు సంబోధిస్తున్నారు.

ఇక్కడ అమ్మను మీనాభలోచనా అని చెప్పి మీనాక్షీ స్వరూపాన్ని స్మరించటం జరిగింది. మీనాక్షి అమ్మవారు కరుణాసముద్ర. శంకరభగత్పాదులు మీనాక్ష్మీం ప్రణతోస్మి సంతత మహం కారుణ్యవారాన్నిధిం అని అన్నారు. మీనాక్షి అమ్మవారు కరుణ అనే జలరాశి అని. ఇక్కడ వశిన్యాదులు అమ్మముఖం అనే లక్ష్మీప్రదమైన జలరాశి అన్నారు.

అమ్మ చిదగ్నికుండంలో ఉద్భవించినప్పుడు, అగ్నిదేవుడి తేజస్సు ఆవిడకు కన్నులుగా అమరింది. మంత్రశాస్త్రపరంగా కుడి, ఎడమ కనులకు ఇకారం, ఈకారం న్యాసాక్షరాలు.

సంప్రదాయంలో మీనముల గురించి ఒకమాట చెప్తారు. అన్యోన్యసంయోగం అవసరం లేకుండా పరస్పర వీక్షణం వలననే అవి సంతానాన్ని పొందుతాయని. వాటిని పోషించటం కూడా కేవలం వీక్షణం చేతనే అని.

వీక్షణం చేతనే సమస్తాన్నీ సంతానానికి అనుగ్రహించే శక్తి మీనజాతికి ఉందన్న సంగతిని పురస్కరించుకొనే అమ్మ కళ్ళు మీనాలనటం. అనగా అమ్మ కూడా కేవలం అనుగ్రహ వీక్షణం ద్వారానే తన సంతతి ఐన సమస్త జీవరాశినీ పోషిస్తున్నది అని సూచన.

24, ఏప్రిల్ 2019, బుధవారం

17. వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా


వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా।  6

వెనుక 16వ నామంలో వశిన్యాదులు అమ్మ ముఖాన్ని పూర్ణచంద్రబింబంతో పోల్చి చెప్పారు. ఆ చంద్రబింబంలో మచ్చ వలె అమ్మ కస్తూరీతిలకం శోభిస్తోందీ అని.

ఈ 17వ నామం ఐన వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా అనే దానిలో మరొక విధంగా పోలుస్తున్నారు చూడండి.

వదనం అంటే తెలిసిందే కదా ముఖం అని అర్థం. మాంగళ్యగృహం అట అమ్మ ముఖం.  మంగళగృహం అనే మాటే పరమమనోహరంగా ఉంది కదూ. ఏ ఇంట సమస్త శుభాలూ నెలకొని ఉన్నాయో అది కదా మంగళగృహం అయ్యేది. అమ్మ ముఖమే సమస్త శుభాలకూ నిలయం అనటంలో సందేహం ఏమీ ఉండదు. అమ్మ స్ఫురణకు రాగానే ఆవిడ ప్రసన్నముఖారవిందం స్ఫురణకు వస్తుంది. ఆ కరుణాపూరితమైన ముఖాన్ని ధ్యానించే వారికి సమస్త మంగళాలూ నిత్యం కలుగుతూనే ఉంటాయి అనటంలో ఎంత మాత్రం మనకు సందేహం అక్కర లేదు కదా.

ఇక్కడ వశిన్యాదులు ఒక చిత్రమైన కల్పన చేస్తున్నారు. అమ్మ ముఖం మన్మథుడు అనే పెద్దమనిషి యొక్క మంగళగృహం అట. అందుకే దాన్ని వారు వదనస్మరమాంగళ్యగృహం అనగా మదనుడి యొక్క మంగళగృహం ఐన వదనం అంటున్నారు.

ఈ నామం చివర చిల్లికా అని ఒక శబ్దం ఉంది. చిల్లిక అంటే కనుబొమలతో ఏర్పడిన భ్రూలత. నామకల్పద్రుమం అనే గ్రంథంలో చిల్లికా అన్న శబ్దానికి  చిల్లికా భ్రూలతా యస్యాః అని చెప్పారు. లలితాస్తవరత్నం అనే దానిలో కూడా అభుగ్న మసృణ చిల్లి అని ప్రయోగం ఉంది.

ఈ చిల్లికా అన్నది ఎందుకు వచ్చిందయ్యా నామంలో అన్నది చూదాం. వదనస్మరమాంగళ్యగృహం అన్నది తెలుసుకున్నాం. అలా అమ్మ ముఖారవిందాన్ని మన్మథుడి యొక్క మంగళగృహంగా చెప్పటం జరిగింది.

ఈ నామం వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా  లో అంటూ ఆ గృహం యొక్క తోరణాల ప్రసక్తి చేసారు.  ఆ మంగళగృహం యొక్క తోరణాలు అమ్మ చిల్లిక అంటున్నారు.

అంటే అమ్మ ముఖారవిందమే మన్మథుడి యొక్క మంగళగృహం.
అమ్మ ముఖంలోని కనుబొమలు ఉన్నాయే అవి ఆ మంగళగృహానికి తోరణాల్లాగ ఉన్నాయి అని అంటున్నారు!

గృహతోరణాలు అంటే ఇంటి ముఖద్వారానికి కట్టిన మంగళతోరణాలు అన్న మాట.

అమ్మ ఆవిర్భవించిన వేళ, పూర్వ, అపర సంధ్యలే అమ్మ యొక్క కనుబొమలు అయ్యాయి.  పూర్వ సంధ్య అంటే ఉదయ సంధ్య, అపరసంధ్య అంటే సాయంసంధ్య.

ఇక్కడ ఒక మంత్ర శాస్త్ర విశేషం ఉంది. వదనం ఐం బీజం, స్మర అనగా మన్మథ బీజం క్లీం (దీనినే కామరాజబీజం అనీ అంటారు).  మాంగల్య సౌః అనే బీజం. గృహం శ్రీం, తోరణ హ్రీః  ఇవీ ఈ నామంలో నిక్షిప్తం ఐన బీజాక్షరాలు.

ఈ శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌః అనే ఐదింటినీ పంచప్రణవాలు అని శ్రీవిద్యాసంప్రదాయంలో పేరు. వీటి విశేష లక్షణాలు

శ్రీం   వేడిమి
హ్రీం  తేజస్సు
క్లీం   ఆకర్షణ
ఐం   శబ్దం
సౌః   విద్యుత్తు

ఈ బీజాక్షరాలు అనులోమంగానూ, విలోమంగానూ గ్రహించబడి శ్రీషోడశాక్షరీకవచ కూటమిగా ఉన్నాయి.

కొన్ని పుస్తకాలలో ఈ నామం వదనస్మరమాంగళ్యగృహతోరణవల్లికా  అని ఉంది కాని అది సరికాదు. వల్లిక అంటే భ్రూలత అన్న అర్థం వీలుపడదు. కాబట్టి ఈపాఠం ఉచితం కాదు.

16. ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా


అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా।
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా। 5

వశిన్యాదులు చెప్పిన స్తోత్రంలోని యీ నామం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా లో ఉన్న మృగం కస్తూరీ మృగం. మృగనాభం అంటే కస్తూరి.  కస్తూరి పరీమళం చాలా గొప్పగా ఉంటుంది.

అసలు సిసలైన పరిమళద్రవ్యాలంటే ఎనిమిదింటిని చెబుతారు. అవి  కర్పూరము, కస్తూరి, పునుగు, జవ్వాజి, అగరు, పన్నీరు, గంధము, శ్రీగంధము అనేవి.

సంస్కృతంలో మృగం అన్న మాటకు సాధారణార్థంగా జంతువు అని అర్థం ఉన్నా, విశేషంగా మృగం అంటే జింక అనే అర్థం. స్త్రీని మృగనయన అంటారు అంటే అమ్మాయి కళ్ళు జింక కళ్ళ వలె అందంగా ఉంటాయని పోల్చి చెప్పటం. అంతే కాని ఏజంతువైనా మృగం అంటారు కాబట్టి గేదెకళ్ళు కలది విగ్రహవాక్యం చెప్పకూడదు!

అందుచేత కస్తూరిమృగం అంటే కస్తూరిజింక. జింకల్లో ఒక జాతి. వాటిలోనూ మగ కస్తూరిజింక పురుషాంగానికి కొంచెం పైన ఉన్న ఒక గ్రంథి నుండి వెలువడే ఒక పరిమళభరిత స్రావం.

ఈ కస్తూరి మీద వేమన్న పద్యం ఒకటి ఉంది.

మృగమదంబు చూడ మీద నల్లగనుండు
బరిఢవిల్లు దాని పరిమళంబు
గురువులైన వారి గుణము లీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ

ఈ మృగమదం అనబడే కస్తూరి పరిమళద్రవ్యాలలోని కెల్లా గొప్పది అన్నది నిర్వివాదం. ఈ రోజుల్లో మనం సంప్రదాయికమైన పరిమళద్రవ్యాల మీద అభిరుచిని కోల్పోయాం. ఏ కంపెనీ సెంటు బాగుంటుందా అనే అలోచన మనది. కాని అవన్నీ కూడా రకరకాల రసాయనాలు కాని సహజమైనవీ నిరపాయకరమైనవీ కానే కావు.

మన కస్తూరి అపాయకరమైనది కాదు కాని అచ్చమైన కస్తూరిని వాసన చూస్తే ముక్కు వెంట నెత్తురు వచ్చే అవకాశం ఉందట! అందుకని సహజమైన కస్తూరిని కూడా సాధారణంగా కొంచెం ఇతరపదార్థాలతో కలిపి కొంచెం సున్నితం చేసే వాడుతారట.

ఈ కాలంలో కస్తూరి పేరుతో చెలామణీ అవుతున్న దానిలో ముప్పాతిక మువ్వీసం నకిలీ. అసలు కస్తూరిమృగం నుండి వచ్చిన పరిమళద్రవ్యం కానే కాదు.

కస్తూరి ఒక పరిమళద్రవ్యం అనగానే అది ఒక అలంకారంగా వాడబడే వస్తువు అని వేరే చెప్పనక్కర లేదు కదా.

మరి అమ్మ కూడా కస్తూరిని ఒక అలంకారంగా నుదుట తిలంగా ధరిస్తుంది అని ఈ నామం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా అనే దాని వలన తెలుస్తోంది.

మరి అలా అమ్మ పెట్టుకున్న కస్తూరీ తిలకం గురించి ప్రస్తావించగానే మనకి ఈ ప్రసిధ్ధమైన శ్లోకం గుర్తుకు రావాలి కదా. ఒకసారి చెప్పుకుందాం.

కస్తూరీతిలకం లలాటఫలకే వక్షఃస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయన్ కంఠే చ ముక్తావళీం
గోపస్త్రీపరివేష్టితో విజయతే గోపాలచూడామణిః

ఈ సుప్రసిధ్ధశ్లోకం లీలాశుకుడి శ్రీకృష్ణకర్ణామృతం లోనిది. ఇందులో శ్రీకృష్ణమూర్తి శోభను వర్ణిస్తున్నాడు కవి. ఆయన ముఖాన కస్తూరిని తిలకంగా ధరించి ఉన్నాడట.

దీనిని బట్టి ఒకప్పుడు స్త్రీలూ పురుషులూ కస్తూరీతిలకాలను ధరించే వారని అర్థం అవుతున్నది కదా. ఈ కస్తూరి కేవలం అలంకారసాధనమే కాదు, ఆయుర్వేదవైద్యంలో దీనికి చాలా ప్రశస్తి ఉంది. ఇది ధనధాన్యసౌభాగ్యవర్థకం అన్న ప్రతీతి కూడా ఉంది.

కస్తూరి అలంకారం కావటానికి కారణం అది సువాసనాభరితం కావటమే కాదు, ఆ సువాసన శృంగారోద్దీపనం కావటమూ ముఖ్య కారణమే.  ఈ శ్రీనాథుడి చాటువు చూడండి.

అక్షయ్యంబగు సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షాదానము సేయరా సుకవిరాట్ బృందారక శ్రేణికిన్
దక్షారామపురీవీహారవర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించుతద్వాసనల్

అమ్మ కస్తూరీ తిలకం ధరించింది కదా, ఆ తిలకం ఎలా శోభిస్తోందీ అంటే వశిన్యాదులు ఒక చక్కని ఊహ చేసి చెప్పారు.

స్తీల ముఖాలను చంద్రబింబాలతో పోలుస్తాం కదా. అమ్మముఖం ఐతే చెప్పేది ఏముంది అచ్చంగా పూర్ణచంద్రబింబమే అనవలసిందేను.

చంద్రుడు ఎంత అందంగా ఉన్నా ఆ చంద్రబింబంలో ఒక మచ్చ ఉంది అని అందరికీ తెలుసు. కాని చిత్రం ఏమిటంటే మచ్చ ఉన్నా అది చంద్రుడి అందానికి ఏమన్నా లోపమా అంటే కానే కాదు. ఒక్క సినిమా చంద్రుడు మాత్రమే మచ్చ లేని చంద్రుడు కాని ఆకాశం మీద చంద్రుడు మచ్చతోనే ఉంటాడు - ఐనా చాలా అందంగా.

ఈ నామం ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా లో కళంకం అనే శబ్దం ఉంది కదా. కళంకం అంటే మచ్చ. ఈ మాట అందరికీ తెలిసిందే.  ఇకపోతే ముఖచంద్ర అనే పోలిక ఉంది. అంటే ముఖం అనే (పూర్ణ)చంద్రబింబం. వశిన్యాదులు కళంకాభం అన్నారు కదా,  దాని అర్థం కళకం వంటిది అని.

ప్రశ్న. అమ్మ ధరించిన కస్తూరీతిలకం  ఎలా ఉందీ?
జవాబు. నల్లగా ఉంది.

ప్రశ్న. కొంచెం కవిత్త్వంతో చెప్తే ఆ నలుపు ఎలా ఉందీ అంటాం?
జవాబు.  అమ్మ ముఖం అనే పూర్ణచంద్రబింబంలో మచ్చలాగా ఉంది

చంద్రుడు మనః కారకుడు.  చంద్రమా మనసో జాతః అని వేదం. సమస్తజీవుల సమిష్టి మనో రూపమే చంద్రుడు.  అచంద్రుడు అమ్మకు ముఖం. అయన షోడశకళా యుక్తుడు.

22, ఏప్రిల్ 2019, సోమవారం

15. అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా


అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా
ముఖచంద్రకళంకాభమృగనాభివిశేషకా। 5

అళికము అంటే నుదురు.

అమ్మ నుదురు అష్టమి చంద్రుడిలా ఉన్నదట.

నెలలో రెండు పక్షాలు. శుక్లపక్షం, కృష్ణపక్షం అని. ఒక్కొక్క పక్షానికి పదిహేను తిథులు. వాటిని మనం వరుసగా వ్రాస్తే ఇలా ఉంటాయి.

శుక్లపక్షంలో
పాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్టి సప్తమి
అష్టమి
నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి.

అలాగే కృష్ణపక్షంలో

పాడ్యమి విదియ తదియ చవితి పంచమి షష్టి సప్తమి
అష్టమి
నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య

రెండుపక్షాల్లోనూ కూడా అష్టమి మధ్యన వస్తుంది. అటు ఏడు తిధులు, ఇటు ఏడు తిధులు.

కళాతు శోడశో భాగః అని నిర్వచనం ప్రకారం కళ అంటే పదహారవ వంతు.

మరి తిథులు పదిహేనే కదా అనవచ్చును మీరు.

పౌర్ణమి చంద్రుణ్ణి షోడశకళా ప్రపూర్ణుడు అంటారు. అంటే నిండా పదహారు కళలూ ఉన్నవాడు అని. పౌర్ణమి నుండి ఒక్కొక్క తిథినాడూ ఒక్కొక్క కళ తగ్గుతుంది. అమావాస్య నాటికి ఒక్క కళ మిగులు తుంది. లేకపోతే కళలన్నీ నశించటం అంటే చంద్రుడే లేక పోవటం కదా! అందుకని అమావాస్యకు సున్నా కాదు ఒక్క కళ అన్నమాట. ఆనాటి నుండి ప్రతి తిథికి ఒక్కొక్క్ కళ చొప్పున పెరిగి మరలా పౌర్ణమి నాటికి పదహారుకళలూ పూర్తిగా సంతరించుకుంటాడు చంద్రుడు.

ఈ కళలకు విడివిడిగా పేర్లూ ఉన్నాయి. వాటికి అధిష్ఠాన దేవతలూ ఉన్నారు!

ఈ కళాదేవతలకు నిత్యలు అని పేరు. ఈ షోడశ నిత్యల నామధేయాలూ  చూదాం.

  1. కామేశ్వరి
  2. భగమాలిని
  3. నిత్యక్లిన్న
  4. భేరుండ
  5. వహ్నివాసిని
  6. మహావజ్రేశ్వరి
  7. శివదూతి
  8. త్వరిత
  9. కులసుందరి
  10. నిత్య
  11. నీలపతాక
  12. విజయ
  13. సర్వమంగళ
  14. జ్వాలామాలిని
  15. చిత్ర
శుక్లపక్షంలో పాడ్యమి నుండి ఆరోహణ క్రమంలో కామేశ్వరి నుండి చిత్రవరకూ నిత్యలు అధిష్ఠాన దేవతలు.
కృష్ణపక్షంలో పాడ్యమి నుండి అవరోహణ క్రమంలో చిత్ర నుండి కామేశ్వరి వరకూ నిత్యలు అధిష్ఠాన దేవతలు.

రెండు పక్షాల్లోనూ కూడా అష్టమి నాటి నిత్యాదేవత పేరు త్వరిత.

పదహారు కళలూ అని చెప్పి నిత్యాదేవతలను పదిహేను మందినే చెప్పారేం అని మీరు ప్రశ్న వేయవచ్చును. పదహారవది ఐన కళ పేరు మహానిత్య. ఇది సర్వకాలమూ ఉండే కళ. ప్రత్యేకంగా అధిష్ఠాన దేవతను చెప్పలేదు.

అమ్మవారి నుదురు అష్టమి చంద్రుడిని పోలి ఉంది అని చెప్పారు కదా. ఇందులో విశేషం ఏమన్నా ఉందా అని అలోచిద్దాం.

వికాసదశ ఐన శుక్లపక్షంలోనూ క్షీణదశ ఐన కృష్ణపక్షంలోనూ కూడా అష్టమి చంద్రుడు ఒక్కలాగే ఉంటాడు. అధిష్ఠాత్రి త్వరితా నిత్య. 

సంతోషమూ వ్యసనమూ వలన బేధం లేని లలాటం అమ్మది అని అర్థం.  ఏవిధమైన పరిణామబేధమూ లేనిది అన్నమాట.

అమ్మ ముఖం పూర్ణచంద్ర బింబం.
అమ్మ లలాటం అర్థం చంద్రబింబం.

తిథులలో ప్రతి పగటికీ రాత్రికీ కూడా విడివిడిగా సంకేత నామాలున్నాయి.  శుక్లపక్షం అష్టమి రాత్రికి పేరు ఆప్యాయ.  అంటే శ్రీదేవీ అమ్మవారి లలాటం ఆప్యాయత కురిపించేదిగా ఉన్నదని భావం.

ఇక్కడ ఒక సమయమత రహస్యం ఉంది. అమ్మముఖం పూర్ణచంద్ర బింబం.  శరీరాంతర్గత పూర్ణచంద్రస్థానం సహస్రారం. అక్కడ సాధకుడికి అమృతసిధ్ధి.

అమ్మవారి లలాటం పైన అంతర్దృష్టి నిలిపి ధ్యానం చేస్తే అష్టమీ చంద్రదర్శనం. అంటే సగం దూరం అతిక్రమించి వచ్చేయటమే యోగంలో అన్నమాట.

త్వరితా త్వరితం ఫలదాయినీ అని శారదాతిలకం.

ఇది సులభోపాయం.  ఇదే రహస్యంం.

సామాన్యులకు ఐనా సరే అమ్మ ముఖదర్శనమే త్వరితఫలదాయక మని గ్రహించాలి. సమస్త కామితములూ అమ్మ ముఖాన్ని మానసికంగా ధ్యానంలో దర్శించితే చాలు అవి వెంటనే ఫలిస్తాయని ఆశీః పూర్వకమైన సందేశం.

14. కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా


చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా 4

ఈ కురివిందమణిశ్రేణీకనత్కోటీరమండితా అన్న నామంలో అమ్మవారి కోటీరం అంటే కిరీటం యొక్క శోభని వర్ణిస్తున్నారు వశిన్యాదులు.

కురువిందము అంటే పద్మరాగం. కురువిందమణి అంటే పద్మరాగమణి. శ్రేణి అంటే తెలిసిందేగా వరుస అని అర్థం. అందుచేత కురువిందమణిశ్రేణి అంటే పద్మరాగమణిపూసల వరుస.

కాబట్టి కురువిందమణిశ్రేణీకనత్ కోటిరము అంటే పద్మరాగమణుల వరుస(ల)తో ప్రకాశిస్తున్న కిరీటం అని తాత్పర్యం.

ఈ కురివిందమణిశ్రేణీకనత్కోటీరమండితా లో చివరన ఉన్న మండితా అన్న సంబోధన వలన అమ్మవారిని వశిన్యాదులు ద్మరాగమణుల వరుస(ల)తో ప్రకాశిస్తున్న కిరీటంతో  అలంకరించుకొని ఉన్న తల్లీ అని సంబోధిస్తున్నారని బోధపడుతున్నది.

కొంచెం శాఖాచంక్రమణం ఐనా మనం ఇప్పుడు ఈ పద్మరాగమణుల గురించి కొంచెం తెలుసుకుందాం.

రావణగంగ అని ఒక నది ఉంది.  వినటానికే కొంచెం చిత్రంగా ఉంది కదా?

రాజశేఖరుడు అనే పదవశతాబ్దానికి చెందిన ఒకాయన పుస్తకం కావ్యమీమాంసలో రావణగంగ గురించిన ప్రస్తావన వస్తుంది. ఈ రావణగంగ అనే నది శ్రీలంకలో ఉన్నట్లుగా ఆ పుస్తకం బట్టి తెలుస్తోంది.

గరుడపురాణంలోని రత్నాధ్యాయం ప్రకారం పద్మరాగమణులకు రావణగంగ పుట్టిల్లు.

తస్యా స్తటేషు చారురాగా భవంతి తోయేషు చ పద్మరాగాః
సౌగంధికోత్ఠాః కురివిందజాశ్చ మహాగుణాః స్ఫాటికసంప్రసూతాః

బంధూక గుంజా శకలేంద్రగోప
జపా శశ్యసృక్ సమవర్ణశోభాః
భ్రాజిష్ణవో దాడిమ బీజవర్ణా
స్తథాపరే కింశుక భాసః

ఈ పై పురాణశ్లోకాలను బట్టి రావణగంగా నదిలోనూ ఆ నదీతీరంలోనూ అందంగా ఎఱ్ఱగా ఉండే పద్మరాగమణులున్నాయి.

ఆ నదీజలాల్లో సౌగంధికములు, కురివిందములు, స్ఫటికములు అని మూడు రకాల శిలలున్నాయి. వాటి నుండి పద్మారాగాలు జన్మిస్తున్నాయి.

ఆ పద్మరాగమణులు కొన్ని బంధూకవర్ణం కలవి. అంటే మంకెన పూవు చాయవి. కొన్ని గుంజాశకలం అంటే గురివిందపూవు రంగు కలవి. కొన్నిఇంద్రగోపం అంటే ఆరుద్రపురుగు రంగులో ఉన్నవి.  కొన్ని జపాకుసుమం అంటే మందారపువ్వు రంగువి. కొన్ని శశి వర్ణం అంటే లొద్దుగపూవు రంగువి. కొన్నిఅసృక్ వర్ణం అనగా రక్తపు రంగు కలవి. కొన్ని  దాడిమ అనగా దానిమ్మగింజల వలె మరికొన్ని కింశుకము అనగా మోదుగపూవు రంగుకలవి. ఇలా అవి ఎఱుపుదనంలో వివిధమైన చాయలు కలవిగా ఉంటాయి.

ఆనదిలో పద్మారాగాలు కల మూడు రకాల శిలల్లో కురివిందముల నుండి జన్మించిన పద్మరాగాలు విశిష్టమైనవి. ఏమిటయ్యా ఆ విశిష్టత అంటే పురాణం ఇలా చెబుతోంది.

కామానురాగః కురువిందజేషు
శనై ర్న తాదృక్ స్ఫటికోద్భవేషు
మాంగల్య యుక్తా హరిభక్తిదాశ్చ
వృధ్ధిః ప్రదాస్తే స్మరణాద్భవంతి

కురువిందముల నుండి పుట్టిన మణులు కామానురాగ కారకాలు. మిగతావాటికి ఆ శక్తి లేదు.
స్ఫాటికశిలల నుండి పుట్టినవి మాంగల్యయుక్తములు. వీటిని స్మరించినంత మాత్రానే హరిభక్తి వృధ్ధి అవుతుంది.

ఇప్పుడు ఈ కురువిందమణి అన్న మాటను పట్టుకొని ఆరాతీస్తే మనకి అవగతం అయ్యేది ఏమిటంటే అవి శుభాన్ని కలిగించేవీ హరిభక్తిని పెంపొందించేవీ అని.

శ్రీహరిని స్మరిస్తూ శంకరభగవత్పాదులు సౌందర్యలహరీ స్తోత్రంలో ఒక మాట అంటారు.

హరిస్త్వా మారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం
పురానారీభూత్వా పురరిపు మపి క్షోభమనయత్
స్మరో పిత్వాం నత్వా రాతినయన లేహ్యేన వపుషా
మునీనా మత్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్

ఆ హరి అమ్మను ఆరాధించి అడవేషం ధరించి శివుణ్ణే మోహింప చేయ గలిగాడని పై శ్లోకంలో ప్రశంస. అంతే కాదు మన్మథుడు కూడా అమ్మని ఆరాధించే మునీశ్వరుల్ని సహితం మోహపరవశుల్ని చేయగల శక్తిని ఆర్జించుకున్నాడట.

ఇప్పుడే చెప్పుకున్నాం కదా కురువిందముల నుండి పుట్టిన మణులు కామానురాగ కారకాలు అనీ.  అమ్మవారి కిరీటంలో అలంకరించి ఉన్న కురువిందమణుల మాలలే అమ్మ భక్తులకు కామానురాగసిధ్ధి ప్రదాయకాలు అవుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. హరి అయ్యేది ఆయన కుమారుడు మన్మథుడు అయ్యేది అమ్మని ఆరాధించి ఆవిడ కిరీట స్మరణ దర్శనాదులవలననే కామానురాగాలకు సంబంధించిన నిగ్రహానుగ్రహాది శక్తులను సంపాదించుకొన్నారన్న మాట.

అమ్మవారి కిరీటంలో ఉన్న స్ఫాటికశిలాజన్యములైన మణులవలన హరిభక్తి అని కదా. అమ్మకూ హరికీ అబేధమే అని చెప్పుకోవాలి. అంటే అమ్మ కిరీటాన్ని స్మరించినా దర్శించినా భక్తివర్ధనం జరిగి అది మోక్షదాయకం అవుతున్నది.

కిరీటం అన్నది అధికార చిహ్నం. అమ్మ సకలజగాలకూ అధినేత్రి కదా.

4, ఏప్రిల్ 2019, గురువారం

13. చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా



చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా 4

ఇక్కడి నుండి కొన్ని నామాలు అమ్మవారి స్వరూపవర్ణనం చేస్తాయి.

ఈ నామం చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా అన్నదానిలో చంపకము, ఆశోకము, పున్నాగము సౌగంధికము అనే పుష్పాలతో అమ్మ యొక్క శిరోజములు ప్రకాశిస్తున్నాయని చెప్తున్నారు వశిన్యాదులు.  ఈ పుష్పాలకు తెలుగుపేర్లు చూదాం. చంపకం అంటే సంపంగిపువ్వు. ఆశోకం అంటే పొగడపువ్వు. పున్నాగం అన్నది తెలుగులో కూడా వాడుకలో ఉన్నదే - ఇవి సురపొన్న లేదా పొన్న పూవులు. సౌగంధికాలు అంటే చెంగల్వపూలు.  ఇవన్నీ అమ్మ తలకట్టులో ఉండి ఆతలకట్టు చాలా శోభాయమానంగా ఉందని చెప్తున్నారు.

మనం ఇప్పటికే గడచిన నామాల్లో అమ్మ అగ్నికుండము నుండి ఉద్భవించింది అని చెప్పుకున్నాం. మరి అలా అగ్నిగుండం నుండి పైకి వస్తున్నప్పుడు మనకు మొదట దర్శనం ఇచ్చేది అమ్మ తలకట్టే కదా. అందుకని మొదట తలకట్టును వర్ణిస్తున్నారన్నమాట. సాధారణంగా ఐతే పాదాలతో వర్ణన మొదలుపెట్టాలి దేవలతలకు. ఇక్కడి సందర్భం ప్రత్యేకంగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ముందు అమ్మ తలకట్టును గురించి చెప్పారు.

ఇక్కడ ఈ నామంలో చంపకాశోకపున్నాగసౌగంధిక అని అన్నీ ఆయా చెట్లూ మొక్కల గురించి చెప్పారు కాని పూవులని చెప్పలేదే అని కొందరికి శంక రావచ్చును. అయ్యా ఇక్కడి సందరర్భాన్ని బట్టి మనం చెట్లూ చేమల గురించి గ్రహించాలా వాటి పూవులను గురించి గ్రహించాలా అర్థంలో అని ఆలోచించాలి. మామిడి అని అంటే అది మామిడి చెట్టు అని అర్థమా మామిడి కాయోపండో అని అర్థమా అంటే ఆ మామిడి అన్నమాట ఉన్న వాక్యంలోని సందర్భాన్ని బట్టి చెప్పాలి అంటాం కదా. మీదేం తోట అంటే మామిడి అన్నారనుకోండి - అక్కడ అన్నీ మామిడి చెట్లు అని అర్థం చేసుకుంటాం. ఏం పళ్ళు తెచ్చావు అంటే మామిడి అన్నాడనుకోండి - అప్పుడు మామిడి పళ్ళు అని తెలుసుకుంటాం. జుట్టూ సుగంధమూ అని చెప్తున్నప్పుడు ఆ పూలజాతికి చెందిన వృక్షాలను గ్రహిస్తామా వాటి పూలను గ్రహిస్తామా? పూలనే కదా.

మరొక శంక ఉంది! ఈ పూలవలన అమ్మవారి జుట్టుకు శోభ వచ్చింది అంటే ఆ శోభ ఆ జుట్టుకు అబ్బిన సుగంధం గురించే కదా, అని. అవును ఇక్కడ ఆ పూలవలన కలిగిన సుగంధశోభ అనే అర్థం.

ఒక చక్కని కథ ఉంది. నక్కీరుడు అని ఒక కవిగారు. ఈయన కథ గురించి ధూర్జటి కవి గారి శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే కావ్యంలో ఉంది.

ఈ నక్కీరుడు దొడ్ద కవి. రాజుగారి సభలో ముఖ్యకవి కూడా . ఒక బీదబ్రాహ్మణుడు సభకు వచ్చి ఒక పద్యం చదువుతాడు. ఆయన ఆశ అల్లా, ఈపద్యం విని రాజు గారు ఏదన్నా నాలుగుకాసులు బహుమానం చేస్తాడు కదా అని. తీరా చదివాడా, ఆ పద్యం తప్పు పో అని నక్కీరుడు తిరస్కరించి మోకాలడ్డు వేసాడు.

నిజానికి ఆ పద్యం ఆ బీదబ్రాహ్మడి సొంతకవిత్వం కాదు. ఆయన దీనావస్థకు జాలిపడి శివుడే ఒక బ్రాహ్మణవేషంలో వచ్చి ఈపద్య ఇచ్చి రాజుగారికి వినిపించి బహుమానం పొందవయ్యా అని పంపాడు.

గోడక్కొట్టిన బంతిలాగా ఈబీదబ్రాహ్మడు వెనక్కు వచ్చి జరిగిన పరాభవం గురించి చెప్పి ఏడిస్తే,  ఈ మాయాబ్రాహ్మడు ఉగ్రుడై తానే బీదాయనతో సహా సభకు వచ్చి ఎవడ్రా పద్యం తప్పన్నదీ అని వాదం వేసుకున్నాడు.

ఏం పద్యమయ్యా ఎక్కడన్నా ఆడవాళ్ళ తలకట్లు సువాసన్లు వస్తాయా అని నక్కీరుడు వెక్కిరించాడు.

పార్వతీదేవి తలకట్టు సువాసన వస్తుందయ్యా, నా పద్యం సరైనదే అని శివుడు సిధ్ధాంతం చేసాడు.

అప్పుడు నక్కీరుడు ఒప్పుకున్నాడా? పార్వతీదేవి సంగతి అలా ఉంచు లోకంలో లేదే. ఐనా నీకేం తెలుసూ అంటాడు. దాంతో శివుడు నిజస్వరూపం చూపిస్తాడు. నక్కీరుడు మాత్ర్రం తప్పుతప్పే పోవయ్యా అని ఎలా అంటాడో చూడండి

కం. తలచుట్టువార కన్నులు
కలిగిన పద్యంబు తప్పు గాదన వశమే
వలదిచ్చట నీమాయా
విలసనములు పనికిరావు విడువు మటన్నన్

ఏమయ్యోయ్ నీకు మూడుకళ్ళున్నా పద్యం తప్పేను. మూడేమిటి తలచుట్టూ కళ్ళున్నా సరే, నీ పద్యం తప్పంటే తప్పే పోవోయ్, ఇంక వదిలేయ్! అన్నాడు

దాంతో శివుడికి మండి శపించాడు. ఆ శాపమూ దానికి శివుడు చెప్పిన విమోచనమూ నక్కీరుడికి శాపవిమోచనం ఐన తీరూ అంతా ఇప్పుడు మనం చెప్పుకోనవసరం లేదు. ఇంతవరకు చాలు.

సిధ్ధాంతం ఏమిటంటే అమ్మవారి జుత్తుకు సుగంధం అంటే పరీమళం సహజం. అది ఏపూవులవల్లనో తైలాదులవల్లనో వచ్చింది కాదు అని.

మరి ఇక్కడ చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచా అంటున్నారే వశిన్యాదులూ అంటే దానికి ఒక చమత్కారమైన సమర్థన చెప్పుకోవాలి.

చంపక, అశోక, పున్నాగ పుష్పములవలె గొప్ప సుగంధము కల జుత్తు కలది అని నామానికి అర్థం చెప్పుకోవాలి.
అమ్మవారికి ఈసృష్టిలోని ఏవో పూవుల వలన సుగంధం రావటం అని చెప్పటం ఉచితం కాదు కదా అని భావించాలి.
ఇది బాగుంది కదా.

అసలు ఈ నామం ప్రకారం అమ్మవారి తలకట్టులోని సుగంధమే ఆపూవులకు అబ్బి అవే మంచి సుగంధాన్ని పొందుతున్నాయని డబాయించి చెప్పుకోవచ్చును.

శ్రీ లలితాత్రిశతి అని మరొక దివ్యగ్రంథం ఉంది. అందులో అమ్మవారి మూడువందల నామాలు చెప్పబడ్డాయి. ఈ లలితాత్రిశతికి శంకరభగవత్పాదులు భాష్యం వ్రాసారు. ఆనామాల్లో 'ఏలాసుగంధచికురా' అని ఒక నామం ఉంది. ఆ నామానికి శంకరభాష్యం కూడా ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా అమ్మ యొక్క కుంతలాలకు ఉన్న సహజసుగంధాన్ని పురస్కరించుకొని చెప్పుతున్నది.

భగవంతుడి విరాట్ స్వరూపం గురించి చెప్పేటప్పుడు వనస్పతులు శిరోజాలు అని చెప్పటం జరుగుతుంది. ఆ వనస్పతులు శ్రీదేవీ దివ్యకచం యొక్క సుగంధాన్ని ప్రదర్శిస్తున్నాయని భావించటం ఆహ్లదకరంగా ఉంటుంది. ఈసృష్టి యంతా పరబ్రహ్మస్వరూపంలో భాగమే కదా.

మల్లినాధ సూరి గారు. ఈయన పేరు విన్నారా?  కాళిదాసు కవిత్వం తెలియాలంటే మల్లినాధసూరి వ్యాఖ్యానం దగ్గర ఉండాల్సిందే. ఆయన రఘవంశం అనే కాళిదాసు కృతికి వ్యాఖ్యానం వ్రాస్తూ చెప్పిన మంగళాచరణ శ్లోకం

అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీ కృతమ్
దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజమ్

గౌరీదేవి దర్శనానికి దేవతాస్త్రీలు వచ్చారట. వాళ్ళ కొప్పుల్లో కల్పవృక్షం పూలున్నాయి. ఆ పూల సుగంధం వల్ల వాటిచుట్టూ తిరుగుతున్న తుమ్మదలూ ఉన్నాయి. సరే వీళ్ళు వచ్చి అమ్మ పాదాలకు నమస్కరించారు.

నమస్కరించారా? అప్పుడు ఆ తుమ్మెదలన్నీ ఆ స్త్రీల కొప్పులలోని పూలను వదలి అమ్మ పాదాల చుట్టూ తిరగటం మొదలు పెట్టాయట.

ఎందుకూ అంటే పూలసువాసనలు ప్రకృతి సహజమైనవి. అమ్మ పాదాల సుగంధం అప్రాకృతిక మైనది. ఆ దివ్యసుగంధం ముందు పూలవాసన లెంతనీ? అందుకే అవి పూలను వదలి అమ్మపాదాలను ఆశ్రయించాయి వెంటనే.

ఇదీ పై శ్లోకం తాత్పర్యం.

అంటే ఏమన్న మాట? అమ్మవారి శరీరం అంతా సహజంగానే దివ్యమైన సుగంధం కలది. ఆపాదమస్తకమూ అలా ఉంటుంది.

అందుచేత పరీమళం అంతా అమ్మ కొప్పుది.

ఆ పరీమళంతో అమ్మ కొప్పులోని చంపకాలూ అశోకాలూ పున్నాగలూ సౌగంధికాలూ గొప్పదనాన్ని పొందుతున్నాయి. అవీ సుగంధాలు చిమ్ముతున్నాయి అని అర్థం.