1, మే 2019, బుధవారం

21. కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా


కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా
తాటంకయుగళీభూతతపనోడుపమండలా  8





ఈ కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా అన్న నామంలో వశిన్యాదులు అమ్మ తన చెవులపైన చేసుకున్న అలంకరణ గురించి చెబుతున్నారు.

కదంబం అంటే కడిమిచెట్టు. దీనికి రుద్రాక్షాంబ అని కూడా పేరుంది. మంజరి అంటే ఇక్కడ గుత్తి అని అర్థం. అందుచేత కదంబమంజరి అంటే కడిమి పూల గుత్తి. కొన్ని కొన్ని చెట్లకు పూవులు గుత్తులుగానే కాస్తాయి. మనం బంతిపూవు అనేది కానీ చేమంతిపూవు అనేది కాని నిజానికి ఒక పూలగుత్తి. బంతిపూవులో ప్రతి ఒక్క రేకా ఒక పువ్వు నిజానికి. అలాగే కడిమిచెట్టుకు కూడా గుండ్రటి ఆకారంలో గుత్తులు పూస్తాయి. అందుకే కదంబమంజరి అన్నారు. చైత్ర, ఆషాడ,శ్రావణ ఆశ్వీజ మాసాల్లోనే కడిమి  ఎక్కువగా పూస్తుంది.

కర్ణములు అంటే చెవులు. కర్ణపూరములు అంటే చెవులకు తగిలించుకొన్న చెవికమ్మలు. అమ్మ తన రెండు చెవులపైనా కడిమిపూల గుత్తుల్ని అలంకరించుకొన్నది. ఇక్కడ నామంలో క్లప్తము అన్న శబ్దం కనిపిస్తోంది కదా దాని అర్థం ఏమిటీ అంటే ఏర్పరించటం అని. అంటే చెవులకు అలంకరించటం అన్నమాట. ఆ అలంకరణ చాలా మనోహరంగా ఉంది అని అంటున్నారు. ఐతే ప్రసిధ్ధ దేవీ ఉపాసకులు తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారు కొంచెం విశేషంగా చెప్పారు. "కడిమిచెట్టు పూలగుత్తి యెడమచెవియందు నలంకరించుకొనియుండును. ఇది కర్ణపూరము. స్త్రీకి ఎడమ, పురుషునకు కుడి భాగములు ముఖ్యములు. ఇట్లు స్త్రీపురుషసంయోగమే అర్ధనారీశ్వరత్వము అగుచున్నది. కావున స్త్రీలు ఎప్పుడును ఎడమనుండి అలంకరించుట ప్రారంభించవలయును. " అని.

మన సాహిత్యంలో ఈ కడిమిచెట్టు తరచుగానే ప్రస్తావనకు వచ్చింది.

తిలక్ అని ప్రసిధ్ధి చెందిన కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ ఒక కవితలో "ఆకు ఆకునీ రాల్చింది కడిమిచెట్టు" అంటాడు. నిజానికి కడిమిచెట్టు ఆకురాలుకాలంలో కూడా ఆకులు రాల్చదు. విశ్వనాథ సత్యనారాయణ గారు కవిసామ్రాట్టు. ఆయన కడిమిచెట్టు అన్న పేరుతో ఒక నవలనే వ్రాసారు.

కడిమిచెట్టు పూవులు శివుడికీ అమ్మకూ కూడా ఇష్టమైనవి. కుమారస్వామికి కూడా ఇష్టమైనవట. అవి శ్రీకృష్ణుడికీ ఇష్టమైనవే నట. ఈవిషయాలు మన పౌరాణిక సాహిత్యంలో తెలియవస్తున్నాయి.

పరమాత్ముడు బాలకృష్ణుడిగా ఉన్నప్పుడు చేసిన లీలల్లో గోపికావస్త్రాపహరణం ఒకటి. అమ్మాయిల బట్టలెత్తుకొని పోయి ఆ పిల్లవాడు ఏ చెట్టుని ఎక్కి కూర్చున్నాడనుకున్నారు? కడిమిచెట్టు. ఆ స్వామి కాళీయుడి పడగలమీద తాండవం చేయటం కోసం ఒక చెట్టు ఎక్కి దానిపై నుండి కాళింది మడుగులోనికి దూకాడు - అదేమి చెట్టనుకున్నారు? కడిమి చెట్టు.

సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క మాట గోపికావస్త్రాపహరణలీల గురించి. గోపికలు కాత్యాయనీ వ్రతం చేస్తున్నారు. కాని దిగంబరంగా జలక్రీడకు దిగారు మడుగులోనికి. అదీ కదంబవృక్షం ఎదురుగా. కదంబవృక్షం అమ్మవారికి సంబంధించినదే కాదు అమ్మ స్వరూపమే. ఆగ్రహించి వారికి బుధ్ధిచెప్పిన బాలకృష్ణుడికీ అమ్మవారికీ అబేధం. అమ్మవారు నారాయణుడి చెల్లెలు నారాయణి. పురుషుడిగా ఆ బ్రహ్మమే నారాయణుడు. స్త్రీరూపంగా భావిస్తే ఆవిడ నారాయణి. అందుకే కృష్ణుడు వాళ్ళతో కాత్యాయనీ వ్రతం కల్ల చేస్తున్నారని ఆక్షేపించాడు.

భగవద్గీతలోనూ కదంబవృక్షం ప్రస్తావన ఉంది.

హనుమంతుడి జన్మవృత్తాంతానికి కడిమి చెట్టుతో సంబంధం ఉందట. వివరం తెలియదు.

వామన పురాణంలో కూడా ఈ కడిమి చెట్టు ప్రసక్తి వస్తుంది.  మాఘమాసంలో శివపూజను గురించి

మాఘేకుశోదకస్నానం మృగమదేన చార్చనమ్‌
ధూపఃకదంబనిర్యాసో నైవేద్యం సతిలోదనమ్‌

అని చెప్తున్నది పురాణం. కడిమిచెట్టు బెరడు ధూపం వేసి నువ్వుల అన్నం నివేదించాలి అని ఇక్కడ కనిపిస్తున్నది.

ఈ కదంబవృక్షం అనగా కడిమిచెట్టు పూలు తెల్లగానో కాషాయవర్ణంలోనో ఉంటాయి. కొంచెం పసుపురంగు కూడా కలిగి ఉంటాయి. చాలా మంచి సువాసనగా ఉంటాయి. అంతే కాదు వాటి పరిమళం కొంచెం మత్తును కలిగించేదిగా కూడా ఉంటుంది. కడిమిచెట్టు పన్నెండేళ్లకోసారి పూస్తుంది అని ఒక నానుడి. నిజం కాకపోవచ్చును.

కదంబ అన్న శబ్ధంలో కొందరు ఒక విశేషాన్ని ఇక్కడ గమనించారు. అది చూదాం.

సంస్కృతంలో సంఖ్యలకు చిహ్నంగా మాటలను వాడటం అని ఒక ప్రసిధ్ధమైన పధ్ధతి ఉంది. దాన్ని కటపయాది విధానం అంటారు. దాని ప్రకారం క = 1 దం = 8 బ = 3 అవుతుంది. కాబట్టి కదంబ పదానికి 183 అన్న సంఖ్యవస్తుంది. ఇది ఒక ఆయనం ప్రమాణం. అంటే దక్షిణాయనం లేదా ఉత్తరాయణం దినప్రమాణం 183 రోజులు. కుడి ఎడమ చెవుల్లో అమ్మ కదంబాలు ధరించింది కాబట్టి ఆ అలంకార విశేషాన్ని సంవత్సరంలోని రెండు ఆయనాలకూ సంకేతంగా గ్రహించాలి అని వారి వివరణ. కాని ఈ వివరణ శుధ్ధతప్పు. ఎందుకంటే ఇలా సంఖ్యలను మాటల ద్వారా వ్యక్తీకరించే సందర్భాల్లో ఒక నియమం అంకానామ్ వామతో గతిః అని. అంటే సంఖ్యలో వచ్చే అంకెలను కుడినుండి ఎడమకు వేసుకొంటూ పోవాలి. అందువలన నియమం ప్రకారం కదంబ అన్నది 183 అన్న అంకెలను ఇస్తుంది కాని సంఖ్యగా 381 అవుతుంది.

పూర్వం విష్ణువు గార్దభాసురుణ్ణి సంహరించిన కథ ఒకటి ఉంది. శివుడిని మెప్పించి అందరు రాక్షసుల్లాగానే వాడూ వరం సంపాదించుకొని దేవతలని తిప్పలు పెట్టాడు. ఇంద్రుణ్ణే తరిమేసాడు స్వర్గం నుండి. వాడికి నేలమీదనూ, నరమృగాదుల వల్లనూ శివుడి వరం కారణంగా చావు లేదు మరి. విష్ణుమూర్తి మోహినీదేవి రూపంలో రాగా వాడు అమె వెంటబడ్డాడు. అప్పుడు విష్ణువు సమయం చూసి వాణ్ణి అకాశంలోని ఎగురవేసి తోడేలు  తల, మానవశరీరం కల రూపం ధరించి అంతరిక్షంలోనే యుధ్ధం చేసి సంహరించాడు. ఆసమయంలో పార్వతీదేవి కదంబవృక్షంగా అవతరించి అగ్నిజ్వాలలను చిమ్మి ఆ గార్దభాసురుడి సైన్యాన్ని నిర్మూలించింది.

అమ్మకు కదంబాలు అంటే మిక్కిలి ప్రీతి. కదంబవనవాసినీ అని కాళిదాసుగారు అమ్మను సంబోధించటం తెలుసు కదా. ఆయన చెప్పిన దేవీ అశ్వధాటీ స్తోత్రంలో కదంబాల ప్రసక్తి పదేపదే వస్తుంది. లలితాసహస్రనామ స్తోత్రంలోనూ ఈ కదంబం ప్రసక్తి ఈ నామంలోనే కాక కదంబవనవాసినీ అనీ కదంబకుసుమప్రియా అనీ వస్తుంది.

కదంబానికి సంస్కృతంలో నీపలత అని ఒక పేరు. నీఞ్ ప్రాపణే అన్న విగ్రహవాక్యం కారణంగా నీపము అంటే తన దగ్గరక్ చేర్చుకొనేది అని వ్యుత్పత్తి.  అమ్మకు కర్ణాభరణంగా ఉన్న నీపమంజరి సాధకులమైన మనను అమ్మ దగ్గరకు చేరుస్తున్నది అని భావం ఇక్కడ ద్యోతకం అవుతున్నది.


5 కామెంట్‌లు:

  1. కడిమిచెట్టు, దాని చుట్టూ వున్న కథలు తెలుసుకున్నాను - బావున్నాయి :)

    రిప్లయితొలగించండి
  2. ఇంకొక విశేషం.

    కదంబానికి సంస్కృతంలో నీపలత అని ఒక పేరు. నీఞ్ ప్రాపణే అన్న విగ్రహవాక్యం కారణంగా నీపము అంటే తన దగ్గరక్ చేర్చుకొనేది అని వ్యుత్పత్తి. అమ్మకు కర్ణాభరణంగా ఉన్న నీపమంజరి సాధకులమైన మనను అమ్మ దగ్గరకు చేరుస్తున్నది అని భావం ఇక్కడ ద్యోతకం అవుతున్నది.

    ఈ విషయం కూడా టపాలో ఇప్పుడు చేర్చాను.

    రిప్లయితొలగించండి
  3. శ్యామ్ గారు, మీకు ఎన్నో ధన్యవాదములు. మీ కృషికి మేము కృతఙ్ఞులం.
    మీరు రాసిన లలితాంబిక అమ్మ వారి లలిత సహస్ర నామం వ్యాఖ్యానం ఎంతో బావుంది. చాలా ప్రేరేపితులమౌతున్నాము. మీరు మిగతా నామాలకి కూడా ఇలాగే వ్యాఖ్యానం రాస్తారని ఎదురుచూస్తున్నాము. దయచేసి, మిగతా నామాలకి కూడా వ్యాఖ్యానం రాయండి అయ్యా.

    రిప్లయితొలగించండి