30, ఏప్రిల్ 2019, మంగళవారం

20. తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా


నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా 7

అమ్మ నాసికను గురించి వశిన్యాదులు సెలవిస్తున్నారు. నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా అన్న నామంతో అమ్మ ముక్కుదూలం అప్పుడే విచ్చుకుంటున్న సంపంగిపూవు లాగా ఉందని చెప్పారు.

ఈ తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా అన్న నామంలో అమ్మ పెట్టుకున్న ముక్కుపుడక గురించి చెబుతున్నారు. ఈ నామంలో ఉన్న నాసాభరణం అన్న మాటకు ముక్కుపుడక అని అర్థం. దానినే అడ్డబాస అనీ బులాకీ అనీ కూడా అంటూ ఉంటారు.

ఈ అడ్డబాసను ఎలా తయారు చేస్తారంటే దానిలో పైన మాణిక్యం ఉంటుంది, క్రింది భాగంలో మంచిముత్యం వ్రేలాడుతూ ఉంటుంది.

ఈ నాసాభరణం ఎట్లా ఉందీ అంటే అది తారాకాంతిని తిరస్కరిస్తోందట. అవును మరి అమ్మ అలాంటి ఇలాంటి ముక్కుపుడక ఎందుకు పెట్టుకుంటుందీ? ఆ ముక్కుపుడక ఎంతలా ప్రకాశిస్తోందీ అంటే దాని వెలుగు జిలుగుల ముందు నక్షత్రాల తళుకుబెళుకులు బలాదూరు అంటున్నారు!

అలాంటి తారాకాంతి తిరస్కారి ఐన నాసాభరణం ధరించి అమ్మ చాలా భాసురంగా ఉన్నదట. భా అంటే కాంతి. అమ్మ భాసురంగా ఉండేందుకు ఆ ముక్కు పుడక అనేది కొంత దోహదకారి అని తాత్పర్యం తీసుకుందామా? అదంత ఉచితంగా అనిపించదు నాకు. మరెలా అన్వయం అని ప్రశ్న వస్తుంది. అమ్మ సహజంగానే వెలుగులకే వెలుగు. ఆ వెలుగుల్లో అవిడ ముక్కుపుడక యొక్క వెలుగు భాసురంగా అంటే ప్రస్ఫుటంగా ఉండి తారకల యొక్క కాంతినే ధిక్కరిస్తున్నది అని చెప్పుకోవాలి మనం.

ఈ తారాకాంతి అన్నప్పుడు మనం తారకలు అనగా నక్షత్రాల యొక్క కాంతి అని చెప్పుకున్నప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రసమాహారం అంతటినీ చెబుతున్నాం. అలా చెప్పటం సహజంగానూ సొగసుగానూ ఉంది నిజమే.

కొందరు తారా అని చెప్పబడినవి రెండు తారలు అని అభిప్రాయ పడ్డారు. అవి శుక్రతార, కుజతార అన్నవి. నిజానికి ఇవి రెండూ శుక్ర మంగళ గ్రహాలు కాని తారలు కావు. జ్యోతిష సంప్రదాయంలో పంచతారాగ్రహాలు అని సూర్యచంద్రులని మినహాయించి మిగిలిన వారగ్రహాలైన కుజ, గురు, శని, బుధ, శుక్ర గ్ర్తహాలను చెప్పటం ఆనవాయితీ. అలా ఎందుకూ అంటే అవి ఆకాశంలో తారలవలె చాలా చిన్నగా ప్రకాశిస్తూ కనిపిస్తాయి కాబట్టి. జాగ్రత్తగా గమనిస్తే ఈ తారాగ్రహాలు దృష్టికి ఆనిన సందర్భాల్లో అవి చాలా ప్రకాశంతో ఉంటాయి. పైగా అవి నక్షత్రాల్లాగా మిణిక్కు మిణుక్కు మనవు. ఆకారణంగా వాటి కాంతి మరింత స్ఫుటంగా కూడా ఉంటుంది.

జాతకపధ్ధతిలో, అందులోనూ ముఖ్యంగా స్త్రీ జాతక విషయంగా మంగళ శుక్ర గ్రహాలకు ఉన్న ప్రాముఖ్యత అందరరికీ తెలిసిందే.

ఇక్కడ ధరించిన బులాకీలో మణిపూసల్లాగా ఉన్నవి ఈ రెండు తారలూ అని తాత్పర్యం. ముక్కుకు రెండువైపులకూ రెండు మణులు ఆ బులాకీలో ఆభరణవిశేషంగా ఉన్నాయి అని కొందరు అభిప్రాయ పడ వచ్చును కాని బులాకీలలో ఇందాక చెప్పినట్లు మాణిక్యమూ దాని క్రింద ముత్యమూ ఉండటమే సాధారణం.

వాటిలో ఒకటి మంగళతార అన్నాం కదా, అది రక్త బిందు వర్ణ సంకేతం. అంటే ఎఱ్ఱనిది. అది పగడపు మణి వంటిది. మరొకటి శుక్రతార అన్నాం కదా, శుక్ల బిందు వర్ణసంకేతం. అంటే స్వఛ్ఛమైన తెల్లని రంగుది. అది వజ్రము వంటిది. ఈ రక్తశుక్ల బిందువుల వర్ణ సమ్మేళనాన్ని ఇక్కడ మనం రక్త శుక్ల బిందువుల మేళనంగా భావించాలి. ఈ మిశ్రబిందువునే అహం అంటారు. ఈ నాసాభరణం సౌమంగళ్య సూచకం.

మరొక విధమైన అన్వయం ప్రకారం సంసారాత్ తారయతి ఇతి తారం. సంసారచక్రమునుండి తరింప జేయునది కాబట్టి తారం. తారం యొక్క భాసురత్వం అనగా వెలుగు జ్యోతిర్మయత్వం అన్నది తారాకాంతిగా ఇక్కడ చెప్పబడింది. అటువంటి వెలుగును త్రోసిరాజంటున్నది అమ్మ ముక్కెర అని సూచన. అనగా ముక్కెరకు శోభ అమ్మ ధరించటం వలన వచ్చినది. ఆవిడ స్వయంగా పరభ్రహ్మ స్వరూపిణి. ముక్కెరవెలుగులు సూచించే పరబ్రహ్మ స్వరూపానికే అలంబనమైనది అమ్మ కాబట్టి తారకమైన జ్యోతుల ద్వారా సూచితమైన వెలుగు యొక్క సాధారణత్వాన్ని దాటి అమ్మ యొక్క శోభ ప్రకాశిస్తున్నది. అమ్మ శోభలో ఆవిడ ముక్కెరశోభ ఒక భాగం.

తారః అనగా తరింపచేయునది. అంటే ఆమాటకు అర్థం ప్రణవం. ఓ మిత్యేకాక్షరం బ్రహ్మ. తస్య వాచకః ప్రణవః అని కదా. అమ్మ యొక్క ఆకారశోభ ఆ ప్రణవశోభను మించి ఉన్నది. అలా చేయటానికి ఆవిడ నాసాభరణం ఒక నిమిత్తం.

శంకరభగవత్పాదులు సౌందర్యలహరీ స్తోత్రంలో

అసౌ నాశా వంశ ,స్తుహిన గిరి వంశాధ్వజ పటి
త్వదీయో ,నేదేయః ఫలతు ఫల మాస్మాక ముచితం
వహత్యంత ర్ముక్తా ,శ్శిశిర కర ,నిశ్వాస ,గలితం
సంరుద్ధ్యా యత్తాసాం ,బహిరపి ,సముక్తా మణిధరః

అని అమ్మ నాసాదండాన్ని ప్రస్తుతించారు. అమ్మా నీ నాసాదండం మాకూ మా వాళ్ళకూ కోరికలు తీర్చుగాక. నీ నాసాదండంలో ముత్యాలున్నాయి. నీ ఎడమ నాసిక నుండి వచ్చే గాలి వలన కూడా ముక్కు అంచున ముక్తామణులను ధరించినట్లు ప్రకాశిస్తున్నావు అని అంటున్నా రందులో.

తంజావూరును పాలించిన విజయరాఘవ నాయకుడికి ఒక గొప్ప నియమం ఉండింది.  అమ్మవారికి నివేదన జరిగి, ఆపైన బ్రాహ్మణసమారాధనం జరిగిన తరువాత కాని ఆయన భోజనానికి లేచే వాడు కాదు.

ఇది ఇలా ఉండగా, భగవంతుడి పరీక్ష కారణంగానా అన్నట్లుగా ఒకవారం పాటు విపరీతమైన వానల కారణంగా వంటచెఱకుకు ఎంతో ఇబ్బంది కలిగింది. చివరకు ఒక నాటికి అన్నీ పచ్చికట్టెలై వంట కుదిరే సావకాశమే లేకపోయింది.

అప్పుడు ఎక్కడినుండి వచ్చిందో ఒక పెద్దావిడ, ఆ పచ్చి కట్టెలనే ఉపయోగించి నేర్పుగా వంట చేసింది. అందరూ ఆశ్చర్యపడ్డారు. విజయరాఘవ నాయక మహారాజు గారి నియమం భగ్నం కాకుండా దైవమే రక్షించినట్లైనది.

ఇది జరిగిన మరునాడు శ్రీరంగంలో గొప్ప అలజడి రేగింది. శ్రీరంగనాయకీ దేవిగా ఉన్న అమ్మ ముక్కెర హఠాత్తుగా అదృశ్యం ఐనది. అర్చకులు కొయ్యబారిపోయారు. అందరూ రాజదండనకు భయడుతున్న ఆ సమయంలో అమ్మ ఒక పెద్దముత్తైదువ ముఖంగా తన ముక్కెర  ఎక్కడ ఉన్నదో సెలవిచ్చింది. అది తంజావూరు విజయరాఘవ నాయక మహారాజుగారి వంటశాలలో ఒక చోట బూడిద కుప్పలో పడి ఉన్నదీ అని.

ఈ వార్త తంజావూరికి చేరి మహారాజు గారు స్వయంగా వెదకి బూడిద కుప్పలో దేదీప్యమానంగా వెలుగులీనుతున్న అమ్మ ముక్కెరను కనుకొని ఆనందాశ్చర్యపరవశు డైనా డట. ఆ ముక్కెరను అలంకరించిన పల్లకీలో ఉంచి స్వయంగా మోస్తూ దాన్ని శ్రీరంగం కొనిపోయి సమర్పించాడని ఐతిహ్యం.

కన్యాకుమారి అని ప్రసిధ్ధమైన క్షేత్రం ఒకటి ఉంది దక్షిణదేశంలో. ఆక్షేత్రంలో అమ్మ పార్వతీ దేవిగా కొలువై ఉంది. అక్కడ అమ్మ చేతిలో ఒక మణిమాలను ధరించి ఉంటుంది. ఆ అమ్మకు ఉన్న ముక్కెర చాలా విశేషమైన ఖ్యాతి కలది. అమ్మ ముక్కెర వెలుగులు సముద్రంలోనికి కూడా చక్కగా ప్రసరించేవట దేదీప్యమానంగా. ఆ వెలుగులకు అటు ఎదురుగా వచ్చే నావలను నడిపే వారికి కళ్ళు మిరుమిట్లు గొలిపేవట. దానితో వాళ్ళ కళ్ళు చెదరటం కారణంగా వారి నౌకలు అడ్డదిడ్దంగా పోయి రేవులో తీరాన ఉన్న బండరాళ్ళకు ఢీకొట్టుకొని ముక్కలైపోయేవని చెప్పుకుంటారు. అందుకే సముద్రాభిముఖంగా ఉన్న అమ్మ అలయం ఉత్తరద్వారాన్ని మూసి ఉంచుతారట. ఆద్వారాన్ని కేవలం ఉత్సవసమయాల్లో మాత్రమే తెరుస్తారట. దీన్ని బట్టి అమ్మ ముక్కెర ప్రకాశం ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోవలసిందే కదా. 

1 కామెంట్‌:

  1. లలితాసహస్రనామాల్లో నాక్కొంచెం ఎక్కువ ఇష్టమైన నామాల్లో ఇదొకటి. వివరించిన మీకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి