3, మార్చి 2019, ఆదివారం

6. ఉద్యద్భానుసహస్రాభా


ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా।
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా॥ 2

భానుడు అంటే సూర్యుడు.  ఉద్యత్ అంటే పైకి వస్తున్న, ఉదయిస్తున్న అని అర్థం.  ఉద్యత్+భానుడు --> ఉద్యద్భానుడు.  అందుచేత ఉద్యద్భానుడు అంటే ఉదయిస్తున్న సూర్యుడు. ఉదయిస్తున్న సూర్యబింబం అరుణవర్ణంతో చాలా మనోహరంగా ఉంటుంది.

సహస్రం అన్న పదానికి సామాన్యార్థం వేయి అని.  విశేషంగా అనేకానేక అని చెప్పటానికి కూడా సహస్రం అన్న పదాన్ని వాడుతూ ఉంటారు. అలాంటిదే కోటి అనే పదమున్నూ. కోటి అంటే వందలక్షలు అనే కాక సమూహం అని అర్థం కూడా ఉంది. సందర్భాన్ని అనుసరించి సరైన విధంగా అర్థం చేసుకోవాలి.

సహస్ర + ఆభ --> సహస్రాభ. ఇక్కడ ఆభ అనే ఉపసర్గను పోలిక చెప్పటానికి వాడతారు.

అందుచేత మొత్తానికి ఉద్యత్ + భాను + సహస్ర + ఆభ --> ఉద్యద్భానుసహస్రాభ అంటే ఉదయిస్తున్న వేయి మంది సూర్యబింబాలతో పోలి ఉన్నది అని అర్థం. ఈ పోలిక దేనితో అంటే అరుణిమలో అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయసూర్యుడిలోని విశేషమైన లక్షణం అరుణిమయే కదా.

కాబట్టి అమ్మ ఆవిర్భావం ఎలా ఉన్నదీ అంటే వేయిమంది బాలసూర్యుల యొక్క అరుణప్రకాశంతో పోలిన వెలుగును కలిగి ఉన్నది అని చెప్పటం.

కాని శాస్త్రప్రకారం ఇలా చెప్పకూడదు. భానూనాం సహస్రం కిరణం యస్య అన్న వ్యుత్పత్తి ప్రకారం ఒక్క సూర్యుణ్ణే చెప్పాలి.

బ్రహ్మాండపురాణంలోని

ప్రాదుర్భభూవ పరమం తేజఃపుంజమయమ్ మహత్
కోటి సూర్యప్రతీకాశం చంద్రకోటి సుశీతలమ్

అని చెప్పిన దానికి విరోధం కలగ కూడదు.

భాను శబ్దానికి సూర్యుడు అనే కాక కిరణం అనే అర్థం కూడా ఉందని మనం గమనించితే అన్వయం సుభగంగా ఉంటుంది.

కాబట్టి ఇక్కడ వేయి అంటే అనేకానేక లేదా అనంత మైన అని అర్థం గ్రహించి  అనంతమైన అరుణకిరణాలతో ఉదయిస్తున్న సూర్యుడితో సమానమైన అరుణప్రభ అనే చెప్పుకోవాలి.

స్వతంత్రతంత్రమనే విద్యాగ్రంథంలో

స్వాత్వైవ దేవతా ప్రోక్తా లలితా విశ్వవిగ్రహాః
లౌలిత్యం తద్విమర్శః స్వాదుప్రాప్తి రితి భావయేత్

పరమాత్మయే దేవతా మూర్తి. ఆదేవతా మూర్తియే లలితదేవి. ఆవిడ విశ్వరూపము కలిగినది. అమె రక్తవర్ణమే విమర్శస్వరూపము. దీనిని చక్కగా భావించటమే ఉపాసనా విధానం అని పై శ్లోకానికి అర్థం. (ఇక్కడ విమర్శ అనేది సాంకేతికపదం)

వామకేశ్వర తంత్రంలో కూడా

స్వయం హి త్రిపురాదేవీ లౌలిత్యం తద్విమర్శనమ్

లలితా దేవి ఎఱ్ఱని వర్ణం కలిగి ఉంది. అది విమర్శారూపం అని పై వాక్యానికి అర్థం

అమ్మవారికి మూడు రూపాలు. స్థూలము, సూక్ష్మము, పరమము అని. కరచరణాలతో ఉండేది స్థూల రూపం. మంత్రమయమైన రూపం సూక్ష్మరూపం. వాసనాత్మకం పరస్వరూపం.

ఈ నామం ఉద్యద్భానుసహస్రాభా నుండి స్వాధీనవల్లభా అనే నామం దాకా అమ్మ యొక్క స్థూలస్వరూపాన్ని వర్ణిస్తున్నారు. ఇదే విమర్శారూపం.

శ్రీమత్సింహాసనాసీన ఐన అమ్మయొక్క స్థూల (విమర్శా) రూపాన్ని  ధ్యానం చేయటం వలన మనస్సుకు ఏకాగ్రత సిధ్ధిస్తుంది.

ఈ విమర్శారూప వర్ణనలో ముందుగా శ్రీదేవి యొక్క తేజస్సును వర్ణించటం జరిగింది ఈ నామంతో.

ఉదయించే సూర్యుడు చీకటిని పారద్రోలి వెలుగును తీసుకొని వస్తున్నాడు.  చీకటి దుఃఖానికి సంకేతం. ఇక్కడ దేవతలు దుఃఖాకులిత చిత్తులై ఉన్నారు. వారి దైన్యం అనే చీకటిని పోగొట్టే బాలసూర్యుడివలె అమ్మ అహ్లాదకరమైన అరుణవర్ణతేజోవిరాజమానమూర్తిగా అవతరించింది అని తాత్పర్యం.

ఉదయించే సూర్యుడు సమస్త జీవులకు ఎలా అహ్లాదాన్ని కలిగిస్తున్నాడో అలాగే అమ్మ ఆవిర్భావం సమస్త దేవతాగణాలకూ అనందోత్సాహాలు కలిగించినది అని మనం అర్థం చేసుకోవాలి.

ఈ సందర్భంగా మనం నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా  సర్వారుణా అనే నామాల వివరణను కూడా పర్యావలోకనం చేసుకొనవలసి ఉంది.


18 కామెంట్‌లు:

  1. "ఉద్యద్భానుసహస్రాభా"
    సూర్యకోటిసమప్రభా!

    రిప్లయితొలగించండి
  2. ఆభా అనేది అమ్మపేరు . విశ్వాంతరాళంలో ఎక్కడా లేని వర్చస్సు
    ఆమె సొంతం . ఆభా అనేది నామం . ఉపసర్గ కాదు . పోలిక అనే
    అర్థమూ కాదు . ఆభా అనే అమ్మ పేరుకు
    ముందున్నపదాలు విశేషణాలు .ఆభా అంటే వర్చస్సు GLOW. ఈ 'అమ్మ ' పేరు అనేకులు తమ బిడ్డలకు పెట్టుకున్నారు .
    ఇది నాకు తోచిన అర్థం . అన్యథా భావించకండి .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారు,

      నిజమే, ఆభ అన్న శబ్దానికి కాంతి అనీ పోలిక అనీ కూడా అర్థాలున్నాయి. కాని ఆభ అని అమ్మవారి నామం అన్నట్లుగా సౌభాగ్యభాస్కరాదులలో కానరాదు.

      సౌభాగ్యభాస్కరంలో "ఉదయించుచున్న వేయికిరణములుకల సూర్యుని యొక్క కాంతివంటి కాంతి కలది" అని ఉంది.

      నేను కూడా వివరణను పోలికతో మొదలుపెట్టాను "వేయిమంది బాలసూర్యుల యొక్క అరుణప్రకాశంతో పోలిన వెలుగును కలిగి ఉన్నది అని చెప్పటం." అని. కాని వెంబడే "శాస్త్రప్రకారం ఇలా చెప్పకూడదు." అని "అనంతమైన అరుణకిరణాలతో ఉదయిస్తున్న సూర్యుడితో సమానమైన అరుణప్రభ" కలది అమ్మ అని వివరించాను.

      ఇకపోతే "అభ" అని అమ్మాయిలకు పేరుపెట్టటం నాకైతే చిత్రంగా అనిపిస్తోంది. కాని ఇలాంటివి చూస్తునే ఉన్నాం. ఒకమ్మాయికి "సంయుత" అని పేరు పెట్టారు. కారణం అడిగితే లలితాసహస్రనామంలో అమ్మవారికి "సంయుత" అని ఒక నామం ఉంది అని నాకు వివరించారు!

      తొలగించండి
  3. ఉద్యత్ = పైకెత్తబడి
    భాను = ప్రకాశమానమైన
    సహస్రా = అనంతకోటి శిరస్సులతో అమ్మ
    ఆభా = అనిర్వచనీయ వర్చస్సుతో అమ్మ
    అమ్మ ప్రకాశమే విశ్వమంతా నిండి సూర్యాది
    బింబాలకు ఆధారమై వెలుగు నిస్తున్నప్పుడు ,
    అనంత కోటి సూర్యుల వెలుతురూ ఆమెకు
    పోలిక కానేరదు .
    సహస్రా అంటే సహస్ర శీర్షా అనే అర్థం ఉత్తమం .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిత్రులు రాజారావు గారు,

      సహస్ర శబ్ధానికి ఒక వేయి అని సామాన్యార్థం. అప్పుదప్పుడూ సహస్రశబ్దం 'అనేక' (లెక్కకు అందనంత లేదా అనంత) అన్న అర్థంలో కూడా ప్రయోగించబడటం విశేషం. కాని సహస్రశబ్ధంలో శిరస్సు(ల)ను సూచించటం సంప్రదాయికంగా ఎక్కడా నేను గమనించ లేదు.

      విష్ణుసహాస్రనామావళి లోని 826వ నామమైన సహస్రార్చిః అన్న నామానికి శంకరులు చెప్పిన భాష్యం చూడండి. సహస్రాణి అనంతాని అర్చీంషి యస్య సః. అనంతమగు జ్వాలలు ఎవ్వనివో అతడు అని. దివిసూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా। యది భాస్సదృశీ సా స్యాద్భాసస్తస్య మహాత్మన॥ (భగ. 11-12) అనే గీతావచనం ఇక్కడ ప్రమాణం. ద్యులోకంలో ఒకేమారు అనేక/వేయి మంది సూర్యుల కాంతి వ్యాపించినచో అది ఆ మహాత్ముని కాంతికి సమానం కావచ్చునేమో. ఇక్కడి సంగతి ప్రస్తుత లలితానామానికి చాలా దగ్గరగా ఉండటం విశేషంగా గమనించ దగ్గది!

      అలాగే 227వ నామమైన సహస్రపాద్ అన్న దానికి సహస్రాణి పాదాః అస్య - వేలకొలది పాదములీతనికి కలవు. సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ (పురుష. 1) విరాట్పురుషుడుగా పరమాత్ముడు వేలకొలది శిరస్సులు, కన్నులు పాదములు కలవాడు అని శ్రుతి ప్రమాణం అని చెప్పారు శంకరులు

      యుధ్ధే సురారీణాం సహస్రాణి జయతి ఇతి సహస్రజిత్, సహస్రాణి మూర్థా అస్యః సహస్రమూర్థాః , సహస్రాణి అంశవః అస్య సహస్రాంశుః, సహస్రాణి అక్షీణి - అక్షాణివా- యస్య సహస్రాక్ష అనీ శంకరుల భాష్యం.

      ఇక్కడ అన్ని సందర్భాల్లోనూ సహస్రశబ్ధం చేత వేయి లేదా అనంతమైన అన్న అన్వయమే కలుగుతున్నది.

      ముఖ్యంగా శ్రుతి సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాద్ (పురుష. 1) అని చెబుతున్నది కదా సహస్రశబ్దంలోనే శీర్షములు అర్థగతము లైన పక్షంలో సహస్రశీర్షా అనటం పునరుక్తి అవుతున్నది.

      శ్రీలలితాసహస్రనామావళిలో 'ఉద్యద్భాను సహస్రా', 'ఆభా' అని విడిదీసి నామములు ఎవ్వరూ చెప్పలేదు ఇంతవరకున్నూ. మొదటిది శ్రీమాతా అన్నది కాగా వేయవ నామం లలితాంబికా అనే సంప్రదాయిక నామావళిగా కనిపిస్తున్నది.

      తొలగించండి
    2. లలితా సహస్రనామాలు . సహస్ర అనేపదం విశేష ప్రాధాన్యతతో అనేక సందర్భాలలో వాడబడి ఉంది .
      మానవ వినిమయ సంఖ్యాపరంగా వేయి అర్థమైనప్పటికీ ,
      వేదాంతపరంగా నిగూఢమైనది . సకారానికి పురుషుడనీ ,
      హకారానికి ప్రకృతియనీ - రెండు తత్త్వాలూ భాసించేది అమ్మలోనేయనీ , అందుకే విశ్వజననిగా అమ్మ సహస్రా అనే
      నామంతో భాసిల్లుతూ ఉంది .
      ఇక ఆభా , తన వర్చస్సు వల్లనే బ్రహ్మాండ మండలి (అనంతకోటి బ్రహ్మాండాలు ) వెలుగు లీనుతూ ఉండడం వల్ల
      అమ్మ భానుమండల మధ్యస్థిత . అందువల్ల అమ్మకు ఆభా
      అనిపేరు . ఇక్కడ భాను అంటే సూర్యుడు కాదు .
      ఇక , అమ్మకు వేయి నామాలేమిటి ? అమ్మ నామావళి అనంతం .

      తొలగించండి
    3. మిత్రులు రాజారావు గారు, అమ్మనామాలు అనంతములే. నిస్సందేహంగా. ఐతే ఇక్కడ వశిన్యాదులు చేసిన ఈ స్తోత్రంలో చెప్పిన వేయినామాలకు భాస్కరరాయలవారూ, సింహభట్లవారు, తుమ్మలపల్లి వారు వంటి మహనీయులూ శ్రీవిద్యారహస్యవేత్తలూ సెలవిచ్చిన సంప్రదాయిక విధానంలోనే నామవివరణ యథాశక్తిగా చేస్తున్నాను. అంతకు మించి నా స్వకపోలకల్పితంగా ఏమీ చేయగలంతటి వాడను కాను. మీ వివరణ ఆసక్తికరంగా ఉన్నది కాని నాకు తెలిసినంతవరకూ సంప్రదాయిక వివరణలతో పోలకపోవటమూ మరికొన్ని అన్వయ క్లిష్టతల కారణంగా ఆశ్చర్యపడుతున్నానంతే. శ్రీవిద్యావిషయకమైన వేదాంతపూర్వక వివరణలు అవసరమైన చోట్ల పెద్దలు చెప్పినవి కూడా వీలైనంత సుబోధకంగా చూపటానికి యత్నిస్తాను.

      తొలగించండి
  4. శంకరభాష్యాను సారిగా శ్రీలలితాత్రిశతి వివరణకూడా వ్రాయాలని ఒక సంకల్పం ఉంది. లలితాసహస్రనామస్తోత్రంతో పాటుగా సమాంతరంగా శ్రీలలితాత్రిశతిస్తోత్ర వివరణ కూడా వ్రాయటమో, ఇది పూర్తైన పిదప వ్రాయటమో ఇంకా ఒక్ నిశ్చయానికి రాలేదు. నాకెంత సమయం ఉన్నదో తెలియదు కాబట్టి త్రిశతీవివరణమూ సమాంతరంగా వ్రాయటం ఉచితం అన్న ఒక ఊహ ఉన్నది మాత్రం నిజం.

    రిప్లయితొలగించండి
  5. మిత్రులు శ్యామలరావుగారూ ,
    అమ్మ అంటే ఆసక్తి . అందున , అమ్మే సర్వస్వమనే భావనతో
    పరమోత్కృష్ట భావన చేయడానికి ప్రయత్నించానేకాని , తదితరంకాదు .
    ఎందరో మహానుభావులు అమ్మను కీర్తించారు . అందరికీ
    వందనాలు . సూర్యకోటి సమప్రభ ఐతే , ఆ కోటి సూర్యుల
    ప్రభ ఎక్కడిది ? అమ్మదే కదా . మీరు చేస్తున్న కైంకర్యం అమ్మకు
    ఆనందదాయకం . కొనసాగించండి . ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి.
      మహాత్మా గాంధీ గారి హత్య జరిగిన సమయంలో ఆయనకు చెరో ప్రక్కన ఉన్న ఇద్దరు అమ్మాయిల్లో ఒకరు పేరు అభా. రెండో అమ్మాయి పేరు మను.

      (కానీ ఇక్కడ జరుగుతున్న చర్చ అది కాదుగా)

      తొలగించండి
    2. # నీహారిక గారు
      ఇక్కడ శ్యామలరావు గారికి రాజారావు గారితో జరుగుతున్న చర్చ ... అభ అన్నది అమ్మవారి నామమా కాదా, అలాగే వేయి (అనేక) సూర్యుల కాంతి అనాలా లేక ఒకే సూర్యుడికి గల వేయి (అనేక) కిరణాల కాంతి అనాలా ... అన్నవి ముఖ్యాంశాలు అని నా అల్పజ్ఞానానికి తోస్తున్నది. పైన మీరన్న "శాస్త్రం ఒప్పుకోదు" అని శ్యామలరావు గారు అంటున్నారు అన్నది వేయి మంది సూర్యులు అనడం గురించి అనుకుంటాను. అమ్మే సర్వస్వమని ఇద్దరూ అంగీకరిస్తున్నట్లే ఉంది.

      అయినా మహాతల్లీ ... ఏదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు "నన్ను ఇన్-వాల్వ్" చెయ్యకండి. మీరేదో అడగడం, నేనేదో చెప్పి ఇటువంటి విషయాలలో నా అజ్ఞానాన్ని బయటపెట్టుకోవడం ... అవసరమా 🙁? నేను కాలక్షేపం కబుర్ల "రాయుడి"నే కాని పై ఇద్దరు రావు ల్లాగా విద్వత్తు కలిగిన "రాయుడ"ను కాను. నన్నొగ్గెయ్యండి 🙏.

      తొలగించండి
  7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఒకసూర్యుడైనా , అనేక సూర్యులైనా ప్రభవించేదీ , వెలుగులు సంతరించుకునేదీ అమ్మనుండే . అనిర్వచనీయమైన అమ్మ దేహదీప్తికి ఆబింబాల వెలుగులు
      పోలిక కావనేది నా భావన .
      అనంతకోటి బ్రహ్మాండాల మధ్య మణిద్వీపంలో వెలుగుతూ ,
      బ్రహ్మాండాలకు వెలుగులు పంచుతూ ఉండే లలితమ్మే ప్రాణుల సహస్రారంలో నవయోని ప్రభాసిత శ్రీచక్రంలో నిలిచి జీవికి చైతన్యాన్ని ప్రసాదిస్తోంది . అందువల్లనే ఈ సహస్రారానికి శ్రీలలితా సహస్రార శ్రీచక్రం అని స్థిరనామం .
      అమ్మకు స్వాధీన వల్లభా అనే నామముంది . అమ్మ విషయంలో అయ్యవారు స్థాణువు . అమ్మే సర్వస్వం .
      అయ్యవారికిక్కడ విషయం నాస్తి .
      మీరేమిటి ? సింహానికి బదులు పిల్లిబొమ్మ పెట్టేరు .

      తొలగించండి
  8. # నీహారిక
    // " ...... తమరేవన్నా సూచిస్తారా ? " // అంటూ చర్చలోకి ఎవరు ఎవర్ని లాగారు? ఆడవారి మాటలకు .. అని అలనాటి పాట ఊరికే వ్రాయలేదండి ఆ గీతరచయిత.

    🦁 roar .. ఇదీ సింహం బొమ్మ, జాగ్రత్తగా చూడండి 😡

    రిప్లయితొలగించండి
  9. శ్యామలరావుగారి బ్లాగును మనం యథోచితంగా వాడేసుకుంటున్నాం .
    ఇప్పటికే ఒక మిత్రుడు అలుక నుంచి ఇంకా తేరుకోలేదు . ఇక్కడేమౌతుందో .....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారు, లోకవాసనాకారణంగా అలుక వస్తుంది. ఈ వాసనాత్రయం నుండి బయటపడటానికి యత్నిస్తున్నాను. ఐతే ప్రజలందరికీ విజ్ఞప్తి యేమిటంటే, ఈ శ్రీలలితా బ్లాగును అమ్మవారికి సంబంధించిన చర్చ(ల)కు మాత్రం పరిమితం చేద్దాం. లౌకికవిషయ సంబంధమైన విషయాలపై చర్చలు పరిహరిద్దామని నా విన్నపం.

      తొలగించండి
    2. అవును శ్యామలరావు గారు, రాజారావు గారు. అందుకే సాగతీత వ్యాఖ్యలకు స్పందించబోవడం లేదు.

      తొలగించండి