19, మే 2019, ఆదివారం

27. నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ


నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా। 11

మాధుర్యం అనగా తీయందనం.

ఈ నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ అన్న నామంలో వశిన్యాదులు అమ్మ మాటల మాధుర్యాన్ని వర్ణిస్తున్నారు.

సల్లాపం అంటే మట్లాడటం. అందుచేత సల్లాప మాధుర్యం అంటే మాట్లాడినప్పుడు ఆ మాటలోని మధురిమ అని అర్థం. ఇంక నిజసల్లాపమాధుర్యం అని నిజ అన్న శబ్దాన్ని ముందు చేర్చి చెప్పినప్పుడు తనయొక్క మాటలోని మాధుర్యం అన్నది అర్థం. ఇక్కడ చెబుతున్నది అమ్మను గురించి కదా, కాబట్టి నిజసల్లాపమాధుర్యం  అంటే అమ్మ మాటలోని మాధుర్యం అన్నమాట.

ఆ  మాధుర్యం అనగా అమ్మ మాటల్లోని తీయందనం ఎలా ఉందంటే కఛ్ఛపి అనేది వినిర్భితం ఐనదట.

నిర్భిన్నం కావటం అంటే దెబ్బతిన్నది కావటం. కఛ్ఛపి వినిర్భితమైనది అంటే కఛ్ఛపికే దెబ్బతగిలిందీ అని అర్థం.

కఛ్ఛపి అంటే సరస్వతీ అమ్మవారి వీణ.

పౌరాణిక వాంగ్మయంలోనూ వైదికవాంగ్మయంలోనూ వస్తువులకూ పేర్లు ఉండటం కొత్త విషయం కాదు. మాటవరసకు విష్ణుమూర్తి గారికి ఐదు ఆయుధాలున్నాయి. అవి చక్రం, శంఖం, గద, ఖడ్గం,విల్లు. వాటికి విడివిడిగా పేర్లున్నాయి. విష్ణువు చక్రం పేరు సుదర్శనం. ఈ పేరు అందరికీ చాలా పరిచయం ఉన్నదే. శంఖం పేరు పాంచజన్యం, , గద పేరు కౌమోదకి. అయన ఖడ్గం పేరు నందకం - అన్నమయ్య గారు ఈ నందకం యొక్క అంశావతారం అని ప్రతీతి. విష్ణువు వింటికి పేరు శార్ఙ్గము.

విష్ణువు వింటికి పేరు  శార్ఙ్గము ఐతే శివుడి విల్లు పినాకం అందుకే ఆయనకు పినాకి అని వ్యవహారం.

అలాగే వేరే వేరే దేవతల చేతుల్లో భాసించే వీణలకూ వేరు వేరు పేర్లున్నాయి.

విశ్వావసో స్సా బృహతీ తుంబురోస్తు కళావతీ
సా నారదస్య మహతీ  సరస్వత్యాస్తు కఛ్ఛపీ

అని విశ్వావసువు వీణకు బృహతి అని పేరు. ఈ విశ్వావసుడు ఒక గంధర్వరాజు, యాజ్ఞవల్క్యమహర్షి శిష్యుడు. తుంబురుడు వాయించే వీణకు కళావతి అని పేరు. నారదుడి వీణ మహతి. సరస్వతీ దేవి వీణ పేరు కఛ్ఛపి.

కొందరు కఛ్ఛపి అంటే కఛ్ఛపుడు అనే అయన భార్య అని వ్యాఖ్యానించారు కాని అది పొరపాటు.

సరస్వతి చేతిలోని వీణ కఛ్ఛపి అన్నాం కదా. దాని ప్రత్యేకత ఏమిటయ్యా అంటే అది ఇతర దేవతల వీణల లాగా కాక స్పష్టంగా అక్షరాలను స్ఫురింపచేస్తూ ధ్వనిస్తుంది.

లోకంలో మనుష్యాదులు అంతకంటే స్పష్టంగానే అక్షరాలను పలుక గలరు కదా అనవచ్చును.

కాని సరస్వతి వీణ వలె స్పష్టతతో పాటు మాధుర్యం కూడా ఆ స్థాయిలో ఉండదుగా. అందుకని సరస్వతీ అమ్మ వీణ ప్రత్యేకం అన్నమాట.

మరొకవిధంగ కూడా కఛ్ఛపి అన్న వీణావిశేషానికి వివరణ ఉంది. పైన చెప్పిన నాలుగు వీణలూ అంటే బృహతి, కళావతి, మహతి, కఛ్ఛపి అనేవి నలుగురి చేతిలో కనిపించే నాలుగు రకాలైన వీణలు అని.

ఈ నాలుగు రకాల వీణలలోనూ తంత్రులు భిన్నంగా ఉంటాయి. కళావతిలో 4, కఛ్ఛపి, మహతీ వీణల్లో 7 తంత్రులుంటే బ్రృహతిలో 15 తంత్రులుంటాయి.

కళావతీవీణ తుంబురుడిది. అందుకే దానికి తుంబురా లేదా తంబురా అని పేరు వచ్చింది. దీనికి వివిధ మైన కళలు అనగా శ్రుతులని పలికించటం ప్రత్త్యేకత.

బృహతి, మహతి ఎక్కువగా ఉత్తరదేశ వాద్యాలైతే కఛ్ఛపి దక్షిణదేశానికి చెందినది.

కఛ్ఛపికి వెండి బంగారు దంతాలతోనూ అలంకరణలు ఉంటే మహతికి మాత్రం సొరకాయబుర్రలూ వెదురుబొంగులతో సాదాగా ఉంటుంది.

కఛ్ఛపిలో 24 మెట్లు ఉంటే మిగిలిన రకాల్లో 20 మెట్ట్లే ఉంటాయి.

ఎక్కువ మెట్లుండటం చేత కఛ్ఛపి ఎక్కువ స్వరస్థానాల్ని పలికించగలదు. అదీ దాని ప్రత్యేకత.

ఐతే శ్రీలలితాపరాభట్టారికా దేవీ అమ్మ పలుకుల స్పష్టతా తీయందనమూ సాటిలేనివి. అందుచేత అమ్మ సంభాషణా మాధుర్యం సర్వాతిశాయి అనటంలో సందేహం లేదు.

ఈ విషయంలో సౌందర్యలహరీ స్తోత్ర్తంలో శంకరులు ఇలా అంటున్నారు.

విపంచ్యా గాయంతీ వివిధమపదానం పశుపతేః
త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే
తదీయైర్మాధుర్యైరపలపితతంత్రీకలరవాం
నిజాం వీణాం వాణీ నిచులయతి చోలేన నిభృతమ్

ఈ సొగసైన శ్లోకం ప్రకారం సరస్వతీ దేవిని గురించి ప్రస్తావిస్తూ అమ్మతో శంకరులు ఏమంటున్నారో చూడండి.

అమ్మా సరస్వతీ దేవి నీ ముందుకు వచ్చి రకరకాలుగా శివుడి విజయగాథలను గురించి వీణాగానం చేస్తోంది. హాలాహలం స్వీకరించటం గురించి పాడుతోంది. త్ర్రిపురాసురుల్ని నిర్జించటం గురించి పాడుతోంది. దక్షయాగం ధ్వంసం చేయటం గురించి పాడుతోంది. గజాసురవృత్తాంతం పాడుతోంది. ఇలా అనేక కథలను నీ ఆనందం కోసం నీముందు గానం చేస్తోంది.

నువ్వు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నావు. తలవూపుతూ ఆ సంతోషం వెలుబుచ్చుతున్నావు. అప్పుడప్పుడు బాగుంది బాగుంది అని మెచ్చుకుంటూ ఆమె చాతుర్యాన్ని అభినందిస్తూ మాట్లాడుతున్నావు.

నీ మాటల మాధుర్యాన్ని ఆలకించి ఆశ్చర్యంతో సరస్వతి తబ్బిబ్బు అవుతోంది.

అమ్మ మాటల ముందు నా వీణాగానం మదురిమ ఏపాటిది అని సిగ్గుపడుతోంది.

అలా బిడియపడిన సరస్వతీ దేవి తన వీణను వెంటనే గవిసెనతో కప్పుతోంది, వాదనం చాలించి!

ఎంత సరస్వతీ దేవి చేతి వీణ ఐనా నీ మాటల మాధుర్యం ముందు అదెంత.

ఇలా శంకరులు తమ సౌందర్యలహరిలో అమ్మ పలుకులు సరస్వతీ వీణను చిన్నబుచ్చుతున్నాయని చెప్పారు.

ఇక్కడ శంకరులు అమ్మ సల్లాపం అతి మధురం అన్న విషయంలో సరస్వతితో అమ్మ ఆడిన పలుకులను ప్రస్తావించారు.  మరొక రకంగా భావిస్తే అమ్మ సల్లాపం ఎవరితో నిత్యత్వం కలిగి ఉందో మనం సులభంగా ఊహించగలం కదా. అది కామేశ్వరునితో అని వేరే చెప్పాలా.

సరస్వతీ దేవి వీణ ఎంతగా మాధుర్యానికి పెట్టింది పేరైనా అది అమ్మ అయ్యవారితో ప్రసంగించటంలోని మాధుర్యానికి సాటి రాదు. అమ్మ వాక్కు నాదబ్రహ్మస్వరూపం కదా,

బహిర్మాతృకాన్యాసంలో అమ్మ ముఖవృత్తానికి విసర్గతో న్యాసం.

3 కామెంట్‌లు:

  1. నాకు చాలా అబ్బురంగా వుందండి మీరు నామాలు వివరించే తీరు. ఎన్ని మంచి విషయాలు తెలుస్తున్నాయో మీ వల్ల! ఇలా మీరు తప్ప ఎవరూ రాయలేరు అన్నట్లు రాస్తున్నారు. ధన్యోస్మి!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లలిత గారూ, నా దేముందండీ. పెద్దలు చెప్పిన విషయాలనే నా ధోరణిలో నేను ఇక్కడ నాకు చేతనైనంత సరళంగా చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. అంతా అమ్మదయా, మీ అభిమానమూ తప్ప నా గొప్ప ఏమీ లేదు.

      తొలగించండి
  2. మంచి ఇన్ఫర్మేషన్ ఎన్నో మాకు తెలియని పదాలకు అర్ధం చెబుతున్న అందుకు ధన్యవాదాలు మీ స్ఫూర్తి తో నా కూతురుకి మహతి అనే పేరు పెడుతున్నాను

    రిప్లయితొలగించండి