4, ఏప్రిల్ 2019, గురువారం

13. చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా



చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా 4

ఇక్కడి నుండి కొన్ని నామాలు అమ్మవారి స్వరూపవర్ణనం చేస్తాయి.

ఈ నామం చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా అన్నదానిలో చంపకము, ఆశోకము, పున్నాగము సౌగంధికము అనే పుష్పాలతో అమ్మ యొక్క శిరోజములు ప్రకాశిస్తున్నాయని చెప్తున్నారు వశిన్యాదులు.  ఈ పుష్పాలకు తెలుగుపేర్లు చూదాం. చంపకం అంటే సంపంగిపువ్వు. ఆశోకం అంటే పొగడపువ్వు. పున్నాగం అన్నది తెలుగులో కూడా వాడుకలో ఉన్నదే - ఇవి సురపొన్న లేదా పొన్న పూవులు. సౌగంధికాలు అంటే చెంగల్వపూలు.  ఇవన్నీ అమ్మ తలకట్టులో ఉండి ఆతలకట్టు చాలా శోభాయమానంగా ఉందని చెప్తున్నారు.

మనం ఇప్పటికే గడచిన నామాల్లో అమ్మ అగ్నికుండము నుండి ఉద్భవించింది అని చెప్పుకున్నాం. మరి అలా అగ్నిగుండం నుండి పైకి వస్తున్నప్పుడు మనకు మొదట దర్శనం ఇచ్చేది అమ్మ తలకట్టే కదా. అందుకని మొదట తలకట్టును వర్ణిస్తున్నారన్నమాట. సాధారణంగా ఐతే పాదాలతో వర్ణన మొదలుపెట్టాలి దేవలతలకు. ఇక్కడి సందర్భం ప్రత్యేకంగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ముందు అమ్మ తలకట్టును గురించి చెప్పారు.

ఇక్కడ ఈ నామంలో చంపకాశోకపున్నాగసౌగంధిక అని అన్నీ ఆయా చెట్లూ మొక్కల గురించి చెప్పారు కాని పూవులని చెప్పలేదే అని కొందరికి శంక రావచ్చును. అయ్యా ఇక్కడి సందరర్భాన్ని బట్టి మనం చెట్లూ చేమల గురించి గ్రహించాలా వాటి పూవులను గురించి గ్రహించాలా అర్థంలో అని ఆలోచించాలి. మామిడి అని అంటే అది మామిడి చెట్టు అని అర్థమా మామిడి కాయోపండో అని అర్థమా అంటే ఆ మామిడి అన్నమాట ఉన్న వాక్యంలోని సందర్భాన్ని బట్టి చెప్పాలి అంటాం కదా. మీదేం తోట అంటే మామిడి అన్నారనుకోండి - అక్కడ అన్నీ మామిడి చెట్లు అని అర్థం చేసుకుంటాం. ఏం పళ్ళు తెచ్చావు అంటే మామిడి అన్నాడనుకోండి - అప్పుడు మామిడి పళ్ళు అని తెలుసుకుంటాం. జుట్టూ సుగంధమూ అని చెప్తున్నప్పుడు ఆ పూలజాతికి చెందిన వృక్షాలను గ్రహిస్తామా వాటి పూలను గ్రహిస్తామా? పూలనే కదా.

మరొక శంక ఉంది! ఈ పూలవలన అమ్మవారి జుట్టుకు శోభ వచ్చింది అంటే ఆ శోభ ఆ జుట్టుకు అబ్బిన సుగంధం గురించే కదా, అని. అవును ఇక్కడ ఆ పూలవలన కలిగిన సుగంధశోభ అనే అర్థం.

ఒక చక్కని కథ ఉంది. నక్కీరుడు అని ఒక కవిగారు. ఈయన కథ గురించి ధూర్జటి కవి గారి శ్రీకాళహస్తి మాహాత్మ్యము అనే కావ్యంలో ఉంది.

ఈ నక్కీరుడు దొడ్ద కవి. రాజుగారి సభలో ముఖ్యకవి కూడా . ఒక బీదబ్రాహ్మణుడు సభకు వచ్చి ఒక పద్యం చదువుతాడు. ఆయన ఆశ అల్లా, ఈపద్యం విని రాజు గారు ఏదన్నా నాలుగుకాసులు బహుమానం చేస్తాడు కదా అని. తీరా చదివాడా, ఆ పద్యం తప్పు పో అని నక్కీరుడు తిరస్కరించి మోకాలడ్డు వేసాడు.

నిజానికి ఆ పద్యం ఆ బీదబ్రాహ్మడి సొంతకవిత్వం కాదు. ఆయన దీనావస్థకు జాలిపడి శివుడే ఒక బ్రాహ్మణవేషంలో వచ్చి ఈపద్య ఇచ్చి రాజుగారికి వినిపించి బహుమానం పొందవయ్యా అని పంపాడు.

గోడక్కొట్టిన బంతిలాగా ఈబీదబ్రాహ్మడు వెనక్కు వచ్చి జరిగిన పరాభవం గురించి చెప్పి ఏడిస్తే,  ఈ మాయాబ్రాహ్మడు ఉగ్రుడై తానే బీదాయనతో సహా సభకు వచ్చి ఎవడ్రా పద్యం తప్పన్నదీ అని వాదం వేసుకున్నాడు.

ఏం పద్యమయ్యా ఎక్కడన్నా ఆడవాళ్ళ తలకట్లు సువాసన్లు వస్తాయా అని నక్కీరుడు వెక్కిరించాడు.

పార్వతీదేవి తలకట్టు సువాసన వస్తుందయ్యా, నా పద్యం సరైనదే అని శివుడు సిధ్ధాంతం చేసాడు.

అప్పుడు నక్కీరుడు ఒప్పుకున్నాడా? పార్వతీదేవి సంగతి అలా ఉంచు లోకంలో లేదే. ఐనా నీకేం తెలుసూ అంటాడు. దాంతో శివుడు నిజస్వరూపం చూపిస్తాడు. నక్కీరుడు మాత్ర్రం తప్పుతప్పే పోవయ్యా అని ఎలా అంటాడో చూడండి

కం. తలచుట్టువార కన్నులు
కలిగిన పద్యంబు తప్పు గాదన వశమే
వలదిచ్చట నీమాయా
విలసనములు పనికిరావు విడువు మటన్నన్

ఏమయ్యోయ్ నీకు మూడుకళ్ళున్నా పద్యం తప్పేను. మూడేమిటి తలచుట్టూ కళ్ళున్నా సరే, నీ పద్యం తప్పంటే తప్పే పోవోయ్, ఇంక వదిలేయ్! అన్నాడు

దాంతో శివుడికి మండి శపించాడు. ఆ శాపమూ దానికి శివుడు చెప్పిన విమోచనమూ నక్కీరుడికి శాపవిమోచనం ఐన తీరూ అంతా ఇప్పుడు మనం చెప్పుకోనవసరం లేదు. ఇంతవరకు చాలు.

సిధ్ధాంతం ఏమిటంటే అమ్మవారి జుత్తుకు సుగంధం అంటే పరీమళం సహజం. అది ఏపూవులవల్లనో తైలాదులవల్లనో వచ్చింది కాదు అని.

మరి ఇక్కడ చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచా అంటున్నారే వశిన్యాదులూ అంటే దానికి ఒక చమత్కారమైన సమర్థన చెప్పుకోవాలి.

చంపక, అశోక, పున్నాగ పుష్పములవలె గొప్ప సుగంధము కల జుత్తు కలది అని నామానికి అర్థం చెప్పుకోవాలి.
అమ్మవారికి ఈసృష్టిలోని ఏవో పూవుల వలన సుగంధం రావటం అని చెప్పటం ఉచితం కాదు కదా అని భావించాలి.
ఇది బాగుంది కదా.

అసలు ఈ నామం ప్రకారం అమ్మవారి తలకట్టులోని సుగంధమే ఆపూవులకు అబ్బి అవే మంచి సుగంధాన్ని పొందుతున్నాయని డబాయించి చెప్పుకోవచ్చును.

శ్రీ లలితాత్రిశతి అని మరొక దివ్యగ్రంథం ఉంది. అందులో అమ్మవారి మూడువందల నామాలు చెప్పబడ్డాయి. ఈ లలితాత్రిశతికి శంకరభగవత్పాదులు భాష్యం వ్రాసారు. ఆనామాల్లో 'ఏలాసుగంధచికురా' అని ఒక నామం ఉంది. ఆ నామానికి శంకరభాష్యం కూడా ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా అమ్మ యొక్క కుంతలాలకు ఉన్న సహజసుగంధాన్ని పురస్కరించుకొని చెప్పుతున్నది.

భగవంతుడి విరాట్ స్వరూపం గురించి చెప్పేటప్పుడు వనస్పతులు శిరోజాలు అని చెప్పటం జరుగుతుంది. ఆ వనస్పతులు శ్రీదేవీ దివ్యకచం యొక్క సుగంధాన్ని ప్రదర్శిస్తున్నాయని భావించటం ఆహ్లదకరంగా ఉంటుంది. ఈసృష్టి యంతా పరబ్రహ్మస్వరూపంలో భాగమే కదా.

మల్లినాధ సూరి గారు. ఈయన పేరు విన్నారా?  కాళిదాసు కవిత్వం తెలియాలంటే మల్లినాధసూరి వ్యాఖ్యానం దగ్గర ఉండాల్సిందే. ఆయన రఘవంశం అనే కాళిదాసు కృతికి వ్యాఖ్యానం వ్రాస్తూ చెప్పిన మంగళాచరణ శ్లోకం

అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీ కృతమ్
దూరీకరోతు దురితం గౌరీచరణ పంకజమ్

గౌరీదేవి దర్శనానికి దేవతాస్త్రీలు వచ్చారట. వాళ్ళ కొప్పుల్లో కల్పవృక్షం పూలున్నాయి. ఆ పూల సుగంధం వల్ల వాటిచుట్టూ తిరుగుతున్న తుమ్మదలూ ఉన్నాయి. సరే వీళ్ళు వచ్చి అమ్మ పాదాలకు నమస్కరించారు.

నమస్కరించారా? అప్పుడు ఆ తుమ్మెదలన్నీ ఆ స్త్రీల కొప్పులలోని పూలను వదలి అమ్మ పాదాల చుట్టూ తిరగటం మొదలు పెట్టాయట.

ఎందుకూ అంటే పూలసువాసనలు ప్రకృతి సహజమైనవి. అమ్మ పాదాల సుగంధం అప్రాకృతిక మైనది. ఆ దివ్యసుగంధం ముందు పూలవాసన లెంతనీ? అందుకే అవి పూలను వదలి అమ్మపాదాలను ఆశ్రయించాయి వెంటనే.

ఇదీ పై శ్లోకం తాత్పర్యం.

అంటే ఏమన్న మాట? అమ్మవారి శరీరం అంతా సహజంగానే దివ్యమైన సుగంధం కలది. ఆపాదమస్తకమూ అలా ఉంటుంది.

అందుచేత పరీమళం అంతా అమ్మ కొప్పుది.

ఆ పరీమళంతో అమ్మ కొప్పులోని చంపకాలూ అశోకాలూ పున్నాగలూ సౌగంధికాలూ గొప్పదనాన్ని పొందుతున్నాయి. అవీ సుగంధాలు చిమ్ముతున్నాయి అని అర్థం.



4 కామెంట్‌లు:



  1. బాగుందండీ

    గరికిపాటి వారి లా కొద్దికొద్దిగా సమయం తీసుకుని ప్రసంగాలు మొదలెట్టండి.


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఎందరో పెద్దలున్నారు ప్రవచనాలకూ ప్రసంగాలకూను. నాబోటివాడి అవసరం ఉంటుందనుకోను. ధన్యవాదాలు.

      తొలగించండి
  2. మీరు నామాలు వివరిస్తూ మధ్యమధ్యలో చెప్తున్న కథలు ఆసక్తికరంగా వున్నాయి. ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టకథలుండాలండీ. అప్పుడే కదా అసలు కథకు మరింత అందం.

      తొలగించండి