22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

5. దేవకార్యసముద్యతా


శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ।
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥  1

అమ్మ చిదగ్నికుండసంభూతగా అవతరించటానికి ఒక కారణం భండాసురవధ అని చెప్పుకున్నాం.

ఈ భండాసురుడి వలన బాధలు పడుతున్న దేవతలు ఒక యోజనం విస్తారం కల హోమగుండంలో అమ్మ కొరకు యాగం చేసారు. తమతమ శరీరభాగాల్నే అమ్మకోసం హోమం చేసారు. ఐనా అనుగ్రహం కనుపించలేదు. వారు తమతమ శరీరాల్నేహోమం చేయటానికి పూనుకున్నారు. అమ్మ ప్ర్తత్యక్షమైనది అని కూడా చెప్పుకున్నాం.

ఇంతకీ ఈ భండాసురుడు ఎవడు?

ఇది తెలుసుకోవలసి ఉంది.

ఈ లలితాసహస్రనామంలో ఈ భండాసురుడితో అమ్మ చేసిన యుధ్ధం గురించి చాలా ప్రముఖంగా ప్రస్తావనకు వస్తుంది.

భండాసురవధోద్యుక్త శక్తిసేనాసమన్వితా అన్న నామం నుండి కామేశ్వరాస్త్రనిర్ధగ్ధ సభండాసురశూన్యకా అన్న నామం వరకు ఉన్న నామాల వరుస ఈ యుధ్ధాన్ని వర్ణిస్తుంది.

అందుచేత ఇప్పుడు ఈ భండాసురుడు ఎవ్వరూ, ఇతడిని వధించటం అనేది అమ్మ స్వయంగా రంగంలోనికి దిగవలసినంత ముఖ్యమైన కార్యం ఎందుకైనదీ తెలుసుకుందాం.

దక్షయజ్ఞం పుణ్యమా అని సతీదేవి శివనిందను సహించలేక అభిమానపడి శరీరత్యాగం చేసింది యోగాగ్నిలో. పిమ్మట శివుణ్ణి వివాహం ఆడటానికి హిమవంతుడికి కుమార్తెగా జన్మించింది. శివుడు తపోనిష్ఠలో ఉన్నాడు.

వజ్రాంగుడనే రాక్షసుని కొడుకు తారకుడు దేవతలపైన పగతో శివుడిని ఉద్దేశించి మహాతపస్సు చేసి భోళాశంకరుణ్ణి మెప్పించి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. పైగా శివుడి కుమారుడి వలన తప్ప ఆతడు చావులేకుండా వరం పొందాడు.

శివయ్య మనస్సును పార్వతిపై లగ్నం చేయటానికి దేవతలు మన్మథుణ్ణి నియోగించితే కథ అడ్దంతిరిగింది. శివుడు కళ్ళెఱ్ఱ జేసి చూసి మూడో కన్ను తెరిచి వీక్షించే సరికి ఆ మన్మథుడు బూది కుప్ప ఐపోయాడు.

మనకు ఆతరువాత పార్వతీ కళ్యాణం జరిగిందని తెలుసును. శివుని కొడుకు కుమారస్వామి తారకాసురసంహారం చేసాడనీ మనకు తెలుసును. ఆ కథలోనికి యిప్పుడు మనం పోవటం లేదు.

బూడిదకుప్ప సంగతి ఒక పెద్ద కథగా మారింది. అది మనకు ఇక్కడి ప్రథాన విషయం.

శివుడి అనుచరగణాలను ప్రమథగణా లంటారు. ఆ  గణాలకు నాయకులను గణపతు లంటారు. అలాంటి ఒక గణపతి చిత్రకర్మ అనే వాడు ఈ బూడిద కుప్పను మానవాకారంలో తీర్చిదిద్ది ప్రాణప్రతిష్ఠ చేసాడు.

ఇది చూసి బ్రహ్మగారు ఆందోళనగా భండ భండ అన్నారు. అంటే అయ్యో అయ్యో అని ఆక్షేపించారన్నమాట.

ఆ పుట్టినవాడు ఉగ్రమైన బూడిదనుండి పుట్టాడు కదా వాడు అసురుడై భండాసురడన్న పేరు వచ్చింది వాడికి.

ఈ ఒక్కడినే కాదు చిత్రకర్మ సృజించింది! మిగిలిన బూడదతో మరో రెండు బొమ్మలూ చేసి ప్రాణం పోసాడు!  వాళ్ళ పేర్లు విశుక్రుడు, విషంగుడు అని.

చిత్రకర్మ వాడికి శివారాథనాక్రమం నేర్పితే వాడు దాన్ని సద్వినియోగం చేసుకొని శివుడి వలన 69వేల సంవత్సరాల రాజ్యపదవి సంపాదించాడు. వీడికి పురుషు డెవ్వడి వలనా చావు లేకుండానూ, ఎదిరించిన వాడి బలంలో అర్థభాగం తనపరం అయ్యేట్లుగానూ కూడా వరం ఇచ్చాడు శివుడు.

చాలా కాలం పాటు పాపం వాడు బుధ్ధిగానే ఉన్నా చివరకు వాడి దైత్యగుణమే గెలిచి లోకాల్నీ దేవతలనీ హింసించటం మొదలు పెట్టాడు.

వాడొక చిత్రమైన ఆలోచన చేసాడు. పరమభయంకరమైన ఆలోచన! ఈ సృష్ఠిని స్థంభింపజేయాలన్నదే ఆ ఆలోచన. అదెలా అంటే, భండాసురుడూ, వాడి ఇద్దరు తమ్ముళ్ళూ సూక్షరూపంలో లోకాలలో తిరుగుతూ స్త్రీపురుషులలో భోగేఛ్చను నశింపజేయటం ద్వారా అట. ఇక ఎక్కడా ఎవ్వరికీ ఏ విషయంలోనూ ఆసక్తి ఉండక నీరసించి క్రమంగా సృష్టి నశిస్తుందని వీళ్ళ ఊహ!

వీళ్ళ అఘాయిత్యం ఎంతదూరం పోయిందంటే స్త్రీపురుషులంటే నరయక్షకిన్నారాదులనే కాదు, పశుపక్ష్యాదులనూ వీళ్ళు వదలలేదు.  అన్ని జీవజాతులూ నీరసించాయి!

దేవతలకు చిక్కు వచ్చింది.  ఈ సృష్టిని సజావుగా నిర్వహించే భారం దేవతలదే. ఇప్పుడు అది ఇబ్బందిలో పడింది!

వాళ్ళు పోయి భండాసురుడితో పోరాడి చంపే వీలు లేదాయె.

చేసేది లేక అన్యథా శరణం నాస్తి అని గ్రహించి అమ్మకోసం ప్రార్థన చేసారు.

ఒక మహాయాగం చేసి అందులో తమతమ సమస్త శక్తులనూ ఆవిడకు సమర్పించారు.

తమ తమ శరీరభాగాలనే కాదు, చివరకు తమను తామే అర్పించుకుందుకు సిధ్ధమైపోయారు.

చివరకు అమ్మకు దయ కలిగి, దేవతల యొక్క ఈ కార్యం సఫలం చేయటానికి స్వయంగా అవిర్భవించింది!

ఆవిడే ఈ భండాసురుణ్ణి వధించటానికి యుధ్ధానికి ఉద్యుక్తురాలై వచ్చింది!

అందుకే వశిన్యాదులు అమ్మను దేవకార్య సముద్యతా అన్నారు.

అన్నట్లు చెప్ప మరిచాను. ఈ మహాయాగం ఎక్కడ జరిగిందో తెలుసా?

ఆ యాగస్థలానికి రాజరాజేశ్వరీ మహేంద్రవరం అన్న పేరు వచ్చింది. రాజరాజేశ్వరి అంటే అమ్మ. యాగకర్త ఐన వాడు దేవరాజు మహేంద్రుడు. అలా ఇద్దరి పేరునా ఆ యజ్ఞవాటికాస్థలానికి పేరు వచ్చింది.

ఆ పేరు క్రమంగా రాజమహేంద్రవరం ఐనది అని స్థలపురాణం!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి