10, ఫిబ్రవరి 2019, ఆదివారం

శ్రీలలితాసహస్రనామస్తోత్రం ఎలా వ్యాప్తి చెందింది?


అగస్త్య మహర్షికి గురువు హయగ్రీవుడు.

ఒక సారి గురువుగారైన హయగ్రీవులకు అగస్త్య మహర్షి ఒక ప్రశ్నవేసారు.

అప్పుడు అగస్త్యమహర్షికీ ఆయన గురుదేవులైన హయగ్రీవులకూ మధ్య చాలా ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.

పూర్వం నైమిశారణ్యంలో ఋషులందరూ ఒక మహాసత్రయాగం చేసారు. యాగకార్యక్రమాల మధ్యన విరామసమయాల్లో జరిగే పురాణగోష్టిలో పురాణం చెప్పిన మహానుభావుడు సూతపౌరాణికుడు. ఋషులు అడుగుతూ ఉండటమూ, వారికి కావలసిన విషయాలను సూతులవారు వివరించటమూ కారణంగా అనేకవిషయాలు వెలుగులోనికి వచ్చాయి. ఆయా ఋషులనుండి ఆ విషయాలు ప్రపంచంలో వ్యాప్తి చెందాయి.

ఋషులు సూతపౌరాణికుడిని శ్రీదేవి గురించి అడిగారు.

ఆయన అన్నారూ,  మహర్షులారా, ఈ శ్రీదేవి అమ్మవారిని గురించిన విద్యారహస్యాలు అన్నీ పూర్వం అగస్త్యమహర్షి తన గురువు హయగ్రీవులవద్ద నేర్చుకున్నారు. ఆతరువాత కొన్నాళ్ళకి ఆయన గురువుల వద్దకు వెళ్ళి ఒక సందేహం వెలిబుచ్చారు. అప్పుడు జరిగిన సంభాషణ అంతా చెబుతాను వినండి అని వివరంగా చెప్పటం మొదలు పెట్టారు.

గురుదేవా మీరు నాకు అమ్మవారి ఆవిర్భావం గురించిన కథ అంతా వివరించారు.

అలాగే నాకు అమ్మవారికి అన్ని బ్రహ్మాండాలకూ అధినేత్రిగా మహారాజ్ఞిగా పట్టాభిషేకం జరిగిన కథనూ వివరించారు.

అమ్మవారు భండాసురుడితో చేసిన మహాయుధ్ధాన్ని గురించీ వాడిని అమ్మవారు సపరివారంగా ఎలా వధించారు అన్నదీ కూడా మీరు నాకు తనివితీరా వివరించారు.

నాకు సకలైశ్వర్యసంయుతమైన మహనీయమైన ఆ శ్రీపురం గురించీ, శ్రీవిద్యకు చెందిన పంచదశాక్షరీ మహామంత్రాన్నీ దాని మహాత్మ్యాన్నీ వివరంగా చెప్పారు.

ఇంకా షోఢాన్యాసాదులూ, అంతర్యాగ బహిర్యాగాలను నాకు ఉపదేశించారు.

నాకు మహాయాగం గురించీ జపలక్షణాలగురించీ ఉపదేశం చేసారు.

శ్రీదేవిని గురించి హోమాదులు చేసే విధానమూ దానికి వలసిన హోమద్రవ్యాలను గురించీ చక్కగా బోధించారు.

దయతో నాకు మీరు శ్రీచక్రానికీ శ్రీదేవికీ ఏవిధంగా తాదాత్మ్యం అన్నది సెలవిచ్చారు. అంతే కాదు గురుశిష్యుల తాదాత్మ్యం గురించి కూడా బోధించారు.

అమ్మవారి గురించిన అనేక స్తోత్రాలను నాకు ఉపదేశించారు.

మీరు నాకు మంత్రిణీదేవి శ్యామలాంబా సహస్రానామాలనూ,  దండినీదేవి వారాహి సహస్రానామాలనూ బోధించారే కాని అమ్మవారు లలితాపరాభట్టారికా దేవి సహస్రానామాలను మాత్రం ఉపదేశించనేలేదు!

దయాసముద్రులైన మీరు ఈవిషయంలో పరాకు పడ్డారా లేక ఏదన్నా కారణం వలన ఈఒక్క స్తోత్రాన్నీ చెప్పకుండా ఊరుకున్నారా అన్న సందేహం కలిగి బాధపడుతున్నాను.

అమ్మ యొక్క సహస్రనామాలను వినటానికి నాకు యోగ్యత లేదేమో అని ఎంతో ఆవేదన చెందుతున్నాను.

మీరు నామీద దయచూపాలని వేడుకొంటున్నాను.

ఇలా అగస్త్యమహర్షి ఎంతో ఆర్తిగా తన సందేహాన్ని తన గురువులు హయగ్రీవులకు తెలియజేసారు వినయంగా.

హయగ్రీవులు చిరునవ్వు నవ్వారు. దయతో శిష్యుణ్ణి చూసి ఇలా అన్నారు.

నాయనా, నీవూ నీభార్యామణి లోపాముద్రా కూడా అమ్మవారికి మిక్కిలి భక్తులు.

అమ్మవారి సహస్రనామాలు అత్యంత రహస్యమైనవి. అందుకే నీకు ఇంతవరకూ ఉపదేశించలేదు.

భక్తి శ్రధ్ధలు కల శిష్యుడికి గురువు మంత్రోపదేశం చేయాలి.  అటువంటి శిష్యుడికి మాత్రమే మంత్రోపదేశం చేయాలి.

ఇప్పుడు నీకు నేను ఉపదేశం చేసే అమ్మవారి రహస్య నామాలు కూడా నువ్వు భక్తిలేని వాళ్ళకు ఎప్పుడూ ఉపదేశించకూడదు సుమా.

అనర్హులు చాలా రకాల వాళ్ళుంటారు కదా.

కొందరు శఠులు. వాళ్ళేం చేస్తారంటే గురువు గారు చెప్పిన రహస్యమైన ఉపదేశం గ్రహించి, ఆ తరువాత నేమో, గురువుతోనే ఇప్పుడు మీరు ఉపదేసించినది నాకు ఎప్పుడో తెలుసును అని ఎద్దేవా చేస్తారు లేదా మీరు చెప్పినది ఏమీ అర్థం కావటం లేదని మొండిగా మాట్లాడతారు. జాగ్రత.

కొందరు దుష్టులు. వాళ్ళేం చేస్తారంటే, గురువు గారు రహస్యం సుమా అని ఉపదేశంగా ఇచ్చిన విద్యను చులకనగా చూసి పదిమందికీ వెల్లడి చేసి గురువు ఉద్దేశాన్ని హేళన చేస్తారు. కాబట్టి జాగ్రత.

కొందరు అవిశ్వాసులు. అంటే వాళ్ళకి గురువు నుండి లభించిన విద్యపట్లనూ నమ్మకం ఉండదు, అసలు గురువుపైనా వారికి సరిగా నమ్మకం ఉండదు, అలాంటి వారుంటారు జాగ్రత.

అందుచేత బాగా ఆలోచించి యోగ్యులకు మాత్రమే రహస్యమైన లోతైన అర్థాలు గల విద్యలను బోదించాలి.

ఈ శ్రీలలితామహాదేవి రహస్యసహస్రనామస్తోత్రం కూడా అటువంటిది.

శ్రీదేవి పట్ల అమితభక్తి కలిగిన వారూ,  గురువువద్ధ పంచదశీ మంత్రం ఉపదేశం పొందినవారు ఐన భక్తులకు మాత్రమే ఎంచి ఉపదేశం చేయాలి సుమా.

అనేక విధాలైన దేవీ సహస్రనామస్తోత్రాలున్నాయి కదా.

వాటిలో బాలా, బగళా శ్యామాలా వంటి దేవతల సహస్రనామాలు త్వరగా సిధ్ధిని అనుగ్రహిస్తాయి.

శ్రీదేవి సహస్రనామస్తోత్రం విషయం వేరు.

మంత్రాల్లో శ్రీవిద్యా మంత్రం అతి ముఖ్యం కదా. ఆ శ్రీవిద్యావిషయంలోనూ కాది విద్య అతి ముఖ్యమైనది కదా.
చక్రాల్లో శ్రీచక్రం శ్రేష్ఠం కదా.

అలాగే శక్తిదేవతలో అతి శ్రేష్ఠురాలు అమ్మ శ్రీదేవి శ్రీలలితాపరాభట్టారికా దేవి.

ఆ విధంగా శ్రీవిద్యోపాసకుల్లో ఇంకెవరు పరమశివుడు శ్రేష్ఠుడు.

అలాగే అనేక విధాలైన దేవీసహస్రనామాల్లోనూ శ్రీలలితాసహస్రనామాలు శ్రేష్ఠమైనవి.

ఏ ఇతర స్తోత్రాలవలన కన్నా ఈ లలితాసహస్రనామస్తోత్రం వలన అమ్మవారు మిక్కిలి సంతోషిస్తుంది.

అమ్మవారిని బిల్వదళాలతోనూ, పద్మాలతోనూ ఈలలితాసహస్రనామాలతో పూజిస్తే తల్లి ఎంతో సంతోషిస్తుంది. తక్షణమే ఆవిడ అనుగ్రహం అబ్బుతుంది.

శ్రీచక్రర్చన, పంచదశాక్షరీ జపమూ చేసి సహస్రనామాలు పారాయణం చేయాలి. పూజాజపాలను చేయటానికి అశక్తులైనపక్షంలో నామపారాయణం చేస్తే చాలు.

ఈ నామ పారాయణం చేతనే సంపూర్ణంగా పూజా జపాలు చేసినట్లే అవుతుంది, సందేహం అక్కరలేదు.

శ్రీవిద్యోపాసకులు పూజాజపాలతో చేయటం మంచిది.  తదితర భక్తులు నామపారాయణం చేస్తే చాలును.

ఈ విధంగా అమ్మవారి సహస్రనామాలను గురించి వివరించి గురువుగారైన హయగ్రీవులు అగస్త్యమహర్షికి అప్పుడు శ్రీలలితాపరాభట్టారికా అమ్మవారి రహస్యసహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించారు.

అగస్త్యమహర్షి నుండి లోకంలో అర్హులైన భక్తులకు అమ్మవారి నామాలు అంది వ్యాప్తి చెందాయి.

గత టపాలో మనం అమ్మవారి సహస్రనామాల ఆవిర్భావకథను చెప్పుకున్నాం. అదంతా హయగ్రీవులు అగస్త్యమహర్షికి చెప్పారని అర్థం చేసుకోవాలి.



3 కామెంట్‌లు: