17, మార్చి 2019, ఆదివారం

10. మనోరూపేక్షుకోదండా


మనోరూపేక్షుకోదండా  పంచతన్మాత్రసాయకా।
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా।  3

ఇక్షువు అంటే చెఱకు.  కోదండం అంటే విల్లు. కోదండరాముడు అని రామయ్యను ధనుర్ధారిగా కీర్తిస్తూ ఉంటాం కదా. అక్కడ కోదండం అన్న పదం మనకు బాగా పరిచయం ఐపోయినదే.

అమ్మ ఎడమవైపు చేతుల్లోని పైచేతిలో చెఱకువిల్లు ఆయుధంగా ధరించి దర్శనం ఇస్తోంది.

ఇది మామూలు చెఱకువిల్లు కాదు నామాలచెఱకు విల్లు.

కొన్ని చెఱకు గడలకి నామాల్లాగా తెల్లని నిలువు చారలుంటాయి. వాటిని నామాలచెఱకు అంటారు. అదే మనం బడాయిగా సంస్కృతంలో చెప్పాలటే పుండ్రేక్షువు. పుండ్రములు అంటే నామాలు.

పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే అన్నది విన్నారా? వినే ఉంటారు. ఈశ్లోకాలు చూడండి.

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి II

చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగ శోణే
పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః

మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ

జయ మాతంగ తనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీత రసికే జయ లీలశుకప్రియే.II

ఇవి మహాకవి కాళిదాసు గారి శ్యామలాదండకం లోనివి. ఆ దండకం ఎత్తుగడలోనే ఈశ్లోకాలు వస్తాయి, మనలో అనేకమందిమి శ్రీఘంటసాల వేంకటేశ్వరరావు గారి కమ్మని గొంతులో అనేక సార్లు శ్యామలా దండకం వినే ఉంటాం కదా.  ఈ ఎత్తుగడ శ్లోకాల్లో పుండ్రేక్షువు కూడా అమ్మవారి ఆయుధం అని చెప్పారు కాళీప్రసన్నత కల మన కవి గారు.

కాని మనందరికి చెఱకువిల్లు ఆయుధం అనగానే గుర్తుకు వచ్చే పెద్దమనిషి మన్మథుడు.

ఇది మామూలు చెఱకువిల్లు కాదు. అది మనస్సే నట. మనస్సును గురించి వేదం ఏమంటున్నదీ అంటే

కామ స్సంకల్పో విచికిత్సా శ్రధ్ధా ధృతి రధృతి
శ్రీః హ్రీ ర్భీరిత్యేత్సర్వం మన ఏవ అని

సంకల్పం వికల్పం వంటి పదకొండు ప్రవృత్తులకు మొదటి స్థానం మనస్సు. సర్వజీవుల యొక్క సమిష్టి మనోరూపం ఐన కోదండం అమ్మ చేతిలోని విల్లుగా ఉంది.

మనస్సు యొక్క ప్రవృత్తిని సంస్కారం అంటాం. ఇది ఒక్కొక్క జీవికి ఒక్కొక్క విధంగా ఆయా జీవుల కర్మఫలాలను బట్టి ఉంటుంది.  మరణంతో పోయేది స్థూలమైన పాంచభౌతిక దేహమే. సూక్ష్మ కారణ శరీరాలు నశించవు. అందువలన కర్మఫలోదయ రూపమైన వేరొక శరీరం పొంది సంస్కారాన్ని అనుసరించిన మరొక స్థూలదేహం వస్తుందంతే. ఇలా జీవులకి వారి వారి సంస్కారఫలాన్ని బట్టి అనుగ్రహం చేసే శక్తియే అమ్మ చేతిలోని విల్లుగా ఇక్కడ సంభావన.

అమ్మకే తమ తమ కర్మలను అర్పించే బుధ్ది ఉన్న వాళ్ళకు నిత్యమూ అనిత్యమూ ఏమిటీ అన్న వివేకం కలుగుతుంది. అమ్మకే మనస్సును అప్పగించితే అది నిశ్చలమై ఉంటుంది.

మనస్సు అంటే అదే కదా ఇంద్రియాలకు రాజు? మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః అని అంటారు కదా. ఈ మనస్సు చంచలంగా ఉండి ఐహికం కోసం తిరుగుతూ ఉండటం వలననే కర్మ బంధాలన్నీను. ఈ మనస్సునే అమ్మకు అర్పించితే? చచ్చినట్లు దానితో పాటు దాని అనుచరగణం అయిన ఇంద్రియాలూ అమ్మవైపే తిరిగి ఉంటాయి. ఇంక ఇహాన్ని అపేక్షించటం అంటటం చేయవు. బంధమోక్షణం అవుతుంది. అదే కదా ముక్తి! అంటే జ్ఞానం దొరికి స్వస్వరూపంలో రమిస్తూ ఉంటాడు జీవుడు.

చెఱకు దేనికి పెట్టింది పేరు? తీపికి కదా. మనం తీపిని అనందానికి సంకేతంగా చెప్పుకుటాం. చెఱకుకు తీపి సహజం. మనస్సుకు కూడా ఆనందం సహజం. చెఱకులో తీపి అంతర్గతం. మనస్సులోని ఆనందమూ అంతర్గతమే. అనందం అన్నదే తనస్వభావం కాబట్టి. మనస్సు ఆనందాన్ని బయట వెదుక్కోవటం కేవలం అవిద్య వలననే. అమ్మకు అర్పించబడిన మనస్సు అమ్మ చేతిలోని చెఱకుగడ విల్లులా ఉంటుంది. చెఱకుకు ఒకరు తీపిని అందివ్వ నవసరం లేనట్లే ఆ మనస్సుకూ మరొకరి నుండి అనందం అపేక్షించక స్వస్వభావమైన ఆనందంలో ఉండటం జరుగుతుంది. ఇది అంతరార్థం


2 కామెంట్‌లు: