12, ఫిబ్రవరి 2019, మంగళవారం

1. శ్రీమాత్రే నమః


శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ।
చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యతా॥  1

అమ్మను శ్రీమాత అనటంలో అనేక విశేషాలున్నాయి.

పెద్దలను సంబోధించి చెప్పేటప్పుడు ముందు శ్రీ అని చేర్చి చెప్పటం మన సంప్రదాయం.  అందుచేత లలితాపరాభట్టారికా మాతను శ్రీమాత అని చెప్పటం.

శ్రీబీజము వైఖరీరూపంలో ఉంది. దానికే మాతృస్వరూపురాలు అంటే అమ్మ శ్రీదేవి పరాశక్తి స్వరూపిణి అని తెలియజేయటం శ్రీమాత అనటంలో ఆంతర్యం. ఇక్కడ వైఖరీరూపం అంటే ఏమిటో చెప్పాలి కదా. నాదం అనేది నాలుగు రూపాలు లేదా వికాసస్థాయిల్లో ఉంటుంది. అవి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేవి. అన్నిటంటికన్నా సూక్ష్మమైన స్థాయి బిందువు. అది పర అని పిలువబడుతుంది.  అవి వికసించి పశ్యంతి అన్న స్థాయికి వస్తుంది. అష్టవర్గులు మధ్యమ స్థాయి. వర్ణమాలలోని ఏభై అక్షరాల పలుకుబడిలో ధ్వనించేది వైఖరి అంటారు. ఈశ్రీబీజం అనేది నాదం యొక్క వైఖరీ విలాసం ఐతే దానికి మూలం ఐనది బిందుస్వరూపమైన పర. ఆ పరాశక్తి స్వరూపమైన అమ్మ శ్రీబీజానికి మూలమై అంటే మాతృస్థానంలో ఉంది కాబట్టి శ్రీమాత అని అమ్మవారికి అన్వయం.

ఈ శ్రీ అనే బీజాక్షరంలో శకారమూ, రేఫమూ (అంటే రకారం), ఈ-స్వరమూ ఇవి సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీకలు. ఈ త్రిగుణాలమేళనానికి వేదాంతశాస్త్రంలో అవ్యక్తం అని పేరు. ఈ అవ్యక్తం నుండే సకలసృష్టీ యేర్పడిందని వేదాంతం. ఈ అవ్యక్తసూచకమైన శ్రీ బీజానికి మాతృస్వరూపమైన బిందురూపంలో ఉన్న పరాశక్తి ఐన అమ్మవారికి అందుచేత శ్రీమాత అని పేరు.

ఇక్కడ మాతా అన్న పదం వలన ఒక త్రిపుటి సూచనగా ఉంది. అది మాతృ, మాన, మేయములు అనే మూడింటిని చెబుతోంది. ఈ త్రిపుటులు వేదాంతంలో విస్తారంగా ప్రస్తావనకు వస్తాయి. ఉదాహరణకు చూడటం అనేది తీసుకొంటే చూడటం అనే క్రియ, చూచేది, చూడబడేది అనే మరొక రెండున్నాయి కదా. ఈ మూడూ కలిసి ఒక త్రిపుటి అన్నమాట. ఇక్కడ అమ్మ అంటే అమ్మ, అమ్మదనమూ, ఎవరికి ఆ అమ్మ అమ్మగా ఉన్నది అనేవి కలిపి ఒక త్రిపుటీ అన్నది తెలుసుకోవాలి. ఈ త్రిపుటి అధిష్టానస్థానం శ్రీచక్రంలో త్రికోణం. దానికి అధిష్ఠానదేవత బాలాత్రిపురసుందరి. ఇక్కడ బాలా అంటే ఎనిమిది తొమ్మిదేళ్ళ పిల్ల. ఈ బాలాదేవికి మాతృదేవత బిందుమండలవాసిని ఐన కామేశ్వరీ దేవి. అందుచేత ఇక్కడ ఆ కామేశ్వరీ దేవిని శ్రీశబ్దంతో తెలుసుకోవాలి. అంటే శ్రీమాతా అని బిందుమండలవాసిని ఐన శ్రీచక్రేశ్వరి కామేశ్వరిని చెబుతున్నారు.

అమ్మ భక్తులకు సకలసంపదలనీ మోక్షప్రాప్తినీ కలిగిస్తుంది. అందుచేత శ్రీమాత అని పేరు. అది యెలాగో వివరంగా చూదాం.

శ్రీ అనే శబ్దానికి సంస్కృతంలో అనేక అర్థాలున్నాయి. శ్రీ అంటే విషం అన్న అర్థం ఉంది. పోతన్నగారి ప్రసిధ్ధమైన పద్యం శ్రీకంఠచాపఖండన... అనేది ఇక్కడ గుర్తుకు తెచ్చుకోండి. అదికాక శ్రీకంఠయ్య అని శివుడినామంగా పేరుపెట్టుకోవటమూ వాడుకలోనే ఉన్నది.

లోకంలో సుప్రసిథ్థంగా శ్రీ అంటే లక్ష్మి అన్న అర్థం చెలామణీలో ఉంది. ఆ లక్ష్మి గురించి ఈసహస్రనామస్తోత్రంలో ఒకచోట కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా అన్న నామం వస్తుంది ముందుముందు. దాని అర్థం ఏమిటంటే అమ్మ దయను పొందిని అనేకానేకమంది లక్ష్ములు అమ్మవారికి సేవకురాండ్రుగా ఉండి కొలుస్తున్నారని. అనేక లక్ష్ములు ఏమిటీ అన్న అనుమానం రావచ్చు. అమ్మ అన్ని బ్రహ్మాండాలకూ కూడా అధినేత్రి కదా. ఒక్కో బ్రహ్మాండానికీ మళ్ళా త్రిమూర్తులూ వాళ్ళ భార్యలూ ఉంటారు. అంటే అనేకమంది లక్ష్మీనారాయణులూ ఉన్నారు. ఇలా సమస్త బ్రహ్మాండాలకూ ఐశ్వర్యం అందించే లక్ష్ములకే అమ్మ లలిత యజమాని, మాతృస్వరూపిణీ కాబట్టి శ్రీమాతా అని పిలుపు.

ఈ శ్రీ అనే శభ్దానికి సరస్వతి అని కూడా అర్థం ఉంది. లక్ష్మీ సరస్వతీ ధీ త్రివర్గసంపద్విభూతి శోభాసు, ఉపకరణవేష విద్యాసు చ శ్రీరితి పథిత అని వ్యాడీ కోశం.  అంటే లక్ష్మీ, సరస్వతీ, బుధ్ధి, త్రివర్గం మొదలైనవని శ్రీశబ్దం చెబుతున్నది. త్రివర్గం అంటే ధర్మ, అర్థ, కామాలు. ఇక్కడ రుద్రాణి కూడా శ్రీశబ్దవాచ్యురాలే.  కాబట్టి అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ శ్రీదేవి లలితాపరాభట్టారికా దేవియే శ్రీమాత (అన్ని విధాల శ్రీలకూ మాత అని)

అలాగే శ్రీ అంటే అమృతం అనే అర్థం కూడా ఉంది. అమృతం అంటే ఏమిటి? అది జరామరణాలను లేకుండాచేసేది కదా. అలా జరామరణరహితమైన స్థితి ఒక్కటే మోక్షం. అపవాదంగా జరామరణాలు దేవతలకు లేవు అని చెబుతారు కాని వారికి జర లేకపోయినా సర్గప్రళయంలో లయం కావటం ఉన్నది. నిజంగా జరామరణాలు లేని స్థితి అంటే మోక్షమే! అందుచేత శ్రీమాత అంటే అలా మోక్షాన్నందిచే తల్లి అని అర్థం,

శ్రీ అంటే వేదం అన్న అర్థం ఉంది. కాబట్టి శ్రీమాత అంటే వేదమాత. అంటే గాయత్రీ మంత్రస్వరూపిణి.

లోకంలో కన్నతల్లీ, గురుపత్నీ, అన్నభార్య మొదలైన పెద్దవారిని స్త్రీలను అమ్మలుగా సంభావించటం మన సంప్రదాయం.  వీరి ఆశీర్వచనాలు అభ్యున్నతికి మనకు సోపానాలు. అందువలన వీళ్ళందరూ మనకు నిత్యం వందనీయులూ, పూజనీయులూ అవుతున్నారు. కాని ఈ మాతృదేవతలు ఎవ్వరికీ జీవులకు సంసారతాపత్రయాది దుఃఖాలను పోగొట్టే శక్తి లేదు కదా. అన్నిలోకాలకూ కూడా తల్లి ఐన శ్రీదేవియే అలా సంసారతాపత్రయం పోగొట్టి ముక్తిని అందించగల గొప్ప మహత్తు కల తల్లి.  కాబట్టి లలితా అమ్మవారిని శ్రీమాత అని చెప్పటం జరుగుతోంది.

శ్రియం అంటే అంతులేని ఐశ్వర్యం అని అర్థం. శ్రియం మాతి అంటే శ్రియముని తెలిసినది కాబట్టి శ్రీమాత అని అర్థం.

శ్రియములు అంటే అంతులేని ఐశ్వర్యరూపాలైన అణిమాది సంపత్తులను తన సాక్షాత్కారం చేత తక్కువచేసి ఆ సిధ్ధులకే మాతృస్థానంలో విరాజిల్లేది కాబట్టి అమ్మకు శ్రీమాత అని పేరు.

నమాతుః పరదైవతమ్ అని సూక్తి. అందరి కన్నా అమ్మే గొప్ప.   జీవుడికి మొట్టమొదటి గురువు అమ్మే కదా! జ్ఞానసాధనాసంపత్తిని తెలిపే నామావళి కూడా జగన్మాత ఐన అమ్మ శ్రీదేవిని మాతృస్వరూపంగా ముందు ప్రతిపాదిస్తూనే మొదలుకావటం ఉచితంగా ఉంది. కాబట్టి అమ్మను శ్రీమాతా అని మొదట సంబోధించటం.

వేదంలో తత్ అనే శభ్దంలో ప్రారంభం అయ్యే మంత్రాలకు తతవతీ వాక్కులని పేరు. వీటినే శ్రీ అగ్రములు అని కూడా అంటారు. ఈ తత్ శబ్ధం పరబ్రహ్మ సూచకం. అందువల్ల తత్ అంటే మోక్షం. ఈవిధంగా శ్రీమాత అంటే శ్రీ అగ్రములైన మంత్రములకు మాతృస్థానమైన బ్రహ్మజ్ఞాన స్వరూపిణి ఐన శక్తి అని అర్థం

ఇంకా ఈ శ్రీమాత అన్న నామానికి విశేషమైన అర్థాలు మరికొన్ని ఉన్నాయి.

13 కామెంట్‌లు:

  1. chala santoshamga vundi ..
    meeru malli ammmanu gurinchi vivaristunte.
    thank you somuch Syamaleeyam garu.

    రిప్లయితొలగించండి
  2. శ్రీ మాత్రేనమః

    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. అద్భుతమైన వర్ణణతో మొదలుపెట్టారు. అనేక విషయాలు తెలియపరుస్తున్నందుకు కృతజ్ఞతలు.

    శ్రీ లలిత పేరుతో ఇంకొక(నా అభిమాన) బ్లాగు ఉంది. శ్రీలలితీయం(కరెక్టేనా?) అని పేరు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇప్పటికే మరొక బ్లాగుందని తెలియదండీ. మీరన్న విషయం ఆలోచిద్దాం.

      తొలగించండి
    2. నీహారిక గారూ,
      ఇప్పుడే వెదకి పట్టుకున్నానండీ, http://srilalitaa.blogspot.com/ అనే చిరునామాలో శ్రీ లలిత బ్లాగును. ఇదేనా మీరు ప్రస్తావించింది?

      తొలగించండి
    3. లలితీయం అవదండీ, లాలిత్యం అవుతుంది. కాని లాలిత్యం అన్నది రూఢార్థంగా వేరే భావనను చెప్తున్నది. కాని శ్రీలలితీయం అన్నప్పుడు ఆ రూఢార్థం బాధించదేమో అనుకుంటాను.

      పేరు మార్చాలా, ఎలాగు అన్నవిషయంలో ఇంకా బాగా అలోచించాలి.

      తొలగించండి
  4. నమస్కారం
    బాగుందండి. ఇవి "సహస్ర" నామాలు. అంటే మీరు మధ్యలో ఆపకుండా అన్నీ పూర్తి చేయాలి. ఏదో ఉత్సాహంతో మొదలుపెట్టి మధ్యలో వదిలేయడం కాదు. లేకపోతే మీకూ నాకూ జట్టు పీస్!

    అదే జరిగితే మిమ్మల్ని బ్లాగు ముఖంగా ఒక ఏకు ఏకడానికి నేను సిద్ధం!`

    రిప్లయితొలగించండి
  5. చాలా బావుంది. ఇంత విపులంగా వివరించగలగడం మీకే సాథ్యం.

    రిప్లయితొలగించండి
  6. మాట మన్నించి కొనసాగిస్తున్నందుకు కృతజ్ఞతలు మీకు!

    రిప్లయితొలగించండి