24, ఏప్రిల్ 2019, బుధవారం

17. వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా


వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా।  6

వెనుక 16వ నామంలో వశిన్యాదులు అమ్మ ముఖాన్ని పూర్ణచంద్రబింబంతో పోల్చి చెప్పారు. ఆ చంద్రబింబంలో మచ్చ వలె అమ్మ కస్తూరీతిలకం శోభిస్తోందీ అని.

ఈ 17వ నామం ఐన వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా అనే దానిలో మరొక విధంగా పోలుస్తున్నారు చూడండి.

వదనం అంటే తెలిసిందే కదా ముఖం అని అర్థం. మాంగళ్యగృహం అట అమ్మ ముఖం.  మంగళగృహం అనే మాటే పరమమనోహరంగా ఉంది కదూ. ఏ ఇంట సమస్త శుభాలూ నెలకొని ఉన్నాయో అది కదా మంగళగృహం అయ్యేది. అమ్మ ముఖమే సమస్త శుభాలకూ నిలయం అనటంలో సందేహం ఏమీ ఉండదు. అమ్మ స్ఫురణకు రాగానే ఆవిడ ప్రసన్నముఖారవిందం స్ఫురణకు వస్తుంది. ఆ కరుణాపూరితమైన ముఖాన్ని ధ్యానించే వారికి సమస్త మంగళాలూ నిత్యం కలుగుతూనే ఉంటాయి అనటంలో ఎంత మాత్రం మనకు సందేహం అక్కర లేదు కదా.

ఇక్కడ వశిన్యాదులు ఒక చిత్రమైన కల్పన చేస్తున్నారు. అమ్మ ముఖం మన్మథుడు అనే పెద్దమనిషి యొక్క మంగళగృహం అట. అందుకే దాన్ని వారు వదనస్మరమాంగళ్యగృహం అనగా మదనుడి యొక్క మంగళగృహం ఐన వదనం అంటున్నారు.

ఈ నామం చివర చిల్లికా అని ఒక శబ్దం ఉంది. చిల్లిక అంటే కనుబొమలతో ఏర్పడిన భ్రూలత. నామకల్పద్రుమం అనే గ్రంథంలో చిల్లికా అన్న శబ్దానికి  చిల్లికా భ్రూలతా యస్యాః అని చెప్పారు. లలితాస్తవరత్నం అనే దానిలో కూడా అభుగ్న మసృణ చిల్లి అని ప్రయోగం ఉంది.

ఈ చిల్లికా అన్నది ఎందుకు వచ్చిందయ్యా నామంలో అన్నది చూదాం. వదనస్మరమాంగళ్యగృహం అన్నది తెలుసుకున్నాం. అలా అమ్మ ముఖారవిందాన్ని మన్మథుడి యొక్క మంగళగృహంగా చెప్పటం జరిగింది.

ఈ నామం వదనస్మరమాంగళ్యగృహతోరణచిల్లికా  లో అంటూ ఆ గృహం యొక్క తోరణాల ప్రసక్తి చేసారు.  ఆ మంగళగృహం యొక్క తోరణాలు అమ్మ చిల్లిక అంటున్నారు.

అంటే అమ్మ ముఖారవిందమే మన్మథుడి యొక్క మంగళగృహం.
అమ్మ ముఖంలోని కనుబొమలు ఉన్నాయే అవి ఆ మంగళగృహానికి తోరణాల్లాగ ఉన్నాయి అని అంటున్నారు!

గృహతోరణాలు అంటే ఇంటి ముఖద్వారానికి కట్టిన మంగళతోరణాలు అన్న మాట.

అమ్మ ఆవిర్భవించిన వేళ, పూర్వ, అపర సంధ్యలే అమ్మ యొక్క కనుబొమలు అయ్యాయి.  పూర్వ సంధ్య అంటే ఉదయ సంధ్య, అపరసంధ్య అంటే సాయంసంధ్య.

ఇక్కడ ఒక మంత్ర శాస్త్ర విశేషం ఉంది. వదనం ఐం బీజం, స్మర అనగా మన్మథ బీజం క్లీం (దీనినే కామరాజబీజం అనీ అంటారు).  మాంగల్య సౌః అనే బీజం. గృహం శ్రీం, తోరణ హ్రీః  ఇవీ ఈ నామంలో నిక్షిప్తం ఐన బీజాక్షరాలు.

ఈ శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌః అనే ఐదింటినీ పంచప్రణవాలు అని శ్రీవిద్యాసంప్రదాయంలో పేరు. వీటి విశేష లక్షణాలు

శ్రీం   వేడిమి
హ్రీం  తేజస్సు
క్లీం   ఆకర్షణ
ఐం   శబ్దం
సౌః   విద్యుత్తు

ఈ బీజాక్షరాలు అనులోమంగానూ, విలోమంగానూ గ్రహించబడి శ్రీషోడశాక్షరీకవచ కూటమిగా ఉన్నాయి.

కొన్ని పుస్తకాలలో ఈ నామం వదనస్మరమాంగళ్యగృహతోరణవల్లికా  అని ఉంది కాని అది సరికాదు. వల్లిక అంటే భ్రూలత అన్న అర్థం వీలుపడదు. కాబట్టి ఈపాఠం ఉచితం కాదు.

1 కామెంట్‌:

  1. నాకు చిల్లిక అంటే భౄలత అని ఇంతకు ముందు అర్థం తెలిసేది కాదు. వివరించిన మీకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి