22, ఏప్రిల్ 2019, సోమవారం

14. కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా


చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచా
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా 4

ఈ కురివిందమణిశ్రేణీకనత్కోటీరమండితా అన్న నామంలో అమ్మవారి కోటీరం అంటే కిరీటం యొక్క శోభని వర్ణిస్తున్నారు వశిన్యాదులు.

కురువిందము అంటే పద్మరాగం. కురువిందమణి అంటే పద్మరాగమణి. శ్రేణి అంటే తెలిసిందేగా వరుస అని అర్థం. అందుచేత కురువిందమణిశ్రేణి అంటే పద్మరాగమణిపూసల వరుస.

కాబట్టి కురువిందమణిశ్రేణీకనత్ కోటిరము అంటే పద్మరాగమణుల వరుస(ల)తో ప్రకాశిస్తున్న కిరీటం అని తాత్పర్యం.

ఈ కురివిందమణిశ్రేణీకనత్కోటీరమండితా లో చివరన ఉన్న మండితా అన్న సంబోధన వలన అమ్మవారిని వశిన్యాదులు ద్మరాగమణుల వరుస(ల)తో ప్రకాశిస్తున్న కిరీటంతో  అలంకరించుకొని ఉన్న తల్లీ అని సంబోధిస్తున్నారని బోధపడుతున్నది.

కొంచెం శాఖాచంక్రమణం ఐనా మనం ఇప్పుడు ఈ పద్మరాగమణుల గురించి కొంచెం తెలుసుకుందాం.

రావణగంగ అని ఒక నది ఉంది.  వినటానికే కొంచెం చిత్రంగా ఉంది కదా?

రాజశేఖరుడు అనే పదవశతాబ్దానికి చెందిన ఒకాయన పుస్తకం కావ్యమీమాంసలో రావణగంగ గురించిన ప్రస్తావన వస్తుంది. ఈ రావణగంగ అనే నది శ్రీలంకలో ఉన్నట్లుగా ఆ పుస్తకం బట్టి తెలుస్తోంది.

గరుడపురాణంలోని రత్నాధ్యాయం ప్రకారం పద్మరాగమణులకు రావణగంగ పుట్టిల్లు.

తస్యా స్తటేషు చారురాగా భవంతి తోయేషు చ పద్మరాగాః
సౌగంధికోత్ఠాః కురివిందజాశ్చ మహాగుణాః స్ఫాటికసంప్రసూతాః

బంధూక గుంజా శకలేంద్రగోప
జపా శశ్యసృక్ సమవర్ణశోభాః
భ్రాజిష్ణవో దాడిమ బీజవర్ణా
స్తథాపరే కింశుక భాసః

ఈ పై పురాణశ్లోకాలను బట్టి రావణగంగా నదిలోనూ ఆ నదీతీరంలోనూ అందంగా ఎఱ్ఱగా ఉండే పద్మరాగమణులున్నాయి.

ఆ నదీజలాల్లో సౌగంధికములు, కురివిందములు, స్ఫటికములు అని మూడు రకాల శిలలున్నాయి. వాటి నుండి పద్మారాగాలు జన్మిస్తున్నాయి.

ఆ పద్మరాగమణులు కొన్ని బంధూకవర్ణం కలవి. అంటే మంకెన పూవు చాయవి. కొన్ని గుంజాశకలం అంటే గురివిందపూవు రంగు కలవి. కొన్నిఇంద్రగోపం అంటే ఆరుద్రపురుగు రంగులో ఉన్నవి.  కొన్ని జపాకుసుమం అంటే మందారపువ్వు రంగువి. కొన్ని శశి వర్ణం అంటే లొద్దుగపూవు రంగువి. కొన్నిఅసృక్ వర్ణం అనగా రక్తపు రంగు కలవి. కొన్ని  దాడిమ అనగా దానిమ్మగింజల వలె మరికొన్ని కింశుకము అనగా మోదుగపూవు రంగుకలవి. ఇలా అవి ఎఱుపుదనంలో వివిధమైన చాయలు కలవిగా ఉంటాయి.

ఆనదిలో పద్మారాగాలు కల మూడు రకాల శిలల్లో కురివిందముల నుండి జన్మించిన పద్మరాగాలు విశిష్టమైనవి. ఏమిటయ్యా ఆ విశిష్టత అంటే పురాణం ఇలా చెబుతోంది.

కామానురాగః కురువిందజేషు
శనై ర్న తాదృక్ స్ఫటికోద్భవేషు
మాంగల్య యుక్తా హరిభక్తిదాశ్చ
వృధ్ధిః ప్రదాస్తే స్మరణాద్భవంతి

కురువిందముల నుండి పుట్టిన మణులు కామానురాగ కారకాలు. మిగతావాటికి ఆ శక్తి లేదు.
స్ఫాటికశిలల నుండి పుట్టినవి మాంగల్యయుక్తములు. వీటిని స్మరించినంత మాత్రానే హరిభక్తి వృధ్ధి అవుతుంది.

ఇప్పుడు ఈ కురువిందమణి అన్న మాటను పట్టుకొని ఆరాతీస్తే మనకి అవగతం అయ్యేది ఏమిటంటే అవి శుభాన్ని కలిగించేవీ హరిభక్తిని పెంపొందించేవీ అని.

శ్రీహరిని స్మరిస్తూ శంకరభగవత్పాదులు సౌందర్యలహరీ స్తోత్రంలో ఒక మాట అంటారు.

హరిస్త్వా మారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం
పురానారీభూత్వా పురరిపు మపి క్షోభమనయత్
స్మరో పిత్వాం నత్వా రాతినయన లేహ్యేన వపుషా
మునీనా మత్యంతః ప్రభవతి హి మోహాయ మహతామ్

ఆ హరి అమ్మను ఆరాధించి అడవేషం ధరించి శివుణ్ణే మోహింప చేయ గలిగాడని పై శ్లోకంలో ప్రశంస. అంతే కాదు మన్మథుడు కూడా అమ్మని ఆరాధించే మునీశ్వరుల్ని సహితం మోహపరవశుల్ని చేయగల శక్తిని ఆర్జించుకున్నాడట.

ఇప్పుడే చెప్పుకున్నాం కదా కురువిందముల నుండి పుట్టిన మణులు కామానురాగ కారకాలు అనీ.  అమ్మవారి కిరీటంలో అలంకరించి ఉన్న కురువిందమణుల మాలలే అమ్మ భక్తులకు కామానురాగసిధ్ధి ప్రదాయకాలు అవుతున్నాయి అని అర్థం చేసుకోవాలి. హరి అయ్యేది ఆయన కుమారుడు మన్మథుడు అయ్యేది అమ్మని ఆరాధించి ఆవిడ కిరీట స్మరణ దర్శనాదులవలననే కామానురాగాలకు సంబంధించిన నిగ్రహానుగ్రహాది శక్తులను సంపాదించుకొన్నారన్న మాట.

అమ్మవారి కిరీటంలో ఉన్న స్ఫాటికశిలాజన్యములైన మణులవలన హరిభక్తి అని కదా. అమ్మకూ హరికీ అబేధమే అని చెప్పుకోవాలి. అంటే అమ్మ కిరీటాన్ని స్మరించినా దర్శించినా భక్తివర్ధనం జరిగి అది మోక్షదాయకం అవుతున్నది.

కిరీటం అన్నది అధికార చిహ్నం. అమ్మ సకలజగాలకూ అధినేత్రి కదా.

1 కామెంట్‌:

  1. కురువిందమణి రంగులో వుంటుందని గురువిందకా పేరు వచ్చినట్లుంది కదండీ? అద్భుతంగా వర్ణించారు కురువిందమణిని. ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి