14, మే 2019, మంగళవారం

26. కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా। 10

ఈ కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా అన్న నామంలో అమ్మ సేవించిన కర్పూరతాంబూలం గురించి వశిన్యాదులు వివరిస్తున్నారు.

వీటిక అంటే తాంబూలం. రోజుల పుణ్యమా అని ఇప్పుడు పాన్ అంటే కాని జనానికి అర్థం కాదేమో! అందరికీ తెలుసుగా ఈ పాన్ అనే దానిలో లక్షరాకాలుంటాయి.

ఒకప్పుడు మనం అందరం తాంబూలం అని పిలచుకొనే దానిలో ఎన్ని రకాలున్నాయో తెలియదు. కాని బాగా పేరుకెక్కింది మాత్రం కర్పూరతాంబూలం. ఈ కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా అన్న నామంలో అమ్మ వేసుకున్నది అని చెప్పినది కూడా కర్పూరవీటిక అనగా కర్పూర తాంబూలమే!

ఇక్కడ కర్పూరం అంటే తినటానికి వాడే పచ్చకర్పూరం. అంతే కాని హారతిపళ్ళెంలో వెలిగించే రకం కర్పూరం కాదు.

మీఠా పాన్ అనగానే ఏదో ఇన్ని తములపాకుల మీద ఇంత పంచదార చల్లి చుట్టేస్తాడా ఏమిటీ? కాదు కదా. అలాగే కర్పూరతాంబూలం అంటే దానిని చుట్టటానికి చాలా గ్రంథం ఉంది.

ఏలా లవంగ కర్పూరీ కస్తూరీ కేసరాధిభిః
జాజీఫలదళైః పూగైః లాంగల్యూషణ నాగరైః
చూర్ణైః ఖదిర సారైశ్చ యుక్తా కర్పూరవీటికా.

అంటూ కర్పూరతాంబూలం చుట్టటానికి కావలసిన సరంజామా ఏకరువు పెట్టారు. ఏమేం కావాలంటే ఏలకులు (ఏలా), లవంగాలు, కర్పూరం, కస్తూరి, కుంకుమపువ్వు (కేసరి), జాజికాయ (జాజీఫలదళం), వక్కలు (పూగైః), కాచు(ఖదిరం), మిరియాలు (ఊషణము), శొంఠి (నాగరం). ఇవన్నీ చక్కగా చూర్ణంగా చేసి తాంబూలంసేవిస్తే అది కర్పూర తాంబూలం అవుతుంది.

కర్పూరపు చెట్టు వేళ్ళనూ చెక్కనూ నీళ్ళలో మరగించి ఆ ఆవిరినుండి సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. ఈనాడు మనకి పూజలకు బిళ్ళల రూపంలో దొరికేది అంతా రసాయన పదార్థమే కాని నిజం కర్పూరం కాదు.

ఈ కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా అన్న నామంలో ఆమోదం అన్న పదానికి ఇక్కడ ప్రయోజనం ఆ కర్పూరతాంబూలం నుండి వెలువడుతున్న సుపరిమళానికి లభించిన ఆదరణను గురించి స్పష్టం చేయటం. ఆ పరీపళం ఎంతగా వ్యాపించిందో చెబుతున్నారు. అది  సమాకర్షద్దిగంతర మైనది అట. అంటే అన్ని దిక్కులనూ చక్కగా సమంగా ఆవిరించింది అని.

నిజమే కర్పూర పరీమళం అంత గొప్పగా ఉంటుంది. ఆ కర్పూరమిళిత పరీమళం మన ముక్కుకు సోకగానే చుట్టుపక్కల ఎవరో కర్పూరతాంబూలం వేసుకొని ఉన్నారూ అని తెలుస్తుంది అన్న మాట. దీనికి గొప్ప ఋజువుగా తెలుగు సాహిత్యంలో అల్లసాని పెద్దన గారు మనుచరిత్రలో ఒక పద్యం చెప్పారు.

ప్రవరుడు అనే అమాయక బ్రాహ్మడు ఎవడో సిధ్ధుడు కాలికి పాదలేపనం పూస్తే దాని ప్రభావంతో హిమాలయాలను చూడటానికి పోయాడు. అక్కడ ఆ లేపనం కాస్తా మంచులో కలిసిపోయి పాదాలు రిత్తబోయి ఇంటికి తిరిగి వెళ్ళే దారిలేక లబోదిబో మని మొత్తుకున్నాడు. కాస్త ఉపాయం చెప్పేవాళ్ళెవరన్నా చుట్టుపక్కల దొరుకుతారా అని ఆ మానవుడు వెదుకు తున్న సమయంలో గొప్ప సువాసన ఒకటి అతడి ముక్కుకు సోకిందట. అది ఎలాగు ఉందని?

కం. మృగమద సౌరభ విభవ
ద్విగుణిత ఘనసార సాంద్ర వీటీ గంధ
స్థగితేతర  పరిమళమై
మగువ పొలుపు తెలుపు నొక్క మారుత మెగసెన్.

కస్తూరి దట్టించిన కర్పూర తాంబూల పరీమళం అది. అది ముక్కుకు తగిలి ఏమని తెలిపిందట. మగువపొలుపు. అంటే ఇక్కడ ఎవరో ఆడవాళ్ళున్నారూ వాళ్ళు కర్పూరతాంబూలం వేసుకొని ఉన్నారూ అని మనవాడికి ఆ తాంబూలపు సువాసనలు మోసుకొని వచ్చిన గాలి తెలియజేసిందట.

అలా కర్పూరతాంబూల పరీమళం నలుదిక్కులా వ్యాపిస్తుంది.

కర్పూర తాంబూలం ఆడామగా అందరూ సేవిస్తారు. ఈ పెద్దన గారే కవిత్వం వ్రాయటానికి కావలసిన సంబారాల చిట్టాను ఒక పద్యంలో చెప్పారు చూడండి.

నిరుపహతి స్థలంబు రమణీప్రయదూతిక తెచ్చి యిచ్చు క
ప్పుర విడెమాత్మకింపయిన భోజన ముయ్యెల మంచ మొప్పు త
ప్పరయఁ రసజ్ఞు లూహఁ దెలియంగల లేఖక పాఠకోత్తముల్
దొరికినఁగాని యూరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే

ఆయన చెప్పిన చిట్టాలో కప్పురవిడెమూ ఉంది.

మరి కర్పూరతాంబూలం ఆడామగా అందరూ వేసుకొంటారు కదా మరి ప్రవరాఖ్యుడికి తాంబూలపు సువాసనను బట్టి చుట్టుపక్కలనే తాంబూలం వేసుకొన్న స్త్రీ ఉన్నదీ అని ఎలా తెలిసిందీ,  మగవాడూ ఉండి ఉండవచ్చును కదా అని అనుమానం వస్తుంది. పద్యం మరొకసారి చూడండి. ఆ తాంబూలపు సువాసనలో కర్పూరపు పరీమళమే కాదు మృగమద (కస్తూరి) పరీమళమూ కలిసి ఉందట. కస్తూరితో కలిసిన తాంబూలం వేసుకొనేది ఆడవాళ్ళు మాత్రమేను. ఎందుకంటే కస్తూరిని ఆడవారే వాడుతారు. దీనికీ తెలుగు సాహిత్యంలో సాక్ష్యం ఉంది చూడండి.

అక్షయ్యంబుగ సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షా దానము సేయరా సుకవి రాడ్బృందారక శ్రేణికిన్
దక్షారామపురీ విహార వర గంధర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించు దద్వాసనల్

ప్రసిధ్ధమైన ఈ పద్యం  శ్రీనాథ మహాకవి చాటువు.ఆయన రాజుగారిని కస్తూరి ఇప్పించవయ్యా అని ఠీవిగా అర్థిస్తున్నాడు. అదేం చేసుకుంటావయ్యా అంటే, దక్షారామంలో ఉన్న వేశ్యాయువతులకు పరిమళద్రవ్యంగా అలంకరించుకుందుకు ఇస్తాడట!

శాఖా చంక్రమణం అవుతున్నది కదా. విషయంలోని వద్దాం. ఈ కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా నామం అమ్మ సేవించిన కర్పూరతాంబూలం గురించి. దాని ప్రభావం ఎంతంటే వశిన్యాదులు, ఆ సువాసనలను దిక్కులను ఆవరిస్తున్నాయి అని చెబుతున్నారు.

లలితా త్రిశతిలో ఇలాంటి నామం ఒకటుంది.కర్పూరవీటీ సౌరభ్య కల్లోల కకుప్తటా అని. అక్కడ అది 14వ నామం. దీని అర్థం అమ్మ కర్పూరతాంబూల సుగంధంతో కల్లోలితమైన జగత్ప్రదేశం కలది అని.

అమ్మ సేవించిన తాంబూల పరీమళం దిక్కులన్నిటా వ్యాపించిందీ అని చెప్పటంలో ఒక విశేషం ఉంది.

దిగంతరా అని అమ్మను సంబోధించారు కదా. అంతరము అంటే కట్టుకోక అని అర్థం. దిగంతరా అంటే అమ్మకు దిక్కులు పరిధానంగా ఉన్నాయని. అంటే అమ్మ తాంబూలపు పరిమళానికి దిక్కులు ఆకర్షణ చెంది వచ్చి చుట్టూ చేరి ఒక ఆవరణ (పరిధానం, అంతరం)లా ఏర్పడ్డాయని చమత్కారం.

అలా ఎందుకు చుట్టు చేరారు దిగ్దేవతలు అని అనవచ్చును. అమ్మ తాంబూలం అత్యంత మహిమాన్విత మైనది. అమ్మ తాంబూలకబళం అనుగ్రహిస్తే సేవించి తరించాలన్న తాపత్రంయంలో దిగ్దేవతలు చుట్టుముట్టి ఉన్నారని అర్థం.

ఏమిటండీ ఆ మహిమా విశేషం అంటారా? అదీ చూదాం ఒక చిన్న కథలో.

అది క్రీ.శ. 4వ శతాబ్దం. కంచిలో విద్యాపతి గారనే ఒక ఖగోళ జ్యోతిర్విద్వాపారంగతుడొకాయన ఉండే వాడు. ఆయన కొడుకు మూగవాడు. ఆ పిల్లవాడు తన గతికి వగస్తూ అమ్మను వేడుకొంటూ కంచి కామాక్షీ అమ్మవారి సన్నిధానంలో నిత్యం ఉండేవాడు.

ఒకరోజున పెద్దావిడ కర్పూరతాంబూలం నములుతూ అలయంలో తిరుగుతూ ఉంది. ఈ మూగపిల్లవాడూ ఆతని పక్కనే ధ్యానం చేసుకుంటున్న మరొక సాధకుడూ ఉంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళింది.

తన నోటిలోని తాంబూలం నుండి ఒక చిన్న పిడచ తీసి ఆ సాధకుడికి ఇవ్వబోయింది. ఆతను చీచీ అంటూ దూరంగా తొలగి పోయాడు.

అమె ఆ పిడచను ఆ మూగ పిల్లవాడి దోసెట్లో వేసింది. అతడు కళ్ళకద్దుకొని నోటిలో వేసుకొన్నాడు.

మరుక్షణం ఆ పిల్లవాడికి మాటవచ్చింది. వచ్చింది మాటా? అది మహాగంగా ప్రవాహం వంటి కవితాధార!  ఆ తాంబూలకరండం అనుగ్రహించిన పెద్దావిడ కంచి కామాక్షీ అమ్మవారు అని ఆ మూగపిల్లవాడు గ్రహించాడు జన్మాంతర సంస్కారప్రభావంతో. అంతే, ఆ మహామహిమాన్విత తాంబూలకరడం కళ్ళకద్దుకొని స్వీకరించాడు. ఆ మూగ పిల్లవాడు మహా కవి ఐపోయాడు తక్షణమే.

ఆశువుగా ఆ పిల్లవాడు అమ్మని స్తుతిస్తూ ఐదువందల శ్లోకాలు చెప్పాడు. ఆ స్తోత్రాన్ని మూకపంచశతి అంటారు. ఆ ఐదు వందలలో ఒక వంద ఆర్యాశతకంగా అమ్మవారి గొప్పదనాన్ని వివరించేదిగా. ఒక వంద స్తుతిశతకంగా అమ్మను స్తుతించేదిగా , ఒక వంద కటాక్షశతకంగా అమ్మ కళ్ళను గురించి , ఒక వంద మందస్మితశతంగా అమ్మ చిరునవ్వును గురించి, ఒక వంద పాదారావిందశతంగా అమ్మ పాదారవిందాలను గురించి అద్భుతమైన శ్లోకాలతో చెప్పారు.

అమ్మ సంతోషించి, నాయనా నీకేం కావాలో కోరుకో అన్నది. అప్పుడు ఆ పిల్లవాడు "అమ్మా, నువ్వు అనుగ్రహించిన వాక్కుతో నిన్ను స్తుతించి తరించాను. ఇంక ఈ వాక్కును లౌకికవిషయాలను ప్రస్తావించి అపవిత్రం చేయలేను తల్లీ. నన్ను మళ్ళా యధాప్రకారంగా మూగవాడిని చేయమ్మా" అని అడిగాడు. అమ్మ చిరునవ్వుతో అనుగ్రహించింది.

అప్పటి కంచి శంకరమఠం పీఠాధిపతులు మార్తాండ విద్యా ఘనేంద్ర సరస్వతి స్వామి వారు ఈ వృత్తాంతం తెలిసి మహానందంతో ఆ పిల్లవాడిని ఉత్తరాధికారిగా స్వీకరించారు. ఆ పిల్లవాడు కంచిమఠానికి 20వ పీఠాధిపతిగా విరాజిల్లాడు.

చూసారా అమ్మ తాంబూల కబళం మహిమ.

అమ్మ తాంబూల మహిమను గురించి కాళిదాసు గారు తన అశ్వధాటీ స్తోత్రంలో ఏమంటున్నారో చూడండి.

చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబ వన వాటీషు! నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీ కిరణ కోటీ కరంబిత పదా!
పాటీర గంధి కుచ శాటీ! కవిత్వ పరిపాటీ మగాధిప సుతా!
ఘోటీ ఖురాదధిక ధాటీ ముదార ముఖ వీటీ రసేన తనుతామ్.

అమ్మ తాంబూలరస మహిమతో గుఱ్ఱముల కంటే వేగంగా పరుగెత్తే ధాటి కల కవిత్వ శక్తి అబ్బుతుందని అంటున్నారు "ఘోటీ ఖురాదధిక ధాటీ ముదార ముఖ వీటీ రసేన తనుతామ్." అన్న ఆఖరు పాదంలో. మూకశంకరుల వృత్తాంతమే దానికి ఋజువు కదా.

ప్రసిధ్దమైన శ్యామలాదండకంలోనూ కాళిదాసమహాకవి అమ్మను గురించి "కుంద మందస్మితోదారవక్త్రస్ఫురత్పూగ కర్పూర తాంబూలఖండోత్కరే జ్ఞానముద్రాకరే, శ్రీకరే" అని వర్ణించారు.

అందుచేత దిగ్దేవతలు చుట్టూ చేరి అమ్మ అనుగ్రహించే తాంబూలకరండం కోసం వేచి ఉంటున్నారు అంటే ఆశ్చర్యం ఏముంది!

శంకర భగవత్పాదులు తమ సౌందర్యలహరీ స్తోత్రంలో అమ్మ తాంబూల మాహాత్మ్యం గురించి ఇలా ప్రస్తుతించారు.

రణే జిత్వా దైత్యానపహృతశిరస్త్రైః కవచిభిర్
నివృత్తైశ్చణ్డాంశత్రిపురహరనిర్మాల్యవిముఖైః
విశాఖేంద్రోపేంద్రైః శశివిశదకర్పూరశకలా
విలీయంతే మాతస్తవ వదనతాంబూలకబళాః

రాక్షసుల్ని జయించి వచ్చారు ఇంద్రుడూ ఉపేంద్రుడూ కుమారస్వామీ సంతోషంగా. వారికి అమ్మ ఆదరంగా తన కర్పూరతాంబూలపు తునకల్ని ఇస్తోందట వాటికోసం వాళ్ళు పోటీపడుతూ లాక్కుంటున్నారట. పోనీ అయ్యవారి  నుండి తాంబూలం గ్రహించడయ్యా పోండి అందామంటే ఆయన గారి తాంబూలం మీద హక్కులన్నీ చండీశ్వరుడివే కాబట్టి అవి వాళ్ళకు అక్కరలేదట. అమ్మ తాంబూల ప్రసాదమే కావాలట.

కుమారస్వామీ, విష్ణువూ, ఇంద్రుడూ కోరి స్వీకరించే అమ్మ తాంబూల ఖండాల కోసం దిగ్దేవతలు చుట్టుముట్టి కాచుకొని ఉంటున్నారు అంటే అది సహజమే కదా.

బహిర్మాతృకాన్యాసంలో అమ్మ జిహ్వకు 'అం' అని బీజంతో న్యాసం.

3 వ్యాఖ్యలు:

 1. అద్భుతం - ఈ నామ వివరణ. ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శాఖాచంక్రమణమని చెప్పి మిగిలిన వృత్తాంతాలు చెప్పకపోతే ఆ వెలితి కనిపించేది. చాలా బావుంది మీ వివరణ. చదివిన తర్వాత రోజంతా తలలో నిలిచే పోయే నామం.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ధన్యవాదాలు అన్యగామి గారూ, చదివిన తర్వాత రోజంతా తలలో నిలిచే పోవటం చాలా మంచిది. సంతోషం. ఇలా వివరణగా అనుశీలన చేసుకొనటం వలన శ్రధ్ధాభక్తులు ద్విగుణీకృతం అవుతున్నాయి మనందరకూ.

   తొలగించు