9, మార్చి 2019, శనివారం

8. రాగస్వరూపపాశాఢ్యా


ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్వితా
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా॥  2

అమ్మను చతుర్బాహుసమన్వితా అని చెప్పిన తరువాత వశిన్యాదులు ఆ తల్లియొక్క బాహువుల యందున్న వాటిని గురించి వివరిస్తున్నారు.

రాగస్వరూపపాశాఢ్యా
క్రోధాకారాంకుశోజ్వలా
మనోరూపేక్షుకోదండా
పంచతన్మాత్రసాయకా

అనేవి నాలుగూ అమ్మ బాహువులను గురించిన నామాలు.

బాహువులను ప్రస్తావించిన తరువాత ఆ బాహువులలో ఉన్న ఆయుధసంపత్తిని వర్ణించటం సముచితం కదా

గమనించ వలసిన సంగతి యేమిటంటే ఈ ఆయుధాలు కూడా స్థూల, సూక్ష్మ పర అనే బేధాలు కలవిగా ఉండటం.

స్థూలంగా అమ్మ వారి చేతుల్లో ఒక దానిలో పాశం ఉన్నది.  అమ్మ వారి ఆకృతిలో అది ఆవిడ ఎడమవైపున ఉన్న రెండుచేతులలో మీది చేతిలో ఉన్నది.

ఈ పాశం ఎటువంటిది అంటే అది రాగం అనేదానిని తెలిపేదట. రాగమే పాశం అనే ఆకారంలో అమ్మ చేతిలోని ఆయుధంగా అమరి ఉందట.

చిత్తవృత్తుల్లో ఒకటి అనురక్తి. అదే రాగం. ఇది వాసనా మయం. వాసనలు మూడు రకాలు. అవి లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అనేవి. అంటే లోకం యొక్క గుర్తింపును కోరుకొనటమూ, దేహసౌఖ్యాపేక్షా, శాస్త్రసంబంధమైన జ్ఞానమే మోక్షం అనే భ్రమ అనేవి. ఇదంతా జీవులకు తమ ఉపాధి పైన అనురక్తి వల్ల ఏర్పడుతున్న తమాషా.

పశువును కట్టేది పాశం అని వ్యుత్పత్తి.  జీవులందరూ పశువులే. అందుకే శివునకు పశుపతి అని నామధేయం. పశువులకు తమ ఉపాధిపై రాగం సహజాత లక్షణం.

ఒకప్పుడు ఇంద్రుడు కర్మవశాత్తు పందిగా జనించ వలసి వచ్చింది. ఆయన నారదమహర్షిని దర్శించి, మహాత్మా, నేను పందిగా ఉపాధిని పొందినప్పుడు మీరు వచ్చి ప్రబోధించితే నేనా ఉపాధిని వదలి మళ్ళా ఇంద్రత్వం స్వీకరిస్తానూ అని బ్రతిమాలాడు. నారదుడు నవ్వి సరే అన్నాక ఆయన సూకరోపాధిని పొందటమూ మాట ఇచ్చినట్లే నారదమహర్షి పోయి ప్రబోధించటమూ జరిగింది. అప్పుడేం జరిగిందో చూసారా. ఆ పందిరూపంలో ఉన్న ఇంద్రుడు అన్నాడు కదా, ఈ జన్మం ఇంత హాయిగా ఉందే, దీనిని వదలిపెట్టమని చెబుతావేమి టయ్యా, ఠాట్ కుదరదంటే కుదరదూ అని.  ఇదండీ జీవుణ్ణి పశువుని చేసి ఆడించే వాసనారూపకమైన పాశం అంటే. ఇటువంటి పాశం అమ్మకు ఆయుధంగా అమరి ఉందని ఈ నామం తాత్పర్యం.

చూసారుగా రాగం అనేది జీవుణ్ణి లోకానికి కట్టి పడవేసే బంధం.  ఈ బంధం ఉన్నన్నాళ్ళూ జననమరణ రూపమైన సంసారంలో పరిభ్రమించటం తప్పదు.  ఈ రాగం అనేది కామం యొక్క స్వరూపం. కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముధ్భవాః అని గీత. త్రిగుణములు లేనిదే ఉపాధియే లేదు. ఉపాధులన్నిటికీ త్రిగుణముల ఆయా ఉపాధులకు తగినట్లు ఉండి తీరుతాయి కదా.  జీవుల కర్మల విశేషాలను బట్టి అమ్మ వారికి తగినట్లు ఈ పాశాన్ని అమ్మే ప్రయోగిస్తున్నదన్న మాట. అంటే ఈ పాశపు దెబ్బలు తిని తిని మెల్లగా జీవుడు దారిలోనికి రావాలి. అంటే రాగాన్ని అతిక్రమించటానికి ప్రయత్నించాలి అని తాత్పర్యం.

పూర్వచతుశ్శతి అన్న గ్రంథంలో పాంశాంకుశౌ తదీయౌ తు రాగద్వేషాత్మికౌ స్మృతౌ అని ఉంది. అంటే తల్లికి రాగద్వేషాలు ఆయుధాలుగా అమరి ఉన్నాయని.

దూర్వాసమహర్షి చేసిన దేవీమహిమ్నస్తోత్రంలో

పాశం ప్రపూరిత మహాసుమతి ప్రకాశో
యోవావ త్రిపురసుందరీ సుందరీణామ్
ఆకర్షణో౽ఖిల వశీకరణే ప్రవీణం
చిత్తే దధాతిస జతగత్రయవశ్యకృత్స్యాత్

య స్వాంతే కలయతి కోవిద స్త్రిలోకీ
స్తంభారంభణచణమృత్యుదారవీర్యమ్
మాతస్తే విజయమహాంకుశం సయే సా
దేవాం స్తంభయతి చ భూభుజో౽న్యసైన్యమ్

ఈ మూడు జగత్తులను ఆకర్షించి వశీకరణం చేసుకొనే శక్తి కలది త్రిపుర సుందరి యొక్క పాశం అనే ఆయుధం. ఆ తల్లి యొక్క క్రోధము అనే విజయ మహాంకుశం శత్రువులను స్తంభింపచేసి వారికి మృత్యువుగా పరిణమిస్తున్నది అని వీటి అర్థం స్థూలంగా.

అంటే జగత్తును శాసించే రాగం అనేది అమ్మ చేతి ఆయుధం. అని స్పష్టం అవుతున్నది.

మనం అమ్మ పాదాలను ఆశ్రయించినట్లైతే ఆవిడ కరుణామయి కాబట్టి రాగం అనే పాశం మనపైకి రాకుండా ఉంటుందని భావన చేయటం ఉచితంగా ఉంటుంది.

5 కామెంట్‌లు:

  1. అమ్మవారికి నాలుగు చేతులు అవసరమే కదండీ? ఆయుధాల గురించి పూర్తిగా చెప్పలేదేమిటీ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ వ్యాసంలోనే చెప్పినట్లుగా నాలుగు చేతుల లోని ఆయుధాలను తెలిపేవి నాలుగు నామాలు వరుసగా వస్తాయి. అందులో మొదటి నామం గురించి ఇక్కడ చదువుకున్నాం కదా. మిగిలిన మూడు నామాలను గురించి కూడా వచ్చే మూడు వ్యాసాల్లో తెలుసుకుందాం. మీ ఆత్రుత మెచ్చదగినది!

      తొలగించండి
  2. "రాగస్వరూపపాశాఢ్యా"

    రాగవిరాగాతీతా!

    రిప్లయితొలగించండి
  3. పాశమంటే త్రాడు . శ్వాస ఆడినంత కాలమూ తల్లి బిడ్డల
    పై ఈ పాశంలో బయటపడలేనంతగా బయటపడడానికి ఇష్ట
    పడనంతగా బధ్ధురాలై ఉంటుంది . తల్లికి బిడ్డలయందు తగు
    ల్కొన్న పాశం లాంటి పాశం ప్రపంచంలో ఇంకెవరిమధ్యా , ఇంకే
    అంశంలోనూ చూడము . ఇది కేవలం తల్లులకే అనుభవైక
    వేద్యం . ఈ పాశంలో చిక్కుకోవడమూ , బయటపడటానికి
    ఇష్టపడకపోవడమూ , బయటపడలేకపోవడమూ ఆ తల్లికి
    ఆనందం . వాత్సల్యమనే ఈ రాగ స్వరూప పాశాన్ని ఏతల్లీ
    వదుకుకోదు . లలితమ్మ ఈ అంశంలో తల్లులకు తల్లిగదా .
    మనమంతా ఆ యమ్మ బిడ్డలంగదా . మనతో తగుల్కొన్న
    ఈ పాశాన అమ్మ ఎల్లవేళలా బధ్ధురాలయే ఉంటుందే . లేక
    పోతే అనేకానేక అరి వర్గాల బారినుండి మనం బతుకీడ్చడం
    సాధ్యమా ? అసలు ఎవరన్నారిది ఆయుధమని . హింసించేది
    ఆయుధం . అనురాగమూ ఆయుధమౌతుందా !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ ప్రశ్నకు సమాధానం వివరంగా వ్రాయటానికి తప్పకుండా ప్రయత్నిస్తానండీ. ధన్యవాదాలు.

      తొలగించండి