19, మార్చి 2019, మంగళవారం

12. నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా


మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయకా।
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా। 3

అరుణ వర్ణం అంటే ఎరుపు రంగు. ప్రభ అంటే కాంతి. ప్రభలు అంటే కాంతిపుంజాలు. అంటే కిరణాలు అనవచ్చును. ఆ పూరము అంటే చూదాం. పూరణము అంటే నింపట. ఆపూరణము అంటే బాగా నింపట. పూరము అంటే నిండినది. ఆపూరము అంటే బాగా నిండినది లేదా సంపూర్ణంగా నిండినది. ఇక నిజ+ అరుణప్రభ -> నిజారుణప్రభ అని సంధి కార్యం. ఇక్కడ నిజ అంటే తనయొక్క అని అర్థం. కాబట్టి నిజ + అరుణ + ప్రభ + ఆపూర -> నిజారుణప్రభాపూర అంటే తనయొక్క ఎర్రని కాంతితో సంపూర్ణంగా నిండిపోయిన అని భావం.

అలా సంపూర్ణంగా నిండటం వలన ఏమి జరిగిందీ అంటే మజ్జద్బ్రహ్మాండమండలా అంటున్నారు. మజ్జనం అంటే స్నానం. బ్రహ్మాండమండలం అంటే బ్రహ్మాండాల సమూహం అని అర్థం. బ్రహ్మాండాల సమూహం అని ఎందుకంటాం అంటే అమ్మ అనేకకోటి బ్రహ్మాండ నాయకి కదా అందు వలన.

మజ్జత్ + బ్రహ్మాండమండలా -> మజ్జద్బ్రహ్మాండమండలా అని సంధికార్యం. అంటే బ్రహ్మాండమండలాలన్నీ స్నానం చేసినటుగా ఉంటున్నాయన్న భావన. అంటే పూర్తిగా మునిగిపోయి ఉన్నాయి అని తాత్పర్యం

ఇప్పుడు మొత్తం నామానికి అర్థం చెప్పవలసి వస్తే అది, అమ్మ యొక్క అద్భుతమైన అరుణకాంతి (పుంజముల)తో పూర్తిగా (దిక్కులన్నీ) నిండిపోయి బ్రహ్మాండమండలాలన్నీ ఆ కాంతిలో సంపూర్ణంగా మునిగి స్నానం ఆచరిస్తున్నాయి అని.

అమ్మ అగ్ని యొక్క (అరుణ) వర్ణం కలది అని శ్రుతి (అంటే వేదం).

తా మగ్ని వర్ణాం తపసా జ్వలంతీం అని తై-య-నారా-2-అనువాకం.

అలాగే శ్రీ జైమిని మహర్షికృత దేవీ వేదపాదస్తోత్రంలో

శ్రీచ్రకస్థాం శాశ్వతైశ్వర్యదాత్రీం
పౌణ్డ్రం చాపం పుష్ప బాణాన్‌ దధానామ్‌
బన్థూకాభాం భావయామి త్రినేత్రాం
తా మగ్నివర్ణాం తపసా జ్వలన్తీమ్

అని వర్ణన. దీని అర్థం శ్రీచక్రంలో ఉన్నదీ, స్థిరమైన ఐశ్వర్యాన్ని ఇచ్చేదీ, నామాలచెఱకువిల్లు కలదీ, పుష్పబాణాలు కలదీ, మూడు నేత్రాలతో మంకెనపూవు లాంటి శరీరఛ్ఛాయతో అగ్నివంటి ప్రభలు కలిగిన తపస్విని ఐన దేవిని భావన చేస్తున్నాను అని .

అమ్మవారి ధ్యానశ్లోకంలో కూడా అరుణాం కరుణాంతరంగితాక్షీమ్ అని వస్తుంది కదా.

అరుణాం కరుణాంతరంగితాక్షీం
ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్‌
అణిమాదిభి రావృతాం మయూఖై:
అహ మిత్యేవ విభావయే భవానీమ

ఇక్కడ అమ్మవారిని అరుణా అంటే ఎర్రగా ప్రకాసిస్తున్న తల్లీ అని సంబోధించారు కదా.|

ఈ సందర్భంలో అంటే అమ్మవారి ఆవిర్భావఘట్టంలోని నామాల అమరికను గమనించండి.

ఉద్యద్భానుసహస్రాభా
చతుర్బాహుసమన్వితా
రాగస్వరూపపాశాఢ్యా
క్రోధాకారాంకుశోజ్జ్వలా
మనోరూపేక్షుకోదండా
పంచతన్మాత్రసాయకా
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా

ఉద్యద్భానుసహస్రాభా అన్న నామంలో అమ్మ ఉదయిస్తున్న వేయి సూర్యుల యొక్క ప్రకాశంతో సమానమైన శోభతో -లేదా- ఉదయసూర్యుని సహస్ర(అనంత) కిరణసముదాయం యొక్క శోభతో అవతరించింది అని చెప్పి, అటు పిమ్మట ఆవిడకు నాలుగు చేతులున్నాయనీ ఆ బాహువుల్లో ఫలాని ఆయుధాలున్నాయనీ చెప్పారు. వెంటనే అమ్మ యొక్క అరుణ (ఉదయసూర్య) ప్రకాశంలో బ్రహ్మాండమండలాలన్నీ మునిగి స్నానం చేస్తున్నాయని చెబుతున్నారు వశిన్యాది దేవతలు.

అమ్మ ఆవిర్భావం యొక్క తేజస్సు సహస్రకిరణసదృశంగా మొదట యజ్ఞవాటికలోని దేవతా సమూహానికి తెలియవచ్చింది కదా. అటుపిమ్మట అమ్మ మూర్తి చతుర్భాహువులతో వెల్లడి కాగానే, అమ్మ యొక్క అరుణమైన తేజస్సు యజ్ఞవాటిని దాటి బ్రహ్మాండాన్నే కాదు, సమస్తమైన బ్రహ్మాండాలనూ ఆవరించి ముంచెత్తిందని చెబుతున్నారు.

అరుణ వర్ణం చైతన్యానికి సూచకం. ఉదయించే సూర్యుడు సమస్తజగత్తుకూ చైతన్యం ప్రసాదిస్తూ అంతవరకూ నిద్రావస్థలో పడి ఉన్న లోకాన్ని మేలుకొల్పుతాడు. ఆయన రాకతో వెల్లడయ్యే అరుణమైన తేజస్సు జగత్తుని ఉత్సాహపరుస్తుంది.

అమ్మ ఆవిర్భావం కూడా జగత్తును కాదు కాదు సమస్ర బ్రహ్మాండాన్నీ ఉత్సాహపరచేది.

ఇంతవరకూ భండాసురుడి యొక్క మాయాప్రభావం వలన ఒక్క బ్రహ్మాండం మొత్తం నిస్సత్తువ చెంది చైతన్యవిహీనం ఐపోయింది.

ఇప్పుడు అమ్మ రాకతో చైతన్యం ఒక వెల్లువలా బ్రహ్మాండాన్ని ముంచెత్తింది. అది ఈ బ్రహ్మాండాన్నే కాదు సమస్త బ్రహ్మాండాలనూ మహాచైతన్యంతో నింపేసింది అని తాత్పర్యం

స్వతంత్ర తంత్రంలో

స్వాత్మైవ దేవతా ప్రోక్తా లలితా విశ్వవిగ్రహా
లౌహిత్యం తద్విమర్శ స్యా దుపాస్తిరితి భావనాః

అని ఉంది. ఇక్కడ అమ్మ యొక్క లౌహిత్యం అనగా అరుణిమను ప్రస్తావిస్తున్నారు. లోహితం అంటే రక్తచందనం అనీ రక్తం అనీ ఎరుపురంగు అనీ అర్థం. లౌహిత్యం అంటే లోహితము (ఎరుపు)గా ఉండటం అనే గుణం అనగా ఎర్రదనం.

అసౌ య స్తామ్రో అరుణ అని శ్రుతి. కుండలినీ రూప త్రిపురసుందర్యాత్మిక అరుణప్రభల చేత పిండాండ బ్ర్హహ్మాండములు నిండిపోయాయి అని. ఇక్కడ పిండాండం అంటే సాధకుడి శరీరమే. కుండలిని ఎర్రని ప్రభకలదని తాత్పర్యం. పిండాండ బ్రహ్మాండములకు ఏకత్వం చెప్తారు.

సౌందర్యలహరీ స్తోత్రంలో శ్రీశంకరులు

క్షితౌ షత్పఞ్చాషట్ ద్ద్విసమధిక పఞ్చాశదుదకే
హుతాశే ద్వాషష్టి శ్చతురధిక పఞ్చాశదనిలే
దివి ద్విష్షట్రింశ న్మనసి చ చతుష్షష్టి రితి యే
మయూఖాస్తేషా మప్యుపరి తవపాదాంబుజ యుగం.

అంటారు. ఈ శ్లోకం చాలా మనోహరమైనది. ఇక్కడ కుండలినికి ఉన్న 360 కిరణములను గురించి చెబుతున్నారు. ఈ 360 సంఖ్య సంవత్సరంలోని తిథులను తెలియజేస్తున్నది. అనగా శ్రీదేవి కాలస్వరూపిణి, సంవత్సరరూపిణి. ఆమె తేజః కిరణాలు 360న్నూ జగత్తును కాలమై నడుపుతున్నాయని స్థూలంగా తాత్పర్యం. ఇది బ్రహ్మాండరూపిణిగా అమ్మ యొక్క కాలస్వరూపం. పిండాండంలోని వివిధ చక్రాలకు వివిధ కిరణసంఖ్య ఉన్నది. అవి మొత్తం 360. కలిసి పిండాండాన్ని పాలిస్తున్నవి అని తాత్పర్యం. ఈ కాంతులన్నీ చైతన్యస్వరూపములు. ఈ విధంగా అమ్మ బ్రహ్మాండాలను తన తేజస్సులో ముంచెత్తుతున్నది అని అర్థం చేసుకోవాలి.

ఈ నామానికి సంబంధించిన కొన్నిమంత్రశాస్త్ర విషయాలున్నాయి. కాని అవి మనం ప్రస్తుతం చర్చించుకోవటం లేదు.

1 కామెంట్‌:

  1. "నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా"

    శబ్దసౌందర్యభూషితమైన నామం!

    రిప్లయితొలగించండి