5, మే 2019, ఆదివారం

22. తాటంకయుగళీభూతతపనోడుపమండలా

కదంబమంజరీక్లప్తకర్ణపూరమనోహరా
తాటంకయుగళీభూతతపనోడుపమండలా 8

తాటంకము అంటే చెవికమ్మ. యుగళం అన్నారు కాబట్టి వాటి జంట. ఈ తాటంకయుగళీభూతతపనోడుపమండలా అన్న నామంతో అమ్మ యొక్క చెవికమ్మలను వర్ణిస్తున్నారు వశిన్యాదులు.

తపనుడు అంటే సూర్యుడు. తన తీక్షణమైన తేజస్సుతో జీవులను తపింపజేస్తాడు కాబట్టి సూర్యుడికి అలా తపనుడు అన్న పేరు వచ్చింది.

ఉడుపుడు అంటే చంద్రుడు. ఉడు అన్న సంస్కృత శబ్దానికి అర్థం నక్షత్రం అని. ప అనే ప్రత్యయం ఆధిపత్యాన్ని చెప్పేది. అందుచేత ఉడుప అంటే నక్షత్రాలకు అధిపతి. నక్షత్రాలు రాత్రి మాత్రమే మనకు కనిపించేవి. ఆకాశం నిండా నక్షత్రమండలాలూ వాటినిండా నక్షత్రాలూనూ. కాస్త చీకటి రాత్రి కనుక ఐనట్లైతే వాటి ధగధగలతో ఆకాశం ఎంత శోభాయమానంగా ఉంటుందంటే ఆ శోభను తిలకించటం అనే ఆనందం ఉందే, అది అనుభవించవలసిన ఆనందమే కాని మాటల్లో చెప్పలేం. రానురాను నగరాల్లోని దీపకాంతులు వెదజల్లే వెలుగుల మధ్య నుండి నక్షత్రాలను తిలకించటం దుస్సాధ్యంగా ఉంటోంది. దీన్ని కాంతి కాలుష్యం అనుకోవచ్చును. అంతరిక్షం నుండి చూస్తే నగరాలన్నీ ఈ కాంతికాలుష్యకాసారాలుగా కనుపిస్తున్నాయి.

ఒకప్పుడు వేసవి వచ్చిందంటే ఆరుబయటకు మారేవి ప్రక్కలు. మదత మంచాలు వేసుకొని చుట్టు ఉన్న చెట్లనుండి అప్పుడప్పుడూ వచ్చి పలికరించే కాస్త చల్లని గాలుల్లో సేదతీరుతూ నిద్రించే వాళ్ళం. నిద్రప్టట్టే దాకా ఆకాశంలోని నక్షత్రాలను చూడటం ఒక అందమైన వినోదం. ఈ కాలంలో అది అసాధ్యం ఐపోయింది కదా. ఇంకా నాగరీకం ముదరని పల్లెలు ఉంటే అక్కడ ఈ ఆనందం వెతుక్కోవచ్చు నేమో. అలా వెలుగుచుక్కల ముగ్గుల శోభలతో మురిపించే అకాశంలో చందమామ మరొక ఆనందం. ఆ చందమామను చూస్తూ ఎంతసేపన్నా వినోదించవచ్చును.

ఆకాశం నిండా నక్షత్రాలూ వాటి మధ్యన చందమామ. ఆ నక్షత్రాలకు ఒక రాజుగా వెలుగుతూ ఉంటాడు చంద్రుడు. పురాణాల ప్రకారం నక్షత్ర కన్యలకు భర్త కద చంద్రుడు. అందుకే చంద్రుడు ఉడుప పదంతో సంబోధించబడతాడు.

ఈ నామం తాటంకయుగళీభూతతపనోడుపమండలా అన్న దానిలో మండలా అని చెప్పారు కదా, దానికి అన్వయం తపన మండలా ఉడుప మండలా అని సూర్యచంద్ర బింబాలను రెండింటికీ వర్తిస్తుంది.

అమ్మకు చెవి కమ్మలు రెండున్నాయి కదా. వాటిలో ఒకటి సూర్యబింబం మరొకటి చంద్రబింబం అని ఈ నామం తాత్పర్యం. అమ్మకు సూర్యచంద్రులు దుద్దుల జత అన్నమాట!

అమ్మ బ్రహ్మాండమే ఆకారమైన తల్లి. కాబట్టి ఆవిడకు సూర్యచంద్రులు చెవిదుద్దులు అంటే బహుసొగసుగా ఉంది.

అమ్మకు వారే నేత్రాలు కూడా అని వేదవాక్యం.

సూర్యచంద్రస్తనౌ దేవ్యా స్తావేవ నయనౌ స్మృతౌ
ఉభౌ తాటంకయుగళ మిత్యేషా వైదికీ శృతి.

అందుచేత ఆ సూర్యచంద్రులు అమ్మకు కళ్ళు. వాళ్ళు అమ్మకు చెవిదుద్దులు. వాళ్ళే అమ్మకు స్తనయుగళం కూడా.

అమ్మ పరాశక్తి. కాబట్టి ఆవిడ సూర్యచంద్రుల్నే చెవిదుద్దులుగా  ధరించ గలిగినది. వేరే దేవతలకు వల్లకాదు.

ఈ నామం అమ్మ విరాడ్రూపి అన్నది మనని స్మరించ మని ప్రబోధిస్తున్నది.

చెవికమ్మలు స్త్రీలకు సౌభాగ్య వర్ధకాలు. అసంగతిని పురస్కరించుకొని మన శంకరభగవత్పాదులు చెప్పిన సౌందర్యలహరీ స్తోత్రంలోని ఈ శ్లోకం పరికించండి.

సుధామప్యాస్వాద్య ప్రతిభయజరామృత్యుహరిణీం
విపద్యన్తే విశ్వే విధిశతమఖాద్యా దివిషదః
కరాలం యత్ క్ష్వేలం కబలితవతం కాలకలనా
న శమ్భోస్తన్మూలం తవ జనని తాటఙ్కమహిమా!!

బ్రహ్మేంద్రాదులు అమృతం సేవించి జరామరణాలను దూరంగా ఉంచగలుగుతున్నారు. కాని కాలం అనేది వాళ్ళనూ వదలదు. (వాళ్ళకీ లయం కావటం అన్నది ఉన్నది!)  ఇకపోతే మీఆయన అమృతం తాగనే లేదే. సరికదా, పైగా పరమభయంకరమైన విషాన్ని తాగాడు. ఐనా చిత్రం ఆయన కాలానికి ఎన్నడూ లొంగడు. ఎప్పుడూ ఉండేవాడై సదాశివుడు అనిపించు కుంటున్నాడు. ఇదంతా సౌభాగ్యకారకాలైన నీ చెవికమ్మల మహిమయేకదా అమ్మా అంటున్నారు ఈ శ్లోకంలో శంకరులు.

ఈ శ్లోకం మహిమను గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంతో మంది అమ్మల సౌభాగ్యాన్ని ఈ శ్లోకపారాయణం రక్షించింది అని పెద్దలు నిత్యం చెబుతూ ఉంటారు.  నమ్మని వారికి దేనివలనా ప్రయోజనం ఉండదు. నమ్మిన వారు ఈ శ్లోకాన్ని నిత్యపారాయణం చేసి సత్ఫలితాన్ని పొందుదురు కాక.

తమిళనాట తిరుక్కడయూర్ అని ఒక ఊరుంది. అక్కడ పార్వతీ అమ్మవారు అభిరామి అనే పేరుతో కొలువై ఉంది. అమ్మ దేవాలయంలో నిత్యం అమ్మను ధ్యానిస్తూ ఉండే ఒక భక్తుడు అభిరామ భట్టర్. నిజానికి ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్.

ఒకరోజున అమ్మ దర్శనానికి విచ్చేసిన శరభోజీ మహారాజు గారు ఈ ధ్యాననిమగ్నుడై తనని గమనించకుండా ఉన్న అభిరామ భట్టర్ గారిని చూసి కొంచెం ఆగ్రహం చెందుతాడు. సాధారణంగా రాజు కాని రాజకుటుంబం కాని వచ్చినప్పుడు భద్రత నిమిత్తం ఆలయం ఖాళీ చేయిస్తారు. అర్చకులు తప్ప గుడిలో ఎవర్నీ ఉండనివ్వరు. ఐతే గుడిలో అయ్యరు ఉండటమే కాక తనని పట్టించుకోలేదు! ఆగ్రహం రాదూ మరి?

అక్కడి అర్చకులు పరిస్థితిని చక్కదిద్దటానికి గాని ఈ సుబ్రహ్మణ్య అయ్యర్ ఒక పిచ్చివాడిలాగా ఎప్పుడూ అక్కడే అమ్మని ధ్యానిస్తూ కూర్చుంటాడనీ, ఎవర్నీ పట్టించుకోడనీ తామూ అతడి ఉనికిని పట్టించుకోమనీ ఆగ్రహించవద్దనీ మనవి చేసారు రాజుగారికి.

సరే ఇతని సంగతి ఏమిటో కనుక్కుందాం అనుకొని రాజుగారి సరాసరి సుబ్రహ్మణ్య అయ్యర్ దగ్గరకు వెళ్ళి పలకరించాడు. కొంచెం ధాటీగా మాట్లాడినట్లున్నాడు. అయ్యరుకు ధ్యానభంగం ఐనది. అంతవరకూ అమ్మ ముఖారవిందాన్ని తిలకిస్తూ మైమరచి ఉన్నాడేమో ఉలిక్కిపడి చూసాడు రాజును.

"ఈరోజు తిథి ఏమిటి" రాజుగారు ప్రశ్నించారు.

వెంటనే అన్నాడు అయ్యరు "పౌర్ణమి" అని.

అందరూ నిర్ఘాంతపోయారు. రాజు ఐతే ఉగ్రుడే అయ్యాడు.

"అలాగా. సంతోషం. ఈరోజు రాత్రికి వస్తాను. నాకు నిండు చంద్రుణ్ణి చూపించండి" అని ఆజ్ఞాపించి చక్కాపోయాడు.

చుట్టూ ఉన్న అందరూ కంగారుగా, "ఎంత పని చేసావయ్యా, ఈరోజు అమావాస్య!" అని సుబ్రహ్మణ్య అయ్యరుతో అన్నారు.

సుబ్రహ్మణ్య అయ్యర్ కూడా ఆశ్చర్యపడి, జరిగిందేదో జరిగింది. అంతా అమ్మ చూసుకుంటుంది అని నిబ్బరంగా ఉన్నాడు. ఏమి జరుగుతుందో అని అర్చకులూ ఊరిజనమూ అందరూ ఆందోళన పడ్డారు. సాయంత్రానికి గుడివద్ద జనం గుమిగూడారు.

రాత్రి అయ్యింది. రాజుగారు మళ్ళా గుడికి వచ్చారు. ఈసుబ్రహ్మణ్య అయ్యర్ సంగతి ఏమిటో చూదామనే వచ్చారు. ఆయన వచ్చేసమయానికి తన్మయత్వంతో అయ్యరు అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు.  అ స్తోత్రం అద్భుతంగా ఉంది. దాన్ని అంత్యాది అంటారు. అంటే ఒక చరణం ఏ మాటతో ముగుస్తున్నదో, దానితోనే తరువాతి చరణం చెప్పుతూ ఉండాలి. ఇలా నడుస్తోంది స్తోత్రం. ఈ అంత్యాదిని తమిళులు అందాది అంటారు. రాజుకు అశ్చర్యం అనిపించింది. ఈయన ఇంతటి కవీ భక్తుడూ అని ఆయనకు ఇంతవరకూ తోచనే లేదు.

సుబ్రహ్మణ్య అయ్యర్ అంత్యాది చెబుతూనే ఉన్నారు మైమరచి. 78 పద్యాలు పూర్తి ఐనవి. అప్పుడు మరొక అద్భుతం జరిగింది. నిండు చంద్రుడు ఉదయించాడు. అమావాస్య కాస్తా పున్నమిగా మారిపోయింది. వెన్నెల వెలుగులతో ఇలాతలం నిండిపోయింది.

జనసమూహం హర్షద్వానాలతో ఇలాతలం మార్మోగింది.

అంత్యాది స్తోత్రం నూరు పద్యాలతో ముగించి పరమానందంతో సుబ్రహ్మణ్య అయ్యర్ మన లోకం లోనికి వచ్చాడు.  కనులు తెరచి చూస్తే తన పాదాల వద్ద కన్నీళ్ళతో రాజు గారు.

" అమావాస్యను పౌర్ణమిగా మార్చగలిగిన మీరు మహామహిమాన్వితులు. తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి" అన్నాడు రాజు.

సుబ్రహ్మణ్య అయ్యర్ తన తలను అడ్డంగా ఆడించి. "మహా మహిమాన్వితురాలు అమ్మ. నాకే మహిమలూ లేవు. నా తలను కాచాలనే, నాకేసి చిరునవ్వుతో చూస్తూ,  అమ్మ తన చెవి కమ్మ ఒకదాన్ని ఆకాశంలోని ఎగురవేసింది. అదే నిండుచంద్రుడిలా వెన్నెల వెలుగులు కురిపించుతోంది" అన్నాడు.

మహారాజు ఆనందాశ్చర్యాలకు పట్టపగ్గాలు లేవు. ఈరోజునుండీ తమరు సుబ్రహ్మణ్య అయ్యర్ కాదు అభిరామ భట్టర్ అని అయ్యరుకు కొత్త పేరు పెట్టి గౌరవించి ఆయన పాదాలకు వంగి నమస్కారం చేసాడు. నిజానికి సాష్టాంగ నమస్కారం చేసే వాడే , కాని దైవసన్నిధానంలో ఒక్క అమ్మకు తప్ప మరెవరికీ అలా చేయరాదు కదా.

అబిరామ భట్టు కారణంగా ఈసూర్యచంద్రులే అమ్మ తాటంక యుగళం అన్నది ఋజువైనది.

2 కామెంట్‌లు:

  1. సుబ్రహ్మణ్య అయ్యర్ వారు పాడిన ఆ అంత్యాది ఎక్కడన్నా దొరుకుతుందాండి? అంత్యాది ఎలా వుంటుందో చదవాలని వుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ అంత్యాది అంతా తమిళంలో ఉందండి. అది వికీపీడియాలో చూడవచ్చును. లింక్ ఇస్తున్నాను: https://te.wikisource.org/wiki/అభిరామి_అందాది

      ఈ అందాదికి తెలుగులో అర్థతాత్పర్యాలు ఎవరన్నా వెలివరించారేమో తెలియరాలేదు.

      తొలగించండి