29, ఏప్రిల్ 2019, సోమవారం

19. నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా


నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా  7

ఈ నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా అన్న నామం అమ్మ నాసికను గురించి. నాసిక అంటే తెలుసును కదా ముక్కు.

వశిన్యాదులు అమ్మ ముఖశోభను వర్ణిస్తున్నారు కదా.  ముక్కు అనేది ముఖం మధ్యలో ఉంటుందాయెను. దాని గొప్పను గురించి చెప్పకపోతే ఎలా మరి?

ఈ నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా  అన్న నామంలో చంపకం అనే శబ్దం ఒకటి వచ్చింది. ఈ చంపకం అన్న సంస్కృతపదానికి అర్థం సంపంగి. అందుచేత చంపకపుష్పం అంటే సంపంగి పువ్వు. ఈ సంపంగి పువ్వు అలాంటిలాంటిది కాదుట అది నవం అంటే అప్పుడే వికసించినది. సంస్కృతంలో సంపెంగను గంధఫలి అని కూడా అంటారు.

మనకు నవనీతము అన్న మాట బాగానే తెలుసును. బాలకృష్ణుణ్ణి నవనీతచోరుడు అని ముద్దుగా పిలుస్తూ ఉంటాం కదా.  నవనీతం అంటె ఏమిటీ అంటే మనవాళ్ళలో చాలామంది వెన్న అని చెబుతారు. కాని నిజానికి ఆమాటకు అర్థం అప్పుడే చల్లచిలికి తీసిన వెన్న అని అర్థం.

అలాగే ఇక్క నవచంపకపుష్పం అంటే అప్పుడే వికసించిన సంపెంగపూవు అని అర్థం. అంటే ఆ సంపెంగపూవు కొద్దిగా వికసించింది. ఇంకా వికాసం పొందుతూనే ఉంది. అటువంటిది.

ఈ నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా  అన్న నామంలో నాసాదండం యొక్క ప్రశస్తిని గురించి చెబుతున్నారు. నాసిక అంటే ముక్కు కదా. మరి నాసాదండం అంటే - ముక్కుదూలం అన్న మాట.

మొన్నమొన్ననే ముఖచంద్రకళంకాభమృగనాభవిశేషకా అన్న నామం చదువుకున్నాం అక్కడ కళంకాభం అంటే కళంకం వంటిది అని చెప్పటానికి వాడినట్లే ఇక్కడ కూడా అభము అన్న శబ్దం వాడారు. నవచంపకపుష్పాభం అన్నప్పుడు.  అంటే అమ్మ ముక్కుదూలం అప్పుడే కొద్దిగా విరిసిన సంపెంగ పూవులాగా ఉంది అని చెప్పారన్న మాట.

ముక్కును సంపెంగపూవుతో పోల్చటం కవులకు పరిపాటే.  చాలా ప్రసిధ్ధికి ఎక్కిన ఈ పద్యం చూడండి.

నానాసూన వితానవాసనల నానందించు సారంగ మే
లా నన్నొల్ల దఁటంచు గంధఫలి బల్కాలం దపం బంది యో
షా నాసాకృతిఁ దాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసి యై
పూనెం బ్రేక్షణమాలికా మధుకర పుంజంబు లిర్వంకలన్

ఈ పద్యం తెలుగు ప్రభంధకావ్యాల్లో పారిజాతాపహరణం అన్న నంది తిమ్మన్న గారు వ్రాసిన కావ్యం లోనిదని చాలా మంది పొరబడుతూ ఉంటారు. అంతే కాదు, ఈ పద్యం వల్లనే నంది తిమ్మన్న గారికి ముక్కు తిమ్మన్న అన్న పేరు వచ్చింది అని కూడా చెబుతూ ఉంటారు.

కాని ఇది రామరాజభూషణుడు అనే కవిగారి అద్భుతప్రబంధ కావ్యం వసుచరిత్ర లోనిది. ఐతే ఒక చాటు కథ ప్రకారం నంది తిమ్మన్న గారి దగ్గరనుండి నాలుగువేల వరహాలకు రామరాజభూషణుడు ఈ పద్యం కొనుక్కున్నాడట! పిచ్చికథ. ఇద్ధరి కాలాలూ వేరువేరు.

ఈ పద్యానికి సంస్కృత మూలం ఉంది. అది ప్రతాపరుద్రచక్రవర్తి ఆస్థానంలోని విద్యానాథుడు అనే కవి వ్రాసిన నలకీర్తికౌముది అన్న సంస్కృత కావ్యంలోని

భృంగానవాస్తి ప్రతిపన్నఖేదా
కృత్వాననే గంధఫలీ తప:ఫలమ్
తన్నాసికా భూ దనుభూతగంధా
పార్శ్వనేత్రీకృతభృంగసేవ్యా

నిజానికి ముక్కును సంపెంగతో పోల్చటం ఇంకా కొన్ని శతాబ్దాలకు ముందే నన్నెచోడుడు చేసాడు చూడండి కుమారసంభవంలో

చం. జలజము సావి కోకములు షట్పదముల్ పఱతెంచి తద్దయున్
నలి వినుతాస్యమండలము నాసికయున్ శశిబింబ చంపకం
బులు సవి డాయనొల్ల కతి మోహమునం బెడఁబాయనోప కా
కులమతి నున్న భంగిఁ గుచకుంతలవక్త్రము లొప్పు గౌరికిన్

పార్వతీ అమ్మవారి ముఖాన్ని చూచి పద్మం అని భ్రమించి చక్రవాకపక్షులూ తుమ్మెదలూ దగ్గరకు వస్తున్నాయట.  దగ్గరకు రాగానే వాటికి అమ్మ ముఖకాంతి వెన్నెలలాగానూ అమ్మ నాసిక చంపకపుష్పం లాగానూ కనిపించిందట, సరిసరి ఈ చక్రవాకాలకు వెన్నెల నచ్చదు. ఆ తుమ్మెదలకు సంపంగి అంటే కిట్టదు. పద్మమని చేరాలో మానాలో తేల్చుకోలేక గడబిడ పడుతున్నాయట అవి.  అన్నట్లు ఈ పద్యం చంపకమాల అన్న ఛందస్సులో ఉంది చూడండి!

చూసారా కవులు ఎంత గమ్మత్తుగా ముక్కును సంపెంగను చేసి పద్యాలను చెప్తున్నారో.

ఇదంతా ఎందుకు తడుముకున్నాం అంటే స్త్రీల నాసికను కవులు సంపెంగ పూవుతో పోల్చటం ప్రసిధ్ధం అని ఒకసారి చెప్పుకుందుకు మాత్రమే.

అమ్మ శ్రీదేవి చిదగ్నికుండంలో దేవతల అంశలను అన్నింటినీ అంగీకరిస్తూ ఆవిర్భవించింది. అప్పుడు ఆవిడ నాసికగా వెలసినది కుబేరాంశ.

మంత్రశాస్త్రపరంగా బహిర్మాతృకా న్యాసంలో ఋ ౠ అన్నవి ఎడమ కుడి నాసికలకు బీజాలు.

అజపా మంత్రం అని చెప్పబడే హంసమంత్రానికి సాధనోపకరణం నాసిక. అమ్మ నాసికకు గంధఫలి అనగా సంపెంగకు అది కూడా అప్పుడే కొంచెంగా వికసించిన సంపెంగపూవుతో సామ్యం. వాసనలను గ్రహించేది నాసిక. అజపాసాధనవలన సమస్త వాసనలనూ విలీనం చేసుకొనే సాధనోపకరణం నాసికను ఇక్కడ గంధఫలితో పోల్చటం సముచితం.

నవ అంటే ప్రణవ సూచకం. అజపాసాధనలో ఉఛ్వాసనిశ్వాసాలు సోహం అనే హంసమంత్రం. ఈ సంపెంగ పూవు రేకులు స హ అనే వర్ణాలు. ప్రణవనాదమే పరీమళం అని కొందరి అభిప్రాయం.


1 కామెంట్‌:

  1. ముక్కు మీద ఎన్ని విశేషాలు, విశేషణాలు చెప్పారండి! ఎంత బాగా రాస్తున్నారో! ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి