17, జులై 2019, బుధవారం

29. అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా


అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా
కామేశబద్ధమాంగళ్యసూత్రశోభితకంధరా। 12

లోకంలో ఉన్న వస్తువులను ఇతర వస్తువులతో పోల్చి చెప్పటం అన్నది కొత్త విషయం కాదు. అందరం ఈ పని చేస్తూనే ఉంటాం. ఐతే పోల్చటం అనే అవసరం ఎప్పుడు వస్తున్నది అన్నది కొంచెం ఆలోచించాలి ఇక్కడ.

చెప్పేవాడు వినేవాడు అనే ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలో పోలిక అవసరం వస్తున్నది కదా. అదికూడా ఫలాని వస్తువు ఎలాగు ఉన్నది అన్న విషయాన్ని చెప్పేవాడు విశదం చేయవలసిన సందర్భంలో. 

కాకి ఇలా ఉన్నది అని ఎవరూ కాకిని దేనితోనూ పోల్చి చెప్పనవసరం లేదు. వినేవాడు కాకిని ఎలాగూ చూసే ఉంటాడు కాబట్టి. అలాగే ఉంగరం అంటే ఇలా ఉంటుంది అని చెప్పనవసరం లేదు.  చెప్పేవాడు ఒక కొత్త వస్తువును గురించి చెప్పాలి అనుకోండి. అది అంతకు పూర్వం వినేవాడికి తెలిసి ఉండదని నమ్మకం అనుకోండి. అప్పుడు ఆ వస్తువును గురించి ఎలా చెప్పాలి? ఆ వస్తువు యొక్క ఆకృతిని దేనితో నైనా పోల్చి చెప్పాలి ఏదో విధంగా. దాని యందు గమనించిన లక్షణాలను కూడా వేటితో నైనా పోల్చి చెప్పాలి. అప్పుడు కదా వినేవాడికి కొంతగా అవగాహన వస్తుంది.

మరొక పక్షంలో మీరు ఒక కొత్త రకం కాకిని చూచారు. అది కాకి కావచ్చు కాని దానిలో  నేమి విశేషం ఉన్నదో ఎలాగో అలా పోలికల సహాయంతో కదా చెప్పగలిగేది. మాటవరసకు అది కొంగలాగా తెల్లగా ఉంది అన్నారనుకోండి. కొంగ తెలుపు ఎటువంటిదో తెలుసును కాబట్టి ఆ కొత్త కాకి మీకంటికి ఎలా కనిపించిందో ఆవలి వాడికి తెలుస్తుంది. అలాగే ఒక గద్ద అంత ఉంది అన్నారనుకోండి. అది ఎంత పరిమాణంలో ఉందో తెలుస్తుంది అంచనాకు.  ఇటువంటివి కదా పోలికల అవసరాలు మనకు ప్రపంచంలో.

ఈ లలితాసహస్రనామ స్తోత్రంలో అమ్మ స్వరూపాన్ని వర్ణిస్తూ కొన్ని కొన్ని పోలికలు చెప్పారు.  పద్మరాగ శిలాదర్శి పరిభావి కపోల భూః వంటివి. ఆ నామం ప్రకారం అమ్మ చెక్కిళ్ళ వర్ణసౌందర్యం పద్మరాగ మణుల ఎఱుపును ధిక్కరిస్తోంది అని తెలుసుకుంటున్నాం.  నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా అన్న నామం ప్రకారం అమ్మ ముక్కు  అప్పుడే వికసించిన సంపంగిపూవులా ఉంది అనగానే ఆ నాసిక సోయగం యొక్క అతిశయం తెలుస్తున్నది మనకు.

ఇలా రూపవర్ణనం చేస్తూ అమ్మ యొక్క గడ్డం దగ్గరకు వచ్చేసరికి పెద్ద గడ్డు సమస్య వచ్చింది!

అమ్మ గడ్డ్డం అనాకలితం. అంటే అది ఇలాగు ఉందని చెప్పటానికి పోలికగా ఏదీ సృష్టిలో దొరకటం లేదు. ఎంత కష్టం ఎంత కష్టం!

వేదవ్యాసులవారు ఘటికులు. ఒక అందమైన పోలిక చెప్పటానికి యత్నించారు.  బ్రహ్మాండపురాణంలో ఆయన 'ముఖదర్పణ వృంతాభ చుబుకా పాటలాధరా' అన్నారు.

ముఖం అనే గుండ్రటి చేతి అద్దం ఉందట, దానికి పిడిలాగా ఉందట గడ్డం!

ఇది కొంచెం అందంగా ఉన్న ఉపమానమే కాని అంత గొప్పగా లేదు. మరి గడ్డం ముఖంలో భాగమే కదా వంటి శంకలు వస్తున్నాయి కాబట్టి. అదీ కాక ముఖం అద్దం ఐతే దానిని అద్దం వలె భావించినది ఎవరూ అన్న ప్రశ్న ఉన్నది!

శంకరాచార్యులవారు తమ సౌందర్యలహరిన్లి 67వ శ్లోకంలో ఇలా అంటున్నారు.

కరాగ్రేణ స్పష్టం తుహినగిరిణా వత్సలతయా
గిరీశేనోదస్తం ముహురధరపానాకులతయా 
కరగ్రాహ్యం శంభోర్ముఖముకురవృన్తం గిరిసుతే
కథంకారం బ్రూమస్తవ చిబుకం ఔపమ్యరహితం

ఓ గిరిసుతా పార్వతీ,  నీ చిన్నతనంలో,  ఎంతో వాత్సల్యంతో మీ తండ్రి హిమవంతుడు తన చేతి వ్రేళ్ళ కొసలచేత నీ గడ్డాన్నిపుణుకుతూ ఆనందించాడు. అమ్మా నీ పతిదేవుడైన శివుడు నీ అధరామృతం పానం చేయాలన్న ఆతురతతో మాటిమాటికీ నీ గడ్డాన్ని పైకెత్తుతూ త్వరపడుతుంటాడు.  అలా నీముఖం అనే అద్దాన్ని పైకెత్తటానికి మంచి పిడిలా ఉన్నది కదా నీ  అందమైన సాటిలేని గడ్డం. అసలు సృష్టిలో మరొక దానితో పోలికే లేని నీ గడ్డాన్ని ఏమని వర్ణించగలను అని అంటున్నారు శంకరులు.

పుత్రాదౌ వాత్సల్యం, పత్నాదౌ ప్రేమ, శిష్యాదా వనుగ్రహః అగ్రజాదౌ భక్తి అని వాత్సల్య శబ్దానికి వ్యాఖ్యానం. పుత్రుడైనా పుత్రిక ఐనా సరే తనకు ప్రతిరూపమే అన్నది నిర్వివాదంగా సంప్రదాయికమైన భావన. హిమవంతుడు తల్లి ముఖమండలం అనే అద్దంలో తనను తాను చూచుకొంటున్నాడని భావించవచ్చును.

కైలాస శంకరులు పార్వతీముఖాన్ని దర్పణంగా భావించటం దేనికయ్యా అంటే ఆమె ముఖం అనే దర్పణంలో తనను తాను చూచుకొనేందుకని భావం.  మరల ఆవిడ ముఖమండలంలోనే చెక్కుటద్దాలు లేవా పద్మరగాల స్నిగ్ధ సోయగాలను ధిక్కరిస్తూ? ఆ అద్దాల సంపుటిలో ఆయన తనను తాను చూచుకొందుకు గాను పెకెత్తటానికి శ్రీదేవి గడ్డం ఒక చక్కని పిడిలా ఉన్నదట!

ఆ గడ్డం లోకంలో ఫలాని వస్తువులాగా ఉన్నది అని చెప్పటం సాధ్యపడదు. దానికి అదే సాటి అమ్మ చుబుకం

28. మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా


నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ।
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా। 11

మందస్మితం అంటే చిరునవ్వు. ఈ నామంలో వశిన్యాదులు అమ్మ చిరునవ్వు గురించి చెబుతున్నారు.  నిజానికి స్మితం అంటేనే చిరునవ్వు. అటువంటప్పుడు మందస్మితం అనటం దేనికీ? ఈ మందం అనే ఉపసర్గను స్మితశబ్దానికి ముందు చేర్చటం ఎందుకూ అన్న ప్రశ్న వస్తుంది కదా.

మంద అన్నసంస్కృతశబ్దానికి అర్థం మొల్లనిది అని అర్థం. సంసృత ఛందస్సులలో మందాక్రాంతం అని ఒక వృత్తం ఉంది. దాని అర్థం మెల్లగా ఆక్రమించబడినది అని అర్థం. అది వర్షాకాలంలోని దట్టమైన మేఘాలు వచ్చి మెల్లగా  ఆక్రమించిన ఆకాశాన్ని ఉద్దేసించి ఊహించటం సొగసుగా ఉంటుంది కదూ.  అందుకే కాళిదాస మహాకవి ఆ వృత్తాలలో మేఘసందేశం అన్న అద్భుతమైన లఘుకావ్యం రచించాడు.

అమ్మాయిని మందగమన అనటం కవుల వాడుకలో తరచుగా వినిపిస్తుంది. అంటే అమ్మాయిలు మెల్లగా నడుస్తారనీ అది వారికి అందగిస్తుందనీ ఉద్దేశం. అలాంటి అందమైన మెల్లని నడక కల అమ్మాయి అని చెప్పటం అమ్మాయిల పరంగా ఒక సుగుణంగా విశేషంగా చెప్తారు కవులు.

అలాగే స్మితం అంటే చిరునవ్వే కావచ్చును. ఆ చిరునవ్వు కూడా ముఖమండలంపైన మెల్లగా ఆవిష్కరించబడటం అన్నది ఇక్కడ నామం చెప్పే విశేషం.

ఎప్పుడైనా కవిత్వంలో చిరునవ్వు వెన్నెలలు వంటి ప్రయోగాలు విన్నారా? వినే ఉంటారు. అందమైన చిరునవ్వులకు చిరునామా అమ్మాయిల ముఖాలే కాబట్టి వెన్నెలలవలె విరబూసే చిరునవ్వులు సహజంగానే కవిత్వాల్లో స్త్రీపరమైన వర్ణనల్లోనే వస్తాయి.

వెన్నెలకు వాతావరణాన్ని ఆహ్లాదపరచే శక్తి ఉంది.
చిరునవ్వుకు వాతావరణాన్ని ఆహ్లాదపరచే శక్తి ఉంది.
అందుకనే కవులు చిరునవ్వులను వెన్నెలతో పోలుస్తూ ఉంటారు.

ఈ నామంలో మందస్మితప్రభ అని చెప్పారు చూడండి. అది అమ్మ చిరునవ్వుల చల్లని వెలుగులు అని అర్థం చేసుకోవాలి. ఇది స్పష్టంగానే తెలుస్తున్నది కదా.

సాధారణమైన స్త్రీల చిరునవ్వులకే వెన్నెలవలె అమితమైనా అహ్లాదన శక్తి ఉంటే సకల జగత్తులోనూ అత్యుత్తమైన స్త్రీత్వం తన సొత్తు ఐన అమ్మ చిరునవ్వు ఎంత గొప్ప ప్రభగా ఉంటుందో మీరే ఊహించండి.

పైగా ఈ నామం మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా అన్న దానిలో మందస్మితప్రభాపూరం అంటున్నారు. ప్రభాపూరం అంటే కాంతి యొక్క ప్రవాహం! ఒక మహా నదీ ప్రవాహంలా కొల్లగా ఉన్నది అన్నమాట అమ్మ యొక్క మెల్లని చిరునవ్వుల చల్లని కాంతి ప్రసరణం.

స్త్రీల చిరునవ్వులకు అకర్షితులై సంతోషంతో తబ్బిబ్బులయ్యేది ఆయా ఉత్తమస్త్రీల పతిదేవుళ్ళు.

ఇక్కడ కూడా అంతే.

అమ్మ కామేశ్వరి. ఆవిడ కు పతిదేవుడైన అయ్యవారు కామేశ్వరుడు.

ఆ మహానుభావుడు కామేశ్వరుడి మానసం ఆ ప్రభాపూరంలో మజ్జనం ఆచరిస్తోందట.

మజ్జనం అంటే స్నానం. మరొక అర్థం మునక అని కూడా ఉంది.

అయ్యవారు అమ్మ చిరునవ్వులో ఐనా సరే మునిగిపోయారు అని అనటం కుదరదు. ఎందుకంటే మునిగిపోయిన వాడికి చేష్టలు ఉడిగిపోతాయి. అలా చెప్పటం అపచారం అవుతుంది. పైగా ఇక్కడ మజ్జత్ అన్నప్పుడు అది వర్తమాన కాల ప్రయోగం కాబట్టి మునిగిపోవటం అన్న భూతకాలసూచన అసంగతం కూడా.

అయ్యవారు అమ్మ చల్లని చిరునవ్వుల కాంతి ప్రవాహంలో ఆనందంగా మునిగీతలు కొడుతూ ఉన్నారని చెప్పటం సమంజసంగా ఉంటుంది.

ఈ నామంలో అయ్యవారిని కామేశుడు లేదా కామేశ్వరుడు అని వాచ్యంగా చెప్పారు. ఇక్కడ కామేశ అన్న పదంలో ఉన్న కాముడు మన్మథుడు అనుకోకండి. అలాగే త్రిమూర్తుల్లో ఒకడైన రుద్రుడు అని కూడా అనుకోకండి. ఈ కామేశుడు కామకళారూపి యైన పరశివుడు. ఈ విషయంగా కామకళా విలాసంలో

బిందు రహంకారాత్మా
రవి రేత ర్మిథున  సమరసాకారః
కామః కమనీయతయా
కలా చ దహనేందు విగ్రహౌ బిందూ

ప్రకాశవిమర్శా మిశ్రస్వరూపమైన మహాబిందువు ఉంది. అది అహమనే వర్ణద్వయం కలిగి ఉంది, ఇది రక్తశుక్ల బిందువుల మేళనము. అంటే చంద్రాగ్నుల సమిష్టి రూపం. ఈ బిందువులోని ప్రకాశవిమర్శాంశలే కామేశ్వర మేమేశ్వరీ దివ్యదంపతులు. ఈ ఉభయాంశల మిశ్రబిందువే సూర్యస్వరూపం. ఇదే సర్వకారణ బిందువు.

ఇక్కడ కామేశ శబ్ధం ఈ విధంగా పరశివ వాచకం. కామకళాస్వరూపం అని గ్రహించాలి.

అమ్మ ముఖమండలములోని చిరునవ్వుల ప్రభల చల్లని కాంతి ప్రవాహం ఆ కామేశ్వరుని మనస్సును పూర్తిగా ఆకర్షించి సంతోషంలో మునకలు వేయిస్తున్నదని ఈ నామం చెబుతోంది.

అమ్మ చిరునవ్వు రాగరహితం. కారణాతీతం.  కారణరహితం. అది నాదానంద, ప్రణవానంద, బ్రహ్మానందాల స్వరూపం. అమ్మ ముఖం ఆనందస్వరూపం.