13, మే 2019, సోమవారం

25. శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా

శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా
కర్పూరవీటికామోదసమాకర్షద్దిగంతరా। 10

అమ్మ స్వరూపాన్ని వశిన్యాదులు బహు చమత్కారంగా వర్ణిస్తున్నారు. ఈ శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా అన్న నామంలో అమ్మ పలువరుసను గురించి చెబుతున్నారు.

ఈ నామంలో ద్విజ శబ్దం కనిపిస్తోంది కదా. ద్విజుడు అన్న మాటకు సంస్కృతంలో ప్రచారంలో ఉన్న అర్థం బ్రాహ్మణుడు అని.

కాని ఈ ద్విజ శబ్దం గురించి చాలా చాలా చెప్పుకోవచ్చును. బ్రాహ్మణుడు అనే కాదు దంతాలకు కూడా ద్విజ శబ్దం వర్తిస్తుంది. ఎందుకబ్బా అని మీరు అడగవచ్చును.

ఆసలు ద్విజము అంటే రెండుసార్లు పుట్టినది అని వ్యుత్పత్తి అర్థం.  అదేం మాటండీ, బ్రాహ్మణుడు పుడతాడా యేమిటీ అని మీరు అనవచ్చును. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః అని సూక్తి. అంటే బ్రాహ్మణ దంపతులకు పుట్టగానే ఎవ్వడూ బ్రాహ్మణుడు కాడు. ఉపనయనం అన్న సంస్కారం పొందిన తరువాతనే వాడు బ్రాహ్మణుడు. అలాగెందుకండీ అంటే ఉపనయనం లోనే గాయత్రీ మంత్రోపదేశం లభిస్తుంది. ఆ పిమ్మటనే వేదాధ్యయనానికి అధికారం వస్తుంది. అందుకని. ఇది సంప్రదాయికమైన అర్థం. ఈ కాలం వాళ్ళకు ఈమాటలు నచ్చకపోతే అది వేరే విషయం.

నిజానికి ఉపనయనసంస్కారం అనేది త్రైవర్ణికులకు సామాన్యమే ఐనా బ్రాహ్మణులనే ద్విజులు అని సాధారణంగా ఎందుకు సంబోధిస్తారూ అన్న ప్రశ్న వస్తుంది. ఉపనయనంతో పాటే వేదాధ్యయనాధికారమూ త్రైవర్ణికులకు సాంప్రదాయికంగా ఉన్నా, వారికి ఆచార్యత్వం విధించబడలేదు.  బ్రాహ్మణులకు అధ్యయనమూ, అధ్యాపనమూ, దానమూ, ప్రతిగ్రహమూ, యజనమూ, యాజనమూ తప్ప ధనసంపాదనకోసం ఏవృత్తినీ చేపట్టే అధికారం వేదం ఇవ్వలేదు. వారు గురువులుగా ఉండి ప్రజల ఆదరణతో బ్రతుకవలసిందే. అందుకే గురుత్వసిద్ది కారణంగా బ్రాహ్మణులకే ద్విజులు అన్న మాట రూఢంగా వినిపిస్తూ ఉంది.

శాఖాచంక్రమణం ఆపుదాం. ద్విజము అంటే రెండుసార్లు పుట్టినది అని వ్యుత్పత్తి చెప్పుకున్నాం కదా దంతములకు ద్విజత్వం ఏమిటీ అని అనవచ్చును. మరి దంతాలు మనుషులకు రెండు సార్లు వస్తాయి కదండీ జీవితంలో. అందుకే అవి ద్విజములు.

కాబట్టి ఇక్కడ ద్విజపంక్తి అంటే దంతాల వరుస అని అర్థం చెప్పుకోవాలి.

ద్విజపంక్తి ద్వయం అంటే దంతాల వరుసల జత అన్నమాట.

ఉజ్వలంగా ప్రకాశిస్తున్న అమ్మ దంతాల వరుసలు ఎలా ఉన్నాయీ అన్నది ఈ నామం శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా అన్న దానిలో చెబుతున్నారు.

అవి శుధ్ధవిద్యాంకురాల్లాగా ఉన్నాయట.

శుధ్ధవిద్య అంటే శ్రీవిద్య.  అంటే అమ్మకు సంబంధించిన జ్ఞానాన్ని కలిగించే విద్య అని అర్థం. అవిద్యను జయించి జ్ఞానం ప్రసాదించేది శ్రీవిద్యయే కదా అందుకని.

సా భవతి శుధ్ధవిద్యా యే దన్తా హస్తయో రబేధమ్ ఇతి. అన్నిటితోనూ తనకు అబేధబుధ్ధిని కలిగించేదే శుధ్ధవిద్య.  అదే శ్రీవిద్య. అమ్మ మొదట ఈ శ్రీవిద్యను శిష్యులకు స్వయంగా ఉపదేశించింది. అమ్మ నోటనే ఆవిష్కృతం ఐన కర్ణోపదేశంగా లోకంలో వ్యాప్తిచెందింది.  పరా, పశ్యంతీ. మధ్యమా వైఖరీ రూపములలో విద్యను వెలువరించిన మన అమ్మ దంతాలే శ్రీవిద్యకు అంకురాలు

ఒక గింజని భూమిలో పాతామనుకోండి. అది మొక్కగా ఎలా మారుతుందీ చూదాం. మొదట అది ఉబ్బుతుంది. ఈ స్థితిని పరావస్థ అంటారు.  ఉబ్బి ఉబ్బి అది విచ్చిపోతుంది కదా. అది పశ్యంతీ అనే అవస్థ.  విచ్చటం అంటే దానినుండి ఒక చిన్న మొగ్గలాంటిది బయటకు వస్తుంది.  జాగ్రత్తగా చూస్తే అందులో రెండు దళాలుంటాయి. కాని అవి అంటుకొని ఉంటాయి. ఇది మధ్యమావస్థ. కొద్దిగా కాడలా పెరిగి,  ఆ రెండుదళాలు మొల్లగా కొంచెంగా విడిపోతాయి. ఇది వైఖరీ అవస్థ. ఈ అవస్థలో ఉన్న మొక్కకే అంకురం అని పేరు.

శ్రీవిద్య యొక్క పూర్ణదీక్ష ప్రధానవిద్య, షోడశాక్షరీవిద్య, శుధ్దవిద్య అని మూడు రకాలైన బీజ ప్రస్తారాలు కలదిగా ఉంది. అందునా షోడశాక్షరీవిద్యకు కూడా శుధ్ధవిద్య అన్న వ్యవహారం ఉంది. ఈ షోడశికి 16 బీజాలు. ఇవి వైఖరీ స్థితికి అనగా అంకురస్థితికి వచ్చేసరికి 16 x 2 = 32 అక్షరాలు అవుతున్నాయి. 32 విద్యాంకుర దళాలు అమ్మకు 32 దంతాలు అన్నమాట. అంకురస్థితిలో ప్రతిబీజమూ శివ శక్తి విభాగాలుగా రెండుగా అవుతున్నది కాబట్టి 16 బీజాలు 32 అంకురాలుగా అవి అమ్మకు దంతాలుగా చెప్తున్నారు. ఇవన్నీ శ్రీరాజరాజేశ్వరీ మంత్ర వర్ణాలు.

శుధ్దవిద్యాంకురాలు అని చెప్పబడే అక్షరాలు అ, ఇ, ఉ, ఋ, ఌ, క, ఖ, గ, ఘ, చ, ఛ, జ, ఝ, ఞ్, ట, ఠ, డ, ఢ, ణ, త , థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, స, హ. ఇవే అమ్మకు దంతరూపాలుగా ఈ నామం ద్వారా చెప్పారన్నమాట.

మరొక విధంగా కూడా అన్వయం ఉంది. శుధ్దవిద్యా చ  బాలా చ ద్వాదశార్థా మతంగినీ అని శ్రీవిద్యా మంత్రదీక్షలు 32 రకాలు. ఈ 32 విద్యావిశేషాలే అమ్మకు దంతాల వంటివి అని చెప్పటం. దీక్షల విషయంలో కూడా సాధకుడిని ద్విజుడు అనే అంటారు. ఎందుకంటే మంత్రదీక్షను పొందక మునుపు, మంత్రదీక్షను పొందిన పిదప వేర్వేరు జన్మలుగా లెక్క, అందుకే దీక్షానామం అని వేరే ఉంటుంది. దీక్షను పొందినప్పుడు అంతకు ముందు ఉన్న నామధేయం పోయి గురువులు పెట్టిన సరికొత్త పేరు వ్యవహారంలోని వస్తుంది కాబట్టి దీక్షాపరులు ద్విజులు అవుతున్నారు. ఇలాంటి ద్విజుల పంక్తి ద్వయమే అమ్మకు దంతముల వంటివి అని అన్వయం చెప్పవచ్చును.

ఈ 32 దీక్షలు ఏవి అన్న విషయంలో కొంత చర్చ ఉంది. 32 దీక్షల గురించి భాస్కరరాయలు చెప్పినా వాటిలో కొన్ని కొన్ని స్మృతి శ్రుతి విరుధ్ధం కాబట్టి అలా అంగీకరించటం కుదరదు. సమయ దక్షిణాచారంలో 16 దీక్షామంత్రాలే ఉన్నాయి. ఈ 16 దీక్షామంత్రాలే శివశక్త్యాత్మకంగా అంకురాలుగా గ్రహించి అమ్మకు రెండు పలువరుసలుగా చెప్పటమే వేదసమ్మతంగా ఉంటుంది.

ద్విజపదానికి విప్రులు అన్న అర్థాన్ని గ్రహించి, ఆ విప్రులు వేదవిద్యలను శిష్యపరంపర ద్వారా వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి వారు శుధ్ధవిద్యకు అనగా వేదవిద్యకు అంకురాలు అన్న భావాన్ని ఆలంబనం చేసుకోవటమే ఎక్కువ సముచితంగా ఉంటుంది.  విద్యావహై బ్రాహ్మణ మాజగామ అని శ్రుతి కదా. అమ్మ నిర్మలమైన విద్యాస్వరూపులైన బ్రాహ్మణులచేత పరివేష్టించబడి ఉందన్న తాత్పర్యం ఈ శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా నామానికి చెప్పుకోవటం బాగుంటుంది. బ్రాహ్మణోఽస్య ముఖ మాసీత్ అన్న శ్రుతిని బట్టి విరాడ్రూపురాలైన అమ్మకు బ్రాహ్మణోత్తములు వదనమునందు దంతపంక్తులుగా విరాజిల్లుతున్నారన్న తాత్పర్యం గ్రాహ్యం.


5 వ్యాఖ్యలు:

 1. మీ నామార్థ వివరణలు చాలా బావున్నాయి. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఈ ప్రయత్నాన్ని ఆదరిస్తున్న పాఠకులకు నేనే ధన్యవాదాలు చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రచనకు ప్రేరణను అందించిన మీకు.

   ఇప్పటికి ఈబ్లాగు మొదలై 92 రోజులైనది. 2,292 మంది ఈబ్లాగును దర్శించారు. అంటే సగటున రోజుకు ఒక 25 మంది. ఇటువంటి అథ్యాత్మిక విషయాలను గిరించిన సమాచారానికి ఈరోజుల్లో ఈవిధమైన ఆదరణ సహజమే అనుకుంటాను.

   మీ ఈ వ్యాఖ్య ఈ బ్లాగులో 100వది!

   తొలగించు
 2. కొన్నిచోట్ల అశ్విన్యాదులు అని
  వ్రాస్తున్నారు. వశిన్యాదులకు మరో పేరా అది
  లేక టైపో ఫాల్టా

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. వశిన్యాదులు అనాలి.
   పొరపాటు పాఠం సరిచేస్తాను.

   తొలగించు
  2. 16,20,21,22,23,24వ నామాల వివరణల్లో ఈ పొరపాటు జరిగింది. ఇప్పుడు సరిచేసాను.
   నాదృష్టికి తెచ్చినందుకు కృతజ్ఞుడను.

   తొలగించు