19, మే 2019, ఆదివారం

27. నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ


నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా। 11

మాధుర్యం అనగా తీయందనం.

ఈ నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ అన్న నామంలో వశిన్యాదులు అమ్మ మాటల మాధుర్యాన్ని వర్ణిస్తున్నారు.

సల్లాపం అంటే మట్లాడటం. అందుచేత సల్లాప మాధుర్యం అంటే మాట్లాడినప్పుడు ఆ మాటలోని మధురిమ అని అర్థం. ఇంక నిజసల్లాపమాధుర్యం అని నిజ అన్న శబ్దాన్ని ముందు చేర్చి చెప్పినప్పుడు తనయొక్క మాటలోని మాధుర్యం అన్నది అర్థం. ఇక్కడ చెబుతున్నది అమ్మను గురించి కదా, కాబట్టి నిజసల్లాపమాధుర్యం  అంటే అమ్మ మాటలోని మాధుర్యం అన్నమాట.

ఆ  మాధుర్యం అనగా అమ్మ మాటల్లోని తీయందనం ఎలా ఉందంటే కఛ్ఛపి అనేది వినిర్భితం ఐనదట.

నిర్భిన్నం కావటం అంటే దెబ్బతిన్నది కావటం. కఛ్ఛపి వినిర్భితమైనది అంటే కఛ్ఛపికే దెబ్బతగిలిందీ అని అర్థం.

కఛ్ఛపి అంటే సరస్వతీ అమ్మవారి వీణ.

పౌరాణిక వాంగ్మయంలోనూ వైదికవాంగ్మయంలోనూ వస్తువులకూ పేర్లు ఉండటం కొత్త విషయం కాదు. మాటవరసకు విష్ణుమూర్తి గారికి ఐదు ఆయుధాలున్నాయి. అవి చక్రం, శంఖం, గద, ఖడ్గం,విల్లు. వాటికి విడివిడిగా పేర్లున్నాయి. విష్ణువు చక్రం పేరు సుదర్శనం. ఈ పేరు అందరికీ చాలా పరిచయం ఉన్నదే. శంఖం పేరు పాంచజన్యం, , గద పేరు కౌమోదకి. అయన ఖడ్గం పేరు నందకం - అన్నమయ్య గారు ఈ నందకం యొక్క అంశావతారం అని ప్రతీతి. విష్ణువు వింటికి పేరు శార్ఙ్గము.

విష్ణువు వింటికి పేరు  శార్ఙ్గము ఐతే శివుడి విల్లు పినాకం అందుకే ఆయనకు పినాకి అని వ్యవహారం.

అలాగే వేరే వేరే దేవతల చేతుల్లో భాసించే వీణలకూ వేరు వేరు పేర్లున్నాయి.

విశ్వావసో స్సా బృహతీ తుంబురోస్తు కళావతీ
సా నారదస్య మహతీ  సరస్వత్యాస్తు కఛ్ఛపీ

అని విశ్వావసువు వీణకు బృహతి అని పేరు. ఈ విశ్వావసుడు ఒక గంధర్వరాజు, యాజ్ఞవల్క్యమహర్షి శిష్యుడు. తుంబురుడు వాయించే వీణకు కళావతి అని పేరు. నారదుడి వీణ మహతి. సరస్వతీ దేవి వీణ పేరు కఛ్ఛపి.

కొందరు కఛ్ఛపి అంటే కఛ్ఛపుడు అనే అయన భార్య అని వ్యాఖ్యానించారు కాని అది పొరపాటు.

సరస్వతి చేతిలోని వీణ కఛ్ఛపి అన్నాం కదా. దాని ప్రత్యేకత ఏమిటయ్యా అంటే అది ఇతర దేవతల వీణల లాగా కాక స్పష్టంగా అక్షరాలను స్ఫురింపచేస్తూ ధ్వనిస్తుంది.

లోకంలో మనుష్యాదులు అంతకంటే స్పష్టంగానే అక్షరాలను పలుక గలరు కదా అనవచ్చును.

కాని సరస్వతి వీణ వలె స్పష్టతతో పాటు మాధుర్యం కూడా ఆ స్థాయిలో ఉండదుగా. అందుకని సరస్వతీ అమ్మ వీణ ప్రత్యేకం అన్నమాట.

మరొకవిధంగ కూడా కఛ్ఛపి అన్న వీణావిశేషానికి వివరణ ఉంది. పైన చెప్పిన నాలుగు వీణలూ అంటే బృహతి, కళావతి, మహతి, కఛ్ఛపి అనేవి నలుగురి చేతిలో కనిపించే నాలుగు రకాలైన వీణలు అని.

ఈ నాలుగు రకాల వీణలలోనూ తంత్రులు భిన్నంగా ఉంటాయి. కళావతిలో 4, కఛ్ఛపి, మహతీ వీణల్లో 7 తంత్రులుంటే బ్రృహతిలో 15 తంత్రులుంటాయి.

కళావతీవీణ తుంబురుడిది. అందుకే దానికి తుంబురా లేదా తంబురా అని పేరు వచ్చింది. దీనికి వివిధ మైన కళలు అనగా శ్రుతులని పలికించటం ప్రత్త్యేకత.

బృహతి, మహతి ఎక్కువగా ఉత్తరదేశ వాద్యాలైతే కఛ్ఛపి దక్షిణదేశానికి చెందినది.

కఛ్ఛపికి వెండి బంగారు దంతాలతోనూ అలంకరణలు ఉంటే మహతికి మాత్రం సొరకాయబుర్రలూ వెదురుబొంగులతో సాదాగా ఉంటుంది.

కఛ్ఛపిలో 24 మెట్లు ఉంటే మిగిలిన రకాల్లో 20 మెట్ట్లే ఉంటాయి.

ఎక్కువ మెట్లుండటం చేత కఛ్ఛపి ఎక్కువ స్వరస్థానాల్ని పలికించగలదు. అదీ దాని ప్రత్యేకత.

ఐతే శ్రీలలితాపరాభట్టారికా దేవీ అమ్మ పలుకుల స్పష్టతా తీయందనమూ సాటిలేనివి. అందుచేత అమ్మ సంభాషణా మాధుర్యం సర్వాతిశాయి అనటంలో సందేహం లేదు.

ఈ విషయంలో సౌందర్యలహరీ స్తోత్ర్తంలో శంకరులు ఇలా అంటున్నారు.

విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః
త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే
తదీయైర్మాధుర్యైరపలపితతంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీ నిచులయతి చోలేన నిభృతమ్

ఈ సొగసైన శ్లోకం ప్రకారం సరస్వతీ దేవిని గురించి ప్రస్తావిస్తూ అమ్మతో శంకరులు ఏమంటున్నారో చూడండి.

అమ్మా సరస్వతీ దేవి నీ ముందుకు వచ్చి రకరకాలుగా శివుడి విజయగాథలను గురించి వీణాగానం చేస్తోంది. హాలాహలం స్వీకరించటం గురించి పాడుతోంది. త్ర్రిపురాసురుల్ని నిర్జించటం గురించి పాడుతోంది. దక్షయాగం ధ్వంసం చేయటం గురించి పాడుతోంది. గజాసురవృత్తాంతం పాడుతోంది. ఇలా అనేక కథలను నీ ఆనందం కోసం నీముందు గానం చేస్తోంది.

నువ్వు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నావు. తలవూపుతూ ఆ సంతోషం వెలుబుచ్చుతున్నావు. అప్పుడప్పుడు బాగుంది బాగుంది అని మెచ్చుకుంటూ ఆమె చాతుర్యాన్ని అభినందిస్తూ మాట్లాడుతున్నావు.

నీ మాటల మాధుర్యాన్ని ఆలకించి ఆశ్చర్యంతో సరస్వతి తబ్బిబ్బు అవుతోంది.

అమ్మ మాటల ముందు నా వీణాగానం మదురిమ ఏపాటిది అని సిగ్గుపడుతోంది.

అలా బిడియపడిన సరస్వతీ దేవి తన వీణను వెంటనే గవిసెనతో కప్పుతోంది, వాదనం చాలించి!

ఎంత సరస్వతీ దేవి చేతి వీణ ఐనా నీ మాటల మాధుర్యం ముందు అదెంత.

ఇలా శంకరులు తమ సౌందర్యలహరిలో అమ్మ పలుకులు సరస్వతీ వీణను చిన్నబుచ్చుతున్నాయని చెప్పారు.

ఇక్కడ శంకరులు అమ్మ సల్లాపం అతి మధురం అన్న విషయంలో సరస్వతితో అమ్మ ఆడిన పలుకులను ప్రస్తావించారు.  మరొక రకంగా భావిస్తే అమ్మ సల్లాపం ఎవరితో నిత్యత్వం కలిగి ఉందో మనం సులభంగా ఊహించగలం కదా. అది కామేశ్వరునితో అని వేరే చెప్పాలా.

సరస్వతీ దేవి వీణ ఎంతగా మాధుర్యానికి పెట్టింది పేరైనా అది అమ్మ అయ్యవారితో ప్రసంగించటంలోని మాధుర్యానికి సాటి రాదు. అమ్మ వాక్కు నాదబ్రహ్మస్వరూపం కదా,

బహిర్మాతృకాన్యాసంలో అమ్మ ముఖవృత్తానికి విసర్గతో న్యాసం.

14, మే 2019, మంగళవారం

26. కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా। 10

ఈ కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా అన్న నామంలో అమ్మ సేవించిన కర్పూరతాంబూలం గురించి వశిన్యాదులు వివరిస్తున్నారు.

వీటిక అంటే తాంబూలం. రోజుల పుణ్యమా అని ఇప్పుడు పాన్ అంటే కాని జనానికి అర్థం కాదేమో! అందరికీ తెలుసుగా ఈ పాన్ అనే దానిలో లక్షరాకాలుంటాయి.

ఒకప్పుడు మనం అందరం తాంబూలం అని పిలచుకొనే దానిలో ఎన్ని రకాలున్నాయో తెలియదు. కాని బాగా పేరుకెక్కింది మాత్రం కర్పూరతాంబూలం. ఈ కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా అన్న నామంలో అమ్మ వేసుకున్నది అని చెప్పినది కూడా కర్పూరవీటిక అనగా కర్పూర తాంబూలమే!

ఇక్కడ కర్పూరం అంటే తినటానికి వాడే పచ్చకర్పూరం. అంతే కాని హారతిపళ్ళెంలో వెలిగించే రకం కర్పూరం కాదు.

మీఠా పాన్ అనగానే ఏదో ఇన్ని తములపాకుల మీద ఇంత పంచదార చల్లి చుట్టేస్తాడా ఏమిటీ? కాదు కదా. అలాగే కర్పూరతాంబూలం అంటే దానిని చుట్టటానికి చాలా గ్రంథం ఉంది.

ఏలా లవంగ కర్పూరీ కస్తూరీ కేసరాధిభిః
జాజీఫలదళైః పూగైః లాంగల్యూషణ నాగరైః
చూర్ణైః ఖదిర సారైశ్చ యుక్తా కర్పూరవీటికా.

అంటూ కర్పూరతాంబూలం చుట్టటానికి కావలసిన సరంజామా ఏకరువు పెట్టారు. ఏమేం కావాలంటే ఏలకులు (ఏలా), లవంగాలు, కర్పూరం, కస్తూరి, కుంకుమపువ్వు (కేసరి), జాజికాయ (జాజీఫలదళం), వక్కలు (పూగైః), కాచు(ఖదిరం), మిరియాలు (ఊషణము), శొంఠి (నాగరం). ఇవన్నీ చక్కగా చూర్ణంగా చేసి తాంబూలంసేవిస్తే అది కర్పూర తాంబూలం అవుతుంది.

కర్పూరపు చెట్టు వేళ్ళనూ చెక్కనూ నీళ్ళలో మరగించి ఆ ఆవిరినుండి సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. ఈనాడు మనకి పూజలకు బిళ్ళల రూపంలో దొరికేది అంతా రసాయన పదార్థమే కాని నిజం కర్పూరం కాదు.

ఈ కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా అన్న నామంలో ఆమోదం అన్న పదానికి ఇక్కడ ప్రయోజనం ఆ కర్పూరతాంబూలం నుండి వెలువడుతున్న సుపరిమళానికి లభించిన ఆదరణను గురించి స్పష్టం చేయటం. ఆ పరీపళం ఎంతగా వ్యాపించిందో చెబుతున్నారు. అది  సమాకర్షద్దిగంతర మైనది అట. అంటే అన్ని దిక్కులనూ చక్కగా సమంగా ఆవిరించింది అని.

నిజమే కర్పూర పరీమళం అంత గొప్పగా ఉంటుంది. ఆ కర్పూరమిళిత పరీమళం మన ముక్కుకు సోకగానే చుట్టుపక్కల ఎవరో కర్పూరతాంబూలం వేసుకొని ఉన్నారూ అని తెలుస్తుంది అన్న మాట. దీనికి గొప్ప ఋజువుగా తెలుగు సాహిత్యంలో అల్లసాని పెద్దన గారు మనుచరిత్రలో ఒక పద్యం చెప్పారు.

ప్రవరుడు అనే అమాయక బ్రాహ్మడు ఎవడో సిధ్ధుడు కాలికి పాదలేపనం పూస్తే దాని ప్రభావంతో హిమాలయాలను చూడటానికి పోయాడు. అక్కడ ఆ లేపనం కాస్తా మంచులో కలిసిపోయి పాదాలు రిత్తబోయి ఇంటికి తిరిగి వెళ్ళే దారిలేక లబోదిబో మని మొత్తుకున్నాడు. కాస్త ఉపాయం చెప్పేవాళ్ళెవరన్నా చుట్టుపక్కల దొరుకుతారా అని ఆ మానవుడు వెదుకు తున్న సమయంలో గొప్ప సువాసన ఒకటి అతడి ముక్కుకు సోకిందట. అది ఎలాగు ఉందని?

కం. మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీ గంధ
స్థగితేతర  పరిమళమై
మగువ పొలుపు తెలుపు నొక్క మారుత మెగసెన్.

కస్తూరి దట్టించిన కర్పూర తాంబూల పరీమళం అది. అది ముక్కుకు తగిలి ఏమని తెలిపిందట. మగువపొలుపు. అంటే ఇక్కడ ఎవరో ఆడవాళ్ళున్నారూ వాళ్ళు కర్పూరతాంబూలం వేసుకొని ఉన్నారూ అని మనవాడికి ఆ తాంబూలపు సువాసనలు మోసుకొని వచ్చిన గాలి తెలియజేసిందట.

అలా కర్పూరతాంబూల పరీమళం నలుదిక్కులా వ్యాపిస్తుంది.

కర్పూర తాంబూలం ఆడామగా అందరూ సేవిస్తారు. ఈ పెద్దన గారే కవిత్వం వ్రాయటానికి కావలసిన సంబారాల చిట్టాను ఒక పద్యంలో చెప్పారు చూడండి.

నిరుపహతి స్థలంబు రమణీప్రయదూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడెమాత్మకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త
ప్పరయఁ రసజ్ఞు లూహఁ దెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికినఁగాని యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే

ఆయన చెప్పిన చిట్టాలో కప్పురవిడెమూ ఉంది.

మరి కర్పూరతాంబూలం ఆడామగా అందరూ వేసుకొంటారు కదా మరి ప్రవరాఖ్యుడికి తాంబూలపు సువాసనను బట్టి చుట్టుపక్కలనే తాంబూలం వేసుకొన్న స్త్రీ ఉన్నదీ అని ఎలా తెలిసిందీ,  మగవాడూ ఉండి ఉండవచ్చును కదా అని అనుమానం వస్తుంది. పద్యం మరొకసారి చూడండి. ఆ తాంబూలపు సువాసనలో కర్పూరపు పరీమళమే కాదు మృగమద (కస్తూరి) పరీమళమూ కలిసి ఉందట. కస్తూరితో కలిసిన తాంబూలం వేసుకొనేది ఆడవాళ్ళు మాత్రమేను. ఎందుకంటే కస్తూరిని ఆడవారే వాడుతారు. దీనికీ తెలుగు సాహిత్యంలో సాక్ష్యం ఉంది చూడండి.

అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షా దానము సేయరా సుకవి రాడ్బృందారక శ్రేణికిన్
దక్షారామపురీ విహార వర గంధర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించు దద్వాసనల్

ప్రసిధ్ధమైన ఈ పద్యం  శ్రీనాథ మహాకవి చాటువు.ఆయన రాజుగారిని కస్తూరి ఇప్పించవయ్యా అని ఠీవిగా అర్థిస్తున్నాడు. అదేం చేసుకుంటావయ్యా అంటే, దక్షారామంలో ఉన్న వేశ్యాయువతులకు పరిమళద్రవ్యంగా అలంకరించుకుందుకు ఇస్తాడట!

శాఖా చంక్రమణం అవుతున్నది కదా. విషయంలోని వద్దాం. ఈ కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా నామం అమ్మ సేవించిన కర్పూరతాంబూలం గురించి. దాని ప్రభావం ఎంతంటే వశిన్యాదులు, ఆ సువాసనలను దిక్కులను ఆవరిస్తున్నాయి అని చెబుతున్నారు.

లలితా త్రిశతిలో ఇలాంటి నామం ఒకటుంది.కర్పూరవీటీ సౌరభ్య కల్లోల కకుప్తటా అని. అక్కడ అది 14వ నామం. దీని అర్థం అమ్మ కర్పూరతాంబూల సుగంధంతో కల్లోలితమైన జగత్ప్రదేశం కలది అని.

అమ్మ సేవించిన తాంబూల పరీమళం దిక్కులన్నిటా వ్యాపించిందీ అని చెప్పటంలో ఒక విశేషం ఉంది.

దిగంతరా అని అమ్మను సంబోధించారు కదా. అంతరము అంటే కట్టుకోక అని అర్థం. దిగంతరా అంటే అమ్మకు దిక్కులు పరిధానంగా ఉన్నాయని. అంటే అమ్మ తాంబూలపు పరిమళానికి దిక్కులు ఆకర్షణ చెంది వచ్చి చుట్టూ చేరి ఒక ఆవరణ (పరిధానం, అంతరం)లా ఏర్పడ్డాయని చమత్కారం.

అలా ఎందుకు చుట్టు చేరారు దిగ్దేవతలు అని అనవచ్చును. అమ్మ తాంబూలం అత్యంత మహిమాన్విత మైనది. అమ్మ తాంబూలకబళం అనుగ్రహిస్తే సేవించి తరించాలన్న తాపత్రంయంలో దిగ్దేవతలు చుట్టుముట్టి ఉన్నారని అర్థం.

ఏమిటండీ ఆ మహిమా విశేషం అంటారా? అదీ చూదాం ఒక చిన్న కథలో.

అది క్రీ.శ. 4వ శతాబ్దం. కంచిలో విద్యాపతి గారనే ఒక ఖగోళ జ్యోతిర్విద్వాపారంగతుడొకాయన ఉండే వాడు. ఆయన కొడుకు మూగవాడు. ఆ పిల్లవాడు తన గతికి వగస్తూ అమ్మను వేడుకొంటూ కంచి కామాక్షీ అమ్మవారి సన్నిధానంలో నిత్యం ఉండేవాడు.

ఒకరోజున పెద్దావిడ కర్పూరతాంబూలం నములుతూ అలయంలో తిరుగుతూ ఉంది. ఈ మూగపిల్లవాడూ ఆతని పక్కనే ధ్యానం చేసుకుంటున్న మరొక సాధకుడూ ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళింది.

తన నోటిలోని తాంబూలం నుండి ఒక చిన్న పిడచ తీసి ఆ సాధకుడికి ఇవ్వబోయింది. ఆతను చీచీ అంటూ దూరంగా తొలగి పోయాడు.

అమె ఆ పిడచను ఆ మూగ పిల్లవాడి దోసెట్లో వేసింది. అతడు కళ్ళకద్దుకొని నోటిలో వేసుకొన్నాడు.

మరుక్షణం ఆ పిల్లవాడికి మాటవచ్చింది. వచ్చింది మాటా? అది మహాగంగా ప్రవాహం వంటి కవితాధార!  ఆ తాంబూలకరండం అనుగ్రహించిన పెద్దావిడ కంచి కామాక్షీ అమ్మవారు అని ఆ మూగపిల్లవాడు గ్రహించాడు జన్మాంతర సంస్కారప్రభావంతో. అంతే, ఆ మహామహిమాన్విత తాంబూలకరడం కళ్ళకద్దుకొని స్వీకరించాడు. ఆ మూగ పిల్లవాడు మహా కవి ఐపోయాడు తక్షణమే.

ఆశువుగా ఆ పిల్లవాడు అమ్మని స్తుతిస్తూ ఐదువందల శ్లోకాలు చెప్పాడు. ఆ స్తోత్రాన్ని మూకపంచశతి అంటారు. ఆ ఐదు వందలలో ఒక వంద ఆర్యాశతకంగా అమ్మవారి గొప్పదనాన్ని వివరించేదిగా. ఒక వంద స్తుతిశతకంగా అమ్మను స్తుతించేదిగా , ఒక వంద కటాక్షశతకంగా అమ్మ కళ్ళను గురించి , ఒక వంద మందస్మితశతంగా అమ్మ చిరునవ్వును గురించి, ఒక వంద పాదారావిందశతంగా అమ్మ పాదారవిందాలను గురించి అద్భుతమైన శ్లోకాలతో చెప్పారు.

అమ్మ సంతోషించి, నాయనా నీకేం కావాలో కోరుకో అన్నది. అప్పుడు ఆ పిల్లవాడు "అమ్మా, నువ్వు అనుగ్రహించిన వాక్కుతో నిన్ను స్తుతించి తరించాను. ఇంక ఈ వాక్కును లౌకికవిషయాలను ప్రస్తావించి అపవిత్రం చేయలేను తల్లీ. నన్ను మళ్ళా యధాప్రకారంగా మూగవాడిని చేయమ్మా" అని అడిగాడు. అమ్మ చిరునవ్వుతో అనుగ్రహించింది.

అప్పటి కంచి శంకరమఠం పీఠాధిపతులు మార్తాండ విద్యా ఘనేంద్ర సరస్వతి స్వామి వారు ఈ వృత్తాంతం తెలిసి మహానందంతో ఆ పిల్లవాడిని ఉత్తరాధికారిగా స్వీకరించారు. ఆ పిల్లవాడు కంచిమఠానికి 20వ పీఠాధిపతిగా విరాజిల్లాడు.

చూసారా అమ్మ తాంబూల కబళం మహిమ.

అమ్మ తాంబూల మహిమను గురించి కాళిదాసు గారు తన అశ్వధాటీ స్తోత్రంలో ఏమంటున్నారో చూడండి.

చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ వన వాటీషు! నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా!
పాటీర గంధి కుచ శాటీ! కవిత్వ పరిపాటీ మగాధిప సుతా!
ఘోటీ ఖురాదధిక ధాటీ ముదార ముఖ వీటీ రసేన తనుతామ్.

అమ్మ తాంబూలరస మహిమతో గుఱ్ఱముల కంటే వేగంగా పరుగెత్తే ధాటి కల కవిత్వ శక్తి అబ్బుతుందని అంటున్నారు "ఘోటీ ఖురాదధిక ధాటీ ముదార ముఖ వీటీ రసేన తనుతామ్." అన్న ఆఖరు పాదంలో. మూకశంకరుల వృత్తాంతమే దానికి ఋజువు కదా.

ప్రసిధ్దమైన శ్యామలాదండకంలోనూ కాళిదాసమహాకవి అమ్మను గురించి "కుంద మందస్మితోదారవక్త్రస్ఫురత్పూగ కర్పూర తాంబూలఖండోత్కరే జ్ఞానముద్రాకరే, శ్రీకరే" అని వర్ణించారు.

అందుచేత దిగ్దేవతలు చుట్టూ చేరి అమ్మ అనుగ్రహించే తాంబూలకరండం కోసం వేచి ఉంటున్నారు అంటే ఆశ్చర్యం ఏముంది!

శంకర భగవత్పాదులు తమ సౌందర్యలహరీ స్తోత్రంలో అమ్మ తాంబూల మాహాత్మ్యం గురించి ఇలా ప్రస్తుతించారు.

రణే జిత్వా దైత్యానపహృతశిరస్త్రైః కవచిభిర్
నివృత్తైశ్చణ్డాంశత్రిపురహరనిర్మాల్యవిముఖైః
విశాఖేంద్రోపేంద్రైః శశివిశదకర్పూరశకలా
విలీయంతే మాతస్తవ వదనతాంబూలకబళాః

రాక్షసుల్ని జయించి వచ్చారు ఇంద్రుడూ ఉపేంద్రుడూ కుమారస్వామీ సంతోషంగా. వారికి అమ్మ ఆదరంగా తన కర్పూరతాంబూలపు తునకల్ని ఇస్తోందట వాటికోసం వాళ్ళు పోటీపడుతూ లాక్కుంటున్నారట. పోనీ అయ్యవారి  నుండి తాంబూలం గ్రహించడయ్యా పోండి అందామంటే ఆయన గారి తాంబూలం మీద హక్కులన్నీ చండీశ్వరుడివే కాబట్టి అవి వాళ్ళకు అక్కరలేదట. అమ్మ తాంబూల ప్రసాదమే కావాలట.

కుమారస్వామీ, విష్ణువూ, ఇంద్రుడూ కోరి స్వీకరించే అమ్మ తాంబూల ఖండాల కోసం దిగ్దేవతలు చుట్టుముట్టి కాచుకొని ఉంటున్నారు అంటే అది సహజమే కదా.

బహిర్మాతృకాన్యాసంలో అమ్మ జిహ్వకు 'అం' అని బీజంతో న్యాసం.

13, మే 2019, సోమవారం

25. శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా। 10

అమ్మ స్వరూపాన్ని వశిన్యాదులు బహు చమత్కారంగా వర్ణిస్తున్నారు. ఈ శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా అన్న నామంలో అమ్మ పలువరుసను గురించి చెబుతున్నారు.

ఈ నామంలో ద్విజ శబ్దం కనిపిస్తోంది కదా. ద్విజుడు అన్న మాటకు సంస్కృతంలో ప్రచారంలో ఉన్న అర్థం బ్రాహ్మణుడు అని.

కాని ఈ ద్విజ శబ్దం గురించి చాలా చాలా చెప్పుకోవచ్చును. బ్రాహ్మణుడు అనే కాదు దంతాలకు కూడా ద్విజ శబ్దం వర్తిస్తుంది. ఎందుకబ్బా అని మీరు అడగవచ్చును.

ఆసలు ద్విజము అంటే రెండుసార్లు పుట్టినది అని వ్యుత్పత్తి అర్థం.  అదేం మాటండీ, బ్రాహ్మణుడు పుడతాడా యేమిటీ అని మీరు అనవచ్చును. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః అని సూక్తి. అంటే బ్రాహ్మణ దంపతులకు పుట్టగానే ఎవ్వడూ బ్రాహ్మణుడు కాడు. ఉపనయనం అన్న సంస్కారం పొందిన తరువాతనే వాడు బ్రాహ్మణుడు. అలాగెందుకండీ అంటే ఉపనయనం లోనే గాయత్రీ మంత్రోపదేశం లభిస్తుంది. ఆ పిమ్మటనే వేదాధ్యయనానికి అధికారం వస్తుంది. అందుకని. ఇది సంప్రదాయికమైన అర్థం. ఈ కాలం వాళ్ళకు ఈమాటలు నచ్చకపోతే అది వేరే విషయం.

నిజానికి ఉపనయనసంస్కారం అనేది త్రైవర్ణికులకు సామాన్యమే ఐనా బ్రాహ్మణులనే ద్విజులు అని సాధారణంగా ఎందుకు సంబోధిస్తారూ అన్న ప్రశ్న వస్తుంది. ఉపనయనంతో పాటే వేదాధ్యయనాధికారమూ త్రైవర్ణికులకు సాంప్రదాయికంగా ఉన్నా, వారికి ఆచార్యత్వం విధించబడలేదు.  బ్రాహ్మణులకు అధ్యయనమూ, అధ్యాపనమూ, దానమూ, ప్రతిగ్రహమూ, యజనమూ, యాజనమూ తప్ప ధనసంపాదనకోసం ఏవృత్తినీ చేపట్టే అధికారం వేదం ఇవ్వలేదు. వారు గురువులుగా ఉండి ప్రజల ఆదరణతో బ్రతుకవలసిందే. అందుకే గురుత్వసిద్ది కారణంగా బ్రాహ్మణులకే ద్విజులు అన్న మాట రూఢంగా వినిపిస్తూ ఉంది.

శాఖాచంక్రమణం ఆపుదాం. ద్విజము అంటే రెండుసార్లు పుట్టినది అని వ్యుత్పత్తి చెప్పుకున్నాం కదా దంతములకు ద్విజత్వం ఏమిటీ అని అనవచ్చును. మరి దంతాలు మనుషులకు రెండు సార్లు వస్తాయి కదండీ జీవితంలో. అందుకే అవి ద్విజములు.

కాబట్టి ఇక్కడ ద్విజపంక్తి అంటే దంతాల వరుస అని అర్థం చెప్పుకోవాలి.

ద్విజపంక్తి ద్వయం అంటే దంతాల వరుసల జత అన్నమాట.

ఉజ్వలంగా ప్రకాశిస్తున్న అమ్మ దంతాల వరుసలు ఎలా ఉన్నాయీ అన్నది ఈ నామం శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా అన్న దానిలో చెబుతున్నారు.

అవి శుధ్ధవిద్యాంకురాల్లాగా ఉన్నాయట.

శుధ్ధవిద్య అంటే శ్రీవిద్య.  అంటే అమ్మకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించే విద్య అని అర్థం. అవిద్యను జయించి జ్ఞానం ప్రసాదించేది శ్రీవిద్యయే కదా అందుకని.

సా భవతి శుధ్ధవిద్యా యే దన్తా హస్తయో రబేధమ్ ఇతి. అన్నిటితోనూ తనకు అబేధబుధ్ధిని కలిగించేదే శుధ్ధవిద్య.  అదే శ్రీవిద్య. అమ్మ మొదట ఈ శ్రీవిద్యను శిష్యులకు స్వయంగా ఉపదేశించింది. అమ్మ నోటనే ఆవిష్కృతం ఐన కర్ణోపదేశంగా లోకంలో వ్యాప్తిచెందింది.  పరా, పశ్యంతీ. మధ్యమా వైఖరీ రూపములలో విద్యను వెలువరించిన మన అమ్మ దంతాలే శ్రీవిద్యకు అంకురాలు

ఒక గింజని భూమిలో పాతామనుకోండి. అది మొక్కగా ఎలా మారుతుందీ చూదాం. మొదట అది ఉబ్బుతుంది. ఈ స్థితిని పరావస్థ అంటారు.  ఉబ్బి ఉబ్బి అది విచ్చిపోతుంది కదా. అది పశ్యంతీ అనే అవస్థ.  విచ్చటం అంటే దానినుండి ఒక చిన్న మొగ్గలాంటిది బయటకు వస్తుంది.  జాగ్రత్తగా చూస్తే అందులో రెండు దళాలుంటాయి. కాని అవి అంటుకొని ఉంటాయి. ఇది మధ్యమావస్థ. కొద్దిగా కాడలా పెరిగి,  ఆ రెండుదళాలు మొల్లగా కొంచెంగా విడిపోతాయి. ఇది వైఖరీ అవస్థ. ఈ అవస్థలో ఉన్న మొక్కకే అంకురం అని పేరు.

శ్రీవిద్య యొక్క పూర్ణదీక్ష ప్రధానవిద్య, షోడశాక్షరీవిద్య, శుధ్దవిద్య అని మూడు రకాలైన బీజ ప్రస్తారాలు కలదిగా ఉంది. అందునా షోడశాక్షరీవిద్యకు కూడా శుధ్ధవిద్య అన్న వ్యవహారం ఉంది. ఈ షోడశికి 16 బీజాలు. ఇవి వైఖరీ స్థితికి అనగా అంకురస్థితికి వచ్చేసరికి 16 x 2 = 32 అక్షరాలు అవుతున్నాయి. 32 విద్యాంకుర దళాలు అమ్మకు 32 దంతాలు అన్నమాట. అంకురస్థితిలో ప్రతిబీజమూ శివ శక్తి విభాగాలుగా రెండుగా అవుతున్నది కాబట్టి 16 బీజాలు 32 అంకురాలుగా అవి అమ్మకు దంతాలుగా చెప్తున్నారు. ఇవన్నీ శ్రీరాజరాజేశ్వరీ మంత్ర వర్ణాలు.

శుధ్దవిద్యాంకురాలు అని చెప్పబడే అక్షరాలు అ, ఇ, ఉ, ఋ, ఌ, క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ఞ్, ట, ఠ, డ, ఢ, ణ, త , థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, స, హ. ఇవే అమ్మకు దంతరూపాలుగా ఈ నామం ద్వారా చెప్పారన్నమాట.

మరొక విధంగా కూడా అన్వయం ఉంది. శుధ్దవిద్యా చ  బాలా చ ద్వాదశార్థా మతంగినీ అని శ్రీవిద్యా మంత్రదీక్షలు 32 రకాలు. ఈ 32 విద్యావిశేషాలే అమ్మకు దంతాల వంటివి అని చెప్పటం. దీక్షల విషయంలో కూడా సాధకుడిని ద్విజుడు అనే అంటారు. ఎందుకంటే మంత్రదీక్షను పొందక మునుపు, మంత్రదీక్షను పొందిన పిదప వేర్వేరు జన్మలుగా లెక్క, అందుకే దీక్షానామం అని వేరే ఉంటుంది. దీక్షను పొందినప్పుడు అంతకు ముందు ఉన్న నామధేయం పోయి గురువులు పెట్టిన సరికొత్త పేరు వ్యవహారంలోని వస్తుంది కాబట్టి దీక్షాపరులు ద్విజులు అవుతున్నారు. ఇలాంటి ద్విజుల పంక్తి ద్వయమే అమ్మకు దంతముల వంటివి అని అన్వయం చెప్పవచ్చును.

ఈ 32 దీక్షలు ఏవి అన్న విషయంలో కొంత చర్చ ఉంది. 32 దీక్షల గురించి భాస్కరరాయలు చెప్పినా వాటిలో కొన్ని కొన్ని స్మృతి శ్రుతి విరుధ్ధం కాబట్టి అలా అంగీకరించటం కుదరదు. సమయ దక్షిణాచారంలో 16 దీక్షామంత్రాలే ఉన్నాయి. ఈ 16 దీక్షామంత్రాలే శివశక్త్యాత్మకంగా అంకురాలుగా గ్రహించి అమ్మకు రెండు పలువరుసలుగా చెప్పటమే వేదసమ్మతంగా ఉంటుంది.

ద్విజపదానికి విప్రులు అన్న అర్థాన్ని గ్రహించి, ఆ విప్రులు వేదవిద్యలను శిష్యపరంపర ద్వారా వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి వారు శుధ్ధవిద్యకు అనగా వేదవిద్యకు అంకురాలు అన్న భావాన్ని ఆలంబనం చేసుకోవటమే ఎక్కువ సముచితంగా ఉంటుంది.  విద్యావహై బ్రాహ్మణ మాజగామ అని శ్రుతి కదా. అమ్మ నిర్మలమైన విద్యాస్వరూపులైన బ్రాహ్మణులచేత పరివేష్టించబడి ఉందన్న తాత్పర్యం ఈ శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా నామానికి చెప్పుకోవటం బాగుంటుంది. బ్రాహ్మణోఽస్య ముఖ మాసీత్ అన్న శ్రుతిని బట్టి విరాడ్రూపురాలైన అమ్మకు బ్రాహ్మణోత్తములు వదనమునందు దంతపంక్తులుగా విరాజిల్లుతున్నారన్న తాత్పర్యం గ్రాహ్యం.


7, మే 2019, మంగళవారం

24. నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా। 8

ఈ నామం నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా అనే దానిలో ఉన్న పదాల అర్థాలను ముందుగా చూదాం.

నవ అంటే తాజాగా ఉన్న అని అర్థం.
విద్రుమం అంటే పగడం.
బింబం అంటే దొండపండు
న్యక్కారం అంటే తిరస్కారం. ఛీకొట్టటం అన్నమాట.
రదనం అంటే దంతము. అనగా పన్ను.
ఛదము అంటే ఆఛ్ఛాదనము అనగా కప్పు.
రదనఛ్ఛదము అంటే దంతములను కప్పి ఉంచేది. అనగా పెదవి అని అర్థం.

ఈ నామంలో ప్రస్తావించిన విద్రుమమూ, బింబమూ రెండూ ఎఱ్ఱనివి. ఇక్కడ వాటికి రెండింటికీ అన్వయించే విధంగా నవ అన్న పదం ముందుగా జోడించారు కాబట్టి తాజా పగడాలూ దొండపండ్లూ అని గ్రహించాలి.

తాజా దొండపండు అంటే తెలుస్తుంది. దొండకాయ బాగా పండితే అది చాలా ఎఱ్ఱగా ఉంటుంది. అది.

కాని తాజా పగడం ఏమీటీ అనవచ్చును. తాజా పగడం అంటే అప్పుడే మెరుగుపెట్టిన పగడం అన్నమాట. ఏ మాలిన్యమూ అంటని దానికి మంచి శోభ ఉంటుంది.

ఈ రెండింటి యొక్క అరుణిమనూ కూడా అమ్మ పెదవులు త్రోసివేస్తున్నాయని ఈ నామం తాత్పర్యం. అమ్మ పెదవులు సర్వకాలాల్లోనూ సహజమైన గొప్ప అరుణిమను కలిగి ఉంటాయని చెప్పటం ఈ నామం ఉద్దేశం.

పరోక్షంగా దొండపండు శోభ కొంచెమే, అదీ కొద్దికాలమే. ఎంత అందంగా మెరుగుపెట్టిన పగడం ఐనా అది గాలిలోని దూళిని పట్టుకొని కాంతిహీనం అవుతుంది మెల్లగా.  కాని అమ్మ పెదవుల సౌందర్యం కాలాతీతమైనది అని స్పష్టం చేయటం అన్నమాట.

శంకరభగవత్పాదుల సౌందర్యలహరీ స్తోత్రంలోని ఈ 62వ  శ్లోకం చూడండి.

ప్రకృత్యా రక్తాయాస్తవ సుదతి దన్తచ్ఛదరుచేః
ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలతా
న బిమ్బం తద్బిమ్బప్రతిఫలనరాగాదరుణితం
తులామధ్యారోఢుం కథమివ విలజ్జేత కలయా

ఇక్కడ శంకరులు అమ్మను ఉద్దేశించి అంటున్నారు. చక్కటి పళ్ళ వరుస ఉన్న తల్లీ!, నీ పెదవులు స్వభావసిధ్ధంగానే కెంపులవలె రక్తవర్ణంలో ఉన్నాయి. వాటిని మరి వేటితోనూ పోల్చటం కుదరదు.

నీ క్రిందిపెదవికి సహజమైన కాంతి ఉన్నది. అది పగడపు తీవకు పండు కాస్తే ఆ పండు ఎలా ఉంటుందో అలా ఉంది. కాని ఏంచేసేదీ, పగడపు తీగ అంటారే కాని అలాంటి తీగ లేదు. పగడాలు తీగలకి కాయవు. అవి పండటం మరింత అబధ్ధం.

పోనీ దొండపండుతో పోలుద్దాం అనుకుందాం.  దొండపండు ఎఱ్ఱగా ఉన్నా అది కాంతిమంతంగా ఉండదే. అసలు దొండపండును బింబం అంటాం. బింబం అంటే ప్రతిబింబించేది అని కదా వ్యుత్పత్తి?  ఆ దొండపండుకు బింబం అన్న పేరు రావటానికి కారణం అది నీ అధరాలను ప్రతిబింబించటం వల్లనే కాని దాని గొప్ప యేం లేదు.

అంటే శంకరుల ఆలోచనకు పిండితార్థం, అమ్మ పెదవుల శోభను పోల్చటానికి మనకు వేరే వస్తువు లోకంలో లేదు అని.

మహాకవి కాళిదాసు గురించి తెలుసును కదా? ఆయన అమ్మపై చేసిన శ్యామలాదండకం జగత్తులో మహా ప్రసిధ్ధికి ఎక్కినది.  అందులో ఆయన

కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,

అని అన్నారు. ఇక్కడ శోణాధరే అన్నదానికి అర్ధం ఎఱ్ఱని పెదవులు కల తల్లీ అనే.  పక్వబింబాధరే అని ముక్తాయించి చెప్తున్నారు కదా పక్వబింబం అంటే చక్కగా పండిన దొండపండు అని. ఈ పక్వ అన్న మాటమీద నవత్వాన్ని ఆరోపించుకొనవచ్చును.

అమ్మ పెదవుల అరుణిమ సహజమైనది. ఆ అరుణిమతో అమ్మ స్మేరశోణాధరే అనగా చిన్నగా నవ్వుతున్న తల్లి అని అర్థం.

పెదవుల్లో పైపెదవికి విద్రుమం అనీ క్రిందిపెదవికి బింబం అనీ సంజ్ఞలు ఉన్నాయట.

బహిర్మాతృకాన్యాసంలో పెన క్రింద పెదవులకు ఏ ఐ అన్నవి న్యాసబీజాలు.

23. పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః

పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా। 8

పద్మరాగ మణుల గురించి మనం ఇప్పటికే చదువుకున్నాం 14వ నామం ఐన కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా అన్న దాని వ్యాఖ్యలో.

ఈ పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః అన్న నామంలో పరిభావము అనే పద విశేషం ఉంది. పరిభావం అన్నా పరాభవం అన్నా ఒక్కటే.  పరిభావి అంటే పరాభవించేది అని అర్థం.

పరిభావి కపోలభూః అన్నారు. కపోలము అంటే చెక్కెలి.  దీనిని బట్టి అమ్మ నామం పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః అన్నది అమ్మ చెక్కిళ్ళకు సంబంధించినది అని తెలుస్తోంది కదా.

ఆదర్శం అన్న మాటను మనం తరచుగానే వింటూ ఉంటాం. ఇక్కడ ఆదర్శం అన్న మాట ఎక్కడుందంటారా?  శిలాదర్శ అన్నమాటను విడదీసి చూస్తే అది శిలా + ఆదర్శ అన్న మాటల కలయిక అని తెలుస్తుంది సులువుగానే.  శిల అంటే రాయి. ఇది మామూలు రాయి కాదు. పద్మరాగశిల అందుకే పద్మరాగశిలాదర్శ అన్నారు.

ఇంక ఆదర్శం అంటే అర్థం అద్దం అని!

సరే ఇంక ఈ నామం చెప్పే భావం ఏమిటో తెలుసుకుందాం.

పద్మరాగాలు మణులు. కాని మణులూ శిలావిశేషాలే. అందుకే పద్మరాగశిలా అన్నారు. ఈ శిలలు ఎంతో నున్నగా ఉంటాయి. అంటే చక్కగా అద్దాల్లాగా అన్నమాట. అద్దాల్లాగా ఉండటం అంటే వాటిలో మన బొమ్మ చూసుకోవచ్చును. అంత నున్నగా ఉంటాయి.

అద్దాల్లాగా ఉన్న పద్మరాగశిలలు ఎఱ్ఱగా నున్నగా అందంగా ఉంటాయి.

ఐతే వాటి కన్నా గొప్పవి ఉన్నాయి లెండీ, వాటి గొప్ప ఒక లెక్కా అంటూన్నారు.

అమ్మ చెక్కిళ్ళూ ఎఱ్ఱగా నున్నగా అందంగా ఉంటాయి.

వాటి ముందు ఆ పద్మరాగ శిలల అద్దాలు దిగదుడుపే అంటున్నారు వశిన్యాదులు స్తోత్రం చేస్తూ అమ్మని. అమ్మ చెక్కిళ్ళ అరుణిమ ముందు పద్మరాగా లేపాటీ, అమ్మ చెక్కిళ్ళ నున్నదనం ముందు ఆ పద్మారాగా లేపాటీ అని పద్మరాగాలను అమ్మ చెక్కిళ్ళు తిరస్కరిస్తున్నాయి అని చెప్తున్నారు.

పద్మరాగశిలలను అద్దాల్లాగా సానబడితే ఆ అద్దాల్లో మన ప్రతిబింబం చూసుకోవచ్చునే. మరి అంతకు మించినవి  అమ్మ చెక్కిళ్ళు అని అంటున్నారు చూడండి, ఆ అనటంలో ఒక చమత్కారం ఉంది. అమ్మ చెక్కిళ్ళనే అద్దాల్లో కామేశ్వరుడి ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుందని ఆ చమత్కారం.

మంచి వయస్సులో అంటే నిండుయౌవనంలో ఉన్న అమ్మాయి చెక్కిళ్ళి కించిత్తుగా ఎరుపుదనం కలిగి ఉండటం సహజం.  అందులోనూ అందమైన అమ్మాయి ఐతే ఇంక చెప్పేదేముందీ? ఇంక మృదుత్వమా సరేసరి.

అమ్మ సర్వలోకాల్లోనూ ప్రతిలేని సౌందర్యరాశి.

ఆవిడ నిత్యయౌవన మూర్తి.

అందుచేత ఆవిడ చెక్కిళ్ళు మరెంత మృదువుగా ఉంటాయీ? మరెంత ఎఱ్ఱగా ఉంటాయీ? మీరే ఊహించుకోండి.

అన్నట్లు, నిత్యయౌవనా అన్నది కూడా అమ్మ సహస్రనామాల్లో ఒకటి. ఇది ముందుముందు వస్తుంది 430వ నామంగా.

అమ్మ యజ్ఞకుండం నుండి ఆవిర్బవించిన సమయంలో తల్లి ముఖ మండలం కామేశ్వరుడి తేజస్సుతో ఏర్పడింది. అందుచేత అమె చెక్కిళ్ళలో కామేశ్వరుడే దర్శనీయుడు కావటం సూచితంగా ఉండటం మనోహరంగా ఉంది.

అమ్మ ముఖమండలాన్ని ధ్యానం చేసే భక్తులకు అమ్మ ముఖదర్శనంతో బాటే కామేశ్వరదేవుడి దర్సనమూ అవుతున్నది అన్నది మనం గ్రహించవలసిన  రహస్యం.

శ్రీవిద్యలో బహిర్మాతృకాన్యాసంలో కుడి ఎడమ కపోలాలకు ల, లూ అనేవి న్యాసాక్షరాలు.

5, మే 2019, ఆదివారం

22. తాటంకయుగళీభూతతపనోడుపమండలా

కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా
తాటంకయుగళీభూతతపనోడుపమండలా 8

తాటంకము అంటే చెవికమ్మ. యుగళం అన్నారు కాబట్టి వాటి జంట. ఈ తాటంకయుగళీభూతతపనోడుపమండలా అన్న నామంతో అమ్మ యొక్క చెవికమ్మలను వర్ణిస్తున్నారు వశిన్యాదులు.

తపనుడు అంటే సూర్యుడు. తన తీక్షణమైన తేజస్సుతో జీవులను తపింపజేస్తాడు కాబట్టి సూర్యుడికి అలా తపనుడు అన్న పేరు వచ్చింది.

ఉడుపుడు అంటే చంద్రుడు. ఉడు అన్న సంస్కృత శబ్దానికి అర్థం నక్షత్రం అని. ప అనే ప్రత్యయం ఆధిపత్యాన్ని చెప్పేది. అందుచేత ఉడుప అంటే నక్షత్రాలకు అధిపతి. నక్షత్రాలు రాత్రి మాత్రమే మనకు కనిపించేవి. ఆకాశం నిండా నక్షత్రమండలాలూ వాటినిండా నక్షత్రాలూనూ. కాస్త చీకటి రాత్రి కనుక ఐనట్లైతే వాటి ధగధగలతో ఆకాశం ఎంత శోభాయమానంగా ఉంటుందంటే ఆ శోభను తిలకించటం అనే ఆనందం ఉందే, అది అనుభవించవలసిన ఆనందమే కాని మాటల్లో చెప్పలేం. రానురాను నగరాల్లోని దీపకాంతులు వెదజల్లే వెలుగుల మధ్య నుండి నక్షత్రాలను తిలకించటం దుస్సాధ్యంగా ఉంటోంది. దీన్ని కాంతి కాలుష్యం అనుకోవచ్చును. అంతరిక్షం నుండి చూస్తే నగరాలన్నీ ఈ కాంతికాలుష్యకాసారాలుగా కనుపిస్తున్నాయి.

ఒకప్పుడు వేసవి వచ్చిందంటే ఆరుబయటకు మారేవి ప్రక్కలు. మదత మంచాలు వేసుకొని చుట్టు ఉన్న చెట్లనుండి అప్పుడప్పుడూ వచ్చి పలికరించే కాస్త చల్లని గాలుల్లో సేదతీరుతూ నిద్రించే వాళ్ళం. నిద్రప్టట్టే దాకా ఆకాశంలోని నక్షత్రాలను చూడటం ఒక అందమైన వినోదం. ఈ కాలంలో అది అసాధ్యం ఐపోయింది కదా. ఇంకా నాగరీకం ముదరని పల్లెలు ఉంటే అక్కడ ఈ ఆనందం వెతుక్కోవచ్చు నేమో. అలా వెలుగుచుక్కల ముగ్గుల శోభలతో మురిపించే అకాశంలో చందమామ మరొక ఆనందం. ఆ చందమామను చూస్తూ ఎంతసేపన్నా వినోదించవచ్చును.

ఆకాశం నిండా నక్షత్రాలూ వాటి మధ్యన చందమామ. ఆ నక్షత్రాలకు ఒక రాజుగా వెలుగుతూ ఉంటాడు చంద్రుడు. పురాణాల ప్రకారం నక్షత్ర కన్యలకు భర్త కద చంద్రుడు. అందుకే చంద్రుడు ఉడుప పదంతో సంబోధించబడతాడు.

ఈ నామం తాటంకయుగళీభూతతపనోడుపమండలా అన్న దానిలో మండలా అని చెప్పారు కదా, దానికి అన్వయం తపన మండలా ఉడుప మండలా అని సూర్యచంద్ర బింబాలను రెండింటికీ వర్తిస్తుంది.

అమ్మకు చెవి కమ్మలు రెండున్నాయి కదా. వాటిలో ఒకటి సూర్యబింబం మరొకటి చంద్రబింబం అని ఈ నామం తాత్పర్యం. అమ్మకు సూర్యచంద్రులు దుద్దుల జత అన్నమాట!

అమ్మ బ్రహ్మాండమే ఆకారమైన తల్లి. కాబట్టి ఆవిడకు సూర్యచంద్రులు చెవిదుద్దులు అంటే బహుసొగసుగా ఉంది.

అమ్మకు వారే నేత్రాలు కూడా అని వేదవాక్యం.

సూర్యచంద్రస్తనౌ దేవ్యా స్తావేవ నయనౌ స్మృతౌ
ఉభౌ తాటంకయుగళ మిత్యేషా వైదికీ శృతి.

అందుచేత ఆ సూర్యచంద్రులు అమ్మకు కళ్ళు. వాళ్ళు అమ్మకు చెవిదుద్దులు. వాళ్ళే అమ్మకు స్తనయుగళం కూడా.

అమ్మ పరాశక్తి. కాబట్టి ఆవిడ సూర్యచంద్రుల్నే చెవిదుద్దులుగా  ధరించ గలిగినది. వేరే దేవతలకు వల్లకాదు.

ఈ నామం అమ్మ విరాడ్రూపి అన్నది మనని స్మరించ మని ప్రబోధిస్తున్నది.

చెవికమ్మలు స్త్రీలకు సౌభాగ్య వర్ధకాలు. అసంగతిని పురస్కరించుకొని మన శంకరభగవత్పాదులు చెప్పిన సౌందర్యలహరీ స్తోత్రంలోని ఈ శ్లోకం పరికించండి.

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః
కరాలం యత్ క్ష్వేలం కబలితవతం కాలకలనా
న శమ్భోస్తన్మూలం తవ జనని తాటఙ్కమహిమా!!

బ్రహ్మేంద్రాదులు అమృతం సేవించి జరామరణాలను దూరంగా ఉంచగలుగుతున్నారు. కాని కాలం అనేది వాళ్ళనూ వదలదు. (వాళ్ళకీ లయం కావటం అన్నది ఉన్నది!)  ఇకపోతే మీఆయన అమృతం తాగనే లేదే. సరికదా, పైగా పరమభయంకరమైన విషాన్ని తాగాడు. ఐనా చిత్రం ఆయన కాలానికి ఎన్నడూ లొంగడు. ఎప్పుడూ ఉండేవాడై సదాశివుడు అనిపించు కుంటున్నాడు. ఇదంతా సౌభాగ్యకారకాలైన నీ చెవికమ్మల మహిమయేకదా అమ్మా అంటున్నారు ఈ శ్లోకంలో శంకరులు.

ఈ శ్లోకం మహిమను గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో మంది అమ్మల సౌభాగ్యాన్ని ఈ శ్లోకపారాయణం రక్షించింది అని పెద్దలు నిత్యం చెబుతూ ఉంటారు.  నమ్మని వారికి దేనివలనా ప్రయోజనం ఉండదు. నమ్మిన వారు ఈ శ్లోకాన్ని నిత్యపారాయణం చేసి సత్ఫలితాన్ని పొందుదురు కాక.

తమిళనాట తిరుక్కడయూర్ అని ఒక ఊరుంది. అక్కడ పార్వతీ అమ్మవారు అభిరామి అనే పేరుతో కొలువై ఉంది. అమ్మ దేవాలయంలో నిత్యం అమ్మను ధ్యానిస్తూ ఉండే ఒక భక్తుడు అభిరామ భట్టర్. నిజానికి ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్.

ఒకరోజున అమ్మ దర్శనానికి విచ్చేసిన శరభోజీ మహారాజు గారు ఈ ధ్యాననిమగ్నుడై తనని గమనించకుండా ఉన్న అభిరామ భట్టర్ గారిని చూసి కొంచెం ఆగ్రహం చెందుతాడు. సాధారణంగా రాజు కాని రాజకుటుంబం కాని వచ్చినప్పుడు భద్రత నిమిత్తం ఆలయం ఖాళీ చేయిస్తారు. అర్చకులు తప్ప గుడిలో ఎవర్నీ ఉండనివ్వరు. ఐతే గుడిలో అయ్యరు ఉండటమే కాక తనని పట్టించుకోలేదు! ఆగ్రహం రాదూ మరి?

అక్కడి అర్చకులు పరిస్థితిని చక్కదిద్దటానికి గాని ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ ఒక పిచ్చివాడిలాగా ఎప్పుడూ అక్కడే అమ్మని ధ్యానిస్తూ కూర్చుంటాడనీ, ఎవర్నీ పట్టించుకోడనీ తామూ అతడి ఉనికిని పట్టించుకోమనీ ఆగ్రహించవద్దనీ మనవి చేసారు రాజుగారికి.

సరే ఇతని సంగతి ఏమిటో కనుక్కుందాం అనుకొని రాజుగారి సరాసరి సుబ్రహ్మణ్య అయ్యర్ దగ్గరకు వెళ్ళి పలకరించాడు. కొంచెం ధాటీగా మాట్లాడినట్లున్నాడు. అయ్యరుకు ధ్యానభంగం ఐనది. అంతవరకూ అమ్మ ముఖారవిందాన్ని తిలకిస్తూ మైమరచి ఉన్నాడేమో ఉలిక్కిపడి చూసాడు రాజును.

"ఈరోజు తిథి ఏమిటి" రాజుగారు ప్రశ్నించారు.

వెంటనే అన్నాడు అయ్యరు "పౌర్ణమి" అని.

అందరూ నిర్ఘాంతపోయారు. రాజు ఐతే ఉగ్రుడే అయ్యాడు.

"అలాగా. సంతోషం. ఈరోజు రాత్రికి వస్తాను. నాకు నిండు చంద్రుణ్ణి చూపించండి" అని ఆజ్ఞాపించి చక్కాపోయాడు.

చుట్టూ ఉన్న అందరూ కంగారుగా, "ఎంత పని చేసావయ్యా, ఈరోజు అమావాస్య!" అని సుబ్రహ్మణ్య అయ్యరుతో అన్నారు.

సుబ్రహ్మణ్య అయ్యర్ కూడా ఆశ్చర్యపడి, జరిగిందేదో జరిగింది. అంతా అమ్మ చూసుకుంటుంది అని నిబ్బరంగా ఉన్నాడు. ఏమి జరుగుతుందో అని అర్చకులూ ఊరిజనమూ అందరూ ఆందోళన పడ్డారు. సాయంత్రానికి గుడివద్ద జనం గుమిగూడారు.

రాత్రి అయ్యింది. రాజుగారు మళ్ళా గుడికి వచ్చారు. ఈసుబ్రహ్మణ్య అయ్యర్ సంగతి ఏమిటో చూదామనే వచ్చారు. ఆయన వచ్చేసమయానికి తన్మయత్వంతో అయ్యరు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు.  అ స్తోత్రం అద్భుతంగా ఉంది. దాన్ని అంత్యాది అంటారు. అంటే ఒక చరణం ఏ మాటతో ముగుస్తున్నదో, దానితోనే తరువాతి చరణం చెప్పుతూ ఉండాలి. ఇలా నడుస్తోంది స్తోత్రం. ఈ అంత్యాదిని తమిళులు అందాది అంటారు. రాజుకు అశ్చర్యం అనిపించింది. ఈయన ఇంతటి కవీ భక్తుడూ అని ఆయనకు ఇంతవరకూ తోచనే లేదు.

సుబ్రహ్మణ్య అయ్యర్ అంత్యాది చెబుతూనే ఉన్నారు మైమరచి. 78 పద్యాలు పూర్తి ఐనవి. అప్పుడు మరొక అద్భుతం జరిగింది. నిండు చంద్రుడు ఉదయించాడు. అమావాస్య కాస్తా పున్నమిగా మారిపోయింది. వెన్నెల వెలుగులతో ఇలాతలం నిండిపోయింది.

జనసమూహం హర్షద్వానాలతో ఇలాతలం మార్మోగింది.

అంత్యాది స్తోత్రం నూరు పద్యాలతో ముగించి పరమానందంతో సుబ్రహ్మణ్య అయ్యర్ మన లోకం లోనికి వచ్చాడు.  కనులు తెరచి చూస్తే తన పాదాల వద్ద కన్నీళ్ళతో రాజు గారు.

" అమావాస్యను పౌర్ణమిగా మార్చగలిగిన మీరు మహామహిమాన్వితులు. తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి" అన్నాడు రాజు.

సుబ్రహ్మణ్య అయ్యర్ తన తలను అడ్డంగా ఆడించి. "మహా మహిమాన్వితురాలు అమ్మ. నాకే మహిమలూ లేవు. నా తలను కాచాలనే, నాకేసి చిరునవ్వుతో చూస్తూ,  అమ్మ తన చెవి కమ్మ ఒకదాన్ని ఆకాశంలోని ఎగురవేసింది. అదే నిండుచంద్రుడిలా వెన్నెల వెలుగులు కురిపించుతోంది" అన్నాడు.

మహారాజు ఆనందాశ్చర్యాలకు పట్టపగ్గాలు లేవు. ఈరోజునుండీ తమరు సుబ్రహ్మణ్య అయ్యర్ కాదు అభిరామ భట్టర్ అని అయ్యరుకు కొత్త పేరు పెట్టి గౌరవించి ఆయన పాదాలకు వంగి నమస్కారం చేసాడు. నిజానికి సాష్టాంగ నమస్కారం చేసే వాడే , కాని దైవసన్నిధానంలో ఒక్క అమ్మకు తప్ప మరెవరికీ అలా చేయరాదు కదా.

అబిరామ భట్టు కారణంగా ఈసూర్యచంద్రులే అమ్మ తాటంక యుగళం అన్నది ఋజువైనది.

1, మే 2019, బుధవారం

21. కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా


కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా
తాటంకయుగళీభూతతపనోడుపమండలా  8





ఈ కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా అన్న నామంలో వశిన్యాదులు అమ్మ తన చెవులపైన చేసుకున్న అలంకరణ గురించి చెబుతున్నారు.

కదంబం అంటే కడిమిచెట్టు. దీనికి రుద్రాక్షాంబ అని కూడా పేరుంది. మంజరి అంటే ఇక్కడ గుత్తి అని అర్థం. అందుచేత కదంబమంజరి అంటే కడిమి పూల గుత్తి. కొన్ని కొన్ని చెట్లకు పూవులు గుత్తులుగానే కాస్తాయి. మనం బంతిపూవు అనేది కానీ చేమంతిపూవు అనేది కాని నిజానికి ఒక పూలగుత్తి. బంతిపూవులో ప్రతి ఒక్క రేకా ఒక పువ్వు నిజానికి. అలాగే కడిమిచెట్టుకు కూడా గుండ్రటి ఆకారంలో గుత్తులు పూస్తాయి. అందుకే కదంబమంజరి అన్నారు. చైత్ర, ఆషాడ,శ్రావణ ఆశ్వీజ మాసాల్లోనే కడిమి  ఎక్కువగా పూస్తుంది.

కర్ణములు అంటే చెవులు. కర్ణపూరములు అంటే చెవులకు తగిలించుకొన్న చెవికమ్మలు. అమ్మ తన రెండు చెవులపైనా కడిమిపూల గుత్తుల్ని అలంకరించుకొన్నది. ఇక్కడ నామంలో క్లప్తము అన్న శబ్దం కనిపిస్తోంది కదా దాని అర్థం ఏమిటీ అంటే ఏర్పరించటం అని. అంటే చెవులకు అలంకరించటం అన్నమాట. ఆ అలంకరణ చాలా మనోహరంగా ఉంది అని అంటున్నారు. ఐతే ప్రసిధ్ధ దేవీ ఉపాసకులు తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారు కొంచెం విశేషంగా చెప్పారు. "కడిమిచెట్టు పూలగుత్తి యెడమచెవియందు నలంకరించుకొనియుండును. ఇది కర్ణపూరము. స్త్రీకి ఎడమ, పురుషునకు కుడి భాగములు ముఖ్యములు. ఇట్లు స్త్రీపురుషసంయోగమే అర్ధనారీశ్వరత్వము అగుచున్నది. కావున స్త్రీలు ఎప్పుడును ఎడమనుండి అలంకరించుట ప్రారంభించవలయును. " అని.

మన సాహిత్యంలో ఈ కడిమిచెట్టు తరచుగానే ప్రస్తావనకు వచ్చింది.

తిలక్ అని ప్రసిధ్ధి చెందిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ ఒక కవితలో "ఆకు ఆకునీ రాల్చింది కడిమిచెట్టు" అంటాడు. నిజానికి కడిమిచెట్టు ఆకురాలుకాలంలో కూడా ఆకులు రాల్చదు. విశ్వనాథ సత్యనారాయణ గారు కవిసామ్రాట్టు. ఆయన కడిమిచెట్టు అన్న పేరుతో ఒక నవలనే వ్రాసారు.

కడిమిచెట్టు పూవులు శివుడికీ అమ్మకూ కూడా ఇష్టమైనవి. కుమారస్వామికి కూడా ఇష్టమైనవట. అవి శ్రీకృష్ణుడికీ ఇష్టమైనవే నట. ఈవిషయాలు మన పౌరాణిక సాహిత్యంలో తెలియవస్తున్నాయి.

పరమాత్ముడు బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు చేసిన లీలల్లో గోపికావస్త్రాపహరణం ఒకటి. అమ్మాయిల బట్టలెత్తుకొని పోయి ఆ పిల్లవాడు ఏ చెట్టుని ఎక్కి కూర్చున్నాడనుకున్నారు? కడిమిచెట్టు. ఆ స్వామి కాళీయుడి పడగలమీద తాండవం చేయటం కోసం ఒక చెట్టు ఎక్కి దానిపై నుండి కాళింది మడుగులోనికి దూకాడు - అదేమి చెట్టనుకున్నారు? కడిమి చెట్టు.

సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట గోపికావస్త్రాపహరణలీల గురించి. గోపికలు కాత్యాయనీ వ్రతం చేస్తున్నారు. కాని దిగంబరంగా జలక్రీడకు దిగారు మడుగులోనికి. అదీ కదంబవృక్షం ఎదురుగా. కదంబవృక్షం అమ్మవారికి సంబంధించినదే కాదు అమ్మ స్వరూపమే. ఆగ్రహించి వారికి బుధ్ధిచెప్పిన బాలకృష్ణుడికీ అమ్మవారికీ అబేధం. అమ్మవారు నారాయణుడి చెల్లెలు నారాయణి. పురుషుడిగా ఆ బ్రహ్మమే నారాయణుడు. స్త్రీరూపంగా భావిస్తే ఆవిడ నారాయణి. అందుకే కృష్ణుడు వాళ్ళతో కాత్యాయనీ వ్రతం కల్ల చేస్తున్నారని ఆక్షేపించాడు.

భగవద్గీతలోనూ కదంబవృక్షం ప్రస్తావన ఉంది.

హనుమంతుడి జన్మవృత్తాంతానికి కడిమి చెట్టుతో సంబంధం ఉందట. వివరం తెలియదు.

వామన పురాణంలో కూడా ఈ కడిమి చెట్టు ప్రసక్తి వస్తుంది.  మాఘమాసంలో శివపూజను గురించి

మాఘేకుశోదకస్నానం మృగమదేన చార్చనమ్‌
ధూపఃకదంబనిర్యాసో నైవేద్యం సతిలోదనమ్‌

అని చెప్తున్నది పురాణం. కడిమిచెట్టు బెరడు ధూపం వేసి నువ్వుల అన్నం నివేదించాలి అని ఇక్కడ కనిపిస్తున్నది.

ఈ కదంబవృక్షం అనగా కడిమిచెట్టు పూలు తెల్లగానో కాషాయవర్ణంలోనో ఉంటాయి. కొంచెం పసుపురంగు కూడా కలిగి ఉంటాయి. చాలా మంచి సువాసనగా ఉంటాయి. అంతే కాదు వాటి పరిమళం కొంచెం మత్తును కలిగించేదిగా కూడా ఉంటుంది. కడిమిచెట్టు పన్నెండేళ్లకోసారి పూస్తుంది అని ఒక నానుడి. నిజం కాకపోవచ్చును.

కదంబ అన్న శబ్ధంలో కొందరు ఒక విశేషాన్ని ఇక్కడ గమనించారు. అది చూదాం.

సంస్కృతంలో సంఖ్యలకు చిహ్నంగా మాటలను వాడటం అని ఒక ప్రసిధ్ధమైన పధ్ధతి ఉంది. దాన్ని కటపయాది విధానం అంటారు. దాని ప్రకారం క = 1 దం = 8 బ = 3 అవుతుంది. కాబట్టి కదంబ పదానికి 183 అన్న సంఖ్యవస్తుంది. ఇది ఒక ఆయనం ప్రమాణం. అంటే దక్షిణాయనం లేదా ఉత్తరాయణం దినప్రమాణం 183 రోజులు. కుడి ఎడమ చెవుల్లో అమ్మ కదంబాలు ధరించింది కాబట్టి ఆ అలంకార విశేషాన్ని సంవత్సరంలోని రెండు ఆయనాలకూ సంకేతంగా గ్రహించాలి అని వారి వివరణ. కాని ఈ వివరణ శుధ్ధతప్పు. ఎందుకంటే ఇలా సంఖ్యలను మాటల ద్వారా వ్యక్తీకరించే సందర్భాల్లో ఒక నియమం అంకానామ్ వామతో గతిః అని. అంటే సంఖ్యలో వచ్చే అంకెలను కుడినుండి ఎడమకు వేసుకొంటూ పోవాలి. అందువలన నియమం ప్రకారం కదంబ అన్నది 183 అన్న అంకెలను ఇస్తుంది కాని సంఖ్యగా 381 అవుతుంది.

పూర్వం విష్ణువు గార్దభాసురుణ్ణి సంహరించిన కథ ఒకటి ఉంది. శివుడిని మెప్పించి అందరు రాక్షసుల్లాగానే వాడూ వరం సంపాదించుకొని దేవతలని తిప్పలు పెట్టాడు. ఇంద్రుణ్ణే తరిమేసాడు స్వర్గం నుండి. వాడికి నేలమీదనూ, నరమృగాదుల వల్లనూ శివుడి వరం కారణంగా చావు లేదు మరి. విష్ణుమూర్తి మోహినీదేవి రూపంలో రాగా వాడు అమె వెంటబడ్డాడు. అప్పుడు విష్ణువు సమయం చూసి వాణ్ణి అకాశంలోని ఎగురవేసి తోడేలు  తల, మానవశరీరం కల రూపం ధరించి అంతరిక్షంలోనే యుధ్ధం చేసి సంహరించాడు. ఆసమయంలో పార్వతీదేవి కదంబవృక్షంగా అవతరించి అగ్నిజ్వాలలను చిమ్మి ఆ గార్దభాసురుడి సైన్యాన్ని నిర్మూలించింది.

అమ్మకు కదంబాలు అంటే మిక్కిలి ప్రీతి. కదంబవనవాసినీ అని కాళిదాసుగారు అమ్మను సంబోధించటం తెలుసు కదా. ఆయన చెప్పిన దేవీ అశ్వధాటీ స్తోత్రంలో కదంబాల ప్రసక్తి పదేపదే వస్తుంది. లలితాసహస్రనామ స్తోత్రంలోనూ ఈ కదంబం ప్రసక్తి ఈ నామంలోనే కాక కదంబవనవాసినీ అనీ కదంబకుసుమప్రియా అనీ వస్తుంది.

కదంబానికి సంస్కృతంలో నీపలత అని ఒక పేరు. నీఞ్ ప్రాపణే అన్న విగ్రహవాక్యం కారణంగా నీపము అంటే తన దగ్గరక్ చేర్చుకొనేది అని వ్యుత్పత్తి.  అమ్మకు కర్ణాభరణంగా ఉన్న నీపమంజరి సాధకులమైన మనను అమ్మ దగ్గరకు చేరుస్తున్నది అని భావం ఇక్కడ ద్యోతకం అవుతున్నది.