13, ఫిబ్రవరి 2019, బుధవారం

2. శ్రీమహారాజ్ఞీ


శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ।
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥ 1

అమ్మ లలితాపరాభట్టారికా దేవి అన్నిలోకాలకూ మాతృదేవత అని చెప్పుకున్నాం కదా శ్రీమాత అన్న మొట్టమొదటి నామాన్ని వివరంగా పరిశీలించి.

అమ్మని శ్రీమహారాజ్ఞీ అని అనటంలో అంతరార్థం గమనిద్దాం.

శబ్దానికి సంబంధించి చూదాం. రాజన్ అన్నది రాజును తెలిపే నకారాంతమైన పుంలింగ పదం. ఆమాటకు స్త్రీలింగ శబ్దం రాజ్ఞీ అని అవుతుంది. ఈ రాజ్ఞీ శబ్దానికి ముందు మహత్ అనే శబ్ధం ఉంచి చెప్పితే అది మహారాజ్ఞీ అవుతుంది. అంటే గొప్ప రాణీ అని తెలుగులో చెప్పుకోవాలి.

మరి ఇప్పుడు శ్రీమహారాజ్ఞీ అని ఎందుకంటూన్నారయ్యా అంటే ఈ శ్రీ అనే శబ్దం ఏ గొప్పగొప్ప విషయాలను సూచిస్తుందో అవన్నీ ఈవిడయందే అన్వయం అవుతున్నాయి కాబట్టి. ఈ శ్రీ శబ్ధం గురించి  శ్రీమాతా అన్న నామం దగ్గర కొంత చర్చ చేసాం కదా, ఒకసారి మరలా చూడండి.

ముఖ్యంగా శ్రీ అని చెప్పి ఈతల్లి సకలబ్రహ్మాండాలకు అధినేత్రి అని సూచించటం అన్నది గమనించాలి.

అంటే శ్రీలలితాపరాభట్టారికా దేవి సకలబ్రహ్మాండాలను ఏలే మహారాణీ అన్న మాట.

లోకంలో చిన్నపెద్దా రాజులు కూడా మహారాజు అని పిలిపించుకోవటం సామాన్యమే. అక్కడ మహా అన్నది కేవలం మర్యాదకోసమేను. వారి రాణీలకు కూడా మహారాణీ అన్నపిలుపూ అటువంటిదే. అమ్మ సభలో అనేక బ్రహ్మాండాలకు అధినాయకులైన లక్ష్మీనారాయణాదులు ఎందరో ఉన్నారు. ఆ లక్ష్మీ సరస్వతీ వంతి లోకమాతలకు ఆ మర్యాదలూ గౌరవాలూ అన్నీ అనుగ్రహించినది శ్రీమాతయే అన్నది స్పష్టం. ఆ లోకమాతలు లోకాలకు తల్లులూ రాణులూ ఐనప్పుడు శ్రీమాతను మహారాజ్ఞీ అని కాక మరెలా సంబోధించాలి చెప్పండి. అందుచేత శ్రీమాతయే మహారాజ్ఞి.

అసలు రాణీ అంటే ఏలిక అనుకుంటున్నప్పుడు, ఆ రాణీ గారు చేసేది పాలించటం కదా, మరి పాలించటం అంటే రక్షించటమేను.

శ్రీమాత అని ఈవిడ సకలబ్రహ్మాండాలకు తల్లి అని చెప్పుకున్నాం.

ఇప్పుడు శ్రీమహారాజ్ఞీ అని ఈవిడే సకలబ్రహ్మాండాలనూ పాలించే తల్లి అని చెప్పుకుంటున్నాం అన్నమాట.

వేదం 'యస్మా ద్భూతాని జాయన్తే,  యేన జాతాని జీవంతి ' అంటూ (తైత్తరీయోపనిషత్తులో) ఎవరిచే జన్మించిదో ఎవరిచే జీవిస్తున్నదో అని చెప్పటం దీన్ని ధృవపరుస్తుంది.

ఇక్కడ రహస్యమైన మంత్రార్థం ఒకటుంది. శ్రీమహా అన్నప్పుడు  శ్రీ+మ్+అ+హా అని పదవిఛ్ఛేదం. ఇక్కడ శ్రీమ్ అనేదాన్ని నిత్యా షోడశీకళ అంటారు. అకారం శివ స్వరూపం. దీనిని ప్రకాశం అంటారు. హా అనేది విమర్శనము శక్తి స్వరూపము. ఈ హాకారమే  రెండు బిందువుల స్వరూపంగా ఉండే విసర్గ (ః) . దీనికి కళారూపం అని పేరు. ఈ  అకార హకారాల సామరస్యం శివశక్తి సామరస్య కామరూపం. ఈ రెండింటి వలననే సమస్త సృష్టి జరుగుతున్నది. వీరు అంటే శివశక్తులు బిందుమండలంలో ఉంటారు. వీరికే కామేశ్వరుడు, కామేశ్వరీ అని పేర్లు. పరాస్వరూపం అంటే కామరూప, కళారూపాల పర్యవసానం!

పరాశక్తియే అమ్మ లలితాదేవి. రాజిల్లటం అంటే సర్వోతృష్టత కలిగి ప్రకాశించటం అన్న అర్థం సామాన్యంగా అనేకులకు తెలిసిందే, రాజిల్లటం,  విరాజిల్లటం అన్నమాటలు సాహిత్యంలో తరచూ తగులుతూనే ఉంటాయి. ఇక్కడ రాజు అని చెప్పినప్పుడు ఆయన కామేశ్వరుడు, రాజ్ఞీ అని స్త్రీలింగంగా చెప్పినప్పుడు ఆవిడ కామేశ్వరి. ఆకామేశ్వరియే లలితాపరాభట్టారిక, మహారాజ్ఞీ వాచ్యురాలు.

జీవులను పాలించటం అంటే వారికి ఉన్న ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మాలను అనుసరించి తగిన విధమైన స్థితిగతుల్ని కలిగించి నియమించటం అన్నమాట. ఈ ఆగామిసంచితప్రారబ్ధాలన్న మాటలు వేదాంతంలో తరచు వినిపించేవే. ఆగామి అంటే ముందుముందు పండటానికి సిధ్ధంగా ఉన్న పూర్వకర్మఫలం. సంచితం అంటే మనం కూడబెట్టుకున్న కర్మఫలం. అందులో కొంతకొంత మనకు ఆగామి అవుతుంది. ప్రారభ్దం అంటే జీవుడికి శరీరం ఎత్తటానికి కారణమైన పూర్వకర్మల సముదాయం.  తన ప్రారభ్దం అనుభవించటానికి జీవి శరీరం దాలుస్తాడు. ఎటువంటి శరీరమూ అన్నది అమ్మ నియామకం. అతడి దగ్గర చాలా సంచిత కర్మ ఉంది, అందులో కొంతకొంతగా ఆగామి అవుతూ అనుభవానికి వస్తుంది.  బలమైన ప్రారబ్ధం మొత్తం ఒక శరీరంతో తీరేది కాకపోవచ్చును. అదీకాక వీడు తిన్నగా ఉండక ఆ శరీరంతో మరింత కర్మఫలాన్ని తన సంచితంలో చేర్చుతాడు. ఏతావత్ తేలేది ఏమిటంటే శరీరాంతంలో బోలెడు సంచిత కర్మం ఉంటుంది. అందులో వీలైనంత  అనుభవించటానికి మరో జన్మం ఎత్తాలి.  అప్పుడెంత తీరేనో, మరెంతగా పోగయ్యేనో. ఎప్పటికి లెక్క శూన్యం అయ్యేటట్లు! ఇదొక పెద్ద విషవలయం.

కర్మానుభవం అంటే అది పాపాలే కానక్కరలేదు. పుణ్యాల ఫలాలూ అనుభవించాల్సిందే! తప్పదు.

పుణ్యమూ, పాపమూ రెండూ లేనప్పుడు ఇంక జన్మం ఎత్తటం కూడా లేదు. అదే మోక్షం. మోక్షం అంటే పుణ్యపాపాలకు కారణమైన సకలబంధాలను వదలటం. బంధమే లేనప్పుడు స్వార్థమే లేదు. స్వార్థమే లేక కేవలం లోకసంగ్రహార్థం చేసేది ఏదీ తనకు పుణ్యమూ పాపమూ ఇవ్వదు కాబట్టి ఇంక పోగుచేసుకొనేది ఏమీ ఉండదు. ఏదీ లేక అనుభవించవలసిదీ లేక తన్ను తానెరిగి స్వస్వరూపంలో ఉంటాడు.

అంతవరకూ అమ్మ అందరు జీవులకూ వారివారి కర్మానుభవాలకు తగిన శరీరాలు ఇచ్చి వారి జీవికలను నియంత్రిస్తున్నది.

జీవులకు క్రమంగా స్వస్వరూపానుసంధానం కలిగేందుకు అమ్మ వారికి తగిన విధంగా కర్మక్షయాన్ని అనుగ్రహించటమూ రక్షించటమూ చేస్తున్నది.

అన్నట్లు ప్రపంచపాలనం అంటే ప్రప్రంచాన్ని సుస్థితిలో ఉంచటం విష్ణువు పని కదా అని అనవచ్చును. సందేహం లేదు. అది విష్ణువు పనే.

మరి మహారాజ్ఞీ అని ఈ విష్ణువు చేసేదంతా అమ్మ లలితాపరాభట్టారికా దేవి పరం చేసి చెప్పారే అని ఆశ్చర్య పోవచ్చును ఎవరన్నా.

పరిపాలనా దక్షతయే విష్ణుత్వం. ఆ విష్ణువు అమ్మయే. లలితా సహస్రనామాల్లో ముందుముందు నారాయణీ అన్న నామమూ వస్తుంది.

ఆ నారాయణతత్త్వాన్ని పురుషపరంగా చెప్తే నారాయణుడు. శ్రీమన్మహావిష్ణువు.
అదే నారాయణతత్త్వాన్ని స్త్రీపరంగా చెప్తే నారాయణి. శ్రీలలితాపరాభట్టారికా దేవి.

ఇద్దరూ ఒక్కటే.

అందుచేత అమ్మవారు నారాయణి అని నారాయణుడి సోదరి అని చెప్తారు సంప్రదాయంలో

జయజయ వైష్ణవి దుర్గే అన్న నారాయణతీర్ధులవారి తరంగం గుర్తుకు తెచ్చుకోండి.

5 కామెంట్‌లు:

  1. >> అందులో వీలైనంత అనుభవించటానికి మరో జన్మం ఎత్తాలి. అప్పుడెంత తీరేనో, మరెంతగా పోగయ్యేనో. ఎప్పటికి లెక్క శూన్యం అయ్యేటట్లు! ఇదొక పెద్ద విషవలయం.

    పరమహంస యోగానంద గారు చెప్పటం ప్రకారం ఒక జీవి మోక్షం సాధించాలంటే 50 లక్షల నుంచి ఎనభై లక్షల జీవితాలు (ఏళ్ళు కాదు) పడుతుందిట. ఆయన 5 నుంచి 8 మిలియన్ జీవితాలు అన్నట్టు చదివినట్టు గుర్తు. ఒక్కో జన్మ వందసంవత్సరాలు పూర్ణాయుష్షు అనుకుంటే మోక్షానికి 5 నుంచి 8 కోట్ల సంవత్సరాలు అన్నమాట. నేనెక్కడున్నానో ప్రస్తుతానికి ఈదారిలో? :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కొంచెం తిరకాసు ఉంది మీ ఆలోచనలో. అనేక జీవితాల సమయం అన్నంత వరకూ సరిగ్గానే ఉంది. ఐతే, అన్ని ఉపాధులూ నరజన్మలు కానక్కరలేదు కదా! నరజన్మకు నూరేళ్ళు అవధి అనుకోవటం వరకూ సరే, మిగిలిన ఉపాధుల అవధులు ఇంకా చిన్నవీ కావచ్చు కొన్నిసార్లు పెద్దవీ కావచ్చును కదా!. చీమకు ఆయుర్ధాయం వందేళ్ళు కాదు కదా? కొన్ని ఒకరోజులోనే పుట్టిగిట్టే జీవులూ ఉంటాయి. అందుచేత ఇన్నికోట్ల ఏళ్ళు అనుకోనవసరం లేదు.

      తొలగించండి
  2. కర్మానుభవం అంటే అది పాపాలే కానక్కరలేదు. పుణ్యాల ఫలాలూ అనుభవించాల్సిందే! తప్పదు. పుణ్యమూ, పాపమూ రెండూ లేనప్పుడు ఇంక జన్మం ఎత్తటం కూడా లేదు. అదే మోక్షం. మోక్షం అంటే పుణ్యపాపాలకు కారణమైన సకలబంధాలను వదలటం. బంధమే లేనప్పుడు స్వార్థమే లేదు. స్వార్థమే లేక కేవలం లోకసంగ్రహార్థం చేసేది ఏదీ తనకు పుణ్యమూ పాపమూ ఇవ్వదు కాబట్టి ఇంక పోగుచేసుకొనేది ఏమీ ఉండదు. ఏదీ లేక అనుభవించవలసిదీ లేక తన్ను తానెరిగి స్వస్వరూపంలో ఉంటాడు.

    Nice explanation !

    రిప్లయితొలగించండి
  3. "శ్రీమహారాజ్ఞీ" - రెండో నామం వివరించినందుకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి