6, మార్చి 2019, బుధవారం

7. చతుర్బాహుసమన్వితా


ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా॥

అమ్మకు నాలుగు బాహువులున్నాయని ఈ చరుర్బాహు సమన్వితా అన్న నామం తెలియ జేస్తోంది.

ఈ చరుర్భాహువులు అన్న చోట ఉన్న నాలుగు సంఖ్య కొందరి మతం ప్రకారం అంతఃకరణ చతుష్టయాన్ని సూచిస్తోంది. అంతఃకరణ చతుష్టయం అంటే మనస్సు, బుధ్ధి, చిత్తము అహంకారము అనేవి.

మనస్సు అనేది వాయుతత్త్వం కలది. అందువల్ల గాలిలాగే నిత్యం చలిస్తూ సంకల్పాలూ వికల్పాలూ చేస్తూ ఉంటుంది. బుధ్ధి అనేది అనితత్త్వం కలది. మంచి చెడులను విశ్లేషించటం దీని లక్షణం. చిత్తం అనేది జలం యొక్క అంశ కలది ఆలోచనలను ప్రచోదింప చేస్తుంది. అహంకారం భూతత్త్వం కలది. నేను నాది అన్న అభిమానానికి మూలం. శ్రీదేవి యొక్క నిర్గుణ రూపంలో ఈ నాలుగూ ఆవిడ బాహువులుగా ఒక భావన.

మరికొందరి ఆలోచనలో నాలుగు బాహువు లంటే అవి ధర్మార్థకామమోక్షాలనే నాలుగు పురుషార్థాలకూ ప్రతీకలు. అంటే అమ్మ పురుషార్థములను సాధకులకు అనుగ్రహించుతూ ఉన్నదని భావన.

అమ్మ నాలుగు బాహువులతో నాలుగు వేదాలనూ ధరించినది అన్న భావన కూడా ఉన్నది.

ఇంకా నాలుగు బాహువు లంటే సాధనాచతుష్టయంగానూ నాలుగు ఆశ్రమాలుగానూ భావన చేయటమూ ఉన్నది.

మరొక విధంగా భావన చేస్తే, శ్రీదేవీ సూక్ష్మరూపం ఐన శ్రీవిద్యా పంచదశాక్షరీ మంత్రానికి కాది హాది విద్యల సమ్మేళనం చతుష్కూటం - అవే శ్రీదేవి బాహువులు అని. అనగా కఏఈల-హసకల-హసకహల-సకల అనే నాలుగు అక్షర కూటములు.

ఇంకొక విధంగా నాలుగు బాహువులతోనూ అమ్మ నాలుగు దిక్కులనూ శాసిస్తున్నది అని ఒక భావన చేయవచ్చును.

అలాగే ఈ నాలుగు బాహువులనూ జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలనూ లేదా స్థూల, సూక్ష్మ, కారణ, తురీయ దేహాలనూ సూచించటమూ కూడ కద్దు.

బాహృ యత్నే అన్న ధాతువు కారణంగా బాహువులు ప్రయత్న సూచకాలు. అమ్మ ఇక్కడు ముఖ్యంగా దేవకార్యం తీర్చటానికి ఆవిర్భవించుతున్నది. దేవతలకు అసాధ్యమైన కార్యాన్ని నెరవేర్చటానికి అవసరమైన అనుపమ మైన ప్రతాపం ప్రదర్శించేవి నాలుగుబాహువులుగా సూచన. అమ్మ బాహువులు ఆయుధధారణ చేసి ఉన్నాయి. దుష్టశిక్షణాకార్యం కొరకు వచ్చింది కదా మరి!

ఒక గమనిక ఏమిటంటే అమ్మ బాహువుల యందు వరద ముద్ర, అభయ ముద్ర చెప్పబడవు! అమ్మ పాదాలే అందుకు చాలు.భయా త్రాతుం దాతుం ఫలమపిచ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ అని సౌందర్య లహరిలో ఈ విషయం స్పష్టంగా ఉన్నది. అంటే భయాల నుండి రక్షించేందుకూ అడిగినవి దండిగా అనుగ్రహించేందుకూ అమ్మ పాదాలే మంచి నేర్పు కలిగినవి అని అర్థం.

6 కామెంట్‌లు:

  1. అమ్మవారికి నాలుగు చేతులు అవసరమాండీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇదొక అసంగత మైన ప్రశ్న. అమ్మా నువ్విలా ఉండటం అవసరమా అని పిల్ల(వాడు) తల్లిని ప్రశ్నించటంలో ఔచిత్యం ఉంటుందా?

      ఐతే, ఈ ప్రశ్న ఎంత అసంగతమైన దైనా, ఇలా ఉండటానికి మాతృదేవత శ్రీదేవికి ఒక కారణం ఉండే ఉంటుంది అని అనుకోవటం ఉచితం కదా. అప్పుడు అటువంటి కారణం ఏమై ఉంటుందబ్బా అని మనం వినయభావంతో అమ్మను గురించిన ఒక ఆలోచన అనండి ధ్యానం అనండి చేసేందుకు అది దారి తీస్తుంది. అలా అనుకొనటం వలన మేలే కలుగుతుంది తప్పకుండా.

      కాదూ, అమ్మ కూడా మన ఊహాచిత్రమే, ఆవిడ ఉనికి మన మనస్సు యొక్క భ్రాంతి అనుకొన్న పక్షంలో మన మనోవికారాలు అమ్మకు కోపం తెప్పించక పోవచ్చును కాని అవి మన అథ్యాత్మికపురోభివృధ్ధికి తోడ్పడతాయని విశ్వసించటం కష్టమే.

      నేను వేదాంతిని కాని పండితుడను కాని కాను. నాకు తోచిన విధంగా చెప్పాను. మీకు నచ్చకపోతే మన్నించాలి.

      తొలగించండి
  2. బాహువులు బలసంపన్నతకు ప్రతీకలు . చతుశ్శబ్దం వాచ్యంగా నాలుగు అంకెను చెబుతున్నప్పటికీ అమ్మ
    విషయంలో కాదు . ' నలుగురూ చేరి ముచ్చటించే చోట
    నాపేరొకపరి తలవండి ' అంటుంది పూర్ణమ్మ . నలుగురూ
    నాలుగు విథాలుగా చర్చిస్తారు అనేది లోకంలో మాట .
    ఇలా ఆలోచిస్తే , చతుర్ అంటే కేవలం నాలుగు అనికాక
    అనేక అని చెప్పుకోవలసి ఉంది . సమన్వితా అంటే
    కూడుకొన్నది అనేకంటే , సమ్ అనే ఉపసర్గకు పరిపూర్ణ
    మైన అని అర్థం . అన్వితం అంటే సమకూర్చడం .
    లోకోత్తర బలసంపన్నయై , అమ్మ ఈలోకాలకు అవసరమైన
    పరిపూర్ణ బలసంపదను సమకూర్చుతూ ఉంది . అని
    ఈనామానికి అర్థంగా నేను భావిస్తున్నాను .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. "అన్వితం అంటే సమకూర్చడం"
      అన్వితము అన్న పదానికి కూడుకొని ఉండటము అన్న అర్థమే కాని మీరు సూచించిన అర్థం అనిదంపూర్వమండీ.

      తొలగించండి
  3. "చతుర్బాహుసమన్వితా"
    చతుర్దశాంతరభువనపాలినీ!

    రిప్లయితొలగించండి